Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటెలిజెంట్ చిత్రసమీక్ష

Intelligent movie review

చిత్రం: ఇంటిలిజెంట్‌ 
తారాగణం: సాయిధరమ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠీ, రాహుల్‌ దేవ్‌, పోసాని కృష్ణమురళి, బ్రహ్మానందం, సప్తగిరి, పృధ్వీ, జయప్రకాష్‌రెడ్డి, వినీత్‌ కుమార్‌, ఆశిష్‌ విద్యార్థి, షయాజీ షిండే తదితరులు. 
సంగీతం: తమన్‌ 
సినిమాటోగ్రఫీ: విశ్వేశ్వర్‌ 
దర్శకత్వం: వి.వి. వినాయక్‌ 
నిర్మాత: సి.కళ్యాణ్‌ 
విడుదల తేదీ: 09 ఫిబ్రవరి 2018

క్లుప్తంగా చెప్పాలంటే

ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేసే ఉద్యోగి తేజ (సాయిధరమ్‌ తేజ్‌). తన వర్క్‌ని చిత్తశుద్ధితో, నిజాయితీగా చేసి కంపెనీలో మంచి పేరు తెచ్చుకుంటాడు తేజ. అనుకోకుండా అతని జీవితంలో పెద్ద అలజడి రేగుతుంది. అదే తాను పనిచేస్తున్న కంపెనీ బాస్‌ (నాజర్‌)ని ఓ క్రిమినల్‌ గ్యాంగ్‌ అంతం చేస్తుంది. ఆ కంపెనీని సొంతం చేసుకోవాలని ఆ గ్యాంగ్‌ ప్రయత్నిస్తుంటుంది. ఆ గ్యాంగ్‌ బారి నుంచి కంపెనీని కాపాడేందుకు ధర్మాభాయ్‌ వస్తాడు. ఎవరీ ధర్మాభాయ్‌? కంపెనీతో అతనికేంటి సంబంధం? తేజు పరిస్థితేంటి? వంటి ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది.

మొత్తంగా చెప్పాలంటే

సాయిధరమ్‌ తేజ నటుడిగా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. యాక్షన్‌ సీన్స్‌లో అదరగొట్టేశాడు, డాన్సుల్లో ఈజ్‌ ప్రదర్శించాడు. మావయ్య మెగాస్టార్‌ చిరంజీవిని తన డాన్సులతో గుర్తు చేయడంలో తేజు సూపర్బ్‌ అనిపించుకున్నాడు. నటనలోనూ సినిమా సినిమాకీ పరిణతి చాటుకుంటున్నాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా ఆ గెటప్‌కి తగ్గ బాడీ లాంగ్వేజ్‌ చూపించాడు. ధర్మాభాయ్‌గానూ తేజూ డిఫరెంట్‌ బాడీ లాంగ్వేజ్‌తో కనిపించి మెప్పిస్తాడు.

హీరోయిన్‌ పాత్ర కేవలం గ్లామర్‌ కోసమే అన్నట్టుంది. దాంతో లావణ్య త్రిపాఠికి అసలు కథలో స్కోప్‌ లేదు. అలా వచ్చి, ఇలా వెళ్ళిపోతుందంతే. నటన పరంగా పెద్దగా మాట్లాడుకోవడానికేమీ లేదు హీరోయిన్‌ విషయంలో. మంచి నటి అయినా ఆమెను సరిగ్గా వాడుకోలేకపోయాడు దర్శకుడు. విలన్‌ పాత్రలన్నీ పరమ రొటీన్‌గానే సాగాయి. కామెడీ పరంగా సినిమాలో కాస్టింగ్‌ బాగానే వున్నా, ఎవరూ ఆశించిన స్థాయిలో నవ్వించలేకపోయారు. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర మమ అన్పించారు.

కథ, కథనాల పరంగా పెద్దగా మాట్లాడుకోవడానికేమీ లేకుండా పోయింది. కథ పాతదే, కథనం కూడా అదే స్టయిల్లో సాగింది. డైలాగ్స్‌ ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. థమన్‌ మ్యూజిక్‌ సైతం సోసో అనిపిస్తుంది. తేజు డాన్సులేయడానికి మాత్రం పాటలు బాగానే వున్నాయి. చిత్రీకరణ బాగా చేశారు. ఎడిటింగ్‌ చాలా అవసరం అనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగుంది. నిర్మాణపు విలువల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఓకే.

ఫస్టాఫ్‌ రొటీన్‌, సెకెండాఫ్‌ ఇంకా రొటీన్‌. నెక్స్‌ట్‌ ఏం జరుగుతుందో ముందే తెలిసిపోతుంది. దాంతో సినిమాపై ఎక్కడా ఇంట్రెస్ట్‌ కన్పించదు. వినాయక్‌ మార్క్‌ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ అనిపించవు. డాన్సుల్లో తేజు ఈజ్‌ చూపించడం, హీరోయిన్‌ గ్లామరస్‌గా కన్పించడం తప్ప సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ అంశాలేవీ లేవు. నటన పరంగా తేజు పూర్తిస్థాయి ఎఫర్ట్స్‌ పెట్టినా, కథల ఎంపికలోనూ ఒకింత జాగ్రత్త తీసుకుంటే బాగుండేదన్పిస్తుంది. పబ్లిసిటీ బాగా చేయడంతో సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయ్యి, ఓపెనింగ్స్‌ పరంగా తేజుకి మంచి ఛాన్స్‌ దొరికినా, సినిమా నిరాశపరుస్తుంది. తేజు డాన్సుల కోసం, హీరో హీరోయిన్లు పాటల్లో ప్రదర్శించిన కెమిస్ట్రీ కోసం అయితే ఓకే అనిపిస్తుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే

ఇంటెల్లిజెంట్‌ ఇంతేనా?

అంకెల్లో చెప్పాలంటే: 2.5/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka