పుస్తకపఠనము -నైతిక ప్రవర్తన - టి. వి. యెల్. గాయత్రి.

పుస్తకపఠనము -నైతిక ప్రవర్తన

ఈ మధ్యకాలంలో మీరొక విషయం గమనించారా? అదేమిటంటే పిల్లలలోనూ, పెద్దలలోనూ పఠనాసక్తి తగ్గిపోవటం. ఇది చాలా చిన్న విషయంలాగానూ, పట్టించుకోవలసిన విషయం కానట్లు గాను నేటి సమాజం భావించవచ్చు. ఒక రుగ్మత మెల్లమెల్లగా సమాజంలోకి చొచ్చుకొని వచ్చి నైతిక విలువలను కబళించివేస్తుందని ఎవరైనా గమనించారా? పుస్తకాలు చదివే అలవాటు ప్రజలకు లేకపొతే ఏమవుతుంది? అందరూ హాయిగా బ్రతకటం లేదా!

పుస్తకాలు చదవని పిల్లలూ, పెద్దలూఖాళీ సమయంలో ఏమి చేస్తారు? పిల్లలయితే వీడియో గేమ్స్ ఆడతారు. పెద్దవాళ్ళు అయితే టి. వి. చూస్తారు. ఎవరికైనా సమయం గడపటం కదా కావాల్సింది. పని చేసుకోవటం, తిండి తినటం, నిద్రపోవటం ఇవే కదా అందరం చేస్తున్నాము. దీనినే 'జంతుజన్మ' అని మహర్షులు పేరు పెట్టారు. జంతువులు కూడా కొంచెం అటూ ఇటూగా ఇలాగే బ్రతుకుతాయి. ఇవే పనులు చేస్తాయి. మనం ఆస్తులు సంపాదించుకొన్నట్లు అవి కూడా గూళ్లు కట్టుకోవటం, బొరియలు త్రవ్వుకోవటం చేస్తాయి.

మనిషికి ఆలోచించే మేధస్సు ఉంది.జ్ఞానాన్ని అందిపుచ్చుకుని, గ్రహించి, ఆచరించే శక్తి ఉంది. అవన్నీ మరుగున పడిపోతే, ఉపయోగించకపోతే చివరకు మెదడు మొద్దుబారిపోయిన జాతి తయారవటానికి ఎంతో దూరంలేదు. ఇప్పటికే మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్న యువతరం, మూఢత్వంతో విశృంఖలంగా తయారవుతున్న యువతరం పెరిగిపోయి తత్ఫలితంగా విడాకులు పెరిగిపోవటం, కుటుంబజీవనం ఛిన్నాభిన్న మవటం, పెద్దవాళ్ళపట్ల గౌరవంలేక పోవటం, వృధ్ధాశ్రమాలు పెరిగిపోవటం ఇవే కాకుండా హింసాత్మక ధోరణి సమాజంలో ఊహించనివిధంగా పెచ్చరిల్లటం ఎన్నో, ఇంకెన్నో చీడ పీడలు చుట్టుముట్టి అభద్రతాభావాన్ని పెంచుతున్నాయి. వీటికి పరిష్కారం ఎవరైనా వెదుకుతున్నారా? పాశ్చాత్య నాగరికత యొక్క ప్రభావంతో పెరిగిన యువత మన సమాజపు నైతిక విలువల్ని కూకటివేళ్ళతో పెకిలించివేస్తున్నారు. మన భాష, మన చరిత్ర, ఘనమైన సంస్కృతి అని చెప్పుకోవటానికి ఏముంది? పూర్వమెప్పుడో మన దేశంలో ఇలా ఉండేవాళ్ళు అని చెప్పుకోవాల్సిన దుస్థితి వచ్చేసింది.

