చ్యవన మహర్షి - ambadipudi syamasundar rao

చ్యవన మహర్షి

చ్యవన మహర్షి వృత్తాంతము మహాభారతము,దేవీభాగవతము, అష్టాదశ పురాణాలలో చెప్పబడింది చ్యవన మహర్షి తల్లిదండ్రులు భృగు మహర్షి పులోమ దంపతులు. ఒకనాడు భృగు మహర్షి స్నానానికి వెళుతు అగ్నిహోత్రాన్ని సిద్దము చేయమని భార్యకు చెప్పుతాడు అప్పటికే ఆవిడ గర్భవతి ఆవిడ తనకు పుట్టబోయే బిడ్డ బ్రహ్మర్షి కావాలని కోరుకుంటూ ఉంటుంది. అగ్నిహోత్రము వెలుగుతుండగా పులోముడు అనే రాక్షసుడు ఆవిడ ఎవరు అని అగ్నిహోత్రుడిని అడుగుతాడు నిజము చెపితే మహర్షికి కోపము వస్తుంది అబద్ధము చెపితే పాపము వస్తుంది ఏమి చేయాలో తోచని అగ్నిహోత్రుడు భృగు మహర్షి భార్య అని చెపుతాడు. ఆ రాక్షసుడు పంది రూపములో ఆవిడను ఎత్తుకుపోతుండగా గర్భము లోని శిశువు భూమిపై పడతాడు ఆ పిల్లవాడి తేజస్సుకు రాక్షసుడు భస్మము అవుతాడు. అలా క్రిందపడిపోవటం వలన ఆ బాలుడికి చ్యవనుడు అనే పేరు వచ్చింది విషయము తెలుసుకున్న భృగు మహర్షి అగ్నిహోత్రుడిని సర్వము భక్షించేవాడిగాను, అతి క్రూరుడిగాను అవమని శపిస్తాడు దేవతలు బ్రతిమాలగ మహర్షి శాపాన్ని ఉపసంహరించుకుంటాడు.
ఉపనయనము చేసుకున్నాక చ్యవనుడు తపస్సు చేసుకోవటానికి అరణ్యానికి వెళ్లి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసుకుంటూ ఉండగా చుట్టూ పుట్టలు పెరిగి ముసలివాడు అవుతాడు ఒకనాడు ఇక్ష్వాకు వంశస్తుడైన శర్వాతి సైన్యము భార్య కూతురులతో అరణ్యానికి వస్తాడు అతనికి కూతురు సుకన్య చాలా అందగత్తె ఆవిడ పుట్టలో మెరుస్తున్న కళ్లను చూచి మిణుగురు పురుగులని భావించి పుల్లతో పొడుస్తుంది ఫలితముగా చ్యవనుడి కళ్ళు పోతాయి ఆగ్రహించిన మహర్షి శర్వాతి సైన్యానికి అందరికి మలమూత్రాలు రాకుండా శపిస్తాడు రాజు చ్యవనుడిని తనకూతురు తప్పును క్షమించమని వేడుకుంటాడు భవిష్యత్తు తెలిసినవాడు అవటం వలన చ్యవనుడు సుకన్యను తనకు ఇచ్చి వివాహము చేయమని అడుగుతాడు అంతటి మహర్షి తనకు భర్తగా రావటము తన అదృష్టముగా భావించి సుకన్య చ్యవనుడిని వివాహము చేసుకోవటానికి సంతోషముగా అంగీకరిస్తుంది సుకన్య ముసలి వాడైన భర్తను భక్తి శ్రద్దలతో సేవిస్తూ ఉంటుంది.వీరికి ప్రమతి,దధీచి అప్రవాసుడు అనే ముగ్గురు కుమారులు ఉంటారు.
ఒక రోజు సుకన్య నదికి నీరు తెచ్చు కోవడానికి వెళ్ళినప్పుడు ఆ మార్గంలో వెళ్ళుతున్న అశ్వనీ దేవతలు సుకన్యని చూసి ఏవరీ నవయవ్వన సుందరాంగి అని అనుకొని పరిచయం అడుగగా సుకన్య చ్యవన మహర్షి భార్యనని చెబుతుంది. అప్పుడు వారు ఆ గుడ్డి మునితో కాలం వెలిబుచ్చే బదులు తమతో వచ్చి సర్వసుఖాలు అనుభవించమని కోరుతారు. దానికి సుకన్య అంగీకరించక తన పాతివ్రత్య ధర్మాన్ని తెలుపుతుంది. అప్పుడు అశ్వనీ దేవతలు ఒక పరీక్ష పెట్టదలచి ముసలి వాడు గుడ్డి వాడు అయిన చ్యవన మహర్షిని తాము తమ వైద్యశక్తులతో తమ వలే నవయవ్వనుడిని చేస్తామని ఆమె తన భర్తని గుర్తించమని పల్కుతారు. ఆ విషయం చ్యవన మహర్షికి తెలుపగా చ్యవన మహర్షి అందుకు అంగీకరిస్తాడు. ఆ ముగ్గురు నదిలో స్నానము చేసి బయటకు వస్తారు. ఆ ముగ్గురు చూడడానికి ఒకే విధంగా నవయవ్వనంలో ఉంటారు. ఆ ముగ్గురుని చూసి మొదట తన పతి ఎవరని సంశయించి జగన్మాతని ప్రార్థించి చ్యవనుడీని గుర్తిస్తుంది. దానికి అశ్వనీ దేవతలు కూడా సంతసించి తమకు సెలవు ఇవ్వమని చ్యవన మహర్షిని కోరుతారు. అప్పుడు చ్యవన మహర్షి తనకు యవ్వనము ప్రసాదించిన కారణమున ఏదైన వరము కోరుకోమంటాడు. అప్పుడు అశ్వనీదేవతలు తమకు యజ్ఞయాగాదులలో సోమరసం ఇంద్రుడు ప్రసాదించడం లేదని ఆ సోమరస పానం కావాలని కోరుకుంటారు.
చ్యవనుడు మామగారి అభివృద్ధికి ఒకయజ్ఞము చేయిస్తూ అశ్వని దేవతలకు సోమపానము ఇస్తుంటే ఇంద్రుడు అడ్డుపడతాడు అయిన చ్యవనుడు అశ్వనీదేవతలతో సోమపానము చేయిస్తాడు ఆగ్రహించిన ఇంద్రుడు చ్యవనుడిని చంపటానికి వజ్రాయుధాన్ని తీస్తాడు. కానీ చ్యవనుడు అగ్ని నుంచి ఒక భయంకర రాక్షసుడిని పుట్టించి ఇంద్రుడి మీదకు వదులుతాడు భయపడ్డ ఇంద్రుడు చ్యవనుడిని క్షమించమని అడుగుతాడు ఆరాక్షసుడిని మద్యము త్రాగేవారిలోని జంతువులలో ఉండమని మహర్షి ఆదేశిస్తాడు ఇంత జరిగినా ఆగ్రహము తగ్గని ఇంద్రుడు ఒకపర్వతాన్ని చ్యవనుడు పైకి విసురుతాడు కానీ ఆ మహర్షి తపోబలము వల్ల ఆ పర్వతము ఇంద్రుడిపైకే వస్తుంది అప్పుడు ఇంద్రుడు తన తప్పు తెలుసుకొని క్షమించమని అడిగి మహర్షుల జోలికి పోరాడు అని నిర్ణయించుకుంటాడు.
కొంతకాలము తరువాత చ్యవనుడు గంగా యమునా సంగమములో నీటిలో మునిగి తపస్సు చేస్తుండగా అయన చుట్టూ నీటిలోని చేపలు నీరు ప్రదక్షిణాలు చేస్తుంటాయి అలా 12 ఏళ్ళు తపస్సు చేసినాక ఒకనాడు జాలర్లు విసిరినా వలలో చేపలతో పాటు చ్యవనుడు కూడా చిక్కుంటాడు ఆయనను వలలో చూసిన జాలర్లు తమ తప్పుని మన్నించమని వేడుకుంటారు కానీ చ్యవనుడు మీరు చేసిన తప్పు ఏమిలేదు మీరు మీ కుల వృత్తిని మీరు చేశారు చేపలతో పాటు నన్నుకూడ అమ్ముకోండి అని అంటాడు జాలర్లకు ఏమిచేయాలో పాలుపోక రాజు నహుషుడు దగ్గరకు వెళతారు రాజు చ్యవనుడికి ఏమి ఇస్తానన్న అంగీకరించడు ఆ సమయములో రాజు దగ్గరకు మరో మహర్షి కవిజాతుడు వచ్చి గోవు బ్రాహ్మణులకు సమానము కాబట్టి గోవును జాలర్లకు ఇమ్మని సలహా ఇస్తాడు గోవు మహత్యము తెలుసుకున్న రాజు గోవును జాలర్లకు ఇస్తాడు జాలర్లు మేము ఆవును ఏమి చేసుకుంటాము అని ఆగోవును చ్యవనునికి దానము గా ఇచ్చి నమస్కరిస్తారు ప్రసన్నుడైన చ్యవనుడు జాలర్లకు స్వర్గలోక ప్రాప్తి నహుషునికి ఇంద్రపదవి దక్కుతుంది అని దీవిస్తాడు.
మునులు దేవతలు ఇష్టాగోష్టి జరుపుతున్న సమయముల్ బ్రహ్మ భృగు, కుశిక వంశాలలో బ్రాహ్మణక్షత్రియ సంకరము జరిగి బ్రహ్మర్షి పుడతాడని చెపుతాడు కానీ ఈ సంకరము ఇష్టము లేని చ్యవనుడు కుశిక వంశాన్ని నాశనము చేస్తే సంకరము తప్పుతుందని భావించి కుశిక రాజును ఎన్నో విధాలుగా పరీక్షించిన కుశికరాజు వినయవిధేయలతో భక్తితో చ్యవనుడిని సేవించగా నీ వంశములో బ్రహ్మర్షి పుడతాడు అని దీవిస్తాడు ఆయనే విశ్వామిత్రుడు.ఒకసారి చ్యవనుడు నర్మదా నదిలో స్నానము చేస్తుండగాఒక పెద్దపాముఆయనను పాతాళలోకానికి లాక్కుపోతుంది. అక్కడ ఆయనకు నాగ కన్యలు భక్తి శ్రద్దలతో సేవచేస్తారు పాతాళరాజు అయినా ప్రహ్లాదుడు మహర్షిని చూసి ఇంద్రుడు తనను చంపటానికి పంపాడని అనుమానిస్తాడు కానీ ఆ మహర్షితో మాటాడినాక తన భయము నిరాధారం అని భావించి ఆయనకు నమస్కారము చేసి ,"మహాత్మా మీరు అనేక నదులలో స్నానమాచరించి ఉంటారు ఏ నది స్నానము పుణ్యమైనది" అని అడుగుతాడు దానికి చ్యవనుడు ,"రాజా నీవు విష్ణుభక్తుడివి మనస్సు పవిత్రముగాలేకుండా ఏ నదిలో స్నానము చేసినా ఉపయోగము ఉండదు. తీర్ధయాత్రలకంటే నదీస్నానములకన్నా సత్యము, భూతదయ, శుచిత్వము కలిగి ఉండటం ముఖ్యము ఇవన్నీ ఉంటె అటువంటి వారి పాదాల వద్దకు అన్ని తీర్ధాలు వస్తాయి. అయినా నీవు అడిగావు కాబట్టి ముఖ్యమైన మూడు తీర్ధాలు చెపుతాను అవి నైమిశము, చక్రతీర్ధము, పుష్కరమునే ఈ మూడు భూలోకము లోని పవిత్రమైన తీర్ధాలు."అని చెపుతాడు విన్న ప్రహ్లాదుడు సంతుష్టుడై భక్తి ప్రపత్తులతో చ్యవన మహర్షిని సేవించి ఆశ్రమానికి పంపుతాడు.
అంబడిపూడి శ్యామసుందర రావు