Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Cine Churaka by Cartoonist Bannu

ఈ సంచికలో >> సినిమా >>

మ్యూజిక్ ముచ్చట్లు

Raja Music Muchchatlu

ఏయన్నార్ ఫెయిల్ అయిన పాట
ఈ స్టిల్ చూడగానే చెప్పేసేవాళ్ళున్నారు ఇది  'ఇల్లరికం' సినిమా లోని 'నిలువవే వాలు కనులదానా' పాట అని. 'ఈ పాట మాకు తెలుసు ఇది రీ మిక్స్ అయి వచ్చింది' అని అంటారు ఈ జెనరేషన్ వాళ్ళు. 'ఈ రిమిక్స్ పాటని పాత పాట సీన్ తో యూ ట్యూబ్ లో చూశాం' అంటారు నెటిజనులు. అప్పట్నించి ఇప్పటి దాకా ఎంతో మందిని ఆకట్టుకున్న ఈ పాట కి నటించడం ఏయన్నార్ కి అస్సలు ఇష్టం లేదు. అంచేత ఈ పాట తీసెయ్యమని అడిగారు .. ''ఇప్పటి దాకా ఈ పాటకి ఎంత ఖర్చు అయిందో చెప్పండి అదంతా ఇచ్చేస్తాను''  అని కూడా అన్నారు.

ఆయన ఆర్గ్యుమెంట్ ఏమిటంటే - అంతకు ముందు సీన్ లో హీరోని హీరోయిన్ అవమానిస్తుంది. 'నువ్వు తింటున్న తిండి నాది' అని భోజనం ఛేస్తుండగా అంటుంది. దాంతో తింటున్న అన్నంలో చేతులు కడిగేసుకుని వెళ్ళిపోతాడు హీరో  తర్వాతి సన్నివేశంలో హీరోయిన్ ని విలన్ బలవంతం చెయ్యబోతుంటే హీరో వచ్చి కాపాడతాడు. - అంతవరకూ కరక్టే ... ఎందుకంటే తనను ఎంత నొప్పించినా ఆమె తన భార్య కాబట్టి ఓకే ... కానీ ఆ తర్వాత స్టెప్పులేస్తూ పాడడం హీరో ని ఒక మెట్టు దిగజార్చినట్టే ..  అతని సంస్కారానికి అది తగదు. - ఇదీ ఆయన వాదన.
''అదేం లేదండీ . మీ మారువేషం, మీ స్టెప్పులు, వినపొంపైన హుషారైన పాట ఇవి చాలు జనంకి మిగిలినవేమీ పట్టించుకోరు'' ఇది నిర్మాత దర్శకుల వాదన.

అక్కినేని లో ఓ సుగుణం వుంది, తన ఆర్గ్యుమెంట్స్ ఎలా వున్నా దర్శకుడు ఒకసారి గనక నాకిలాగే కావాలి అని అంటే అలాగే చేస్తారు. నటిస్తున్నప్పుడు నా మాట మన్నించలేదు లాంటి ఫీలింగ్స్ పెట్టుకోరు. (ఈ విషయంలో వ్యక్తిగతంగా నాక్కూడా ఆయనతో ఓ మంచి అనుభవం వుంది)

ఎలా అయితేనేం .. సినిమా పూర్తయింది. డిస్ట్రిబ్యూటర్స్ కోసం, శ్రేయోభిలాషుల కోసం స్టూడియోలో ప్రీవ్యూలు వేస్తున్నారు. మిగిలిన వారి మాటెలా వున్న తన సతీమణి అన్నపూర్ణ మాత్రం అప్పటికి మూడు సార్లు అటెండ్ అయి చూశారని తెలిసిందాయనకి. ఆశ్చర్యం కలిగింది. ఇంటికి వెళ్ళగానే అడిగారు నిజం తెలుసుకుందామని.

''అవునండీ ఆ సినిమాలో నిలువవే వాలు కనుల దానా పాట కోసమే వెళుతున్నాను'' అని అన్నారామె. దాంతో అక్కినేని షాక్.
ఆయనలో మరో సుగుణం కూడా వుంది. తనపై సద్విమర్శలు చేసేవారిని ఎప్పుడూ దూరం చేసుకోరు. పిలిచి మరీ వారి అభిప్రాయాల్ని అడుగుతుంటారు. అలాంటి వారిలో విజయవాడలో వుండే బెనర్జీ ఒకరు. నిర్మాత డూండీ గారి సోదరుడీయన. ఇల్లరికం సినిమా రిలీజ్ రోజు బెనర్జీకి ఫోన్ చేశారు అక్కినేని. ఇదీ వారి మధ్య జరిగిన సంభాషణ:

(ఇది ఏయన్నార్ స్వయంగా నాతో చెప్పారు)
''సినిమా ఎలావుంది ? '
"బ్రహ్మాండంగా వుంది. జనం ఎంజాయ్ చేస్తున్నారు."
"మరి లాస్ట్ లో వచ్చే ఆ పాట ?"
"దానికి ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు " .
అక్కినేనికి మళ్ళీ షాక్ ... 'అదికాదు' అంటూ తన ఆర్గ్యుమెంట్ చెప్పారు.
"నీ మొహం (ఆంత చనువుంది బెనర్జీ గారికి అక్కినేని దగ్గర) ... ఆ ఒక్క పాటకే వందరోజులు ఆడేట్టుంది
నీ లాజిక్ లన్నీ నీ దగ్గరే పెట్టుకో జనానికవేవీ పట్టవు. తెర మీద మాంచి పాట, నీ స్టెప్పులు అన్నీ మ్యాజిక్ చేస్తుంటే నీ లాజిక్కులెవడిక్కావాలి" అన్నారు బెనర్జీ.

దాంతో తెలిసొచ్చింది అక్కినేనికి జనం పల్స్ ఎలా వుంటుందో ...!?

పకడో పకడో
ఇక్కడున్న 'ఇరుగు - పొరుగు' సినిమా కలర్ ఫొటోలోని ఎన్.టి.ఆర్. డ్రెస్ చూసి "ఓస్ ...ఇది గుండమ్మ కథ లోని ఫేమస్ స్టిల్ ... తీసుకొచ్చి కలర్ చేసి పెట్టేశారు - అని ఈసారి చెబుతారు. అంతే కదా ఇదో పెద్ద విషయమా మాకెప్పుడో తెలుసు " అని పాఠకులు నవ్వుకునే చాన్స్ వుంది.

కానీ ఊహించని కొత్త విషయం చెబితే పాఠకులు ఎంత ఆనందిస్తారో ఊహించగలం.

అందుకోసమే మా ఈ శోధన, పరిశోధన. ఇక్కడ చెప్పొచ్చేదేమిటంటే 'గుండమ్మకథ' లో వేసిన డ్రెస్సే ఎన్.టి.ఆర్. 'ఇరుగు - పొరుగు' సినిమాలో కూడా వేశారు. 'ఎటు చూసిన కురిసే కన్నీరే ' అంటూ హీరోయిన్ కృష్ణకుమారి పాడే పాటలో ఓ నిముషం పాటు ఈ డ్రెస్ లో కనబడతారాయన.

కాబట్టి కలర్ ఫొటోలో వున్న ఎన్.టి.ఆర్. ఫొటో 'ఇరుగు -పొరుగు' సినిమా కోసం తీయించుకున్న స్టిల్ అని మనం నమ్మొచ్చు.

అందుకు సాక్ష్యంగా ఆ పాటలోని కొన్ని స్టిల్స్ ని జతపరిచాం. చూడండి.






రాజా (మ్యూజికాలజిస్ట్)

మరిన్ని సినిమా కబుర్లు
Aditya Hrudayam