మాటే మంత్రము . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

మాటే మంత్రము .

మాటే మంత్రము !.

నిజమే అమృత మయమైన మాటలు మనపైన మంత్రంలా పని చేస్తాయి.

అందుకేనేమో మాటే మంత్రము అన్నాడు ఓ సినీ కవి.

నోరు మంచిదైతే ఊరు మంచిది ఔతుంది ,నోరా వీపు జాగ్రత్త అని మన పెద్దలు ఎన్నడో చెప్పారు. అంటే మనం మాట్లాడే ప్రతిమాట ఆలోచనతో మాట్లాడాలి ఎప్పుడు తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి.

ఈ సృష్టిలో ఏ ప్రాణికి లేని వాక్కు మనకు మాత్రమే లభించిన ఒక అమూల్యమైన అద్వితీయమైన అమోఘమైన వరం.

మాటకు అధిదేవత ' అగ్ని ' అని భారతీ శాస్త్ర దర్శనం.

' భద్రం భద్రమితి బ్రూయాత్ - భద్ర మిత్యేవ వా వదేత్ '

చక్కగా శాంతియుతంగా మాట్లాడితే మాటే మంత్రమౌతుంది. వేదకాలంలో మహర్షులు అకారాది ఏభైవర్ణములను మంత్రములుగా భావించి ఒక్క మంత్రములో సాధన చేసి మంచి ఫలితాలు సాధించారని .....ఆ అనుభవ సారాంశాన్ని పురాణ గాధల ద్వారా స్పష్టం చేసారు. కొన్ని అక్షర సముదాయాలను కూడా మంత్రాలుగా తీర్చి దిద్దారు.

మంత్రాలను మూడు రకాలుగా విభజించారు. వానికే' దైవం ', ' మానుషం ' ,' అపరం ' అని పేర్లు పెట్టారు.నిత్యమైన, మంగళప్రదమైన,అలౌకికమైన ఆత్మానందాన్ని కలిగించే సత్యం, శివం, సుందర రూపాలకు ' దైవం ' అని పేరు పెడితే మానవ జీవితంలో భాగమైన బాలసారె, ఉపనయ, వివాహాది కార్యక్రమాలకు నిర్వహించే వానిని ' మానుషం ' అన్నారు.మానవుని పరమపదమైన పిదప ఆ సంతానముచేత నిర్వహింపబడే అపర కర్మలను

నిర్ధేసించి వానికి ' అపరం ' అని నామకరణం చేసారు. ఇలా మూడు రకాల మంత్రాలు మానవ జీవితాన్ని మూడు దశలలో ప్రభావితం చేస్తున్నాయి.

మంత్రములలో అక్షరాల సంఖ్యను బట్టి కూడా ఆయా మంత్రములను వర్గీకరించారు. ఒక అక్షరం కలిగిన ఏకాక్షర మంత్రములను ' పిండములు ' అని రెండు అక్షరములు కలిగిన వానిని ' కర్తరులు ' అని,మూడు నుండి తొమ్మిది అక్షరముల వానిని ' బీజములని ' పిలిచారు.అలాగే పదినుండి ఇరవై అక్షరములు ఉన్నవానిని ' మంత్రములని ' ఇరవైకి పైగా అక్షరములు ఉన్నవానిని ' మాలలు ' అని వర్గీకరించారు. కావ్యకంఠ వాసిష్ఠ గణపతి మునీంద్రులు తాము రచించిన 'ఉమాసహస్రము ' అను గ్రంధము నందు ప్రతి శభ్ధము ధ్వనించు వాణి దైవ స్వరూపమే అని అభివర్ణంచారు.

' శబ్దే శబ్దే వాణీ దైవమ్

విచో వినయ ద్వహ్ని దైవమ్

కంఠే నివసత్ ప్రవదత్ దైవమ్

కవి వాగ్త్వేభవ పాత్రం దైవమ్ '

మాటల్ని ఉచ్చరించే సమయంలో అక్షరంలోకానీ ,స్వరంలోగానీ తేడా ఏర్పడితే అర్ధమే మారిపోయి అనర్ధాన్ని కలిగిస్తుంది.

చక్కగా తెలుసుకొని మాట్లాడే ప్రతి మాటా ఓ మంత్రమౌతుంది.అది ఇతరులపై మంత్రంలా పని చేస్తుంది. మాట జ్ఞానపూర్ణం కావాలంటే వ్యక్తి జ్ఞానకాంక్షిగా ఉండాలి.అందుకే మూర్ఖుని హృదయం అతని నోటిలో ఉంటుంది. జ్ఞాని నోరు అతని హృదయంలో ఉంటుందని పెద్దలు చెపుతారు.

మాట్లాడే తీరును బట్టి మన సభ్యతా సంస్కారం బయట పడుతుంది.

మృదు వచనమే సకల జపమనీ ,మృదువచనమే సకల తపమని బసవేశ్వరుడు అంటాడు.

అందమైన ,అహ్లదకరమైన,ఆనందమయ భావాలను మాత్రమే మనసు నిండా నింపుకున్నప్పుడు ,మృదువైన మధురాతి మధురమైన ,మంజులమైన మాటలు మంత్రాల్లా మన ముఖాలనుండి వెలువడతాయి. ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగిస్తాయి .వినే విరి పైనకూడా అద్బుతమైన ప్రభావాన్ని చూపుతాయి.మంచి మనసుతో ఆలోచించి వెలువరించే ప్రతి మంచి మాట ' మంత్రమే ' అవుతుంది.

' వాజ్మే మనసి ప్రతిష్టత ...మనోమే వాచి ప్రతిష్ఠత '

 

డా.బెల్లంకొండ నాగేశ్వరరావు. చెన్నయ్ .

9884429899.