Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

లవర్‌ చిత్రసమీక్ష

lover movie review

చిత్రం: లవర్‌ 
తారాగణం: రాజ్‌ తరుణ్‌, రిద్ది కుమార్‌, రాజీవ్‌ కనకాల, సత్యం రాజేష్‌, సత్య, సుబ్బరాజు, అజయ్‌, సచిన్‌ ఖేడ్‌కర్‌, ప్రవీణ్‌ తదితరులు 
సంగీతం: అంకిత్‌ తివారీ, ఆర్కో ప్రావో, ముఖర్జీ, రిషీ రిచ్‌, అజయ్‌ వాస్‌, సాయికార్తీక్‌, తనీష్‌ భాగ్చి 
సినిమాటోగ్రఫీ: సమీర్‌ రెడ్డి 
దర్శకత్వం: అనీష్‌ కృస్ణ 
నిర్మాత: హర్షిత్‌ రెడ్డి 
నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ 
విడుదల తేదీ: 20 జులై 2018

క్లుప్తంగా చెప్పాలంటే 
బైక్‌ మెకానిక్‌ రాజ్‌ (రాజ్‌ తరుణ్‌) అనాధ, జగ్గు (రాజీవ్‌ కనకాల)ని అన్నగా భావిస్తూ, అతని కుటుంబంలో సభ్యుడిగా వుంటాడు. నర్స్‌గా పనిచేస్తోన్న చరిత (రిద్ధికుమార్‌)ని రాజ్‌ ప్రేమిస్తాడు. చరిత కూడా, రాజ్‌ ప్రేమలో పడుతుంది. పెళ్ళి చేసుకుందామనుకుని ఈ ఇద్దరూ కేరళ వెళతారు. అయితే అక్కడ, ఓ మాఫియా ముఠా చరితను కిడ్పాన చేస్తుంది. రాజ్‌ సోదరుడిగా భావించే జగ్గు కూడా మాయమవుతాడు. ఇంతకీ ఈ మాఫియాతో చరితకు సంబంధమేంటి? జగ్గు ఏమయ్యాడు? ఈ గందరగోళం నుంచి రాజ్‌, తన లవర్‌ని ఎలా కాపాడుకున్నాడు? అన్న ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది.

మొత్తంగా చెప్పాలంటే 
రాజ్‌ తరుణ్‌కి ఇలాంటి కథలు కొట్టిన పిండి. లవర్‌ బాయ్‌లా కన్పించడం రాజ్‌తరుణ్‌కి కొత్తేమీ కాదు. గెటప్‌లో ఒక్క పిలక మినహా, పెద్దగా ఛేంజెస్‌ ఏమీ లేవు. నటుడిగా ఇప్పటికే తానేంటో ప్రూవ్‌ చేసుకున్న రాజ్‌ తరుణ్‌, ఈ సినిమాలో నటుడిగా ఇంకో మెట్టు పైకెక్కాడు. రొమాంటిక్‌ యాంగిల్‌లోనూ, యాక్షన్‌ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు.

హీరోయిన్‌ రిద్దికుమార్‌ క్యూట్‌గా వుంది. నటన పరంగా ఆమెకి మంచి మార్కులే పడతాయి. హీరోయిన్‌గా ఆమెకు ముందు ముందు మరిన్ని ఛాన్సులు వచ్చే అవకాశముంది. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. రాజీవ్‌ కనకాల తన పాత్రకు ప్రాణం పోశాడు. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగానే చేశారు.

కథ కొత్తదేమీ కాదు, కొంచెం కొత్తగా చెప్పాలనుకున్నాడు దర్శకుడు. స్క్రీన్‌ ప్లే ఓకే. అక్కడక్కడా హిక్కప్స్‌ అన్పిస్తాయి. మాటలు బాగున్నాయి. సంగీతం ఆకట్టుకుంటుంది. పాటలు వినడానికీ, తెరపై చూడ్డానికీ బాగున్నాయి. ఎడిటింగ్‌ ఫస్టాఫ్‌లోనూ, సెకెండాఫ్‌లోనూ ఇంకాస్త అవసరం అన్పిస్తుంది. సినిమాటోగ్రఫీ సినిమాకి హైలైట్‌. సినిమాని చాలా అందంగా తీర్చిదిద్దడంలో సినిమాటోగ్రాఫర్‌ పాత్రకి హేట్సాఫ్‌ చెప్పాలి. కేరళ అందాల్ని ఇంకా అందంగా తన కెమెరాలో బంధించాడు సినిమాటోగ్రాఫర్‌. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి. 
ఫస్టాఫ్‌, సెకెండాఫ్‌ పరమ రొటీన్‌గా సాగుతాయి. కొత్తదనం కోసం దర్శకుడు చేసిన కొన్ని ప్రయత్నాలు వర్కవుట్‌ కాలేదు. ఎనర్జీకి కేరాఫ్‌ అడ్రస్‌ అయిన రాజ్‌ తరుణ్‌ని ఇంకా బాగా వాడుకుని వుంటే బావుండేది. రొమాంటిక్‌ లవ్‌ ట్రాక్‌ని నడిపించడంలోనూ, ఎమోషనల్‌ సీన్స్‌ నడిపించడంలోనూ దర్శకుడి తడబాటు కన్పిస్తుంది. అక్కడక్కడా కామెడీ తళుక్కుమన్నా, ఓవరాల్‌గా అదీ బోర్‌ కొట్టించేస్తుంటుంది. మొత్తంగా చెప్పాలంటే ఓ సాదా సీదా లవ్‌ స్టోరీని, అంతే సాదా సీదాగా తెరకెక్కించాడు. కాస్త కొత్తదనం వుంటే, ఆ కొత్తదనం వర్కవుట్‌ అయితే సంచలన విజయాలుగా ఆయా సినిమాలు మారుతున్న పరిస్థితులిప్పుడున్నాయి. కానీ, ఆ మ్యాజిక్‌ చేయడంలో దర్శకుడు సక్సెస్‌ అవలేకపోయాడు.

ఒక్క మాటలో చెప్పాలంటే 
పరమ రొటీన్‌ లవర్‌

అంకెల్లో చెప్పాలంటే: 2.5/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka