Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

సురేష్ బాబుతో ఇంటర్వ్యూ

intreview with  d. suresh babu
నా పేరు ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడేయ‌వు  - డి.సురేష్‌బాబు

నిర్మాత అనే ప‌దానికి అర్థం మారిపోయిందిప్పుడు. ఆ సీటుకు ఉన్న గౌర‌వ‌మూ త‌గ్గిపోయింది. ఇది వ‌ర‌కు నిర్మాత‌ల్ని మేక‌ర్స్‌గా అభివ‌ర్ణించేవారు. ఇప్పుడు.. ప్రొడ్య‌స‌ర్ అంటే డ‌బ్బులు పెట్టేవాడు అని మాత్ర‌మే అర్థం. క‌థేంటో, సినిమా ఎటుపోతోందో క‌నీసం అవ‌గాహ‌న కూడా చాలామంది నిర్మాత‌ల‌కు ఉండ‌డం లేదు. అయితే.. ఇలాంటి వాతావ‌ర‌ణంలోనూ 'నిర్మాత‌'ల్లో మార్గ‌నిర్దేశ‌కులు, మేక‌ర్లు క‌నిపిస్తున్నారు. అక్క‌డ‌క్క‌డ‌.. సురేష్ బాబు లాంటివాళ్ల‌న్న‌మాట‌. ప‌రిశ్ర‌మ మూలాలు, నిర్మాణ సాధ‌క బాధ‌కాలు.. ఇవ‌న్నీ తెలిసిన వ్య‌క్తి సురేష్ బాబు. పంపిణీ రంగంలోనూ అపార‌మైన అనుభ‌వం ఉంది. సురేష్ బాబు క‌న్ను ఓ సినిమాపై ప‌డిందంటే... అందులో క‌చ్చితంగా విష‌యం ఉంద‌న్న‌మాటే. ఈ యేడాది వ‌చ్చిన పెళ్లి చూపులుతో అదే నిజ‌మైంది. ఇప్పుడు పిట్టగోడ సినిమాకీ స‌పోర్ట్ చేస్తున్నారాయ‌న‌. ఈ చిత్రం ఈ వార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా సురేష్ బాబుతో మాటా మంతీ.

* సురేష్ బ్యాన‌ర్‌లో సినిమాలు త‌గ్గాయి. ఆ కొర‌త తీర్చుకోవ‌డికా ఇలా అప్పుడ‌ప్పుడూ స‌మ‌ర్ప‌కుడి పాత్ర‌లోకి దూరిపోతున్నారు..?
-  ప్రేక్ష‌కుల అభిరుచి మారుతోంది. వాళ్ల‌కిప్పుడు కొత్త కొత్త క‌థ‌లు చెప్పాల్సిందే. మా సంస్థ‌కంటూ కొన్ని విలువ‌లున్నాయి.. చ‌రిత్ర ఉంది. వాటికి త‌గ్గ సినిమాల్ని, ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గ్గ‌ట్టుగా నిర్మించాల్సివుంది.  కాస్త ఆల‌స్య‌మైనా మంచి క‌థ‌ల‌తో వ‌ద్దామ‌న్న ఉద్దేశంతో స్పీడు త‌గ్గించాం. పెళ్లి చూపులు లాంటి మంచి సినిమాలకు వెన్నుద‌న్నుగా నిలవాల‌నిపిస్తుంటుంది.  నా అభిరుచికి త‌గ్గ సినిమాల్ని ఎవ‌రు నిర్మించినా.. వాటికి అండ‌దండ‌లు అందించాల‌నిపిస్తుంటుంది.

* పిట్ట‌గోడ‌లో మీకు న‌చ్చిందేంటి?
- చాలా సింపుల్ క‌థ‌. జ‌న్యుయన్ ఎమోష‌న్స్  ఉన్నాయి. చాలా సింపుల్ ట్రీట్‌మెంట్‌. ఇలాంటి క‌థ‌లు, సినిమాలూ ప్రేక్ష‌కుల‌కు చేరువ కావాలి. అప్పుడే ప‌రిశ్ర‌మ‌కు కొత్త టాలెంట్ వ‌స్తుంది. పైగా రామ్మోహ‌న్ నాకు బాగా తెలుసు. కొత్త టాలెంట్‌తో కొత్త క‌థ‌ల‌తో సినిమాలు తీస్తుంటారాయ‌న‌. అది న‌చ్చే అసోసియేట్ అవుతున్నా.

* ఇది సురేష్ బాబు సినిమా అనేస‌రికి అంచ‌నాలు పెరుగుతుంటాయి. దాని వెనుక మార్కెట్ స్ట్రాట‌జీ పుట్టుకొస్తుంటుంది క‌దా?
- నా పేరు ఉన్నంత మాత్రాన‌ సినిమాలు ఆడ‌వు. విష‌యం ఉంటేనే ఆడ‌తాయి. పెళ్లి చూపులులో అది క‌నిపించింది. అందుకే జ‌నం ఆద‌రించారు. 

* కొత్త వాళ్ల‌తో సినిమా అనేది రిస్క్ ఫ్యాక్ట‌ర్ క‌దా?
- అవును. పోస్ట‌ర్‌పై ఏమాత్రం గ్లామ‌ర్ ఉండ‌దు. కేవ‌లం మౌత్ టాక్‌పైనే న‌డ‌వాలి. కానీ చిన్న సినిమాలు, కొత్త‌వాళ్ల‌తో చేస్తుంటే అందులోనూ ఓర‌క‌మైన తృప్తి ఉంటుంది. ప‌రిశ్ర‌మ‌కు కొత్త ఫ్లేవ‌ర్ అందిచిన తృప్తి అది. అన్ని సినిమాలూ విజ‌య‌వంతం కావు క‌దా. కొన్ని ఎదురుదెబ్బ‌ల‌కూ సిద్ధ‌మై ఉండాలి.

* సంస్థ‌కు ఓ పేరొచ్చాక‌, నిర్మాత‌గా అనుభవం సంపాదించాక రిలాక్స్ అయిపోతుంటారు... మీరు మాత్రం ఇంకా క‌సిగా ప‌నిచేయ‌గ‌ల‌గుతున్నారు...
- అది నా అదృష్టం. నాకంతా తెలుసు అనుకొంటే మ‌న ప్ర‌యాణం అక్క‌డితో ఆగిపోయిన‌ట్టే. ఏమీ తెలియ‌దు అనుకొన్న‌ప్పుడే ఇంకా క‌ష్ట‌ప‌డ‌గ‌లం. అది మా నాన్న‌గారి నుంచి నేను నేర్చుకొన్న ల‌క్ష‌ణం. ఆయ‌న చివ‌రి వ‌ర‌కూ క‌ష్ట‌ప‌డుతూనే ఉన్నారు. సినిమాలు, క‌థ‌లు, స్క్రిప్టులు వీటితోనే గ‌డిపేవారు. ఆయ‌న‌తో పోల్చుకొంటే మేం చేస్తుంది చాలా త‌క్కువ‌నే చెప్పాలి.

* మీ నాన్న‌గారిని చూసే నిర్మాత అయ్యారా, లేదంటే వేరే కార‌ణాలున్నాయా?
- నిజానికి నిర్మాత అవ్వాల‌న్న ఆలోచ‌న అస్స‌ల్లేదు. అమెరికాలో చ‌దువు పూర్తి చేసుకొని వ‌చ్చిన త‌ర‌వాత‌.. ఏదైనా వ్యాపారం చేద్దామనుకొన్నా. అప్ప‌టికీ నాన్న‌గారు సినిమాల‌తో బిజీగా ఉన్నారు. కానీ.. సినిమా ప‌రిశ్ర‌మ అంటే అప్ప‌ట్లో పెద్దగా గౌర‌వం ఉండేది కాదు. నాన్న‌గారితో తిర‌గ‌డం, ఆయ‌న ప‌నుల్లో ఇన్‌వాల్వ్ అవ్వ‌డం, క‌థ‌లు, స్క్రిప్టుల్లో జోక్యం చేసుకోవ‌డం.. ఇలా మెల్లిమెల్లిగా నేనూ ఈ వాతావ‌ర‌ణంలో ఇమిడిపోయా.

* న‌టుడ‌వ్వాల‌న్న ఆలోచ‌న అప్ప‌ట్లో రాలేదా?
- లేదు. అయితే కొంతమంది అడిగారు. 'మీ అబ్బాయి చూడ్డానికి బాగున్నాడు క‌దా, వాడితో సినిమాలు తీయొచ్చు క‌దా' అని నాన్న‌గారికి స‌ల‌హాలు ఇచ్చేవారు. భాగ్య‌రాజాగారైతే 'హీరోగా చేస్తావా' అని అడిగారు. నాకు ఇష్టంలేద‌ని చెప్పేశా. హీరోల‌కు ఇంత క్రేజ్ వ‌స్తుంది.. అని అప్పుడే తెలిస్తే.. న‌టించేవాడ్నేమో.? (న‌వ్వుతూ)

* నోట్ల ర‌ద్దు ప్ర‌భావం చిత్ర ప‌రిశ్ర‌మ‌పై ఎంత వ‌ర‌కూ ప‌డింది?
-  చాలా ఉంటుందేమో అనుకొన్నాం. అయితే భ‌య‌ప‌డినంత లేదు. దానికి కార‌ణం.. ప్రేక్ష‌కుల దృక్ప‌థ‌మే. వినోదం అంటే.. సినిమానే. దాన్ని వ‌దులుకొనే ప‌రిస్థితి లేదు. ఎలాంటి క‌ష్టం వ‌చ్చినా థియేట‌ర్‌కి వెళ్లి రిలాక్స్ అయిపోవొచ్చ‌న్న న‌మ్మ‌కంతో ఉన్నారు. 

* సామాన్య‌జ‌నం ఇబ్బందులు ప‌డుతున్నారు క‌దా?
- నోట్ల ర‌ద్దు దేశానికి ఓ ఔష‌ధంలా ప‌నిచేస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. దాని రిజల్ట్ మెల్లిమెల్లిగా తెలుస్తుంది. అయితే ఈలోగా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే.  

 * సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌పై సినిమాలు ఎప్పుడు?
- రానా - తేజ కాంబోలో ఓ సినిమా చేస్తున్నాం. ర‌విబాబుతో అదిగో తీస్తున్నాం. పెళ్లి చూపులు ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్‌తో ఓ సినిమా చేస్తున్నాం. ఇంకో రెండు మూడు చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి.

* మీ బ్యాన‌ర్‌లో వ‌చ్చిన పాత సినిమాల్ని రీమేక్ చేసే ఆలోచ‌న ఉందా?
- ప్రేమ‌న‌గ‌ర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ సినిమాని రీమేక్ చేయాల‌ని ఉంది. అయితే ఏయే పాత్ర‌కు ఎవ‌రెవ‌ర్ని తీసుకోవాలో బాగా ఆలోచించాలి.   కాస్త స‌మ‌యం ప‌డుతుంది. 

- కాత్యాయని
మరిన్ని సినిమా కబుర్లు
appatlo okadundevadumovie review