నేటి కాలంలో సాంకేతిక పరిజ్ఞానం యువతల జీవన విధానంలో విడదీయలేని భాగమైపోయింది. పాఠశాల పాఠాలు నేర్చుకోవడం నుంచి సమాచారాన్ని పొందడం వరకు, స్నేహితులతో మాట్లాడటం నుంచి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం వరకు—ప్రతి చర్యలో స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ సాంకేతిక విప్లవం యువతకు అపారమైన అవకాశాలను తెస్తున్నప్పటికీ, వారి మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత భద్రతపై గమనించదగ్గ ముప్పులు కూడా పెరుగుతున్నాయి. అందుకే డిజిటల్ ప్రపంచంలో సురక్షితంగా, సమతుల్యంగా జీవించడానికి ప్రత్యేకమైన అవగాహన, సరైన అలవాట్లు అవసరం.
డిజిటల్ వెల్నెస్ అంటే సాంకేతికతను ఆరోగ్యకరమైన పద్ధతిలో వినియోగించడం. నిరంతరం మొబైల్‌ఫోన్‌లో గడపడం వల్ల యువతలో ఆందోళన, ఒత్తిడి, నిరాశ వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా, ఇతరుల జీవితాలను చూసి తమతో పోల్చుకునే అలవాటు, సోషల్ మీడియాలో కనిపించే అవాస్తవ ప్రకటనలు యువతలో ఆత్మన్యూనతా భావాన్ని పెంచుతాయి. నటులు, క్రీడాకారులు, ప్రముఖులు చూపించే ప్రకాశవంతమైన చిత్రాలను నిజ జీవితమని భావించడం వల్ల, తమ జీవితం తక్కువగా ఉందన్న భావన కలుగుతుంది. ఈ పోలికల ఉచ్చు నుంచి బయటపడాలంటే తమ ప్రత్యేకతను గుర్తించడం, ఇతరుల రూపాలకంటే తమ వాస్తవాన్ని ముఖ్యంగా భావించడం అవసరం.
అలాగే, ‘ఏదో మిస్ అవుతున్నామేమో’ అన్న భావన యువతలో పెరుగుతోంది. ఈ ఆందోళన నిరంతరం ఫోన్ చూసే అలవాటు పెంచి, నిద్రను చెడగొడుతుంది. ఫోన్‌ను ఓపికగా పక్కన పెట్టడం, పుస్తకం చదవడం, నడక చేయడం, కుటుంబ సభ్యులతో మాట్లాడడం వంటి అలవాట్లు ఈ ఒత్తిడిని తగ్గిస్తాయి. రోజులో కొంత సమయం అయినా సాంకేతికతకు దూరంగా ఉండటం మనసును ప్రశాంతం చేస్తుంది. ఉదయం లేవగానే లేదా నిద్రపోయే ముందు ఫోన్ ఉపయోగించకపోవడం వంటి చిన్నపాటి నియమాలు కూడా మానసిక శాంతిని పెంచుతాయి.
డిజిటల్ ప్రపంచంలో భద్రతా సమస్యలు కూడా అంతే తీవ్రమైనవి. ఆన్‌లైన్ దూషణలు, వేధింపులు యువతను మానసికంగా కుంగదీస్తాయి. ఇలాంటి వేధింపులు ఎదురైనప్పుడు భయపడకుండా, వాటి ఆధారాలను భద్రపరచి, వేధింపులకు పాల్పడుతున్న వారిని నిరోధించి, పెద్దలకు తెలియజేయడం చాలా ముఖ్యం. ఏ పరిస్థితిలోనూ ఒంటరిగా భరించకూడదు.
వ్యక్తిగత వివరాల రక్షణ కూడా అత్యంత అవసరం. అపరిచితులకు తమ ఫోన్ నంబరు, చిరునామా, కుటుంబ వివరాలు ఇవ్వకూడదు. ప్రతి ఖాతాకు వేరే రహస్య సంకేతం పెట్టడం, సులభంగా ఊహించగల పదాలు వాడకపోవడం, అనుమానాస్పద సమాచారానికి స్పందించకపోవడం మంచిది. అనేక సందర్భాల్లో మోసగాళ్లు బ్యాంక్ వివరాలు తెలుసుకోవడానికే ఆకర్షణీయ సందేశాలు పంపుతారు. తెలియని సందేశాలపై నొక్కకపోవడం, అనుమానాస్పద సమాచారాన్ని వెంటనే తొలగించడం ఉత్తమం.
తప్పుడు సమాచారం కూడా పెద్ద సమస్యగానే మారింది. ఏ వార్త నిజమో, ఏది అబద్ధమో గుర్తించగలిగే నైపుణ్యం పెంపొందించుకోవాలి. ఒకే చోట చదివిన సమాచారాన్ని వెంటనే నమ్మకుండా, వివిధ వనరుల్లో పరిశీలించడం మంచిది. నిజాన్ని తెలుసుకునే అలవాటు యువతలో నిర్ణయశక్తిని పెంచుతుంది.
మొత్తానికి, సాంకేతికతను పూర్తిగా దూరం పెట్టడం సాధ్యం కాని విషయం. కానీ దానితో సమతుల్యంగా జీవించడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. డిజిటల్ ప్రపంచం మన అభివృద్ధికి సాధనం కావాలంటే, దానిని ఎలా ఉపయోగిస్తున్నామన్నది ముఖ్యమం. మానసిక ప్రశాంతతను కాపాడుకుంటూ, వ్యక్తిగత వివరాలను రక్షించుకుంటూ, సమాచారాన్ని విశ్లేషిస్తూ ముందుకు సాగితేనే యువత ఈ డిజిటల్ యుగంలో సురక్షితంగా, ఆరోగ్యకరంగా, విజయవంతంగా జీవించగలరు.

