ఆశ ఉత్సాహాల హేల-ఆశా భోస్లే - వనం వేంకట వరప్రసాదరావు

ఆశ ఉత్సాహాల హేల-ఆశా భోస్లే

ఒక ఉత్సాహ ప్రవాహం కాలసాగరంలో కలిసిపోయింది! కోట్లాది సంగీతప్రియుల 'మనోనందనవన ఆశాలత' వాడి, వడలి 'అల్విదా' చెప్పింది!

ఒక పవిత్ర, గంభీర, శ్వేత వాహిని, నిండైన , లోతైన ప్రవాహిని, గంగానది!

ఒక రాసిక్యం నిండిన ప్రేమమయ హృదయిని, చిలిపి, దూకుడు, అల్లరి స్వేచ్ఛావాహిని, అసిత కాళింది, యమునానది!

ఆ రెండూ ఈ ధరిత్రిని ముంచెత్తాయి, రసప్లావితం చేశాయి, మంజుల రాగ రంజితం చేశాయి, సేద దీర్చాయి, మెత్తని చిత్తసీమలను, భారతీయ చలనచిత్రసీమను సరస, రసిక భావాలతో సస్యశ్యామలం చేశాయి! అవి ఇంకిపోని వాహినులు! అవి చెమ్మలు చెల్లిపోని ఆర్ద్రస్మృతులు, అవి అమరగతులు!

ఆ గంగకు మరొక పేరు లతామంగేష్కర్! ఆ యమున తీరు, మరొకపేరు ఆశాభోస్లే! అనేక దశాబ్దాలుగా ఆ గంగా, యమునలలో మునకలేస్తున్నది అఖిల ప్రపంచం! ఆ కన్నతండ్రి ‘దీనానాథ్ మంగేష్కర్’దివ్య స్మృతికి నమస్సులు! ఎటువంటి కూతుళ్ళను కన్నావయ్యా మహానుభావా! ఎవరా అన్నది, పుత్రులే ఉద్ధరిస్తారని?

అక్క గొంతు ఆర్ద్రతను, లోతైన ఎమోషనల్ అప్పీల్ ని యిచ్చేది! ఆ గొంతు, ఆ తత్త్వం, ఆ వ్యక్తిత్వం, అవి .. ఆ పాట వున్నదే.. ‘రహే న రహే హమ్ మెహకా కరెంగే, బన్ కే కలీ బన్ కే సబా బాగే వఫా మే..’ (మేము ఉన్నా లేకపోయినా, ఈ వలపుల వనంలో ఒక పువ్వులా, ఒక చల్లని పిల్లగాలిలా ఎప్పుడూ పరిమళిస్తూనే ఉంటాము! ఆ ప్రస్తుతి, ఆ ప్రశస్తి అక్కా, చెల్లెళ్ళు ఇద్దరికీ వర్తించేదే నిజానికి!) ఆ పాటలాగా!

చెల్లెలి గొంతు దూకుడైన అల్లరి, చిలిపిదనం, తలెగరేసే పొగరు ధనం, ‘టేకిటీజీ .. చల్ గోలీ మారో యార్’ మూడ్ ని యిచ్చేది, ఆ పాట వున్నదే.. ‘దునియా నే హమ్ కో దియా క్యా? దునియా సే హమ్ నే లియా క్యా? హమ్ సబ్ కీ పర్వా కరే క్యోం? సబ్ నే హమారా కియా క్యా? దమ్ మారో దమ్ మిట్ జాయే గమ్ బోలో సుబ్ శ్యామ్ హరే కృష్ణ హరే రామ్‘(లోకం మనకేం ఇచ్చింది? లోకం నుంచి మనమేం పుచ్చుకున్నాం? అందరినీ మనం ఎందుకు లెక్క చెయ్యాలి? అందరూ మనకేం చేశారు? ఎవరైనా మనకేం ఒరగబెట్టారు?!) ఆ పాటలాగే, అదే దూకుడు!

పదహారేళ్ళకే, తనకన్నా పదిహేనేళ్ళు పెద్దవాడైన, తను మనసిచ్చిన గణపతి రావు భోస్లేతో లేచిపోయి పెళ్లి చేసుకుంది! అసూయ, అనుమానం కారణంగా అతడు కలహిస్తే ఇద్దరు చిన్న పిల్లలు, కడుపులో ఒక పిల్లతో పుట్టింటికి వచ్చేసింది! భర్తకు విడాకులిచ్చినా, భర్త ఇంటి పేరును అట్టే పెట్టుకుంది! అదే, ఆ పాటలో లాగానే జాన్తా నై ఆటిట్యూడ్! బాల్యం నుండి యిక్కట్లతో రాటుదేలి, జీవితాన్ని వడపోసిన అనుభవ సారమైన ఆప్టిట్యూడ్! ఆత్మ విశ్వాసంలో ఎవ్వరికీ అందనంత ఆల్టిట్యూడ్! దట్ ఈజ్ ఆశా భోస్లే! ఆశ ఆమె పేరులోనే వుంది, ఆత్మ విశ్వాసం గుండె నిండా వున్నది!

వ్యక్తిగత జీవితంలో, వృత్తిగత జీవితంలో, ప్రవృత్తిగత జీవితంలో ఎవ్వరినీ నెత్తికెక్కించుకోలేదు, ఎవరికీ లొంగలేదు, విజయాలకు ఒళ్లు మరిచి పొంగలేదు, అయినవాళ్ళతో (అక్కతో సహా మొదటి భర్తతో, కొంతమంది ప్రముఖులతో) అపార్థాలు, కలహాలు వస్తే కుంగలేదు! తుంటరిగా, ‘జంటరిగా’, ఒంటరిగా.. ఎలాగైనా సరే, నవ్వుతూ, తుళ్లుతూ, ఆటంకాలొస్తే వెనక్కు తగ్గకుండా పక్కకు మళ్ళుతూ తను తన మనసు చెప్పినట్లే బతికింది, గైడ్ సినిమాలో రోజీ మార్కో/నళిని(వహీదా రెహమాన్) పాత్రలాగా! తనకన్నా ఆరేళ్ళు చిన్నవాడైన 'ఆర్.డీ. బర్మన్'తో వృత్తిలో ఎదుగుతూ ముందడుగు వేసింది, అభిరుచులేకాక అంతరంగాలూ కలవడంతో అతడితోనే మూడు ముళ్ళతో ఒకటై , జీవితంలో ఏడడుగులు వేసింది!

ఆమెకు నచ్చినపనిని ఆమె చేయకుండా ఆపగలిగిన వాడు పుట్టలేదు! ఆమె జీవిత కాలపు హిట్ సాంగ్ అయిన అదే పాట 'దమ్ మారో దమ్ ..' పాట రికార్డింగ్ పూర్తి అయిన తర్వాత దానిని సినిమాలో వుంచొద్దు అని పక్కన పెట్టాడు ఆ సినిమా (హరే రామ హరే కృష్ణ) హీరో/నిర్మాత/రచయిత దేవానంద్! ఆ పాట రచయిత ఆనంద్ బక్షీ, సంగీత దర్శకుడు ఆర్.డి.బర్మన్ ఎంత చెప్పినా వినలేదు దేవానంద్! ఆ సినిమాను, ఆ పాట తర్వాత హీరోగా తన పాత్ర మీద చిత్రీకరించాల్సిన మరొక పాట 'ఫూలోం కా తారోం కా సబ్ కా కహనా హై, ఏక్ హజారోం మే మేరీ బహ్నా హై' అనే పాటను డామినేట్ చేస్తుంది అని దేవానంద్ ఆర్గ్యుమెంట్! చేసేది లేక ఆనంద్ బక్షి, ఆర్ డి బర్మన్ ఊరుకున్నారు! ఆ విషయం తెలిసిన ఆశాభోస్లే మాత్రం దేవానంద్ ఇంటికెళ్ళి మరీ 'దమ్ మారో దమ్' పాట వుండి తీరాల్సిందే అని పట్టు పట్టింది! ఆ సినిమా 'సక్సెస్'కి ఆ పాట ప్రధాన కారణం అవుతుంది చూడమని ఆర్గ్యూ చేసింది! ఆమె వాదనను కాదనలేక ఒప్పుకున్నాడు దేవానంద్. ఆశా భోస్లే వాదించినట్టుగా ఆ సినిమా విజయానికి ప్రధాన కారణం అయ్యింది ఆ పాట, దాని చిత్రీకరణ! హిందీ సినిమా ఆల్ఆ టైం హిట్స్ లో ఒకటిగా నిలిచింది ఆ పాట! ఆ పాటకే 1973 లో ఉత్తమ నేపథ్యగాయని అవార్డు లభించింది ఆమెకు!

ఆమె మానసికంగా ఎన్నడూ వృద్ధురాలు కాలేదు, నిస్తేజత్వం, నిస్సత్తువ, నిరాశ రాలేదు! ముదిమిలో కూడా డిస్కోలు, హుక్ స్టెప్స్ వేసింది! భోజన ప్రియులకు, కావలసిన వాళ్ళకు, కడుపునిండా షడ్రుచుల భోజనం వండి పెట్టింది. సంగీత ప్రియులకు సప్తస్వరాల వీనులవిందు భోజనం పెట్టింది! డిస్కో, క్యాబరే పాటలు పాడింది, భజనలు, గజల్స్ పాడింది, ప్రైవేట్ ఆల్బమ్స్ పాడి రిలీజ్ చేసింది! 12000 పాటలకు పైగా స్టూడియో రికార్డింగ్స్ చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకెక్కింది! భారత ప్రభుత్వ పద్మ విభూషణ్ తోపాటు, 9 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్, జీవిత సాఫల్య పురస్కారం, 18 మహారాష్ట్ర ప్రభుత్వ సినిమా అవార్డులు, 4 బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అవార్డులు మరెన్నో ఇతర అవార్డులు ఆమెను అందుకున్నాయి!

ఆ గొంతు…

‘దాదీ అమ్మా దాదీ అమ్మా మాన్ జా! ఛోడో జీ ఏ గుస్సా జరా హస్ కే దిఖావో’ అని చిన్న పిల్లలా పాడింది!

‘ఓ మేరె సోనారే సోనారే సోనారే! దే దూంగీ జాన్ జుదా మత్ హోనారే!’ అని పడుచు పిల్లలా పాడింది!

‘ఏ లడ్కా హాయ్ అల్లా! కైసా హై దీవానా!’ అని కవ్వించింది! ‘ఈనా మీనా డీకా.. డాయ్ డామనికా.. మకనకనకా చికా పిక రీకా’ అని నవ్వించింది! ‘జబ్ ఛాయే మేరా జాదూ కోయీ బచ్ న పాయే హా ‘ అని కైపుతో కసి పెంచింది!

‘హ్హ! ఛోడ్ దో ఆంచల్! జమానా క్యా కహేగా?’ అని ఊరించింది! ‘ఏక్ మై ఔర్ ఏక్ తూ దోనో మిలే ఇస్ తర్హా ఔర్ జో తన్ మన్ మే హోరహాహై ఓ తో హోనాహీ థా’ అంటూ ఉసి గొలిపింది!

‘..ముఝే లేకే సాథ్ చల్ తూ! యుహీ దిన్ రాత్ చల్ తూ! ఓ సాథీ చల్ ‘ అంటూ ఉరుకులు పెట్టించింది! ‘చురా లియాహై తుమ్ నే జో దిల్ కో, నజర్ నహీ చురానా సనం, బదల్ కే మేరీ తుమ్ జిందగానీ కహీ బదల్ నా జానా సనం’ అని వలచి వలపించింది! ‘ఓ సాథీ రే! తేరే బినా భీ క్యా జీనా? తేరే బినా భీ క్యా జీనా? ఫూలోంమే కలియోం మే, సప్నోం కీ గలియోం మే, తేరే బినా కుఛ్ కహీ నా’ అని విరహంతో విలపించింది!

ఆమె గొంతు పలికించని భావం లేదు, తలపించని వయసు లేదు! ఆ గానానికి పులకించని మనసు లేదు! ఆమె స్వర సాగరంలో ఎన్ని అలలు? ఎన్నని లెక్క పెట్టగలము?

‘ఇన్ ఆంఖోం కే మస్తీ మస్తాన్ హజారోం’...'క్యా గజబ్ కర్తే హో జీ?’.. ‘మై చలీ మై చలీ’.. ‘జవాని జానేమన్ హసీన్ దిల్ రుబా’.. ‘పియా తూ అబ్ తో ఆజా!’.. ‘ఆయియే మెహర్బాన్’.. ‘రాత్ అకేలీ హై బుఝ్ గయే దియే’.. ‘అభీ నా జావో ఛోడ్ కర్’.. ‘దిల్ ఛీజ్ క్యా హై ఆప్ మేరీ జాన్ లీజియే! బస్ ఏక్ బార్ మేర కహా మాన్ లీజియే’…’లేకర్ హమ్ దీవానా దిల్ ఫిర్తే హై మంజిల్ మంజిల్’… ‘లేకే పెహ్లా పెహ్లా ప్యార్’…’అచ్ఛా జీ మై హారీ చలో మాన్ జావో నా’…’ఆగే భీ జానే నా తూ, పీఛే భీ జానే నా తూ, జో భీ హై బస్ ఏహీ ఏక్ పల్ హై’..’మిల్ గయా! హమ్ కో సాథీ మిల్ గయా!’…’పర్దే మే రహ్నే దో! పర్దా నా ఉఠావో’…’ఏదునియా వాలే పూఛేంగే ములాకాత్ హుయీ! క్యా బాత్ హుయీ’…'దీవానా హువా బాదల్’…’ఇక్ పర్ దేశీ మేరా దిల్ లేగయా!’…’జాయియే ఆప్ కహా జాయెంగే..’ ’హోటోన్ పే లగావోతో షరాబ్ హమ్ హై! లే జాయేంగే లే జాయేంగే దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’…’కబ్ కే బిఛ్ డే హుయే హమ్ ఆజ్ కహా ఆకే మిలే’…’పియా ఆధీ హై ప్యార్ కీ భాషా! ఆధీ రహనే దో మన్ కీ అభిలాషా! ఆధా హై చంద్రమా రాత్ ఆధీ’

కోట్లాది హృదయ తీరాలను తాకిన ఆశాభోస్లేజీ స్వరసాగర కెరటాలలో ఇవి కొన్ని మాత్రమే! భౌతికంగా చివరి మజిలీకి ఆమె పయనం ముగిసింది!

కానీ..

జయంతితే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః |
నాస్తి తేషాం యశః కాయే జరా మరణజం భయం ||

సుకృతాత్ములు రససిద్ధులు।
సుకవీంద్రులు విజయ నిధులు సుమ్ము తదీయా।
ధిక కీర్తి శరీరంబులు।
ప్రకట జరామరణ జన్మ భయ రహితంబుల్‌॥

ఆమెకు నా అశ్రుపూర్ణ స్మృత్యంజలి!

-వనం వేంకట వరప్రసాదరావు