మనసు కవి - ఆచార్య ఆత్రేయ - ambadipudi syamasundar rao

మనసు కవి - ఆచార్య ఆత్రేయ

కృష్ణమాచార్యులు.సీతమ్మ.దంపతులకు 1921 మే 7 న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సూళ్ళూరుపేట మండలంలో గల మంగళంపాడు గ్రామంలో ఆచార్య ఆత్రేయగా సినీరంగ ప్రవేశం చేసిన కిళాంబి వెంకట నరసింహాచార్యులు జన్మించాడు.ఆత్రేయ పలు చలన చిత్రాలకు సంభాషణలు, పాటలు రాశారు. వీరి పాటలలో ఎక్కువగా మనసుకు సంబంధించిన ప్రస్తావన ఉండటం వలన అతను మనసు కవి, మన సుకవి అయ్యాడు. దీక్ష (1950) చిత్రానికి తొలిసారి గీత రచన, అదే సంవత్సరంలో విడుదలైన సంసారం చిత్రానికి తొలిసారి కథా రచన చేసారు. వాగ్ధానం (1961) చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం కూడా చేసాడు. చిన్ని చిన్ని పదాలతో స్పష్టమైన భావాన్ని పలికించడంలో ఆత్రేయ ఘనాపాటి. తెలుగులో నాటక, సినిమా పాటల, మాటల రచయిత, నిర్మాత, దర్శకులు. దాదాపు 400 సినిమాలకు మాటలు, పాటలు రాసిన కవి తెలుగు పాటను ఆస్వాదించే అందరి మనసులను దోచుకున్న ఈ మనసు కవి చిన్నప్పటినుండి నాటకంలోని పద్యాలను రాగయుక్తంగా చదివేవారు. సమాజంలో మధ్య తరగతి కుటుంబ సమస్యలను తీసుకుని మనోహరమైన నాటకాలుగా మలిచారు. వీరి 'ప్రవర్తన', 'ఎన్.జి.వో' నాటకాలు ఆంధ్ర నాటక కళా పరిషత్ అవార్డులను గెలుచుకున్నారు. విశేషంగా రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో ప్రదర్శనలు జరిగాయి. అలాగే 'కప్పలు' బాగా ప్రాచుర్యం పొందిన నాటకం. రాయలసీమ క్షామ పరిస్థితులను వివరించే 'మాయ' నాటకం, స్వాతంత్ర్యానంతరం దేశంలో చెలరేగిన హిందూ ముస్లిం హింసాకండను 'ఈనాడు' అనే మూడంకాల నాటకం, విశ్వశాంతిని కాంక్షించే 'విశ్వశాంతి' నాటకాన్ని రచించారు. విశ్వశాంతి నాటకానికి కూడా రాష్ట్ర స్థాయి బహుమతి లభించింది. 'సామ్రాట్ అశోక','గౌతమ బుద్ధ', 'భయం' నాటకాలు కూడా వ్రాసారు.
ఆచార్య ఆత్రేయ తెలుగు సినిమా గేయరచయితగా, సంభాషణకర్తగా పేరుపొందినా నిజానికి అతను మాతృరంగం నాటకాలే. నాటక రచయితగా అతను స్థానం సుస్థిరం. మనసుకవిగా సినిమా వారు పిలుచుకునే ఆత్రేయ నాటకాల్లో చక్కని ప్రయోగాలు చేసి నాటక రంగాన్ని మలుపు తిప్పారు.సినిమాల్లో గాని నాటకాలలోగాని ఈయన క లము నుండి వచ్చిన న సంభాషణలు అన్ని కూడా తాత్విక ధోరణితో రాసిన సంభాషణలు జీవిత తత్వాన్నిగుట్టు విప్పేవే జీవితాన్ని కాచి వడపోసిన నగ్న సత్యాలు "వెలుగు నీడలు" చిత్రంలో ఇటువంటి ఓ అద్భుత సంభాషణ తనదైన శైలిలో రాసి ఓ సన్నివేశానికి ఆత్రేయ జీవం పోసారు. సెంటిమెంటల్ డైలాగ్స్ రాయడంలో ఆత్రేయది అందెవేసిన చెయ్యి. ఆత్రేయకు లేడీస్ సెంటిమెంట్లు లేకపోయినా లేడీస్ సెంటిమెంట్ డైలాగ్స్ బాగా రాస్తారని చెప్పుకుంటారు
