Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview

మ‌హేష్ బావ‌న‌ని ఎప్పుడూ చెప్పుకోలేదు -  సుధీర్‌బాబు

కుర్రాడు మంచి ఎత్తుగా, దిట్టంగా ఉంటాడు. ష‌ర్టు తీస్తే.. కండ‌లు క్యూ క‌డ‌తాయ్‌!
మాస్‌, యాక్ష‌న్ సినిమాల‌కు స‌రిగ్గా స‌రిపోతాడు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ల‌వ్ స్టోరీలు త‌గిలాయి. హార‌ర్ కామెడీ చేశాడు. క్రైమ్ కామెడీ కూడా ట్రై చేశాడు. అచ్చ‌మైన యాక్ష‌న్ సినిమా ఎప్పుడు అని అడిగితే.. 'ఇంకా అంత ఎత్తుకు ఎద‌గ‌లేదు.. అప్పుడు త‌ప్ప‌కుండా చేస్తా' అంటాడు. ఆ కుర్రాడే... సుధీర్ బాబు. కృష్ణ‌కి అల్లుడిగా, మ‌హేష్ బాబుకి బావ‌గా ప‌రిశ్ర‌మ‌కు ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు త‌న‌దైన గుర్తింపు కోసం త‌ప‌న ప‌డుతున్నాడు. కృష్ణ‌మ్మ క‌లిపింది ఇద్ద‌రినీ సినిమాతో తాను ఎదురుచూస్తున్న గుర్తింపు ల‌భిస్తుంద‌ని గంపెడాశ‌తో ఉన్నాడు. ఈ శుక్ర‌వారం ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా సుధీర్ బాబు చెప్పుకొచ్చిన సంగ‌తులివి.

*  మొన్న క్రైమ్ కామెడీ, ఇప్పుడు ప్యూర్ ల‌వ్ స్టోరీ.. క‌థ‌ల ఎంపిక‌లో వెరైటీ చూపిస్తున్నారు?
- అవునండీ. ఇదంతా నా అదృష్టం. రొటీన్‌క‌థ‌లు  నా ద‌గ్గ‌ర‌కు రావ‌డం లేదు. వ‌చ్చినా నేనూ అంత తేలిగ్గా ఒప్పుకోవ‌డం లేదు. క‌థ‌లో ఏదో మ్యాజిక్ ఉండాలి. ఆ మ్యాజిక్ ఈ సినిమాలో త‌ప్ప‌కుండా వ‌స్తుంది.

* సాధార‌ణంగా మీ ద‌గ్గ‌ర‌కు ఎలాంటి క‌థ‌లొస్తుంటాయ్‌..?
- యాక్ష‌న్ బేస్డ్ క‌థ‌లు ఎక్కువ‌గా చెప్తుంటారు. బ‌హుశా.. నా బాడీనిచూసి నన్ను అలా ఊహించుకొంటారేమో..?

* మ‌రి మీరూ అలాంటి సినిమాలు ఒప్పుకోవ‌చ్చు క‌దా..?
- యాక్ష‌న్ సినిమాలు చేయాల‌ని నాకూ ఉంది. నాబ‌లం యాక్ష‌న్‌! కాక‌పోతే.. దానికి ఇంకా టైమ్ ఉంది. నాకిప్పుడు బ‌డ్జెట్ ప‌రిమితులున్నాయి. పెద్ద పెద్ద హీరోలంతా ముప్ఫై న‌లభై కోట్ల‌లో యాక్ష‌న్ సినిమాలు తీస్తున్నారు. ఏడెనిమిది కోట్ల‌తో నేనూ ఆ రేంజుకి చేరుకోవాల‌ని చూడ‌డం త‌ప్పు.

* ఇంత‌కీ   మీ బ‌లం ఏమిటి? 
- ఫైట్స్ బాగా చేయ‌గ‌ల‌ను. డాన్సులు కూడా.

* మ‌రి బ‌ల‌హీన‌త‌లు..?
- ఇది వ‌ర‌కు నా వాయిస్ అంతగా బాగుండేది కాదు అని చెప్తుండేవారు. ఇప్పుడు బెట‌ర్‌గానే ఉంది.

* మీ ఫీడ్ బ్యాక్ ఎక్క‌డి నుంచి వస్తుంది?
-మంది కామ‌న్‌గా చెప్పిన ప్ల‌స్సులూ, మైన‌స్‌లూ ఏమిటో ఆలోచిస్తా. నా గురించి ఏఈ తెలియ‌నివాళ్లే న‌న్ను బాగా జ‌డ్జ్ చేస్తార‌న్న‌ది నా న‌మ్మ‌కం నేను ప్ర‌తి వెబ్ సైట్‌నీ ఫాలో అవుతా. ఏ వెబ్ సైట్‌లో ఎలాంటి రివ్యూ ఇచ్చారో చ‌దువుతా. రివ్యూకింద కామెంట్లు కూడా వ‌ద‌ల‌ను. ఎక్కువ‌.

* మ‌హేష్ మీ సినిమాల్ని చూస్తారా?
- చూస్తాడు. కానీ త‌న‌కు కుద‌రాలి. చూసి న‌చ్చితే త‌న ఫీడ్ బ్యాక్ చెబుతాడు. మ‌హేష్ ఏదైనా స‌రే ఉన్న‌ది ఉన్న‌ట్టుగానే మాట్లాడ‌తాడు. ఆ విష‌యంలో మొహ‌మాటాలుండ‌వు.

*  కృష్ణ అల్లుడిగా, మ‌హేష్ బావ‌గానే మీరు ప‌రిశ్ర‌మ‌లో సుల‌భంగా స్థానం ద‌క్కింద‌నుకొంటున్నారా? 
- నిజం చెప్పాలంటే.. నేను కూడా అవ‌కాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగాను. అయితే ఎప్పుడూ కృష్ణ అల్లుడిన‌ని, మ‌హేష్ బావ‌న‌ని చెప్పుకోలేదు. కానీ అభిమానులు మాత్రం నన్ను మ‌హేష్ బావ‌గా, కృష్ణ అల్లుడిగా గుర్తించారు. ఏం చేశాడో, ఎలా చేశాడో చూద్దామ‌నే థియేట‌ర్ల‌కు వ‌చ్చారు. ఆ విష‌యంలో నేను చాలా ల‌క్కీ.

* ఇంత‌కీ కృష్ణ‌మ్మ క‌థేంటి?
- ఇదో ప్యూర్ ల‌వ్ స్టోరీ. ఒక విధంగా ప్రేమకు స్వ‌చ్ఛ‌మైన నిర్వ‌చ‌నం అనుకోవ‌చ్చు. మ‌నం ఇచ్చుపుచ్చుకొనే గ్రీటింగ్ కార్డుల్లో, చెప్పుకొనే ఇంగ్లీషు మాట‌ల్లో ప్రేమ లేదు. ప్రేమిస్తే ఆ విష‌యాన్ని మ‌న‌సులోనే దాచుకోవ‌చ్చ‌నే అద్భుత‌మైన భావ‌న ఈ సినిమాలో చూపించాం.

* ఈ సినిమా చేస్తున్నంత సేపూ మీ ల‌వ్ స్టోరీఏమైనా గుర్తొచ్చిందా?
- (న‌వ్వుతూ) అబ్బే.. అలాంటివేం లేవండీ.

* చార్మినార్ సినిమాకి ఇది రీమేక్‌. రెండు సినిమాల్నీ పోల్చి చూసుకొంటే మీకు ఏమ‌నిపించింది?
- ల‌గ‌డ‌పాటి శ్రీ‌ధ‌ర్‌గారు `చార్మినార్‌` చూసొచ్చి... ఆ సినిమాని రీమేక్ చేద్దాం అన్నారు. అయితే నేను చార్మినార్ చూడ‌ద‌ల‌చుకోలేదు. ఎందుకంటే ఆ సినిమా ప్ర‌భావం నాపై ప‌డుతుంద‌ని. క‌థ‌గా చెప్పండి. న‌చ్చితే చేస్తా అన్నా. క‌థ న‌చ్చింది కాబ‌ట్టే ఈసినిమా చేశా. సినిమా పూర్త‌య్యాకే చార్మినార్ సినిమాని చూశా. చాలా అద్భుతం అనిపించింది. అయితే తెలుగు వెర్ష‌న్ ఇంకా బాగుంటుంది. కొన్ని త‌ప్పొప్పుల్ని రీమేక్ లో స‌వ‌రించుకొనే ఛాన్స్ దొరికింది. అందుకే ఓ చిన్న మిస్టేక్ కూడా లేకుండా.. ఈసినిమాని అద్భుతంగా మ‌లిచారు.

* నందిత‌ను తీసుకోవ‌డానికి కార‌ణ‌మేంటి?  హిట్ పెయిర్ అనా?
- అదేం లేదు. అలాంటి డెప్త్ ఉన్న ఆర్టిస్ట్ ఈ సినిమాకి కావాలి. ప్రేమ‌క‌థా చిత్రంతో పోలిస్తే ఈ సినిమాలో త‌ను చాలా బాగా న‌టించింది.

* ఒక్క‌మాట‌లో చెప్పాలంటే కృష్ణ‌మ్మ ఎలాంటి సినిమా?
- నాకు హృద‌యం లాంటి ఫీల్ గుడ్ మూవీస్ అంటే ఇష్టం. ఖ‌చ్చితంగా ఈ సినిమా ఆ కోవ‌లో చేరుతుంది.

* బాలీవుడ్ వెళ్తున్నార‌ట‌..
- అవునండీ. టైగ‌ర్ ష్రాఫ్ న‌టిస్తున్న ఓ చిత్రంలో నేను ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నా.

* మోస‌గాళ్ల‌కు మోస‌గాడు సినిమా నిరాశ‌ప‌రిచిందా?
- అంత‌గా ఏం లేదండీ. సినిమా బాగానే ఆడింది. కొన్ని సెంట‌ర్ల‌లో కాస్త డ‌బ్బులు పోయుంటాయి. మిగిలిన చోట్ల లాభాలొచ్చాయి.

* మ‌ళ్లీ ఆ జోన‌ర్ ట‌చ్ చేస్తారా?
- త‌ప్ప‌కుండా. భ‌లేమంచి రోజు అనే ఓ సినిమా చేస్తున్నా. అది అలాంటి క‌థే. 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది.

* స‌రే.. మీ కృష్ణ‌మ్మ క‌లిపింది ఇద్ద‌రినీ గ్రాండ్ స‌క్సెస్ కావాల‌ని కోరుకొంటున్నాం..
- థ్యాంక్యూ వెరీ మ‌చ్‌. 

-కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka