జీవవైవిధ్య రక్షణ – మన బాధ్యత “భూమి మన అవసరాలకు సరిపడా వనరులు ఇస్తుంది, కానీ మన ఎక్కువ కోసం కాదు” — మహాత్మా గాంధీ గారి ఈ మాటలు నేటికీ పర్యావరణ పరిరక్షణకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.
భారతదేశం ప్రపంచ జీవవైవిధ్యంలో అగ్రస్థానం. సుమారు 45,000 మొక్కల జాతులు, 91,000 జంతు జాతులు ఇక్కడ ఉన్నాయి. ప్రపంచ పులులలో మూడవ వంతు, ఆసియా ఏనుగులలో 60%, ఒక కొమ్ము ఖడ్గమృగాలలో 80%, మిగిలిన ఆసియా సింహాలు — ఇవన్నీ భారతదేశంలోనే నివసిస్తాయి. ఇది మన దేశం వన్యజీవి సంరక్షణలో సాధించిన విజయాన్ని ప్రతిబింబిస్తుంది. ఇటీవల దేశవ్యాప్తంగా 71వ వన్యప్రాణి వారోత్సవాలు (Wildlife Week–2025) అక్టోబర్ 2 నుంచి 8 వరకు “మానవ–వన్యజీవి సహజీవనం” అనే థీమ్‌తో నిర్వహించబడ్డాయి.
మానవులు, వన్యప్రాణులు రెండూ ఒకే సహజ వనరులపై ఆధారపడుతుండటంతో, సహజీవనం భవిష్యత్తు తరాల పర్యావరణ సమతుల్యతకు అవసరమైంది. ఈ సందర్భంలో కేంద్ర పర్యావరణ, అరణ్య మరియు వాతావరణ మార్పుల మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ ఐదు ప్రధాన జాతీయ వన్యజీవి ప్రాజెక్టులను ప్రారంభించారు — ప్రాజెక్ట్ డాల్ఫిన్ (దశ II), ప్రాజెక్ట్ స్లోత్ బేర్, ప్రాజెక్ట్ ఘరియాల్, మానవ–వన్యజీవి ఘర్షణల కేంద్రం (CoE–HWC), మరియు టైగర్స్ అవుట్‌సైడ్ టైగర్ రిసర్వ్స్.
ఈ ప్రాజెక్టుల లక్ష్యం జాతుల సంరక్షణను బలపరచడం, పర్యావరణ సమతుల్యతను కాపాడడం, ఘర్షణలను తగ్గించడం. ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశం వన్యప్రాణుల సంరక్షణలో సాధించిన ప్రగతిని ప్రశంసిస్తూ, గత దశాబ్దంలో పులులు, ఏనుగులు, ఖడ్గమృగాల రక్షణలో దేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. వన్యప్రాణులు కేవలం ప్రకృతి అందమే కాదు, మన జీవన వ్యవస్థలో కీలక భాగం. జీవవైవిధ్యం తగ్గితే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది, ఆహార గొలుసులు విరిగిపోతాయి. అందువల్ల వన్యజీవి సంరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు, ప్రతి పౌరుడి ధర్మం. ప్రకృతితో సహజీవనం మన ఆచరణలో భాగమైతేనే భవిష్యత్తు తరాలకు పచ్చదనం, జీవ వైవిధ్యం అందించగలం. “ప్రకృతిని కాపాడటం అంటే మనల్ని మనమే కాపాడుకోవడం” — ఈ భావనతో ముందుకు సాగితే, భూమి మనందరికీ సురక్షితమైన గృహంగా నిలుస్తుంది.