సగం మందికి మానసిక రోగాలు దాపురిస్తున్నాయి. ఇటువంటి బలహీనమైన సమాజంలో ఉంటూ దానిని బాగు చెయ్యాలని ఎంతమంది ముందుకు వస్తున్నారు? సమాజం కుళ్ళి పోతూ ఉంటే చూస్తూ, నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటే ఈ ప్రళయం మనల్ని నామరూపాలు లేకుండా చేస్తుంది. తల్లి తండ్రులు, విద్యావేత్తలు ఈ రుగ్మతను అరికట్టడానికి ప్రయత్నించాలి. తల్లి తండ్రులు పిల్లలతో రోజులో కొంత సమయాన్ని తప్పనిసరిగా గడపాలి. సెల్ ఫోన్ లను కట్టి వేయాలని, కుటుంబానికి సమయాన్ని కేటాయించాలని పిల్లలతో చెప్పాలి. పెద్ద వాళ్ళని ఇంట్లో ఉంచుకోవటం అలవాటు చేసుకోవాలి. పెద్ద వాళ్ళు చేప్పే కథల వలన పిల్లల్లో ఒంటరి తనం పోవటమే కాదు భద్రతా భావం వస్తుంది. దాని వలన వాళ్ళల్లో మానసిక ధైర్యం ఏర్పడుతుంది.

ప్రణాళికాబద్ధంగా పిల్లల చేత పుస్తకాలు చదివించాలి. పుస్తక పఠనం వలన మానసిక వికాసమే కాకుండా నైతిక ప్రవర్తన కూడా అలవడుతుంది. మనదేశ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాల గురించి పిల్లలకు ఎప్పుడూ చెప్తూ ఉండాలి.ప్రతి విషయంలో చికాకు పడటం తగ్గించుకోవాలని, పెద్దలను గౌరవించాలని పదే పదే చెప్తూ ఉండాలి. స్కూలుకు వెళ్ళే పిల్లలకు మాదక ద్రవ్యాల గురించి జాగ్రత్తలు చెప్పాలి. నేడు చాలా స్కూళ్లల్లో, కాలేజీల్లో మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయని పేపర్లో చదువుతూనే ఉన్నాము. స్కూళ్లల్లో చదువుకూ, రాంకులకూ మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా, మోరల్ క్లాసులు, లైబ్రరీ క్లాసులు, కథలు చేప్పే క్లాసులు పెట్టాలి. దాని వలన పిల్లలకు నైతిక విలువల పట్ల గౌరవం వస్తుంది.

పిల్లల్లో పఠనాసక్తిని పెంచటం కోసం లైబ్రరీలు ప్రతి ఊరిలోనూ ఉండేటట్లు నాయకులు చూసుకోవాలి. ఇక విద్యావేత్తలు, మేధావులు సమాజంలో మార్పు కొఱకు అవగాహనా సదస్సులు ఏర్పాటు చేసి, మంచి అలవాట్ల గురించి, మంచి ప్రవర్తన గురించి పిల్లల్లో, పెద్దల్లో కూడా అవగాహన తీసికొని రావాలి. అందుకోసం విన్నూత్నమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసి, ప్రజలను భాగస్వామ్యులను చెయ్యాలి. మొబైల్ గ్రంథాలయాలు ఏర్పాటు చేసి ప్రజలలో పఠనాసక్తిని పెంచాలి. కరోనా గురించి జాగ్రత్తలు చెప్పినట్లు, ఎయిడ్స్ గురించి అవగాహనా సదస్సులు ఏర్పాటు చేసినట్లు, పులులు అంతరించిపోతుంటే ప్రజలందరినీ హెచ్చరించినట్లు ప్రజల్లో పుస్తక పఠనం పట్ల, నైతిక ప్రవర్తన పట్ల ఎందుకు పట్టించుకోరు? జ్ఞానాన్ని ప్రసాదించే బంగారు గనులు గ్రంథాలయాలు.పుస్తకాలు చైతన్య ప్రకాశ దీపాలు. తమస్సులో నిండి పోయిన సమాజానికి పుస్తకాలు వెలుగు దివ్వెలు. మానసిక ఆరోగ్యానికి పుస్తక పఠనం దివ్యమైన ఔషధము. సమాజములో పేరుకుపోయిన మాలిన్యాన్ని కడగటం మన అందరి కర్తవ్యం. అందరి కృషి, సహకారం వలననే చైతన్య వంతమైన సమాజం ఏర్పడుతుంది. అప్పుడే జాతి అభివృద్ధి పథంలో పయనిస్తుంది.