"ఆంధ్ర ప్రదేశ్ కార్టూనిస్టులు సంఘం" (ఆకాసం) ఆవిర్భావ సభ ఆదివారం 14-12-2025 న విజయవాడ లోని బాలోత్సవ భవన్ లో ఘనంగా జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘు రామ కృష్ణ రాజు గారు , విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శ్రీ ఎ. వి. శేషసాయి గారు విచ్చేసి సంఘం లోగో మరియు పేరును ఆవిష్కరించారు.
అనంతరం శ్రీ రఘు రామ కృష్ణ రాజు గారు మాట్లాడుతూ "తనకు కార్టూన్లు అంటే చిన్నతనం నుండి ఇష్టమని, సమాజంలోని సమకాలీన సమస్యలను కార్టూనిస్టులు తమ కార్టూన్ల ద్వారా వెలుగులోకి తెస్తారని" చెప్పారు. అలాగే ప్రముఖ చిత్రకారుడు బాపు గారితో తనకున్న అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.
మరో అతిథి జస్టిస్ శ్రీ ఎ. వి. శేషసాయి గారు మాట్లాడుతూ సమాజ హితాన్ని కాంక్షిస్తూ మంచి కార్టూన్లను ప్రజలకు అందించాలని కోరారు. కార్టూన్లలో హాస్యం జోడించి ఉన్నందున వాటికి ప్రజల ఆదరణ ఎప్పటికి ఉంటుందన్నారు.
ఆకాసం అధ్యక్షులు శ్రీ శ్రీధర్ గారు మాట్లాడుతూ కార్టూన్ రంగానికి ప్రభుత్వ సహకారం అందించాలని కోరారు.
సంఘం గౌరవ అధ్యక్షులు దుగ్గరాజు శ్రీనివాసరావు, అధ్యక్షులు అన్నం శ్రీధర్ (బాచి), కార్యదర్శి రావెళ్ల శ్రీనివాస రావు, ఉపాధ్యక్షుడు బొమ్మన్ లతో కలిపి మొత్తం 14 మందితో ఆకాశం నూతన కార్యవర్గం ఏర్పాటైంది.
ఈ కార్యక్రమంలో హాస్యానందం రాము, గోతెలుగు బన్ను, పద్మ, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

