Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Raja Music Muchchatlu

ఈ సంచికలో >> సినిమా >>

ఆదిత్య హృదయం

Aditya Hrudayam

"నేనున్నాను"

"ఎన్ని వందలకోట్లు ఆస్థి సంపాదించాం అన్నది ముఖ్యం కాదయ్యా! పడుకుంటే రాత్రి పది గంటలకి ఏ మందూ, మాకూ అవసరం లేకుండా ప్రశాంతంగా రోజూ నిద్ర పోగలుగుతున్నామా లేదా - అదే సీక్రెట్ ఆఫ్ సక్సెస్" అని చెప్పిన మంచి వ్యక్తి, అగ్ర హీరో శ్రీ అక్కినేని నాగార్జున.

"పరిశ్రమకి చెందని వ్యక్తిని పెళ్లాడితే, వాళ్ళు మనం ఇక్కడ చాలా సుఖపడిపోతున్నాం అని, లగ్జరీస్ అలవాటై వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నాం అని ఏవేవో ఊహించుకుని సాధించడం మొదలుపెట్టారనుకో - పొరపాట్న కూడా బుజ్జగించడం, గారం చెయ్యడం అలవాటు చెయ్యకు. అలా చేస్తే ఇక్కడ నువ్వు పడుతున్న కష్టం మీద నీకే గౌరవం లేనట్టు - ఇంక వాళ్లకేం ఉంటుంది. ఇక్కడ ఒక్కో షాట్ సరిగా తియ్యడానికి ఇన్ని ప్రెజర్స్ మధ్య, కాంపిటీషన్స్ మధ్య మనం ఇంత కష్టపడుతుంటే, ఇంట్లో కింగ్ లా ఉండాలి - గుర్తుంచుకో" అని చెప్పిన మన్మధుడూ శ్రీ అక్కినేని నాగార్జునే.

"ఒక్కసారి స్క్రిప్ట్ ఓకే చేశాక నేను సెట్ లో నా కాస్ట్యూమ్స్ స్టైలింగ్ తప్ప మిగతా ఏ విషయంలోనూ జోక్యం చేసుకోనమ్మా - సినిమా మళ్ళీ డబ్బింగ్ చెప్పే ముందు ఓసారి ఎడిటింగ్ రూంలో ఫ్లోలో చూస్తానంతే - జనరల్ గా నాకు మ్యూజిక్ సిటింగ్స్ అంటే ఇష్టం - నీ సినిమాల్లో పాటలు బావుంటాయి కాబట్టి. నేను మ్యూజిక్ సిటింగ్స్ కి కూడా రాను - రికార్డ్ అయ్యాక సిడి ఇవ్వు చాలు" అని ఎంకరేజింగ్ గా చెప్పగలిగిన మంచి మనసున్న వ్యక్తీ శ్రీ అక్కినేని నాగార్జునే.

"నాకూ, శివప్రసాద్ రెడ్డి గారికీ 20 ఏళ్ళ ఫ్రెండ్ షిప్. ఏ కారణం వల్లయినా నీకూ, ఆయనకి ప్రొఫెషనల్ గా డిఫరెన్సెస్ వస్తే నువ్వు రైటో, రాంగో కూడా ఆలోచించను. నేను ఆయన్నే సపోర్ట్ చేస్తాను - కాబట్టి నువ్వు, ఆయన కలిసి కష్టపడండి - మీ మధ్య తేడాలు రాకుండా చూసుకో" అని క్లియర్ కట్ గా, నిజాయితీగా, నిక్కచ్చిగా ముందే చెప్పగలిగిన నిర్మొహమాటి - ముక్కుసూటి కూడా శ్రీ అక్కినేని నాగార్జునే.

ఆయనకున్న ఈ క్లారిటీ వల్లే ఆయన్ని రెండు సినిమాలకి డైరెక్ట్ చేయగలిగాను అదే కామాక్షి మూవీస్ బ్యానర్ లో, శ్రీ శివప్రసాద్ రెడ్డి గారు నిర్మాతగా. విజయవాడలో ఇంటర్ చదువుతూ రామ్ గోపాల్ వర్మ గారి "శివ" సినిమాని ప్రేక్షకుడిగా, శివ సినిమా ప్రభావాన్ని స్టూడెంట్ గా చవిచూసిన నేను దర్శకుడిగా ఆ హీరోతో పని చేయడం అంటే, ప్రతి రోజూ థ్రిల్లే. షూటింగ్ అయ్యాక ప్లాస్టిక్ కుర్చీని వికెట్ గా పెట్టి అఖిల్, బుచ్చిరాజు గారు, చంద్రగారు, శేఖర్ గారు (వీళ్ళు నాగార్జున గారి అబ్బాయి, పర్సనల్ మేనేజర్, మేకప్ చీఫ్, కాస్టూమర్ లు), నేను, శివప్రసాద్ రెడ్డి గారి పిల్లలిద్దరు చందన్, కైలాష్ కలిసి క్రికెట్ ఆడేవాళ్ళం. నాగార్జున గారు అప్పుడప్పుడు జాయిన్ అయ్యి మాకంటే యంగ్ స్టర్ లా ఆడేసేవారు. అలా ఓరోజు ఆయనే, 'నేనున్నాను'లో ఫస్ట్ సాంగ్ లీడ్ సీన్ ఇలాగే, ఇంత నేచురల్ గా స్టార్ట్ అయ్యేలా అలోచించు అన్నారు. అదే సీనయ్యింది. బంతి కావాలా, బాలు కావాలా అంటూ సాకీతో మొదలై చంద్రబోస్ గారు రాసిన "ర్యాలీ రావుల పాడు రేలంగి సంతలోన..." పాటయ్యింది.

"శ్రీ రామదాసు" సినిమా హిట్ అయ్యాక వెంటనే మొదలైన సినిమా "బాస్". మొదటి రోజు షూటింగ్ లో నా భుజం మీద చెయ్యేసి, శివ, అన్నమయ్య, శ్రీ రామదాసు లాంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాక వెంటనే నేను చేసిన నార్మల్ కమర్షియల్ సినిమాలు నిర్మాతలకి సేఫ్ అయ్యాయి గానీ, దర్శకులకి పెద్ద హిట్ లు అవ్వలేదు - అలా చూస్తే శ్రీ రామదాసు సినిమా తర్వాత వెంటనే నీకు సినిమా చేయడం డైరెక్టర్ గా నీ మీద పెద్ద భారం మోపడమే. అందుకే, మళ్ళీ ఇంకో సినిమా చేద్దాం. దీనికి నువ్వు పడగలిగిన కష్టం నువ్వు పడు. రిజల్ట్ గురించి ఎక్కువ టెన్షన్ పడకు అని చెప్పిన మాటలు నాకింకా గుర్తు. ఆయన అన్నట్టే "బాస్" నిర్మాతకి లాభం తెచ్చింది. దర్శకుడుగా నాకు హెల్ప్ అవ్వలేదు. నిజానికి నేను "నేనున్నాను" సినిమా కన్నా "బాస్" సినిమాకే ఎక్కువ కష్టపడ్డాను. "నేనున్నాను" కి నాకు పరుచూరి బ్రదర్స్ ఉన్నారు, కథకుడు భూపతిరాజా ఉన్నారు. సంగీత దర్శకులు కీరవాణిగారున్నారు. బాస్ కి వీళ్ళ ముగ్గురూ లేరు. దాంతో భారం ఇంకా ఎక్కువై, మోయలేక చతికిలపడ్డాను.

ఇవన్నీ ఒక ఎత్తయితే, నేను జయంత్ గారి అసోసియేట్ గా "రావోయి చందమామ" సినిమాకి రెండు షెడ్యూల్స్ మాత్రం పని చేశాను. అప్పుడు వైజాగ్ బీచ్ లో నాగార్జున గారు షాట్ గ్యాప్ లో నాతో వాకింగ్ చేస్తూ, "ఈ జనరేషన్ లో కాబోయే దర్శకులందరు వాళ్ళ క్రియేటివిటీకి, నిర్మాతల సేప్టీని కూడా ముడిపెట్టి ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. ఎకనామిక్ వయబిలిటీ లేకుండా నువ్వు సినిమా బాగా రావాలని ఎంత చెక్కినా అది డెడ్ ఇన్వెస్ట్ మెంటే. మార్కెట్ ని బ్యాలెన్స్ చేయలేని దర్శకుడు, నిర్మాతని చంపేయడానికి తప్ప ఎందుకూ పనికిరాడు. మనమంతా నిర్మాతల డబ్బు మీదే ఎక్స్ పెరిమెంట్ చేస్తున్నాం అని ప్రతిక్షణం గుర్తించుకోవాలి. రానున్న రోజుల్లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంకా పెరిగిపోతుంది. అప్పుడు ఎవరికన్నా ఎక్కువ బాధ్యత మీ దర్శకులు వహించాల్సి వస్తుంది" అని ఆయన చెప్పిన మాటలు అక్షరసత్యాలు. ఆ సూత్రాన్ని వేదంలా నేనీ రోజుకీ పాటిస్తూనే ఉన్నాను. జగడం, ఆరెంజ్, అందాల రాక్షసి లాంటి కొన్ని సినిమాల తర్వాత ఆ నిర్మాతల్ని చూసినప్పుడు నాగార్జున గారు చెప్పిన పై మాటలు నాకు బాగా గుర్తొస్తూ ఉంటాయి.

ఒక కాలమ్ లో కుదించలేను గానీ, నాగార్జున గారితో నా ట్రావెల్ ని పుస్తకంగానే రాయగలను నేను. ఓసారి, గాసిప్స్ గురించి బాధపడుతుంటే "మనం ఎంత పెద్ద సెలిబ్రిటీ అయితే అంత మన గురించి ఏదో ఒక వార్త రాస్తారు బాబూ. అది స్టార్ డమ్ అనుకుని సంతోషించు. చదివే వాళ్ళకి ఇంట్రస్ట్ లేని వార్తలు, వ్యక్తుల గురించి రాయడానికి జర్నలిస్టులేం తెలివితక్కువ వాళ్ళు కారు. మనం సినిమాలు ఎలా డిజైన్ చేస్తామో వాళ్ళు వెబ్ సైట్లు, మ్యాగజైన్లు అలాగే డిజైన్ చేస్తారు" అని కళ్ళు తెరిపించారు.

నిజంగానే నా స్టార్ డమ్ ఈ మధ్య తగ్గిందని వెబ్ సైట్లు చూస్తే తెలుస్తోంది కదా!

సాయంత్రం ఆరింటికి షూటింగ్ లో ఇచ్చే టిఫిన్ ని కట్ చేసి (దాని వల్ల డిన్నర్ లేటవుతుంది కాబట్టి) ఏడున్నరకల్లా డిన్నర్ ముగించడం ద్వారా పొట్ట ఎక్కువ పెరగదని, డైజెస్టివ్ సిస్టమ్ బాగా వర్క్ చేస్తుందని చెప్పిన డాక్టర్ - ఒకే వ్యాపారం చేసి నష్టాలోస్తే కుదేలైపోకుండా నాలుగైదు వ్యాపారాల్లో కొంత కొంత పెట్టుబడులు పెట్టడం ద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చని, పాటించి, చాటించిన ఎకనమిస్ట్ - 20 -30 మధ్య వయసులో ఉన్నప్పుడు ఆరోగ్యంగా, ఎనర్జిటిక్ గా, హ్యాండ్ సమ్ గా ఎవరైనా ఉంటారు - 50 వచ్చినా అలా ఉండే మన్మధుడు. నిజ జీవితంలో కూడా హీరోయే. అందుకే అభిమానులందరికీ ఆయనే బాస్ - ఆ అభిమానుల్లో ఒకడిగా 'నేనున్నాను'.





మీ
వి.ఎన్.ఆదిత్య

మరిన్ని సినిమా కబుర్లు
movies trend