ఆకాశయానంలో అనాగరికత (వ్యాసం) - మద్దూరి నరసింహమూర్తి

Akashayanam lo anagarikatha

ఆకాశయానం చేసే ప్రయాణీకులు అంతో ఇంతో చదువుకున్నవారు, కొద్దో గొప్పో డబ్బున్నవారు అయి ఉంటారన్నది, నాగరికులు అయి ఉంటారన్నది నిర్వివాదాంశం.

ఇప్పటికి పలుమార్లు ఆకాశయానం చేసిన నా అనుభవంలో, ఆకాశయానం చేసే ప్రయాణీకులలో ఎక్కువ ప్రయాణీకులు అనాగరికంగా వ్యవహరించడం చూసిన నాకు, ఆ ప్రయాణీకుల మీద సూటిగా ఆగ్రహించుకొనేందుకు అవకాశం లేక, వారిని మనసులోనే అసహ్యించుకోవడం పరిపాటైపోయింది.

అంతో ఇంతో చదువుకున్నవారిని, కొద్దో గొప్పో డబ్బున్నవారిని మరియు నాగరికులైనవారిని అసహ్యించుకోవాలి అనిపించడమేమిటి – అని చదువరులకు వచ్చే సందేహాన్ని దూరం చేసేందుకు, ఇక్కడ కొన్ని దృష్టాంతములను వివరిస్తాను, అవధరించండి.

విమానాశ్రయంలో విమానంలోనికి చేరుకొనేందుకు – ‘ జోన్ ఒకటి/రెండు/మూడు లోనికి చేరుకొనవలసిన ప్రయాణీకులు మాత్రమే ముందుకు వచ్చి, లోనికి వెళ్ళే ప్రయత్నం చేయండి ’ అని ప్రకటన వినిపిస్తూనే ఉంటుంది. అయినా, ఒక జోన్ లోనికి వెళ్ళే ప్రయాణీకులలో, ఇతర జోన్ కు చెందిన ప్రయాణీకులు కూడా చేరి ముందుకు పోయే ప్రయత్నం చేయడం హాస్యాస్పదంగా కనిపిస్తూనే ఉంటుంది.

విమానం ఎగిరే ముందర – ఆకాశయానంలో ప్రయాణీకులు తీసుకోవలసిన జాగ్రత్తలు, అత్యసర పరిస్థితులు ఎదురయేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, హిందీ భాషలోనూ మరియు ఆంగ్ల భాషలోనూ చేష్టల ద్వారా మాటల ద్వారా ఆకాశయాన ప్రయాణీకుల సంరక్షకులు వివరించడం వారి విధి నిర్వహణలోని భాగం.

కానీ, ఆ వివరణను జాగ్రత్తగా చూసి వినే ప్రయాణీకులను వేళ్ళ మీద లెక్కించవచ్చు.

అందుకే కాబోలు – వారు ప్రయాణీకులను ఉద్దేశించి – “ పలుమార్లు విమానయానం చేసిన అనుభవం ఉన్నాకూడా ఇప్పుడు వివరించే జాగ్రత్తలు తప్పకుండా గమనించండి ” – అని కూడా ప్రకటిస్తూనే ఉంటారు.

అయినా, చాలా మంది ప్రయాణీకులలో చలనం/స్పందన శూన్యం.

విమానం ఎగిరే ముందర మరియు నేల మీదకు దిగే ముందర -- కిటికీ మూయకుండా తెరిచే ఉంచండి, ఎదురుగుండా ఉన్న కుర్చీకి తగిలించి ఉన్న బల్లను వాల్చకండి, కూర్చున్న కుర్చీని నిటారుగా ఉంచండి – అని ఆకాశయాన ప్రయాణీకుల సంరక్షకులు చెప్తూనే ఉంటారు. వారు చెప్పడమేమిటి, మనం వినడమేమిటి అన్న నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు వ్యవహరించే ప్రయాణీకులే అధికం.