ఆత్రేయ గొప్ప వేదాంతి కూడ ప్రతివిషయాన్ని వాస్తవిక దృష్టితో అలోచించి సినిమాల్లో సంభాషణలను సమకూర్చేవాడు వేదాంతము, వైరాగ్యము వంట బడితే ప్రమాదం కాబట్టి వాటి జోలికి మంచిదని పైపెచ్చు అవి మనిషిలోని కార్య దీక్షతను, విశ్వాసాలను దెబ్బతీస్తాయని ఆత్రేయ అనేవారు. అలాగే శృంగార రసము ఎక్కువైతే అస్లీలము అవుతుంది అనేవారు కానీ సినిమా పరిశ్రమలో గల వ్యాపార ధోరణులను బట్టి కలెక్షన్లను దృష్టిలో పెట్టుకొని కొన్ని సన్నివేశాలకు లేదాపాటలను వ్రాసేటప్పుడు అస్లీలతకూడా చోటు చేసుకునేది దాని ఫలితముగా ఆత్రేయను బూతు కవి అనికూడా చలనచిత్ర రంగములో వ్యవహరించేవారు సినిమా రంగములో నిలబడాలి అంటే అన్ని రకాల రసాలను పండించాలి కదా
ఆత్రేయ. నిర్మాతలను తిప్పుకునేవాడు. రాయక నిర్మాతలనూ రాసి ప్రేక్షకులనూ ఏడిపిస్తాడని అతనుపై ఓ ఛలోక్తి. రచనలు చేయడానికి చాలా సమయం తీసుకునేవాడు పాటలు సమయానికి రాయక ఏడిపిస్తాడని నిర్మాతలు అంటే ఆ పాటలు వ్రాయటానికి నేనెంత ఏడుస్తానో వాళ్ళకేమి తెలుసు అని ఆత్రేయ అనేవారు. తెలుగు సినిమా పాటలను మామూలు వాడుక మాటలతోనే రాయగలిగిన ఘనాపాటీ ఆత్రేయ. ఉదాహరణకి, తేనె మనసులు సినిమాలో ఈ రెండు పాటలు "ఏవమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు," "నీ ఎదుట నేను వారెదుట నీవు, మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు." అలాగే ప్రేమనగర్ సినిమాలో "నేను పుట్టాను ఈలోకం మెచ్చింది,, నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది." పాట,, "తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా" పాట. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చిట్టా అనంతమే అవుతుంది.మనసును గూర్చి ఆత్రేయ రాసినన్ని పాటలు వేరొకరు రాసి ఉండలేదు. అందుకనే ఆతడిని మనసు కవి అనేవారు. బహుశా అందుచేతనే అయ్యుంటుంది, డాక్టర్ చక్రవర్తి సినిమాలోని "మనసున మనసై బ్రతుకున బ్రతుకై" పాటని ఆత్రేయనే రాసారని అనుకునేవారు. కానీ ఈ పాటని రాసినది వాస్తవానికి శ్రీశ్రీగా లబ్ధప్రతిష్ఠుడైన శ్రీరంగం శ్రీనివాసరావు.వీరిద్దరికీ సంబంధించినదే ఇంకొక సంగతుంది. అదేమంటే తోడికోడళ్లు సినిమాలో "కారులో షికారికెళ్ళే పాల బుగ్గల పసిడిదాన" పాటని శ్రీ.శ్రీ. రాసాదాని విన్నవాళ్ళు అందరు అనుకునేవారు. కాని ఈపాటని రాసింది మాత్రం ఆత్రేయ.
"ఇంద్రధనుస్సు" సినిమాలోని పాట "నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి" అనే పాట ఆత్రేయకు అత్యంత ఇష్టమైన పాటగా చెబుతారు. అతనుే ఒకసారి ఏదో సందర్భంలో ఈ పాట నా జీవితానికి సంబంధించిన పాట అని చెప్పారు.ఆత్రేయ వాస్తవిక జీవితంలో భగ్నప్రేమికుడు
ఆయ్యుంటాడు. అందుకనే అతను రాసిన పాటల్లో విషాద గీతాలు, ముఖ్యంగా మనసును గూర్చి రాసిన పాటల్లో అంతటి విషాదం గోచరిస్తూ ఉండేవేమో.ఒకసారి రావి కొండల రావు గారు ఆత్రేయ దగ్గరకు అసిస్టెంట్ గా పనిచేస్తానని వెళితే "నేనే సహాయకుడిని. దర్శకుడు, నిర్మాత ఏం చెబితే అది రాస్తాను. నాకు మళ్ళీ సహాయకుడెందుకు? అనేశాడుట ఒకసారి ఏదో చిత్రానికి పాట రాయవలసివచ్చినప్పుడు చాలా సమయం తీసుకోవడంతో నిర్మాత గొల్లుమన్నాడు. తను ఆ పాట కోసం బస చేసిన హోటల్ పేరు "చోళ" అందుకే "పల్లవి" తట్టడంలేదని చెప్పి వేరే హోటల్ కి మార్పించుకుని వెంటనే ఆ పాటను పూర్తి చేసారు. ఇంతకీ విషయమేమిటంటే చోళులకీ, పల్లవులకీ పడదు. ఇదే విషయాన్ని శ్లేషగా చెప్పారు.
ఆత్రేయ పాటల రచయిత మాత్రమే కాకుండా, అనేక సినిమాలకు మాటల రచయితగా కూడా ఉన్నారు. ముఖ్యంగా ప్రేమనగర్ సినిమా విజయంలో ఆత్రేయ రాసిన పాటలు, మాటలు ముఖ్యభూమిక వహించిందంటే అతిశయోక్తి కాదు
'మూగమనసులు' రజతోత్సవం సందర్భముగా రావి కొండల రావుగారు ఆత్రేయ గారి ముందు- ఎవరో చెప్పగా- 'తెలుగు మాస్టారు' ప్రహసనం చేశారు . అత్రేయ గారు చాలా ఆనందంగా నవ్వి, ఇంకోసారి చెప్పమన్నారు. అలా ఆ పరిచయం ముదిరి- ఆత్రేయగారిని, తెలుగు మాస్టారు కలిస్తే ఎలా మాట్లాడతారో చెప్పమంటే కొండల రావు గారు చెప్పారు .అత్రేయను అయను రచనల్ని రాసే విధానాల్ని చీల్చి చెండాడాడు .అప్పుడు ఆత్రేయ తనపై వేసిన జోకులకు ఎంత నవ్వారో! ఎంత స్పోర్టివ్‌గా ఆనందించారో ఉదాహరణకు శిలలపై శిల్పాలు చెక్కినారూ- ఏమిటి, శిలలపై శిల్పాలు కాక, పెన్సిళ్లు చెక్కుతారా- ఏమిటి తమ రచన? అంటూ, ఇలాంటివే.ఆత్రేయగారి 'రచనాచమత్కృతి' ఎలాంటిదంటే- రాయరు. చెప్పి రాయిస్తారు. అదీ రాత్రివేళ. రాత్రి తొందరగా భోజనం చేసి, తొమ్మిదిన్నర, పదిగంటలకి పడుకోవాలి. రెండుగంటలకి లేవాలి. ఆ రెండు నుంచి, కోడి కూసే వరకూ (కోళ్లు లేవు- కాకులే అరిచేవి) సాగుతుంది ఆ రచన. అందుకే అతని 'అర్ధరాత్రేయ' అని చమత్కరించేవాళ్లు దేనికీ అయన నొచ్చుకోరు
అతను ఎంత గొప్ప రచయితో అంత నిబద్ధత లేని మనిషి. సినిమా రచయితలకి ఒక సంఘం వుండాలని, అందరికీ చెప్పి, మొదటి సమావేశం ఎక్కడో ఎప్పుడో చెప్పి అందర్నీ ఆహ్వానించి, అతను వెళ్లలేదు తాను ఒక మంచి నీతి గల సాంఘిక చిత్రం (వాగ్దానము) నిర్మిస్తూ దర్శకత్వం కూడా చేస్థానని ప్రకటించి రావి కొండల్ రావు గారిని కె.వి.రావుగారినీ పిలిచి," మీరిద్దరూ నాకు సహాయకులు. కథ సూక్ష్మంగా చెబుతాను. ఇద్దరూ కలిసి స్క్రీన్‌ప్లే వండండి. వంట అయ్యాక చెప్పండి. తింటాను అదే, వింటాను" అన్నారుట మరి.ఆఫీసు అని అని గొణిగితే తన ఇంట్లోని లైబ్రరీ గది చూపిస్తూ" ఇదే మన ఆఫీసు. ఇద్దరూ ఒకవేళ అనుకుని వచ్చి కూచోండి. మీకు టీలు, కాఫీలూ కావలసివస్తే ఇంట్లో చెప్పండి పంపిస్తారు" అన్నారుట . షూటింగ్ కు నటీనటులందరు టెక్నీషియన్లు సిద్ధమై ఉదయం 9 గంటలకు సెట్లో కూర్చుంటే .వాగ్దానము సినిమాకు దర్శకుడు ఆత్రేయ 10-30, 11 గంటలకు వచ్చేవాడుట ఏమిటి మహానుభావా అని అడిగితే" బద్దకిష్టి రచయితని పెట్టుకున్నానయ్యా. సీన్లు రాయడు. (తానే, తన మీదే జోకు వేసుకొని) దగ్గర కూచుని రాయించుకుని వచ్చేటప్పటికి ఇంత ఆలస్యమైంది" ఇదీ ఆత్రేయ సమాధానం అయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ కు ఒక ఉదహరణలు ఏమైతేనేం ఒక గొప్ప రచయిత. ఎన్ని గొప్ప నాటకాలు, ఎన్ని సినిమాలు ఎన్ని గొప్ప పాటలు అయన చేత పాట రాయించు కోవాలని తిరగని వాళ్లు లేరు. ఐతే, ఆ పాట, ఆ మనసులో ఎప్పుడు పుడుతుందో! అతనుకే తెలీదు. ఆత్రేయ సంభాషణలూ అంతే, వింటూ థియేటర్లో ప్రేక్షకులు చప్పట్లు కొట్టేవారు.అత్రేయకి నటుడు కొంగర జగ్గయ్య ఆప్తమిత్రుడు. ఆత్రేయ వ్రాసిన పాటలు, నాటకాలు, నాటికలు, కథలు మొదలగు రచనలన్నీ ఏడు సంపుటాలలో సమగ్రంగా ప్రచురించి జగ్గయ్య తన మిత్రుడికి గొప్ప నివాళి అర్పించాడు అని చెప్పవచ్చు మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చవి చూసి పాటల్లో తన అనుభవాలను పొదిగి, గుండె బరువును దించుకొని మనసు కవి ఆత్రేయ 1989,సెప్టెంబర్ 13 న స్వర్గస్తులయ్యారు.



.