భజనలు. - సృజన.

భజనలు.

చక్క భజనలు.

ఇది ప్రాచిన జానపదకళా రూపాల్లో చెక్క భజన కూడా ఒకటిఈ చెక్క భజన బృందం కూడా కోలాటం వేసే సభ్యులు వలే లయ బద్దంగా పాటలు పాడుతూ వృత్తాకారంలో తిరుగుతారు.అయితే ఈ బృందం సభ్యులు చేతిలో చెక్కతో చేసిన చిరుతలు ధరిస్తారు.ఈ బృందానికి ఒక గురువు ఉండి మద్యలో నుంచుని పాటలు పాడుతుంటే బృందం సభ్యులు చిరతలు వాయిస్తూ వృత్తాకారంలో తిరుగుతూ గురువు పాడిన చరణాన్ని అందుకుని పాడతారు.వీరికి తబలా, ప్లూటు వాయిధ్య సహకారం ఉంటుంది.ఈ చక్కభజన బృందంలో 16నుండి 20మంది సభ్యులు వరకూ ఉంటారు.పూర్వం రోజుల్లో చెక్కభజన బృందాలు లేని గ్రామాలు ఉండేవి కాదు.అంతగా గ్రామసీమల్లో ఈ కళకి ఆదరణ ఉండేది. ముఖ్యంగా రామ మందిరాలు దగ్గర పొలం పనులు ముగించుకువచ్చిన వారు బృందంగా చేరి రామనామ స్మరణ చేస్తూ ఈ చెక్కభజన చేసేవారు.రాను రానూ టీవీ, సినిమా ప్రభావం వల్ల గ్రామాల్లో ఈ కళకి ఆదరణ తగ్గింది.

ఆంధ్ర దేశపు పల్లెలలో అనాదిగా వస్తున్న కళారూపాలలో చెక్క భజన ముఖ్య మైంది. దేవుని స్తంభాలను పట్టుకుని ఇంటింటికీ తిరుగుతూ భక్తి భావంతో భజనలు చేస్తారు. పల్లెలో వుత్సాహం వున్న యువకులందరూ పని పాటలు లేని తీరిక సమయాలలో ఇరవై మంది దళ సభ్యులుగా చేరి, ఒక గురువును ఏర్పాటు చేసుకుని రాత్రి సమయంలో కట్టుదిట్టంగా ఈ విద్యను నెర్చుకుంటారు. ఇది అషా మాషీగా చేసే భజన కాదు. ఎవరికి తోచిన రీతిలో వారు గంతులు వేస్తూ చేసే భజన కాదు. ఇది శాస్త్రీయ మైన జానపద నృత్య కళ. ఇది ఎంతో క్రమ శిక్షణతో నేర్చుకుని చేయ వలసిన కళ.

ఇది చాల శ్రమతో కూడుకున్న కళారూపం. అందరూ సమానంగా అడుగులు వేయాలి. అందరూ ఒకే రకంగా వలయా కారంగా తిరిగాలి. ఒకే రకంగా చేతుల్లో ఘల్లు ఘల్లు మనే చెక్కలను పట్టుకోవాలి. అందరూ కలిపి కట్టుగా తాళం వేయాలి. ఒకే రకంగా ఆగి చలనాలను చూపించాలి. ఒకే సారి ఎగరటం, కూర్చోవట, గుండ్రంగా తిరిగటం. ఎగురుతూ గుండ్రంగా తిరుగుతూ భజన చేయటం చెక్క భజన విశిష్టత. ప్రతి పాటకూ నృత్యం మారుతుంది. పాట మారుతుంది. భావం మారుతూంది. వరుసలు మారుతాయి. తాళం మారుతుంది. తెలుగు వారి భక్తిరస కళారూపాలలో చెక్క భజన ఒక సుందర కళారూపం.

పామర కళారూపమా?

ఇలాంటి శాస్త్రీయ జానపద కళారూపాన్ని శాస్త్రీయ నృత్య కారులు పల్లెటూరి కళారూపంగా పామర కళారూపంగా ఏదో పని లేక తీరిక సమయాల్లో ఉవుసు పోక కుఱ్ఱ వాళ్ళందరూ కలిసి చేసుకునే ఏదో చెక్కభజనగా తేలికగ భావంతో చూసి ఇలాంటి కళారూపాలన్నిటినీ అణగ ద్రొక్కి వేశారు. చెక్క భజనలో తాళం లేదా? లయ లేదా, గమకం లేదా, పాట లేదా? అంగికాభినయ విన్యాసంతో కూడిన నృత్యం లేదా? అభినయంతో కూడిన ముఖ భావాలు లేవా? భక్తి పాటల తన్మయత్వంలో ముఖంలో చూపించే సాత్వికాభావాలు లేవా? అందరికీ అర్థ మయ్యే భాష లేదా? ముఖంలో సాత్విక భావం లేదా? చిరుగజ్జెల సవ్వడితో చేసే నృత్యం లేదా? అందరు ఒకే రకంగా తిరుగుతూ,. కూర్చుంటూ, లేస్తూ గిరకాలు కొడుతూ క్రమ శిక్షణతో కూడిన శాస్త్రీయమైన తాళ గతులు లేవా? స్వర గతులు లేవా? బృందాన్నంతా ఏక త్రాటి మీద నడిపే గురువు లేడా? ప్రేక్షకులందర్నీ ముగ్ధులను చేస్తూ పాటలు పాడే శ్రావ్వమైన కంఠాలు లేవా? ఎన్నో ఉన్నాయి. అల్లుడు నోట్లో శని అన్నట్లు ఆదరణ తగ్గి పోయింది. అయినా పల్లె ప్రజలు ఈ నాటికీ ఈ కళా రూపాన్ని బ్రతికించు కుంటున్నారు. ఈ నాటికీ అన్ని ప్రదేశాల్లోనూ ఈ కళారూపం బ్రతికే ఉంది.

ఎన్నీ పాటలు, ఎన్నో అడుగులుసవరించు

పైన వివరించిన విధంగా ఎన్నో అడుగులు, భంగిమలూ, వివిధ దశలలో ఈ విధంగా నడుస్తాయి, ఆది అడుగు .. రెండు పోట్లు .. మూడు మెలిక .. కులుకుడు .. కుప్పిడుగు .. పద్మ వ్యూహము .. పర్ణశాల మొదలైన వివిధ రకాల అడుగులతో శోభాయమానంగా బృందాన్ని తయారు చేస్తాడు గురువు. పైన వివరించిన అడుగులే కాక, గురువు నేర్పిన వివిధ రకాలైన భంగిమల్ని కూడా కళాకారులచే చేయిస్తాడు. వ్రాతలో కంటే ప్రతి భంగిమనూ ప్రత్యక్షంగా చూస్తే తప్ప ఆ ప్రత్యేకతను అర్థం చేసుకోలేము. అందుకే ఈ కళా రూపాన్ని గురుకుల పద్ధతిలో తీర్చిదిదిద్దాలి. చెక్క భజన గూర్చి తెలిసిన పరిశోధకులు ఎడ్ల బాలకృష్ణా రెడ్డి గారు ఒకరు. జానపద పారమార్థిక గేయ సాహిత్యంలో చెక్క భజన కులుకు భజన, అని పేరు పెట్టారు. చెక్క భజన ప్రాచీన రూపం కులుకు భజన. మొత్తం భజనల్లో ఏడు రకాలున్నాయనీ తెలిపారు. హరి భజన, ఊరి భజన, కులుకు భజన, పండరి భజన, కోలాట భజన, సప్తాతాళ భజన, వేదాంత భజన. భజన అందరికీ సంబంధించిన జానపద కళారూపం. భజనంటే సేవ, భగవంతుని అనంత నామాలకు రూప గుణ మహిమల్ని రాగ తాశ యుక్తంగా తన్మయత్వంలో సమష్టిగా కీర్తించటం భజన అంటారు.

ముక్తి కోసం భక్తి పాటలుసవరించు

చెక్క భజన ప్రారంభించే ముందు ప్రప్రథమంగా విఘ్నేశ్వరుని ప్రార్థించి, తరువాత వరుసగా భక్తి పాటలు పాడుతారు. అలాంటి పాటల్లో.....కేవలం ఉత్సాహం కొద్దీ చేసే భజన కాదిది. భక్తి తన్మయత్వంతో భగవంతుణ్ణి వేడుకుంటారు. అలా వేడుకుంటూ భక్తి పారవశ్యంలో అమితోత్సాహంలో చేసే నృత్యం చెక్క భజన. భజన చేసే వారే భక్తి భావంలో మునిగి పోవటం కాక, ప్రేక్షకుల్ని కూడా తన్మయత్వంలో ముంచేస్తారు. చెక్కభజన ప్రేక్షకుల్ని ఉత్తేజితుల్ని చేస్తుంది. ముఖ్యంగా పల్లెల్లో తీరిక సమయాల లోనూ వర్షాలు లేని రోజుల్లోనూ, పండుగ సమయాల లోనూ, దేవుళ్ళ కళ్యాణ సమయాల లోనూ, తిరునాళ్ళ సమయాల లోనూ రథోత్సవాల లోనూ, జాతర్ల లోనూ ఈ చెక్క భజనల్ని చేస్తారు.

అమ్మా రావమ్మా ఆది శక్తివి నీ వమ్మా

మమ్మూ దయ చూడమ్మా

వేడెద మనసున వేడెదమమ్మా

వేగమే కదలి రామ్మా.

భక్తీ, ముక్తీసవరించు

భక్తి కోసం ముక్తి కోసం ఈ భజనలు చేస్తారు. భజన బృందం కట్టు దిట్టంగా భజన చేయడం ప్రారంభించిన తరువాత ఉన్న ఊర్లోనే కాక చుట్టు ప్రక్కల గ్రామాలకూ యాత్రా స్థలాలకూ బయలు దేరి వెళ్ళి తమ తమ ప్రావీణ్యాన్నంతా చూపిస్తారు. కేవలం పాటలతోనే గాక, రామాయణ భారత గాథల్ని ఘట్టాలు ఘట్టాలుగా ఆడుతూ పాడుతూ, వచనంతో కథను నడుపుతూ ఆయా రసాలకు తగిన విధంగా భజన చేస్తూ పౌరాణిక ఘట్టాలను ప్రదర్శిస్తారు.

గురుపూజ.

చెక్క భజన నేర్చుకోలాలనుకున్న యువకులందరూ చేరి ఒక గురువుని ఎన్నుకుంటారు. గురుపూజతో నృత్యాన్ని ప్రారంభిస్తారు. ప్రతి గురువూ ఒకే రకంగా ఈ చెక్క భజన విద్యను ప్రదర్శింపడు. ఎవరి విధానం వారిది. ఈ చెక్క భజన రాయలసీమలో కడప జిల్లాలో పుట్టి, ఆంధ్ర దేశమంతటా వ్వాపించిందని, అందుకు నిదర్శనం గురువులు చెప్పిన మూలాలు మాత్రమే కాక, జిల్లాలో ప్రతి గ్రామంలోనూ చెక్క భజన బృందాలుడటం కూడా అందుకు నిదర్శన మనీ, అలాగే చెక్క భజనకు సంబంధించిన గేయాలు ఎన్ని వున్నాయో చెప్పటం కష్టమనీ, నేను పులి వెందుల తాలూకాలోని భజన గురువుల దగ్గర సేకరించిన గేయాలు, భంగిమలు ఆధారంగా కొన్నిటిని మాత్రమే వివరించ గలుగు తున్నాననీ, ఈ చెక్క భజన నృత్యాన్ని ఆమూలాగ్రంగా పరిశీలించాలంటే ఈ జన్మ చాలదనీ, ప్రతి గురువు భంగిమల్లోనూ, వైవిధ్యం వుందనీ, తెలుగు విశ్వ విద్యాలయ జానపద కళల శాఖ లెక్చారర్ డా: చగిచర్ల కృష్ణా రెడ్డి గారు జానపద కళారూపం చెక్క భజన అనే గ్రంథంలో సోదాహరణంగా వివరించారు.

చెక్క భజన స్వరూపం.

ముఖ్యంగా చెక్క భజనల ఇతి వృతాలు ఈ విధంగా వుంటాయి. భక్తి పాటలు, భారత, భాగవత, రామాయణాలకు చెందిన పురాణ పాటలు, నీతిని ప్రబోధించే పాటలు, వీర గాథలు, ఇతరాలు, జడకోపు విద్యల్నీ ప్రదర్శిస్తారు. భజనల్లో, హరి భజనలు, పండరి భజనలు, శావమూళ్ళ తాళం భజనలు, డప్పుల కోలాట భజనలు, కోలాట భజనలు రకారకాలుగా ఉన్నాయి. దేని ప్రత్యేకత దానిదే. దేని పరికరాలు దానివే. అడుగు పొడుగైన చెక్కల్ని తయారు చేసుకుని, రెండు ప్రక్కలా ధ్వని రావడానికి గుండ్రటి ఇనుప బిళ్ళలను గాని, ఇత్తడి బిళ్ళలను గానీ రెండేసి చొప్పున అమర్చుతారు. తాళం ప్రకారం చెక్కలను కొట్టే టప్పుడు ఈ బిళ్ళలు శ్రావ్వమైన ధ్వనినిస్తాయి. అన్ని చెక్కలూ ప్రయోగించి నప్పుడు ఈ ధ్వని గంభీరంగా ఒకే శ్రుతిలో వినిపించి భజన పరుల్ని ఉత్సాహ పరుస్తాయి. ఈ చెక్కలపై నగిషీలు చెక్కి సుందరంగా వుంటాయి. ఈ బృందలలో కథా వృతాన్ని బట్తి కొందరు పురుషులు గానూ, మరి కొందరు స్స్త్రీ పాత్ర ధారులు గానూ ప్రవర్తిస్తారు. ఉదాహరణకు గోపికా క్రీడల్లో పురుషులు కృష్ణులు గానూ, స్త్రీలు గోపికలు గానూ నర్తిస్తారు.

రంగుల రంగుల వేషధారణ.

అందరూ ఒకే రంగు గల తల గుడ్దలను, అందంగా చుడతారు. ఒక ప్రక్క రిబ్బను కుచ్చులాగా అందంగా వ్రేలాడు తుంది. పంచెల్ని నృత్యానికి అడ్డు తగల కుండా ఎగరటానికి వీలుగా వుండే లాగా సైకిల్ కట్టులాగా మడిచి కడతారు. పురుషులు ఒకే రంగు గల బనియన్ లను ధరింస్తారు. స్త్రీ పాత్రలకు లంగా, రవికె, పవిటెకు ఓణీ లాగా గుడ్దను ఉపయోగిస్తారు. ఈ బృందాలలో ఇరవై మొదలు ముప్పై వరకూ సమసంఖ్యలో బృంద సభ్యలుంటారు. పన్నెండు సంవత్సరాల నుంచి పాతిక సంవత్సరాల వయస్సుకల యువకు లందరూ పాల్గొంటారు. చెక్క భజన వ్యాయామంతో కూడు కున్న కళారూపం. ఇందుకు తట్టుకోగల యువకులే పాల్గొంటారు. ఒక్కొక్క బృందం తయారవాలంటే మూడు మాసాల కాలం పడుతుంది. అప్పటికి గానీ, చెక్క భజన బృందానికి పరిపక్వత రాదు.

చెక్క భజనల ఇలా ప్రారంబిస్తారు.

భజన ప్రారంభించే ముందు దేవుని పటాలకు పూజ చేస్తారు. టెంకాయ కొట్టి చిరుతలు పట్టుకుని సాష్టాంగ నమస్కారం చేస్తారు. అందరూ వలయాకారంగా నిలబడి అందరూ లయతో చెక్కలను మోగిస్తారు. గురువు పాడగా వంత పాడతారు. తరువాత ఒక్కొక్క అడుగు వేయిస్తాడు. అలా కుడికాలు తోనూ, ఎడమ కాలితోనూ, చాక చక్యంగానూ ఆడిస్తూ వుంటారు. అందరూ అలాగే ఆపేస్తారు. అంతా నిశ్శబ్దం. ఆ సన్ని వేశం అద్భుతంగా వుంటుండి. ఇలాంటి వాటిని విలుపులు అంటారు. నృత్యం ఉధృత స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఈ విధంగా నిలుపుదల చేస్తాడు. ఈ నిశ్శబ్దాలు, మళ్ళీ ప్రారంబాలు. బృంద సభ్యుల యొక్క కలయికనూ లక్ష్యాన్నీ, క్రమ శిక్షణనూ, గురు భక్తిని చాటుతాయి. అలాగే తెలుగు జాతిని భక్తితో ప్రభావితం చేసిన గ్రంథాలు మూడు. అవి రామయణ, భారత, భాగవతాలు. ఈ పురాణ గ్రంథాల నుండి ఆయా ఘట్టాలకు సంబంధించిన గేయాలను చెక్క భజనకు ఎన్నుకున్నారు. అలాంటి వాటిలో శ్రీకృష్ణ గొల్లభామల సంవాదం చూడండి.

గొల్లభామలు

..రామ రామ అనంత కాలం రాజ్య మేలుతువుండర కిష్టా చీరలిచ్చి చెట్లు దిగిరా ఓ గోపాల కిష్టా, చీరలిచ్చి చెట్టు దిగిరా.

కృష్ణుడు

ఏయ్.

రామ రామ అనంత కాలం రాజ్యమేలుతూ వుండనే భామా.. చీరలివ్వనే చెట్లు దగనే ఓ భామలార చీరలివ్వనే చెట్టు దిగనే.

గొల్లభామలు:....వందనాలు నీకు పెడ్తాం చీరలిచ్చి చెట్లు దిగరా గోపాలకిట్నా చీరలిచ్చి చెట్లు దిగరా.

కృష్ణుడు:....వందనాలు నాకు వద్దు దండాలు నాకు వద్దు చీరాలివ్వను చెట్లు దిగానే ఓ బామలార చీర లివ్వను చెట్లు దీగానే.

అంటూ గోపికలు బ్రతిమాలడటం, కృష్ణుడు బెట్టు చేయడం ఆసక్తి కరంగా సాగుతుంది. అలాగే ఉద్ది అడుగులో శ్రీకృష్ణ లీలల్నీ గేయాలలో, గేయ రూపకంగా రామాయణ ఘట్టాల్నీ గంటల కొద్దీ చెక్క భజన రూపంలో వివరిస్తారు. రామాయణంలో వచ్చే ఆయా పాత్రలను దళ సభ్యులు బృందం మధ్యలో కొచ్చి ఆ పాత్రను విర్వహించి మళ్ళీ బృందంలో కలిసి పోతారు.

జడ కోపులు.

చెక్క భజన ప్రారంభించి కొంత కార్యక్రమం జరిగిన తరువాత చివరిగా చేసేది జడ కోపులు. ఈ కోపులు ప్రేక్షకుల్ని ఎంతగానో ముగ్థుల్ని చేస్తాయి. అందరూ గుండ్రంగా నిలబడతారు. రంధ్రాలతో కూడిన గుండ్రని చంద్రాకారం గల బిళ్ళను తయారు చేస్తారు. రంధ్రాలలో రంగు రంగుల త్రాళ్ళను వేలాడదీస్తారు. ఆ చెక్కను ఎత్తుగా వున్న ఒక దూలానికి లాగి కడతారు. లేదా గ్రామ మధ్యలో వున్న చెట్టుకు వ్రేలాడ దీస్తారు. దీనిని జడ కోపు బిళ్ళ అంటారు. బృంద సభ్యులు ఒక్కొక్కరూ ఒక్కొక్క తాడును ఏడమ చేత్తో పట్టుకుని కుడి చేత్తో చెక్కల్ని పట్టుకుని తాళ్ళ సహ్యాయంతో ఆదుగులు వేస్తూ లోపలికి బయటికి గుండ్రాకారంగా తిరుగుతారు. మధ్య గురువు పాటలు పాడు తుండగా కళాకారు లందరూ పాట పాడుతూ జడను అల్లుతారు. దీనిని జడ కోపు అంటారు.

రక రకాల కోపులు.

ఈ కోపుల్లో రకరకాల కోపు లున్నాయి. అవి ........ సాదా జడ కోపు .......... నూగాయ జడ కోపు. ........... డబుల్ నూగాయ జడ కోపు ..............కరక్కాయ జడ .................. గర్భ జడ ................... పట్టెడ జడ .............. పచ్చల జడ .......... నాలుగు పచ్చల జడ ..... వల జడ ...బొంగు జడ .........పుట్ల ల్జడ . ఈ విధంగా రకరకాల జడలను అల్లుతారు. ఇవి ఎంతో నైపుణ్యంతో అల్ల బడతాయి. చూపరులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. బృందంలో ఏ ఒక్కరు తప్పు చేసినా జడ చిక్కుపడి పోతుంది. చిక్కు పడిన జడను విడ దీయటం చాల కష్టం ఈ జడలను అల్లటం ఎంతో సాధన చేస్తారు. ఒక జడకూ మరో జడకూ ఏ మాత్రం సంబంధం వుండదు. పాట పాడుతూ, అడుగు వేస్తూనే ఈ కోపులను వేస్తారు.

ఇలా ఎన్నో కొల్లలు కొల్లలుగా భజనలో వాడుకునే జానపద గేయాలున్నాయి. వీటిలో చాల వరకు ఆయా ప్రాంతీయ భాషా మండలి కాలలో ఎన్నో పాట లున్నాయి. ఏది ఏమైనా చెక్క భజన సకల కళా సమన్వితమైన జానపద నృత్య కళారూపం. దీనిని నేడు తెలుగు విశ్వ విద్యాలయం చేపట్టి శిక్షణా శిభిరాల ద్వారా పునరుద్ద రిస్తున్నది. దీనిని డా|| చరిచర్ల కృష్ణా రెడ్డి గారు సక్రమంగా నిర్వహిస్తున్నారు.

సేకరణ: