Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
tamilnadu tour

ఈ సంచికలో >> శీర్షికలు >>

గాంధీజయంతి కార్టూన్లు - ..

గాంధీ జయంతి
మా పేట లో, ఓ వీధి ప్లాట్ ఫాం  లైటు స్తంభం పక్కన, గాంధీ గారి శిల పెట్టాలనుకున్నాం. చందాలు వసూలు చేసి, సిమెంటు విగ్రహాల తయారీ కొట్టుకెళ్ళి, గాంధీ 'బస్ట్' ఒకదాన్ని సెలక్ట్ చేసి కొన్నాం. కన్సెషన్ మినహా,  వెయ్యిన్నర ఖర్చైంది. విగ్రహం ఎత్తు ఒకటిన్నర అడుగు. దానికి కనీసం మూడడుగుల ఎత్తు తిన్నె అవసరం. మా కమిటీ ఆ పని ఒక తాపీ మేస్త్రీక్ర్ అప్పజెప్పింది.  ఇటుక రాళ్ళూ, సిమెంటూ, కట్టు కూలీ, అన్నిటికీ కలిపి మరో రెండు వేలు విరాళ్ళాలోంచి ఖర్చు పెట్టాం.
గాంధీ  జయంతికి విగ్రహ ప్రతిష్ట, రిబ్బన్ కటింగూ, జరపాలన్నది మా సంకల్పం. పన్నెండు రోజులకు ముందే, పని పూర్తి అయింది. విగ్రహానికి ప్లాస్టిక్ షీటు, చుట్టి పెట్టి తక్కిన చిన్న చిన్న పనులు పూర్తి చేసుకుంటున్న సమయంలో, మా నెత్తి మీద బండ రాయి పడింది. విగ్రహం వెనక కొన్నేళ్ళుగా, మూత పడి వున్న కిళ్ళీ కొట్టు ఓనరు, ఎక్కడి నుంచో వూడి పడ్డాడు. ఓ పొద్దున్నే కొట్టు తెరిచి, అక్కడ విగ్రహం పెట్టడానికి వీల్లేదని, తన బంధువుల్ని తోడు తీసుకొచ్చి పెద్ద గొడవ ప్రారంభించాడు. కట్టడాన్నీ, గాంధీ శిలనీ తొలగించక పోతే, కోర్టుకెళతాననీ, ఇన్నాళ్ళూ మూత పడి వున్న, తన కిళ్ళీ కొట్టు ని తెరుచుకునే ఉత్తరువును, తను కోర్టులో ఎలా గెలుచుకొచ్చాడో, కోర్టులో తనకి పలుకుబడి ఎంతో, సుదీర్ఘ వుపన్యాసాలిచ్చి గగ్గోలు పెట్టసాగాడు. మా కమిటీ, అక్కడి కౌన్సిలర్ సాయం కోరింది. రిబ్బన్ కటింగు చేసేది ఆయనే గనక,  కొట్టు ఓనరుతో మాట్లాడుతానన్నాడు. అయినా ఫలితం శూన్యమే అయింది. కొట్టుకి, విగ్రహం కేవలం రెండడుగులు మాత్రమే అడ్డు. కిళ్ళీ వ్యాపారానికి అది ఎంత మాత్రమూ అవరోధం కాదు.

ఓనరుకి ఎంత నచ్చ చెప్పినా, అతడు వినలేదు. అతడి చేతే రిబ్బను కటింగు చేయిస్తామన్నాం. శిలాఫలకం అతికించి, దాని మీద, కమిటీ మెంబర్ల తో పాటు, అతడి పేరూ చెక్కిస్తామన్నాము. పేటలో ప్లాట్ ఫాం విగ్రహాలు, మేరీ మాత, వినాయకుడు, అమ్మవారు, అంబేద్కరు, బుల్లి బుల్లి గుళ్ళు ఎన్నో వున్నాయి, వాటికి కార్పరేషను ఏనాటికీ నోటీసులివ్వలేదు. పూజలూ పునస్కారాలూ, షామియానాలూ, లౌడ్ స్పీకర్ మీటింగులూ, రాజకీయ నాయకుల ప్రసంగాలూ, అన్నదానాలూ, ఆనవాయితీగా, జనానికి అలవాటే అయిపోయింది. ఎక్కడో ఎవరికో ఎదో విధంగానో, సద్దుబాట్లు జరిగి పనులు సాగి పోతున్నాయి కదా, మనవీధిలో, గాంధీ జయంతి ఘనంగా జరగనివ్వు, పైగా నీ కొట్టుకి పబ్లిసిటీ కూడా, ఎంతో నచ్చ జెప్పి చూశాము. అతగాడు ససేమిరా చలించ లేదు. విధి లేక, గాంధీ శిలని తొలగించి కొన్నిరోజులు ఒక మిత్రుడి కారు షెడ్డులో పెట్టి, తరువాత మూడు చక్రాల సైకిలు బండి మీద తీసుకు వెళ్ళి, శిలలమ్మే షాపు వాడికే దానమిచ్చేసి చేతులు దులిపేసుకున్నాము.

గాంధీ జయంతి రోజున మా కమిటీ సభ్యులు, మెరీనా బీచ్ కెళ్ళి గాంధీ శిలా విగ్రహం ముందు పుష్పాలు చల్లి, దణ్ణాలు పెట్టుకుని వచ్చేశాము. విరాళాలిచ్చిన వాళ్ళకి, మిగిలిన డబ్బుల్ని పంచి, తిప్పి ఇచ్చేశాము. మంచి వాళ్ళు గనక, మమ్మల్ని అర్ధం చేసుకుని, మన్నించేశారు. ప్రతి ఏటా గాంధీ జయంతి రోజున, మా కమిటీ మెంబర్లు మెరీనా లో కలవటం, కొన్నేళ్ళ పాటు కొనసాగింది. ఇప్పుడు లేదు. మేము అక్కడక్కడా చెదిరి పోయాము. మాలో ఇద్దరు, ఈలోకం విడిచి వెళ్ళి పోయారు. కిళ్ళీ కొట్టు ఓనరు, గాంధీ శిల కోసం కట్టిన తిన్నెని వుంచేసి, దాని మీదికి కొట్టు కప్పు, ఎక్స్ టెండు చేసి, ప్లాట్ ఫాం ని ఆక్రమించి, ఎవళ్ళకి ఎంత ముట్టచెప్పాలో చేసి, వ్యాపారం కొన సాగించాడు.

ఈ మధ్య ఎలక్షనులో టీటీవీ దినకరన్ గెలిచాడు. ఎంజీయార్ శత సంవత్సర వేడుకల సందర్భంగా, ఆర్కే నగర్, ఉత్తర చెన్నై, ఆరణి గంగన్ వీధిలో, జయలలిత శిలని పెట్టి, దినకరన్ చేత రిబ్బన్ కటింగ్ చెయబోతున్నాడు , కిళ్ళీ కొట్టు ఓనరు. (ఇది వాస్తవ కధ. పాతికేళ్ళ క్రితం జరిగిన సంఘటన.  గాంధీ జయంతి సందర్భంగా, గోతెలుగు కి గాంధీ గారి మీద కార్టూన్లు కావాలని మిత్రుల్ని కోరాను. వారి కార్టూన్లు,  గోతెలుగు  పాఠ కులకి సమర్పిస్తున్నాను. -కార్టూనిస్ట్ జయదేవ్.)

మరిన్ని శీర్షికలు
sarasadarahasam romantic cartoon