Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

ఏ ఎన్ ఆర్ ప్రశంస ఎప్పటికీ మర్చిపోలేను

never forgot anr's appreciation

స‌మంత క్లారిటీ ఉన్న క‌థానాయిక‌. ఏం చేయాలి? ఏం చేయ‌కూడ‌దు...?  ఈ విష‌యాల‌పై చాలా స్పష్టత ఉంటుంది. అందుకే ఆమె సినీ ప్రయాణం ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగుతుంది. ఆమె క‌థ‌ల ఎంపిక చాలా ప‌ర్ ఫెక్ట్‌. అందుకే... ఆమెకు విజ‌యాల శాతం ఎక్కువ‌. తెలుగు, త‌మిళ సినిమాల్ని చ‌క్కగా బ్యాలెన్స్ చేసుకొంటోంది. త్వర‌లో మ‌ల‌యాళంలోనూ అడుగుపెడ‌తా అంటోంది. తాజాగా ' మ‌నం ' సినిమాతో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకొంది. ''అక్కినేని మూడు త‌రాల సినిమా అని ఇందులో న‌టించ‌లేదు. విక్రం చెప్పిన క‌థ విని చాలా ఎగ్జైట్ అయ్యా. ఇలాంటి క‌థ‌లు అరుదుగా వ‌స్తాయి. వ‌చ్చిన‌ప్పుడు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వ‌దులుకోకూడ‌దు. అందుకే వెంట‌నే ఒప్పుకొన్నా'' అంటోంది స‌మంత‌. ఆమె చెప్పిన మ‌రిన్ని క‌బుర్లు ఇవీ...

* మ‌నంలో న‌టించ‌డం ఎలాంటి అనుభూతినిచ్చింది?
- మాట‌ల్లో చెప్పలేను. ఇలాంటి ఓ అరుదైన చిత్రంలో న‌టించ‌డం నా అదృష్టం. నేన‌నే కాదు.... ఈ సినిమాలో పాలు పంచుకొన్న అంద‌రూ అదృష్టవంతులే. మూడు త‌రాల క‌థానాయ‌కులు క‌లసి న‌టించే అవ‌కాశం రావ‌డం.. నిజంగా గ్రేట్‌!  అలాంటి సినిమాలో నాకూ ఓ భాగం ఉన్నందుకు గ‌ర్వంగా ఉంది. ఈ సినిమాని నేను జీవితాంతం గుర్తించుకొంటాను.

* రెండు ర‌కాల స్వభావాలున్న పాత్రలు పోషించారు.  ఆ రెండిటిలో మీకు న‌చ్చిందేమిటి?
- కృష్ణ పాత్ర చాలా మెచ్యూర్డ్ గా ఉంటుంది. ప్రియ క్యారెక్ట‌ర్ చాలా బ‌బ్లీగా అనిపిస్తుంది. కానీ అందులో చాలా డెప్త్ ఉంది. రెండు పాత్రలూ నాకు న‌చ్చాయి. కానీ ఒక్కటే ఎంచుకోమంటే... ప్రియ పాత్రనే ఎంచుకొంటా.

* చాలా రోజుల త‌ర‌వాత మీలో ఉన్న పూర్తిస్థాయి న‌టి ఈ సినిమాతో బ‌య‌ట‌కు వ‌చ్చింది..
- అవును. ఎందుకంటే నేనీమ‌ధ్య ఎక్కువ‌గా క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే చేస్తున్నా. హీరో ప‌క్కన నాలుగైదు స‌న్నివేశాల‌కే ప‌రిమిత‌మ‌వుతున్న పాత్రలొస్తున్నాయ్‌. కానీ త‌ప్పడం లేదు. అవి కూడా చేయాలి క‌దా..?  మీర‌న్నట్టు మ‌నం నాకు అన్నివిధాలా సంతృప్తినిచ్చింది. ఇలాంటి పాత్రల కోస‌మే నేను  ఎదురుచూస్తున్నా.

* ఏఎన్నార్ తో క‌ల‌సి న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. ఆయ‌న‌తో సెట్లో గ‌డిపిన క్షణాలు ఎలా అనిపించాయి..?
- అక్కినేనిగారితో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఏమాయ చేశావె స‌క్సెస్ మీట్‌లో ఆయ‌న  నా గురించి మాట్లాడిన మాట‌లు, ఆయ‌నిచ్చిన ప్రశంస ఎప్పటికీ మ‌ర్చిపోలేను. నేను డిప్రెష‌న్‌లో ఉన్నప్పుడు యూ ట్యూబ్‌లోకి వెళ్లి.. ఒక్క‌సారి మ‌ళ్లీ ప్లే చేసుకొని వినేదాన్ని. కావ‌ల్సినంత ఉత్సాహం వ‌చ్చేది. అలా... నా కెరీర్ ఇంత బాగుండ‌డానికి ఆయ‌నా ఓ కార‌ణ‌మే. ఆయ‌న‌తో క‌ల‌సి ప‌నిచేస్తాన‌ని ఎప్పుడూ అనుకోలేదు. ఆ అవ‌కాశం మ‌నం ద్వారా వ‌చ్చింది. సెట్లో ఆయ‌న చాలా స‌ర‌దాగా ఉండేవారు. చాలా జోకులు వేసేవారు. మా ఇద్దరి మ‌ధ్య నాలుగైదు స‌న్నివేశాలే ఉన్నాయి. కానీ ఆయ‌న న‌టించే విధానం ద‌గ్గ‌ర‌నుండి చూసే గొప్ప అవ‌కాశం నాకు ద‌క్కింది.

* విక్రం కె.కుమార్ సెట్లో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టార‌ట‌..
- ఆయ‌న‌కు నేనేం చేసినా వెంట‌నే న‌చ్చేది కాదు. ఇంకాస్త బాగా చేయాలి, అలా కాదు, ఇలా చేయాలి... అని చెప్పి చేయించుకొనేవాళ్లు. వీళ్లంతా డిమాండింగ్ డైరెక్ట‌ర్లు. మ‌నం చేసింది కాదు, వాళ్ళకు కావ‌ల్సింది చేయాలి. రాజ‌మౌళి సార్‌.. కూడా ఇంతే. ఆయ‌న‌కు కావ‌ల్సింది వ‌చ్చే వ‌ర‌కూ షాట్ ఓకే చేసేవాళ్లు కాదు. ఇలాంటి ద‌ర్శకులు ఉండాలి. అప్పుడే మాకూ ఛాలెంజింగ్‌గా ఉంటుంది. లేదంటే ప్రతి సినిమాలోనూ ఒక‌టే ఎక్స్‌ప్రెష‌న్ ఇవ్వాల్సివ‌స్తుంది.

* స‌మంత అంద‌మైన న‌టి, స‌మంత మంచి న‌టి.... ఈ రెండిటిలో ఏం కోరుకొంటారు..?
- గ్లామ‌ర్‌, టాలెంట్ రెండూ అవ‌స‌ర‌మే. అయితే.. నేను నా బ‌లం.... న‌ట‌న‌. ఆ త‌ర‌వాతే గ్లామ‌ర్‌. అందుకే స‌మంత మంచి న‌టి అనిపించుకోవ‌డం పైనే ఎక్కువ దృష్టి పెడ‌తా.  రివ్యూల్లో మాత్రం స‌మంత అందంగా ఉంది... చాలా బాగా న‌టించింది అని రాస్తుంటారు. కానీ నాకు మాత్రం నేను న‌టించిన ఏ సినిమా అంత‌గా న‌చ్చదు. ఏంటిది ఇలా చేశాను అనిపిస్తుంటుంది.. (న‌వ్వుతూ)

* మీకు మీరుగా ఎక్కువ మార్కులు ఇచ్చుకొన్న సినిమా..
- ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు. ఎందుకంటే అప్ప‌టికి నాకు న‌ట‌న‌పై అంత ప‌రిజ్ఞానం లేదు. డైలాగులు ప‌ల‌క‌డం చేత కాదు. అయినా స‌రే... అందులో ద‌ర్శకుడు చెప్పిన పాత్రకు న్యాయం చేయ‌గ‌లిగా. అందుకే నా సినిమాల్లో ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉంటుందా చిత్రం.

*  స‌మంత - నాగ‌చైత‌న్య , నాగార్జున - శ్రియ... ఈ రెండు జంట‌ల్లో ఎవ‌రి కెమిస్ట్రీ బాగా కుదిరింద‌నుకొంటున్నారు...?
- ఈ రెండు జంట‌ల‌దీ కాదు. అక్కినేని, నాగార్జున‌, నాగ‌చైత‌న్య.... వీళ్ల కెమిస్ట్రీ బాగా కుదిరింది. తాత‌య్య, తండ్రి, మ‌న‌వ‌డు ఈ ముగ్గురినీ ఒకేచోట చూడ‌డం థ్రిల్లింగ్ గా అనిపించింది. వాళ్లు జోకులు వేసుకోవ‌డం, ఒకరిని మ‌రొక‌రు ఏడిపించుకోవ‌డం అంద‌రికీ న‌చ్చింది. అందుకే ఈ సినిమా ఇప్పుడు ఇంత సూప‌ర్ డూప‌ర్ హిట్టయ్యింది.

* లిప్‌లాక్‌లాకూ ఎలాంటి అభ్యంత‌రం చెప్పలేదు..
- క‌థ ఏం చెబితే అది చేయాల‌నేది నా సిద్ధాంతం. అవేం కావాల‌ని పెట్టుకొన్న ముద్దులు కావు. అందుకే ఎక్కడా వల్గర్ గా అనిపించ‌లేదు. ఫ్యామిలీ కూడా చూసి ఎంజాయ్ చేసేలానే ఉన్నాయ్‌.

* ఇక మీద‌ట కూడా ఇలాంటి ఘాటు ముద్దుల‌కు మీరు రెడీయేనా..?
- ముద్దు కోస‌మే ముద్దు... అంటే మాత్రం ఒప్పుకోను. దానికో కార‌ణం ఉండాలి. లేదంటే మాత్రం తిరస్కరిస్తా.

* క‌థానాయ‌కుల ప్రాబ‌ల్యం ఎక్కువగా ఉండే పరిశ్రమ ఇది. మీరెప్పుడైనా అభద్రతా భావానికి గుర‌య్యారా?
-  లేదు.. అని చెబితే అది అబ‌ద్ధం అవుతుంది. ఆ ఫీలింగ్ నాకు తెలిసి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే ఎప్పటిక‌ప్పుడు వాటిని అధిగ‌మిస్తూ రావాల్సిందే. లేదంటే మ‌నుగ‌డ సాధించ‌లేం.

* తెలుగు, త‌మిళం రెండు చోట్లా బిజీనే. కాల్షీట్లు ఎలా కేటాయించ‌గ‌లుగుతున్నారు..?
-  త‌ప్పదండీ. నాకు రెండు చోట్లా రాణించ‌డం ముఖ్యం. మ‌ల‌యాళ సినిమాలూ చేయాల‌ని వుంది. మంచి సినిమాల్నే ఎంచుకొంటుంటే... స‌మ‌యం త‌ప్పకుండా  దొరుకుతుంది.

* ఇప్పుడు చేస్తున్నవన్నీ మంచి సినిమాలేన‌న్నమాట‌..
-  త‌ప్ప‌కుండా. ర‌భ‌స‌లో చాలా మంచి పాత్ర చేస్తున్నా. వినాయ‌క్ సినిమాలోనూ నా పాత్ర న‌చ్చుతుంది.

* ఓకే.. ఆల్ ది బెస్ట్‌...
- థ్యాంక్యూ

 
-కాత్యాయిని
మరిన్ని సినిమా కబుర్లు
cine churaka