తగిన వరుడు (చిన్నపిల్లల కథ) - పద్మావతి దివాకర్ల

suitable bride children story

కళింగరాజ్యాన్ని ఏలే మహారాజు విక్రమవర్మకి లేక లేక కలిగిన ఒకే ఒక సంతానం, కుమార్తె సంయుక్త.  ఆమెని అతి గారాబంగా పెంచాడు విక్రమవర్మ.  ఆమె తన చిన్నతనం నుండే అన్ని విద్యలూ నేర్చుకుంది.  క్షాత్రవిద్యలో కూడా ఆమె మంచి ప్రావీణ్యం సంపాదించింది. ఆమెకి యుక్తవయస్సు రాగానే ఆమె పెళ్ళి ప్రయత్నాలు చేయసాగాడు విక్రమవర్మ. ఆమెకి కాబోయే భర్తే తన తదనంతరం కళింగరాజ్యాన్ని పరిపాలించ వలసి వస్తుందని అందుకు తగిన వాణ్ణి ఎంపిక చేసుకునేటందుకు వివిధ రాజ్యాల రాకుమారుల వివరాలు, చిత్రపటాలు తెప్పించాడు. యువరాణి సంయుక్తకి ఆ చిత్రపటాలు, వివరాలు ఇచ్చి తగిన వరుణ్ణి ఎన్నుకోమన్నాడు.

విక్రమవర్మకయితే వాటిలో పొరుగునే ఉన్న అంగరాజ్యానికి యువరాజైన విజయవర్మ బాగా నచ్చాడు. విజయవర్మ అందగాడే కాక అన్ని యుద్ధవిద్యల్లో మంచి ప్రావీణ్యం సాధించిన మహావీరుడు. తన కుమార్తె సంయుక్తకి విజయ వర్మే తగిన వరుడని అతనికి అభిప్రాయం కలిగింది. యువరాణి సంయుక్తకి కూడా విజయవర్మ తప్పకుండా నచ్చుతాడనే గట్టి నమ్మకం ఉంది మహారాజుకి.

అయితే యువరాణి ఆ చిత్రపటాలేవీ చూడడానికి ఆసక్తి కనపర్చలేదు. ఆమె మనుసులో ఏముందో గ్రహించమని మహారాణిని కోరాడు విక్రమవర్మ. ఆ మరుసటి రోజు మహారాణి చెప్పిన విషయం విని ఆశ్చర్యచకితుడైనాడు. యువరాణి ఉద్యానవనంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న ఆనందుడనే తోటమాలిని వివాహం చేసుకోవాలనే దృఢసంకల్పంతో ఉన్నది.

తోటమాలి ఆనందుడు అందగాడే కాక మురళి వాయించడంలో దిట్ట.  వీరోచితమైన విద్యలు కూడా  తెలుసు. ఆనందుడి మురాళీ గానం విని యువరాణి సంయుక్త అతని పట్ల ఆకర్షణ పెంచుకుంది.  ఉద్యానవనంలో చెలికత్తెలతో విహరించేటప్పుడు ఆనందుడి మురళీ గానం విని పరవశమై అతని పరిచయం పెంచుకుంది.  రోజూ క్రమం తప్పక ఉద్యానవనం వచ్చేది ఆ గానం వినడానికి.  రానురాను ఆ పరిచయం పెరిగి ఆనందుణ్ణి వివాహం చేసుకోవాలని సంకల్పించింది. ఆ విషయమే తండ్రితో ఎలా కదుపుదామనే లోగానే మహారాణి ద్వారా ఈ విషయం విక్రమవర్మకి తెలిసింది. 

విషయం తెల్సిన విక్రమవర్మ కలవరపడ్డాడు. తన తర్వాత సింహాసనం అధిరోహించే వ్యక్తి మహావీరుడై రాజ్యాన్ని కాపాడ గలిగే వాడై ఉండాలని, రాజ్యాన్ని సమర్థంగా పరిపాలించ గల వాడై  ఉండాలని అతని కోరిక. సంయుక్త ఆనందుణ్ణి వివాహం చేసుకుంటే రాజ్యాన్ని సమర్థంగా, విజయవంతంగా పరిపాలించ గలడా అని సందేహం కలిగింది. అందుకు యువరాణిని పిలిపించి విషయం చెప్పాడు.

"అమ్మా!...నువ్వు సామాన్యుణ్ణి వివాహం చేసుకుంటే నాకు అభ్యంతరమేమీ లేదు కాని, నా తదనంతరం మన రాజ్యాన్ని శత్రువుల బారిని పడకుండా రక్షించడమే కాక ప్రజలకి సమర్థవంతమైన పరిపాలన అందించగలగాలి.  అందుకు ఆనందుడు సమర్థుడేనా అన్న సందేహం నాకున్నది.  అయితే మన పొరుగు రాజ్యమైన అంగరాజ్య యువరాజు విజయవర్మ మాత్రం అందుకు పూర్తిగా సమర్థుడు.  అతను అందగాడే కాక మహా వీరుడు కూడానూ. అతను నీకు అన్ని విధాలా తగిన వాడు.  విజయవర్మ ప్రస్తుతం మన రాజ్యనికే అతిథిగా వచ్చి ఉన్నాడు కూడా. అతన్ని వివాహం చేసుకుంటే నువ్వు సుఖపడతావని నా అభిమతం. బాగా ఆలోచించుకో!" అన్నాడు విక్రమవర్మ.

"మన్నించండి నాన్నగారూ!...ఆనందుడు కూడా వీరుడే.  అతనికి అన్ని అస్త్ర-శస్త్ర విద్యలు కూడా తెలుసు.  క్రమంగా పరిపాలనలో మెలుకువలు తెలుసుకొని రాజ్య భారం చేపట్ట గలడని నాకు నమ్మకం ఉంది.  అతన్నే వివాహం చేసుకోవాలని నాకున్నది.  నన్ను ఆశీర్వదించండి నాన్నా! " అంది సంయుక్త.

తనకి ఇష్టం లేకున్నా కుమార్తె కోరిక మన్నించక తప్పలేదు విక్రమవర్మకి.

ఆ మరుసటి రోజు ఉద్యాన వనంలో యువరాణి సంయుక్త విహరిస్తూ అనందుడితో మాట్లాడుతూ ఉండగా హఠాత్తుగా వారిని  ఓ పది మంది అశ్వారూఢులైన ముసుగు మనుష్యులు చుట్టుముట్టారు.

"చూడబోతే వీళ్ళెవరో శత్రు సైనికుల్లా ఉన్నారు. ఉద్యాన వనంలోకి ఎలావచ్చారో మరి! మనం వీరోచితంగా పోరాడాలి." అని వాళ్ళతో వట్టి చేతులతోనే తలపడింది సంయుక్త.  అయితే ఆనందుడు యువరాణి మాటలు విని కొద్దిసేపు వాళ్ళతో తలపడడానికి కత్తిదూసినా వాళ్ళ ఎదుట నిలవలేక రాకుమార్తెని శత్రువుల మధ్య ఒంటరిగా వదిలి పలాయనం చిత్తగించాడు. అప్పుడే ఎక్కడి నుంచి వచ్చాడో ఓ యువకుడు అశ్వారూఢుడై వాళ్ళ మధ్యకు జొరబడి కొద్ది సేపట్లోనే వాళ్ళను చెల్లాచెదురు చేసాడు. 

సంయుక్త ఆ యువకుడ్ని అంగరాజ్య యువరాజైన విజయవర్మగా గుర్తించి తన కృతఙతలు తెలియచేసింది. ఆ పిమ్మట అంతపురం చేరిన సంయుక్త జరిగినదంతా తండ్రితో చెప్పి విజయవర్మని వివాహం చేసుకోవడానికి తన సమ్మతి తెలియ చేసింది.

"నేను ముందే చెప్పాను కదమ్మా! ఆనందుడు వీరుడైనా ఆపదలో నిన్ను ఒంటరిగా విడిచిపెట్టి పారిపోయాడు.  అయితే ఆ తోవనే వెళ్తున్న విజయవర్మ ఆపదలో చిక్కుకున్న నిన్ను రక్షించడానికి ముందుకొచ్చాడు. మహారాజు కావడానికి ఆనందుడు వంటి భీరువు పనికిరాడు. రాజ్యాన్ని శత్రువుల బారి నుండి కాపాడలేడు. అందుకే విజయవర్మ నీకు తగిన వాడని నేను ముందే నిర్ణయించాను." అన్నాడు విక్రమ వర్మ.

ఆ తర్వాత వారిద్దరి వివాహం త్వరలోనే అత్యంత వైభవంగా జరిగిపోయింది.

అయితే ఆ ముసుగు వీరులు విక్రమవర్మ ఏర్పాటు చేసిన మనుష్యులేనని, సమయానికి విజయవర్మ అక్కడికి చేరేటట్లు వారిద్దరు కలసిచేసిన పన్నాగమేనని పాపం యువరాణి సంయుక్తకి తెలియదు.  అయితే అసలు రంగు బయట పడ్డ పిరికి వాడు, భీరువైన ఆనందుడు ఆ తర్వాత మరెవరికీ కనపడ లేదు.

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు