
ఆది కైలాశ్ ఓం పర్వత్ యాత్ర-4
అప్పటికే వెలుగు వచ్చేసింది, సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు, ఆ వెలుగులో చుట్టూరా ఉన్న మంచు పర్వతాలు కొన్ని బంగారు రంగులోనూ, కొన్ని వెండి రంగులోనూ మెరిసిపోతున్నాయి.
మేమున్న బస ఓ పర్వతాన్ని ఆనుకొని ఉంది, అంటే రోడ్డు ప్రక్కనే, ఇలాంటి ప్రదేశాలకి టాక్సీలలో తప్ప మన కారులో మన డ్రైవింగులో అయితే కష్టమే. ప్రమాదం ఎప్పుడూ మన ప్రక్కనే ఉంటుంది. సుమారుగా ధార్చూలా దాటిన తరువాత మంచిరోడ్డు లేదనే చెప్పాలి, గుంజి తరువాత అస్సలు లేదు.
అయితే ఆ ఉషఃకాల వెలుగులతో నిండి ఉన్న ప్రకృతిని చూస్తూ గతకలరోడ్డు కుదుపులను పట్టించుకోలేదు.
ఇదే గతకల రోడ్డు మీద సుమారు పదిహేడు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే “కుతి” గ్రామం చేరుకుంటాం. కుతి గ్రామం నుంచి మరో 17 కిలోమీటర్లు ప్రయాణించేక జోలింగ్కోంగ్ఆదికైలాశ్ కి నడక దారి మొదలవుతుంది. ఈ దారిలో ఎటువంటి వృక్షాలు ఉండవు, కాబట్టి ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది.
మా జీపు డ్రైవరు మాకు ఎదురుగా ఉన్న పర్వతాలను చూపిస్తూ వాటి గురించి వివరించేడు. ముందుగా ఎడమ చేతివైపు బ్రహ్మ పర్వతం కనిపిస్తుంది. మరోపక్క పాండవ పర్వతాలు, పాండవులకోట, పార్వతీముకుటం ఇలా ఆ పర్వతాలను చూపించేడు. పాండవ పర్వతం అన్నవి ఒకేలా ఉన్న అయిదు పర్వత శిఖరాలు, పాండవులకోట అన్నది కూడా పెద్ద గోడలా ఉన్న పర్వతం. స్థానికుల కథనం ఏమిటంటే అరణ్యవాస సమయంలో పాండవులు ఈ పర్వతాలలో నివసించేవారట, కాని ప్రస్థుతం ఎటువంట కట్టడం కాని, శిధిలాలు కాని లేవు. జీపు దిగి దగ్గరగా వెళ్తే కనిపిస్తాయేమో?, మాకెవ్వరికీ ఆ చలిలో దిగి నడిచే ఓపికలేకపోయింది. అప్పటికే మాదోస్త్ కి హై ఆల్టిట్యూడ్ సిక్ నెస్ వల్ల మాట్లాడలేక పోతోంది.
పార్వతీ ముకుటం అన్న పర్వత శిఖరం కిరీటంలా కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ మంచుతో కప్పబడే ఉంటాయి, కుంతీ పర్వతంకూడా దర్శనం చేసుకున్నాం. మన ప్రయాణం కుతి వేలీ గుండా సాగుతుంది. కుంతి పేరుమీదుగా కుతి అనే పేరొచ్చిందని అంటారు. అధికారికంగా ఇది ఉత్తరాంచల్ లోని కుమావు ప్రాంతంలో ఆఖరి గ్రామం, ఘరెవాల్ ప్రాంతంలో ఆఖరి గ్రామం “మానా”.
మొత్తం 17 కిలోమీటర్ల ప్రయాణం ఆగతుకుల రోడ్డుమీద ఎలా జరిగిందో మాకుతెలీలేదు. చుట్టూ ఉన్న మంచు పర్వతాలు వాటి అందాలు చూడ్డంతోనే గడిచిపోయింది. బంగారం రంగులో మెరిసిపోతున్న కొండని చూపించి అదే ఆదికైలాశ్ అనగానే అటు వైపు చూసేం. ఆది కైలాశ్ పర్వతం కైలాశ్ పర్వతానికి నమూనా లా అనిపించింది. అదే ఆకారం కాని దానికన్నా చాలా చిన్నది.
ఒక్కసారిగా గుర్రాలు, మనుషుల కోలాహలం, టెంటులు చూడగానే జోలింగ్ కోంగ్ చేరేమని తెలిసిపోయింది. మా జీపు ఒక టెంటు దగ్గర ఆపి వేడివేడి టీ తాగి కాస్త స్నాక్స్ తిని బయలుదేరమని మా డ్రైవరు చెప్పేడు. అప్పటికి తొమ్మిది, తొమ్మిదిన్నర అయుంటుంది. కాస్త టీ తాగి కాలుచెయ్యా స్వాధీనం అయేక కొండ వరకు ఉండే నడవాలా? గుర్రాల మీద వెళ్లాలా?, తర్జన భర్జనలు పడుతూ ఉండగా అక్కడి మిలిటరీ టెంట్లు చూడగానే ఓ చిన్న ఆలోచన వచ్చింది. మాతో పాటు వచ్చిన దంపతులు ఎయిర్ ఫోర్స్ డాక్టర్లు, కాబట్టి వారి కార్డు చూపిస్తే ఆ దూరంకూడా నడవకుండా ఏదైనా సహాయం దొరుకుతుందేమో అని, వాకబు చేస్తే ఓ అర కిలోమీటరు నడిచి వారి జీపుని చేరుకుంటే వారు పార్వతీ సరోవర్ వరకు తీసుకు వెళతాం అని చెప్పేరు. తిరిగి వచ్చేటప్పుడు జీపు ఇవ్వలేమని చెప్పేరు. ఓ పది నిముషాలలో చేరిపోయేం.
ఆది కైలాశ్ పర్వతాన్ని దగ్గరగా చూస్తూ ఉంటే జన్మ ధన్యం అనిపించింది. మందిరానికి వెనుకవైపున పార్వతీ సరోవరం, సగం కరిగి, సగం మంచు కట్టి ఉంది, నీళ్ళు స్నచ్చంగా ఉన్నాయి.
ముందు మందిరంలోకి వెళ్లి శివుని దర్శించుకొని, లోపల చాలా ప్రశాంతంగ ఉంది. కాసేపు కూర్చొని శివుని స్తోత్రాలు చదువుకొని, ఋద్రాభిషేకం చేసుకొని బయటకి వచ్చేక పార్వతీ సరోవర్ వరకు వెళ్ళడానికి శరీరం సహకరించలేదు. కొందరు యువకులు సరోవరానికి వెళుతూ ఉంటే నీళ్లు తీసుకు రమ్మని సీసా ఇచ్చేం. అక్కడే మెట్లమీద కూర్చొని వాళ్లు నీళ్లు తీసుకొని రాగానే వెనక్కి బయలు దేరేం. మా డాక్టరు చెల్లి పార్వతీ కుండ్ వెళతానని బయలుదేరింది, అక్కడకి మరో మూడు కిలోమీటర్ల దూరం, దూరంగా చాలా మంది కొండ ఎక్కుతూ కనిపించేరు. మా చెల్లి సలహా ప్రకారం ఆమె తప్ప మిగతా వారం టెంటుకి బయలుదేరేం. మేం రోడ్డు మీదకి రాగానే మిలిటరీ జీపు వచ్చి ఉంది, అది ఎక్కి వచ్చేసాం. సగం దూరం వచ్చేక మరో మందిరం కనిపించింది. అదేమిటి అంటే అది కూడా శివకోవెలే అని, అక్కడ దిగి చూసుకొని తిరిగి టెంటు నడకలో చేరాలని, దిగకపోతే తిన్నగా టెంటు దగ్గర దింపెస్తానని జీపు డ్రైవరు చెప్పేడు. నేను మావారు ఇద్దరం అక్కడ దిగిపోయేం.
అప్పటికి మేం సుమారు 15,000 అడుగుల ఎత్తుకి చేరేం. ఆది కైలాశ్ పర్వతం ఎత్తు సుమారు 20,000 అడుగుల ఎత్తు. కైలాశ్ మానససరోవర్ లో సరోవరం పరిక్రమ, కైలాశ్ పర్వత పరిక్రమ ఉంటాయి కాని ఇక్కడ పరిక్రమలు ఉండవు, వాహనాలు ఆపే దగ్గర నుంచి సుమారు 5 లేక 6 కిలోమీటర్లు నడిస్తే గౌరీకుండ్ చేరుతారు, అక్కడనుంచి ఆదికైలాశ్ పర్వతాన్ని దగ్గరగా చూడొచ్చు. చివరి మూడు కిలోమీటర్లు చాలా స్టీప్ గా ఉండడం, ఆక్సిజన్ అస్సలు లేకపోవడం వల్ల తట్టుకోడం కష్టం. 50 సంత్సరాల లోపుల ఈ యాత్ర చేసుకుంటే గౌరీకుండ్ వరకు కూడా సులువుగా వెళ్లొచ్చు అనిపించింది.
చిన్న శిలకోవెల, చాలా ప్రశాంతంగా ఉంది. కాసేపు అక్కడ కూర్చొని, మాలాగే మందిరం చూడటానికి వచ్చిన యువకులతో పిచ్చాపాటి మాట్లాడుతూ కాసేపు గడిపి, నమకం, చమకం మావారు చదువుకొన్న తరువాత అక్కడ బయలుదేరి మా టెంటు చేరేం. అక్కడ మా దోస్తు లోపల పరిచిన పరుపులపైన సేద తీరుతోంది. బయట డాక్టరు చెల్లెలు భర్త కూర్చొని ఉన్నాడు. వాళ్లిద్దరకీ కూడా ఆక్సిజన్ తక్కువవుతోందని తెలుస్తోంది. అలాంటి పరిస్థితిలో నాకు తెలిసిన వైద్యం ఆరారా నీళ్ళు త్రాగడం, పచ్చ కర్పూరం వాసన చూడడం. నేను చెప్పేది కూడా వినిపించుకొనే స్థితిలో లేరు ఇద్దరూ, ఆ విషయం నాకర్థం కాలేదు.
మా డాక్టరు చెల్లెలు గౌరీకుంఢ్ వరకు అని బయలుదేరి, భీమ్ కి ఖేతీ వరకు వెళ్ళి తిరిగి వచ్చేసింది. ఒంటి గంటకి లంచ్ ఇచ్చేరు, ఆ చలిలో ఆకలి లేకపోయినా వేడివేడిగా రొట్టికూర తిన్నాం, మా చెల్లి, మరిది ఇద్దరూ భోజనం దగ్గర నుంచి లేచి మిలటరీ హాస్పెటలుకి వెళ్లేరు. నాకు మా ఫ్రెండు పరిస్థితికి ఏమీ తోచక ఆమెని తీసుకొని నేను కూడా అక్కడికే వెళ్ళేను, మేం చేరేటప్పటికి వాళ్లిద్దరికీ ఆక్సిజన్ ఇస్తున్నారు, మా ఫ్రెండుని చూస్తూనే ఆమెని కూడా లోపలకి తీసుకు వెళ్లి ఆక్సిజన్ ఇవ్వడం మొదలు పెట్టేరు. మేము కూడా ఆక్సీమీటరు పెట్టమన్నాం, 50 శాతం చూపిస్తోంది, నేను గభరాగా నాకు ఆక్సిజన్ పెట్టమన్నా, బయట ఉన్న హెల్పరు మీకు అక్కరలేదు, తక్కువ చూపిస్తున్నా మీకు అవుసరం లేదు, కొంచం సేపు రెస్ట్ తీసుకుంటే మీకు నార్మల్ అవుతుంది, వీరికి అలా కాదు అన్నాడు. అప్పటికే మబ్బులు వచ్చేసేయి, సన్నగా వాన కూడా మొదలయింది. కొంతమంది ఆక్సిజన్ చాలక కూలబడిపోతున్నారు.
మేము తిరుగు ప్రయాణం మొదలు పెట్టేం, వాన కుండపోతగా కురవసాగింది. పన్నెండు తరువాత ఆది కైలాశ్ పర్వతం మబ్బులలో ఉండిపోయింది. ఆక్సిజన్ పెట్టుకున్న తరువాత మా దోస్తులందరూ కుదుట పడ్డారు.
అప్పుడు మా డాక్టరు చెల్లి భీమ్ కి ఖేతీ గురించి చెప్పింది. పాండవులు అక్కడ గడిపిన సమయంలో కుంతి పంటలు పండని ఆ ప్రదేశంలో ఎలా గడపాలి? అని అడిగితే భీముడు నేను పండిస్తానని అక్కడ ధాన్యం పండించేడట, ఇప్పటికీ అక్కడ పూర్తి మంచులో, నీటికొలను మీద పంట పండుతుందట, అక్కడి వాతావరణం పంటలు పండటానికి అనుకూలంగా ఉండదు. మరి పంటలు ఎలా పండుతున్నాయో, పరిశోధకులు చెప్పాలి. ఫొటో తచూసి మేము కూడా ఆశ్చర్యపోయేం, వీలయితే భగవంతుడు అనుగ్రహిస్తే మరోసారి వెళ్ళి భీమ్ కి ఖేతీ చూడాలని ఉంది.
ఆలస్యంగా వెళ్ళిన వాళ్లకి ఆదికైలాశ్ పర్వత దర్శనం అవలేదు.
మేము మా నివాసం చేరేసరికి వాన కాస్త తెరిపిచ్చింది. కాని ఆది కైలాశ్ లో వాన పడుతూనే ఉంది.
రాత్రి వేడివేడిగా రొట్లుకూర తిని తొందరగా నిద్రపోయేం.
మరునాడు కూడా మేము తొందరగా బ్రేక్ ఫాస్ట్ చేసి ఓం పర్త్ చూడటానికి బయలుదేరేం. ఆరోజు ఓంపర్వత్ దగ్గర చూడవలసినవి చూసుకొని తిరిగి ధార్చూలా చేరిపోవాలి.
ఓం పర్వతం వెళ్లే మార్గం లో మిలిటరీ వారి టెంటులు తప్ప జనావాసాలు లేవు. రోడ్లు కూడా బోర్డర్ల లో ఉండే జవానులకు నిత్యావలరాలు చేరవేయడానికి వేసుకున్నవే. రోజూ కురుసే వర్షాల వల్ల రోడ్లు ఎప్పుడూ కొట్టుకుపోతూనే ఉంటాయి.
మేము ముందు ఓం పర్వత్ చూసి వచ్చేక కాళీనది చూసుకుందామనుకున్నాం. కొండ ప్రాంతాలలో వర్షం రాక తెలీదు, ఒక్క నిముషం లో మబ్బులు కమ్ముకు వచ్చెస్తాయి. ఆరోజుకి ఇంక దర్శనం అవదు.
మేం మంచి ఎండగా ఉన్నప్పుడు ఓం పర్వతం చేరిపోయేం.
చుట్టూరా అన్నీ మంచుపర్వతాలే, దూరంగా ఓం పర్వతం కనిపిస్తోంది.
పార్కింగ్ నుంచి చాలా ఎత్తుగా ఉన్న శిఖరానికి ఎత్తైన మెట్లదారిలో పైకి చేరేం. ఎదురుగా పెద్దలోయ, లోయకి అవతలి ప్రక్క పెద్ద పర్వత శిఖరం మీద దేవనాగరిలో(ऊं) ఓం ఆకారం లో మంచు పడి ఉంటుంది. ఈ ఫొటోలు చాలా సార్లు చూసేం, కాని నిజం గా మా ఎదురుగా ఆ పర్వతాన్ని చూడడం ఒక అద్భుతాన్ని చూసినట్లే అని పించింది. ప్రతీ విషయాన్ని తార్కికంగా ఆలోచించే నాకు దీని వెనుక ఎలాంటి తర్కం ఉందో అర్థం కాలేదు, చుట్టూరా ఉన్న కొండలు , శివుడు, పార్వతి, వినాయకుడు, శేషనాగు, కుమారస్వామి, ఇలా ఆకారాలలో కనపించేయి, ఒక్కనాకే కాదు అందరకీ కూడా!. అక్కడ చిన్న శివకోవెల, వచ్చిన యాత్రీకులు ఎవరి శక్తానుసారం వారు పూజలు చేసుకున్నారు. మేము ఓం పర్తం మా దోసిలిలో ఉన్నట్లు ఫొటోలు తీసుకున్నాం.
తనివితీరా ఆ ప్రతాలను చూసుకున్నాం, పార్వతీదేవి నాభి అని ఆ కొండలలో ఓ ప్రదేశం చూపించేరు. గుండ్రంగా ఒకచోట మంచు పడకుండా ఉన్న ప్రదేశం అది. మొత్తం పర్వతమంతా మంచుతో ఉండి ఆ ఒక్క ప్రదేశం మంచు పడకుండా ఉండడమేమిటో అర్థం కాలేదు. ఓం పర్వతం మీద పడ్డ మంచు ఓం ఆకారంలో కనబడడం కూడా అర్థం కాలేదు.
ఓ అద్భుతాన్ని చూసిన అనుభూతి కలిగింది. సుమారుగా ఓ గంట గడిపి ఉంటాం, నల్లని మబ్బులు రావడం గమనించి మా డ్రైవరు పదమని మమ్మలని తొందరచేసేడు. ఇక్కడ ఎక్కువగా మంచు తుఫానులే వస్తాయట, అందులో చిక్కుకుంటే అంతే సంగతులు, అక్కడ ఒక చిన్న టీ దుకాణం తప్ప మరేమీ లేవు, రోజ్లు మూసుకుపోతే ముందుకి కాని వెనుకకి కాని వెళ్లే దారి ఉండదు. మేము వెంటనే బయలుదేరిపోయేం.
మా యాత్రలో చూడవలసిన ప్రదేశం ”కాలాపాని”, అండమాన్ లో ఉన్న జైలుకాదు సుమా!. ఇది “కాళి” నది పుట్టిన ప్రదేశం అని అంటారు, కొందరు ఇకికడకి 15 కిలోమీటర్ల దూరం లో హిమాలయాలలో ఉన్న హిమనీనదం నుంచి పుట్టిందని అంటారు, ఏమైనా కాళి నది ఇక్కడ నుంచి దిగువకి పిరవహిస్తుంది. కాళి నది నీరు నల్లగా ఉండటంతో ఈ నదిని కాలాపానీ(నల్ల నీరు) అని, శారదానది అని కూడా అంటారు, కాళీనది, ధర్మ, గోరా కాళి(తెల్ల కాళీ) అనే నదులను కలుపుకొని దిగువకి ప్రవహించి రెండుపాయలుగా మనదేశం, నేపాలు దేశాలలో ప్రవహిస్తూ వేల ఎకరాలను సారవంతం చేసి అనేక పంటలు పండడానికి సహాయం చేస్తోంది. మనదేశంలో ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, బీహారు రాష్ట్రాలలో ముఖ్యంగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తోంది. దీనిని కూడా మిలిటరీ వారే నడుపుతున్నారు. బయట సన్నగా ప్రవహిస్తున్న కాళీ నది ఒడ్డున చిన్న పూలతోట పెంచుతున్నారు. లోపల చిన్న మందిరం, అక్కడ లోపల చిన్న కుండం, అందులో నిరంతరం ఊరుతున్న నీరు, ఎదురుగా చిన్న అమ్మవారి విగ్రహం ఉన్నాయి. మిలిటరీ జవానే అక్కడ పూజారి కూడా.
ఈ మందిరం ఉన్న ప్రాంతానికి ఎదురుగా ఉన్న కొండలలో అంటే చాలా దూరంగా కనిపిస్తున్న గుహని వ్యాసగుహ అని అంటారు. ద్వాపరయుగం అంతరించిపోయిన తరువాత ఈ గుహలో తపస్సు చేసుకుంటూ ఉండి కలియుగం ముగిసిపోయి ప్రళయంలో భూమి కొట్టుకు పోయిన తరువాత పునః సృష్టి చేసేటప్పుడు గుహలోంచి వస్తాడట.
మేము చూసిన వింతలు గురించి మాట్లాడుకుంటూ మా తిరుగు ప్రయాణం చేసుకున్నాం. కొండదారులలో ప్రయాణం పైకి వెళ్లేటప్పుడు చాలా సమయం పడుతుంది దిగేటప్పుడు తొందరగా దిగిపోతాం. బాగా వెలుగు ఉండగానే ధార్చూలా చేరేం. మా కోరిక మీద ముందు మాకిచ్చిన బసను మార్చి ఊరికి దూరంగా క్రొత్తగా కట్టిన హోటలులో ఇచెచేరు మా టూరు ఆపరేటర్లు. చాలా ప్రశాంతంగా ఉంది. రాత్రి అక్కడే భోజనాలు, చీకటి పడ్డ తరువాత ఓ శ్వేత వస్త్రధారి అయిన మధ్య వయస్కుడైన బాబాతో వారి బృందం దిగింది. ఆతరువాత మాకు కంటిమీద కునుకు లేదు. యాత్రలలో ఈపాటి అసౌకర్యాలు భరించాలి తప్పదు. మొత్తం మీద మా యాత్ర చాలా బాగా సాగింది.
మరుసటి రోజు బయలుదేరి పాతాళ భువనేశ్వర్ చూసుకొని రాత్రంతా ప్రయాణం చేసి తెల్లవారి 4 కి కాఠ్గోదాం చేరేం.
ఒకప్పుడు పాతాళ భువనేశ్వర్ లో యాత్రీకులే ఉండేవారు కాదు, ఇప్పుడు గుహలోపలకి వెళ్లడానికి 4 గంటలు సమయం పట్టింది. రద్దీకి తగ్గట్టుగా హోటల్స్, రెస్టారెంట్స్ వచ్చేసాయి. పాతాళ భువనేశ్వర్ ఒక గుహాలయం, లోపల ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ దేవతా మూర్తులను చూడడం ఒక అనుభూతి, మొత్తం పురాణ కథలు కొండలలో ఏర్పడడం ఒక వింతనే చెప్పాలి. ఇంతకు ముందు మూడు సార్లు ఈ గుహాలయాన్ని చూసేం. అప్పట్లో ఈ పరిసరాలు ప్రశాంతంగా ఉండేవి, ఇప్పుడు ఎక్కడ చూసినా రద్దీ, వాహనాలు, కాలుష్యం. ఈ యాత్రలో అడవులు మంటలలో తగలబడి పోవడం చూసేం. పెద్దపెద్ద మానులు మంటలలో కాలిపోతున్నాయి. కొండ చరియలలో ఉండే వృక్షాలు చాలా భాగం కాలిపోతూనే ఉన్నాయి.
మేము ఒకరోజు చేతిలో ఉంచుకొని మా తిరుగు ఫైటు టికెట్లు తీసుకున్నాం. మధ్యాహ్నం వరకు రెస్ట్ తీసుకొని టాక్సీ బుక్ చేసుకొని నైనితాల్ వెళ్లేం. నైనితాల్ అన్నది ఒక మంచినీటి సరస్సు. ఈ సరస్సు చుట్టూ ఏర్పడ్డ గ్రామం, ఇది ఇప్పుడు చుట్టుపక్కల కొండలమీదకి కూడా ఇళ్ల నిర్మాణం జరిగి పెద్ద పట్టణంగా రూపు దిద్దుకుంది. మనదేశంలో ఇదొక ముఖ్య వేసవి విడిది. నైనితాల్ పేరుని రెండురకాలుగా చెప్తారు ఒకటి ఇక్కడ ఉన్న చిన్నాపెద్దా సరస్సులు తొమ్మిది ఉన్నాయట, అందుకని నౌతాల్ అని పిలిచేవారట, కాలాంతరంలో ఇంగ్లీషులారి ప్రభ్వంతో నైన్ తాల్ గా మారిందని, సతీదేవి యొక్క కన్ను పడిన ప్రదేశం సరస్సుగా మరిందని, సరస్సు ఆకారం కన్నులాగా ఉంటుందని, నయన్ తాల్ గా పిలువబడి కాలాంతరాన నైనితాల్ గా మారిందని అంటారు. సరస్సు ఒడ్డున నయనాదేవి మందిరం ఉంటుంది, లోపల శివుడు, అమ్మవారు, రాధామాధవ ఉపమందిరాలు కూడా ఉంటాయి. ఈ కోవెలకి ఎదురుగా పెద్ద మైదానం ప్రస్తుతం దీనిని వాహనాలు నిలపడానికి ఉపయోగిస్తున్నారు, ఇది భూకంపంలో విరిగి పడ్డ కొండ శిఖరం, 30 ఏళ్ల క్రిందట వెళ్లి నప్పుడు చిన్నాపెద్దా రాళ్లతో ఉండేది, తరువాత ఆ ప్రదేశాన్ని చదును చేసి పార్క్ కట్టించింది ప్రభుత్వం, ఆతరువాత పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని దీనిని పార్కింగ్ గా మార్చేరు.
నైనా దేవి మందిరం నైనితాల్(సరస్సు) ని ఆనుకొనే ఉంటుంది. నౌకాయానం కూడా ప్రభుత్వం ద్వారా నడుప బడుతోంది. నౌక ద్వారా కూడా ఈ మందిరాన్ని దర్శించుకోవచ్చు.
మరునాడు బయలుదేరి ఢిల్లీ, అక్కడనుంచి హైదరాబాద్ చేరుకున్నాం.
మేం వెళ్లినప్పుడు మాది మొదటి బేచ్ కాబట్టి సౌకర్యాలు అంతగాలేవు, త్వరలో అన్ని సౌకర్యాలు రావొచ్చు. ఏది ఏమైనా ఇలాంటి యాత్రలు గరిష్టంగా అరవైలలో చేసుకుంటే మంచిది.
ఇవండీ మా అనుభవాలు, ఆదరించినందుకు అందరకీ ధన్యవాదాలు.
శలవు.