Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

movie review
చిత్రం: సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌ 
తారాగణం: సాయిధరమ్‌తేజ్‌, రెజినా, ఆదా శర్మ, నాగబాబు, సుమన్‌, బ్రహ్మానందం, అజయ్‌, నరేష్‌, రావు రమేష్‌, ప్రభాస్‌ శ్రీను, ఫిష్‌ వెంకట్‌, తేజస్వి, ఝాన్సీ తదితరులు. 
ఛాయాగ్రహణం: సి.రామ్‌ప్రసాద్‌ 
సంగీతం: మిక్కీ జె మేయర్‌ 
దర్శకత్వం: హరీష్‌ శంకర్‌ 
నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ 
నిర్మాత: దిల్‌ రాజు 
విడుదల తేదీ: 24 సెప్టెంబర్‌ 2015 

క్లుప్తంగా చెప్పాలంటే 
అమెరికాలో డాలర్లు సంపాదించి ఇండియాకొచ్చి కాలర్‌ ఎగరేయాలనుకునే కుర్రాడు సుబ్రమణ్యం (సాయిధరమ్‌ తేజ్‌). ఇష్టం లేని పెళ్ళిని కాదనుకుని జంప్‌ అయిపోతుంది సీత (రెజినా). వీరిద్దరూ అనుకోకుండా ఓ సందర్భంలో కలుస్తారు. తనకు భర్తగా నటించమని సీత, సుబ్రమణ్యంను అడుగుతుంది. ఆమె మాట ప్రకారం సీత సొంతూరికి వెళ్తాడు సుబ్రమణ్యం. అక్కడ అనుకోకుండా సుబ్రమణ్యంకి శతృవులు (అజయ్‌ అండ్‌ కో) ఎదురవుతారు. సీతకి భర్తగా నటించిన సుబ్రమణ్యం, నిజంగానే సీతకు భర్త అవుతాడా? సీత కోసం వెళ్ళిన సుబ్రమణ్యంకి ఎదురైన శతృవులు ఎవరు? ఇవన్నీ తెరపై చూడాల్సిన అంశాలు. 

మొత్తంగా చెప్పాలంటే 
ఆద్యంతం సాయిధరమ్‌ చాలా ఈజ్‌తో నటించాడు. డాన్సులు, ఫైట్స్‌లో ఎంతో మెచ్యూరిటీ వున్న సీనియర్‌లా చెలరేగిపోయాడు. చిరంజీవి డాన్సుల్లోని గ్రేస్‌, పవన్‌కళ్యాణ్‌ బాడీ లాంగ్వేజ్‌లోని ఈజ్‌.. ఇవన్నీ సాయిధరమ్‌తేజలో కలగలిసి వున్నాయనడం అతిశయోక్తి కాదు. చాలా సందర్భాల్లో సాయిధరమ్‌ ఇమిటేట్‌ చేశాడనిపించిందంటే, అతనిలో మేనమామల జీన్స్‌ ఎంతలా ఉన్నాయో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. ఎమోషనల్‌ సీన్స్‌లో కూడా సాయిధరమ్‌ ఆకట్టుకున్నాడు. కామెడీలోనూ టైమింగ్‌ ప్రదర్శించాడు. 

హీరోయిన్‌ రెజినా నటనతో ఆకట్టుకుంది. డాన్సుల్లో అయితే సాయిధరమ్‌తేజతో పోటీ పడి అదరగొట్టింది. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ సత్తా చాటింది. సరిగ్గా వాడుకుంటే తెలుగు సినీ పరిశ్రమకి అన్ని నటన, గ్లామర్‌, డాన్స్‌ అన్నీ కలగలిసిన రెజినా దర్శక నిర్మాతల పాలిట బంగారు బాతు అనడం సబబు. రావు రమేష్‌ నటించాడు అనడం కన్నా జీవించాడు అనడం సబబేమో. సుమన్‌ మామూలే. అజయ్‌ది రొటీన్‌ క్యారెక్టర్‌. బాగానే చేశాడు. అతిథి పాత్రలో ఆదా శర్మ ఓకే అనిపిస్తుంది. ఫిష్‌ వెంకట్‌, ప్రభాస్‌ శ్రీను కామెడీ ఆకట్టుకుంటుంది. బ్రహ్మానందం తన కామెడీతో సినిమాకి అదనపు ఆకర్షణ అయ్యాడు. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర ఓకే అనిపిస్తారు. 

కథ కొత్తదేమీ కాదు. కథనం కూడా కొత్తగా ప్లాన్‌ చేసుకోలేదు. దర్శకుడు ఎంటర్‌టైన్‌మెంట్‌ని నమ్ముకున్నాడు. సీన్స్‌ని కాస్త కొత్తగా రాసుకోవడం సినిమాకి ప్లస్‌ అయ్యింది. ఎడిటింగ్‌ బాగుంది. సెకెండాఫ్‌లో ఇంకాస్త అవసరం అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ సూపర్బ్‌. పాటల లొకేషన్స్‌ అదరహో అనిపిస్తాయి. పాటలు వినడానికీ, తెరపై చూడటానికీ బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా ఆకట్టుకుంటుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి ఇంకాస్త అందాన్నిచ్చాయి. నిర్మాణపు విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. రిచ్‌నెస్‌ని సినిమాకి ఆపాదించింది సినిమాటోగ్రఫీ. 

సినిమా చూస్తోంటే చాలా పాత సినిమాలు గుర్తుకొస్తాయి. ఒక్కో కాన్సెప్ట్‌ ఒక్కో సినిమాలో చూసినట్టుందే అనిపిస్తుంది. అదే సమయంలో ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్ట్‌ కడుపుబ్బా నవ్విస్తూ, సినిమాని వేగంగా పరుగులు పెట్టేలా చేస్తుంది. తగినంత యాక్షన్‌, స్క్రీన్‌ మీద నుంచి కళ్ళు పక్కకు తిప్పుకోనివ్వని సాంగ్స్‌ ఇవన్నీ సినిమాలో చిన్న చిన్న లూప్‌ హోల్స్‌ని కవర్‌ చేసేశాయి. డైలాగ్స్‌తో హరీష్‌ శంకర్‌ తన సత్తా చాటాడు. డైరెక్షన్‌ విషయంలో ఎక్కడా ఓవర్‌ ది బోర్డ్‌ వెళ్ళలేదు. ప్రయోగాలకు పోకుండా పక్కా కమర్షియల్‌ మూవీని ప్లాన్‌ చేసుకున్నాడు. కామెడీ, గ్లామర్‌, యాక్షన్‌, ఎమోషన్‌ అన్నీ సమపాళ్ళలో కలిపి, సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులూ ఆకట్టుకునేలా తీర్చిదిద్దడంలో సఫలమయ్యాడు. ఫస్టాఫ్‌ సరదా సరదాగా సాగిపోతుంది. సెకెండాఫ్‌లో కాస్త ఎమోషన్‌ మిక్స్‌ అవుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ కొనసాగుతూనే, సినిమా ఎమోషన్‌ మూడ్‌లోకి వెళుతూ, యాక్షన్‌, గ్లామర్‌ మిక్స్‌ అవుతూ అలరిస్తుందంటే అది హరీష్‌ శంకర్‌ మ్యాజిక్కే. పబ్లిసిటీ బాగా చేశారు, చేస్తున్నారు గనుక నిర్మాతకి మంచి ప్రాఫిట్‌ వెంచర్‌ అయ్యే అవకాశముంది. 

ఒక్క మాటలో చెప్పాలంటే 
సుబ్రమణ్యం సూపర్‌ సేల్‌ 

అంకెల్లో చెప్పాలంటే 
3.25/5
మరిన్ని సినిమా కబుర్లు
srinu vaitla got mega  chance