విమానం ఎగిరే సమయమందు, ఆకాశంలో ప్రయాణం చేసే సమయంలో మరియు నేల మీదకు దిగే సమయమందు - మొబైల్, ల్యాప్టాప్ వగైరా ఎలక్టానిక్ పరికరాల వాడకం, విమానం సురక్షితంగా ప్రయాణించడంలో ఆటంకం ఏర్పరిచే అవకాశం ఉండడం వలన, వాటి వాడకాన్ని నిషేదిస్తూ ఆకాశయాన ప్రయాణీకుల సంరక్షకులు తగురీతిన ప్రకటన చేస్తూనే ఉంటారు. అయినా, ఆ ప్రకటనను పట్టించుకొని, ఆచరించే ప్రయాణికులను వేళ్ళ మీద లెక్కించవచ్చు.

‘ విమానం ఆకాశంలో ఎగిరే సమయాన కుర్చీకి బెల్ట్ బంధించుకొనే ఉండడం సురక్షితం ’ అని ప్రకటన వినిపిస్తున్నా, విమానం పైకి చేరుకొనగానే, బెల్టును తీసేసుకొనే ప్రయాణీకులే అధికం.

విమానం నేల మీదకు చేరుకున్నా, కొంత సమయం వరకూ అతి వేగంగానే నడుస్తూనే ఉంటుంది. కనుక, ‘ విమానం పూర్తిగా ఆగినవరకూ, కుర్చీకి బెల్ట్ బంధించుకొనే ఉండండి ’ అని ప్రకటన వెలువడుతూనే ఉంటుంది. అయినా, విమానం నేల మీదకు చేరుకొనగానే, బెల్టును తీసేసుకొనే ప్రయాణీకులే అధికం.

‘ బయటకు వెళ్ళేందుకు విమానం తలుపు(లు) తెరుచుకొనేంతవరకూ, ఎవరి కుర్చీలలో వారు కూర్చొనే ఉండండి, పైన సామాన్లున్న స్థలానికి ఉన్న తలుపులు తీయకండి ’ అని కూడా ప్రకటన వెలువడుతూనే ఉంటుంది. అయినా, విమానం నేల మీద ఆగడమే ఆలస్యం అన్నట్టుగా, నిలబడి పైన సామాన్లున్న స్థలానికి ఉన్న తలుపులు తీసెసే ప్రయాణీకులే అధికం.

‘ విమానం వదిలి వెళ్ళేటప్పుడు మీ వస్తువులు అన్నీ తీసుకొని వెళ్తున్నారో లేదో ఒకటికి రెండు సార్లు చూసుకొని వెళ్ళండి ’ అని కూడా ప్రకటన వెలువడుతూనే ఉంటుంది. అయినా, కొంతమంది ప్రయాణీకులు కళద్దాలు, చేతితో పట్టుకొనే చిన్న సంచీలను పోలే కొన్ని వస్తువులు వదిలి వెళ్లిపోయేరు అని పత్రికలలో వార్తలు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి.

ఇప్పటికైనా, మీరు నా ఆలోచనలను సమర్ధిస్తారా?

లేక, వీడేవడో చెప్పడమేమిటి మనం సమర్ధించడమేమిటి అనుకుంటున్నారా?

**శ్రీరామ**

మరిన్ని వ్యాసాలు

Kaashi Prayana Kathalu - PRASADAM PARAMAARTHAM
కాశీ ప్రయాణ కథలు - ప్రసాదం పరమార్ధం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaashi Prayana Kathalu - mantra jalam
కాశీ ప్రయాణ కథలు - మంత్రజలం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaka o andamaina baakaa
కాకా... ఓ అందమైన బాక!
- ..... బొల్లిముంత వెంకట రమణా రావు
Kashi Prayana Kathalu - garvam veedina raju
కాశీ ప్రయాణ కథలు - గర్వం వీడిన రాజు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అద్దంకి శ్రీరామమూర్తి.
అద్దంకి శ్రీరామమూర్తి.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు