Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
prize-for-best-comment

ఈ సంచికలో >> శీర్షికలు >>

పై - వాసుదేవమూర్తి శ్రీపతి

rates

పై"రేట్లు"

సినిమా.........

ఇరవై నాలుగు శాఖల సమిష్టి కృషి!

సినిమా....

కొన్ని వందల మందికి అన్నం పెట్టే పరిశ్రమ!

సినిమా....

తెర వెనుక ఎన్ని కష్టాలున్నా, తెరపైన మాత్రం మనని అలరించే ప్రయత్నం చేసే రంగుల ప్రపంచం!!

కొన్ని నెలలు, కొంతమంది వ్యక్తులు శ్రమించి, ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి, ఒక కథని తెర మీదకి ఎక్కిస్తే... వందో, రెండు వందలో ఖర్చుపెట్టి చూసి బావుందో, బాలేదో ఒక్క ముక్కలో తేల్చేస్తాం! అంతవరకు ఫరవాలేదు.

కానీ కొన్ని బావున్న సినిమాలు, మంచి పేరొచ్చిన సినిమాలు కూడా ఆర్ధికంగా అంతంత మాత్రం ఫలితాలే ఇస్తుంటాయి. ఒక్కొక్కసారి మంచి సినిమాలు కూడా నష్టాలని చవిచూస్తాయి. దీనికి అంతర్గత రాజకీయాలు కొంత కారణమైతే, సినిమాలను పైరేట్‌ చేయ్యడం అతి ముఖ్యమైన కారణం.

సినిమా విడుదలైన గంటల్లో ఇంటర్‌ నెట్‌లో ఆ సినిమా తాలూకు కాపీలు దొరుకుతున్నాయి. ఎన్ని సైట్‌లని అరికట్టినా మరికొన్ని పుట్టగొడుగుల్లా పుట్టూకొస్తూనే ఉన్నాయి. ఈ పైరేట్‌లని మన సినిమాలే కాకుండా విదేశీ సినిమాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎన్నో కలలతో, ఎంతో ఆశతో, కథపై ఎంతో నమ్మకంతో సినిమాపైన పెట్టుబడి పెట్టిన చాలామంది నిర్మాతలు తీవ్రమైన నష్టాలని చవిచూస్తున్నారు. చాలామంది ఆ నష్టాలనుండి జీవితాంతం కోలుకోలేకపోతున్నారు. ఎవరి పెట్టుబడినో, మరెవరి శ్రమనో ఇంకెవరో సొమ్ము చేసుకుంటున్నారు.

మంచి సినిమా తీసిన నిర్మాత లాభపడితే మరో సినిమా తీస్తాడు. మరి కొంతమందికి పని కల్పించగలుగుతాడు. తను లాభపడుతూ మరికొంతమంది కలలకి రంగులు వేయగలుగుతాడు. మరో మంచి సినిమాతో మనని అలరించగలుగుతాడు. ఒక సినిమాని పైరేట్‌ చెయ్యడం అంటే వందలమంది శ్రమను దోచుకున్నట్టే, కొంత మంది ఆశలని నాశనం చేసినట్టే. ఎన్నో దశాబ్దాలుగా మనకి వినోదాన్ని, విఙ్ఞానాన్ని, అందిస్తున్న ఒక గొప్ప పరిశ్రమని నష్టాల ఊబిలోకి తోసినట్టే. ఇది నిజంగా హత్యకన్నా భయంకరమైన నేరం, ఘోరం.

దయచేసి పైరేటెడ్‌ సినిమాలు చూడకండి. నేరస్తులను ప్రోత్సహిస్తూ ఒక గొప్ప పరిశ్రమ అధోగతికి మీరు కూడా బాధ్యులు కాకండి.

మరో కోణం:

ఒక మధ్య తరగతి కుటుంబం సినిమాకి వెళ్ళాలంటే కనీసం పదిహేను వందలనుంచి, రెండు వేలు ఖర్చవుతోంది. ఇది వారికి ఒక నెల పాల ఖర్చుతో సమానం. ఇటువంటి పరిస్థితులలో ఎంత మంది మధ్య తరగతి వాళ్ళు థియేటర్‌లో సినిమా చూడడానికి రాగలుగుతారు. సినీ పెద్దలు, ప్రభుత్వం వారు ఈ విషయంపై కాస్త దృష్టి పెట్టండి. సినిమా హాలులో అమ్మే తినుబండారాల, పానియాల ధరలు కూడా నియంత్రించాల్సిన అవసరం ఎంతైనావుంది.

మరిన్ని శీర్షికలు
weekly-horoscope-june-8th  to june 14th