Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review

ఈ సంచికలో >> సినిమా >>

బాహుబ‌లికి నేను చేసిన త్యాగం అదొక్క‌టే...- ప్ర‌భాస్‌

interview



ఆరున్న‌ర అడుగులు
సిక్స్‌ప్యాక్ షాకిచ్చే కండ‌లు
హీమాన్ లాంటి రూపం!
ప్ర‌భాస్‌.. అంటే ఒక్క ముక్క‌లో మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌.
- ఇదీ ప్ర‌భాస్ అంటే. అక్క‌డే అమ్మాయిలు ప‌డిపోయారు. అబ్బాయిలు ఫ్యాన్స‌యిపోయారు. ద‌ర్శ‌కులు... క్యూలు క‌ట్టారు. నిర్మాత‌లు సూట్ కేసుల‌తో దిగిపోయారు.  వ‌ర్షంతో ఫాలోయింగ్ పెంచుకొని.. ఛ‌త్ర‌ప‌తితో షాకిచ్చిన ఈ డార్లింగ్‌.. ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ మోష‌న్ పిక్చ‌ర్ బాహుబ‌లి లో హీరో!   ''చిన్న‌ప్ప‌టి నుంచీ అమ‌ర చిత్ర క‌థ‌లంటే చాలా ఇష్టం. అలాంటి క‌థ‌తో తెలుగులో ఓ సినిమా రావ‌డం, అందులో నేను హీరో అవ్వ‌డం... అదృష్టం'' అంటున్న ప్ర‌భాస్‌తో చేసిన స్మాల్ చిట్ చాట్‌..


* ఇంకొన్ని గంట‌ల్లో బాహుబ‌లి బొమ్మ‌డిపోతోంది... ఈ క్ష‌ణాల్లో మీ ఫీలింగ్ వ‌ర్ణించ‌మంటే...
- (న‌వ్వుతూ) వ‌ర్ణించ‌డం క‌ష్టం.. ఆ ఫీలింగ్స్ చెప్ప‌లేను.. టెన్ష‌న్ పెరిగిపోతోందంతే...

* భారీ బ‌డ్జెట్ సినిమా, ఇండియ‌న్ అవ‌తార్ అంటున్నారు,  మూడేళ్లు క‌ష్ట‌ప‌డ్డారు ... ఆ టెన్ష‌న్ ఇంకా ఎక్కువైఉంటుంది...
- ఒక విధంగా అదీ నిజ‌మే. ఎందుకంటే నా తొలి సినిమా ఈశ్వ‌ర్ విడుద‌ల స‌మ‌యంలో ఏమాత్రం టెన్ష‌న్ లేదు. ఏదో ఒక‌టి అవుతుందిలే.. అని రిలాక్స్ అయిపోయా. వ‌ర్షం టైమ్‌లోనూ అంతే. ఛ‌త్ర‌ప‌తికి మాత్రం రిజ‌ల్ట్ ఏంటా..? అని కాస్త ఆలోచించా. బాహుబ‌లి విష‌యంలో మాత్రం నా టెన్ష‌న్ అంతా ఇంతా కాదు. ఒక విధంగామీర‌న్న‌ట్టు ఈ సినిమా కోసం మేమంతా ప‌డిన క‌ష్టం వ‌ల్లే...ఇంత ఒత్తిడేమో..?

* ఇంత‌కీ సినిమా ఎక్క‌డ చూస్తారు?
- రిలీజ్ రోజున‌.. ఢిల్లీలో ఉంటాను. బ‌హుశా.. అక్క‌డే చూడొచ్చు.

* షూటింగ్  మ‌ధ్య‌మ‌ధ్య‌లో సినిమా చూళ్లేదా?
- లేదండీ. సినిమా పూర్తి స్థాయిలో సిద్ద‌మ‌య్యాకే చూడాల‌నుకొన్నా. డ‌బ్బింగ్ చెప్పేట‌ప్పుడు మాత్రం నా భాగం చూశా.

* ఆ స‌మ‌యంలో ఏమనిపించింది?
- రాజ‌మౌళి ఓ  అద్భుతం తీశార‌నిపించింది.  నేనొక్క‌డినే కాదు.. అంద‌రూ ఈ క‌థ విన్నాక‌.. చాలా ఎగ్జైట్ అయ్యాం. ఇది మామూలు సినిమా కాదని అప్పుడే అర్థ‌మైంది. ఈ సినిమా కోసం ఎంతైనా చేయొచ్చు అనుకొన్నాం. నిజంగానే రాజ‌మౌళి మా క‌ల‌ల్ని సాకారం చేసే సినిమా తీశారు. 


* రాజ‌మౌళి కోసం సినిమా ఒప్పుకొన్నారా, లేదంటే క‌థ కోస‌మా?  లేదంటే ఇండియ‌న్ స్ర్కీన్ పై ఇంత పెద్ద సినిమా ఇప్ప‌టి వ‌ర‌కూ రాలేద‌న్న న‌మ్మ‌కంతోనా?
- ఈ సినిమా ఒప్పుకొన్న‌ది మాత్రం రాజ‌మౌళి కోస‌మే. ఆ త‌ర‌వాత క‌థ బాగా న‌చ్చింది. ఈ సినిమా ఇంత గొప్ప సినిమా అవుతుంద‌ని ముందు తెలీదు.. చేస్తూ చేస్తుండ‌గా ఈ క‌థ విలువ అర్థ‌మైంది. 

* అందుక‌నేనా.. మూడేళ్ల పాటు ఈ సినిమా కోస‌మే కాల్షీట్లు త్యాగం చేశారు?
- ఈ టీమ్ చేసిన త్యాగాల‌తో పోలిస్తే నేను చేసింది చాలా త‌క్కువ‌. మ‌హా అయితే నా టైమ్ ఇవ్వ‌గ‌ల‌ను. అది కూడా ఇవ్వ‌క‌పోతే ఎలా?  బాహుబ‌లి కోసం నేను చేసిన త్యాగం ఏమైనా ఉందీ అంటే అది ఇదే.

* ఈ సినిమాతో క‌థానాయ‌కుడి పాత్ర కంటే ప్ర‌తినాయ‌కుడి పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంద‌ని ఓ రూమ‌రొచ్చింది..
- నాకు మాత్రం అలా అనిపించ‌లేదు. అయినా ప్ర‌తి నాయ‌కుడు ఎంత బ‌లంగా ఉంటే.. క‌థానాయ‌కుడి పాత్ర అంత బాగా పండుతుంది. రాజ‌మౌళి సినిమాల్లో విల‌న్లు శ‌క్తిమంతంగా ఉంటారు. ఈ సినిమాలో భ‌ళ్లాల‌దేవుడిగా రానా పాత్ర కూడా చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుంది. ఆమాట‌కొస్తే.. ఈ క‌థంతా 8 పాత్ర‌ల చుట్టూ తిరుగుతుంది. ఆ 8 పాత్ర‌లూ చాలా కీల‌కం.

* మీ జీవితంలో అత్యంత పెద్ద రిస్క్ ఈ సినిమానే అనుకోవ‌చ్చా?
- ఇదేం రిస్కీ సినిమా కాదండీ. మేం ఓ మంచి సినిమా చేస్తున్నామని తెలుసు. ఆ సినిమా కోసం ఏం చేయాలో కూడా తెలుసు. అంద‌రం ఈ త‌ర‌హాలో క‌ష్ట‌ప‌డితే అనుకొన్న ఫ‌లితం వ‌స్తుంద‌ని కూడా తెలుసు. అలాంట‌ప్పుడు రిస్క్ ఎలా అవుతుంది?

* అంటే.. ఈ జోన‌ర్‌లో సినిమా వ‌చ్చి చాలా కాలం అయ్యింది క‌దా..?
- కావ‌చ్చు. కానీ ఎప్పుడొచ్చినా... ఇలాంటి క‌థ‌ల‌కు ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. 

* బ‌డ్జెట్ విష‌యంలో ఎప్పుడూ బెంగ ప‌డ‌లేదా?
- ఆ బెంగ నిర్మాత‌ల‌కు త‌ప్ప‌... టీమ్‌లో అంద‌రికీ ఉంది (న‌వ్వుతూ). శోభుగారిని చూస్తే మా అంద‌రికీ ఆశ్చ‌ర్య‌మేసేది. ఎవ‌రో నిర్మాత అయిన‌ట్టు, ఆ డ‌బ్బును ఈయ‌న ఖ‌ర్చు పెడుతున్న‌ట్టు అనిపించేది. ఒక రోజు షూటింగ్ క్యాన్సిల్ అయితే ల‌క్ష‌ల రూపాయ‌లు ఎగిరిపోయేవి. అయినా స‌రే.. ఆయ‌న ఎప్పుడూ కంగారు ప‌డ‌లేదు. మేం మాత్రం చాలా చాలా టెన్ష‌న్ ప‌డేవాళ్లం. ఈ నిర్మాత‌లు త‌ప్ప మ‌రెవ్వ‌రూ ఈ సినిమాని ఇంత గ్రాండ్‌గా తీయ‌లేరు. 

* ఇంత‌కీ మీ పారితోషికం మొత్తం అందేసిన‌ట్టేనా?
- ఎప్పుడో.. (న‌వ్వుతూ). వ‌ద్దు వ‌ద్దు అన్నా మా నిర్మాత‌లు బ‌ల‌వంతంగా చేతిలో పెట్టేస్తుంటారు. ఇలాంటి సినిమా చేస్తున్న‌ప్పుడు పారితోషికం గురించి ఆలోచించ‌కూడ‌దు. అది చాలా చిన్న విష‌యం. నా కెరీర్‌లో ఎప్పుడూ ఇలాంటి సినిమా చేయ‌లేను.. అది బాహుబ‌లి వ‌ల్ల సాధ్య‌మైంది. అందుకే.. అంత‌కంటే ఏం కోరుకోను. 

* బాహుబ‌లి తో మీ ఇమేజ్ ఒక‌టికి ప‌ది రెట్లు పెరిగింది. దాన్ని కాపాడుకొంటూ ముందుకు సాగ‌డం ఓ ఛాలెంజ్ క‌దా..?
- నిజంగానే ఈ సినిమా త‌ర‌వాత నాపై అంచ‌నాలు మ‌రింత‌గా పెరుగుతాయి. కానీ.. త‌ర‌వాత ఏదో జ‌రుగుతుంద‌ని బాహుబ‌లి లాంటి సినిమాని వ‌ద‌లుకోలేం క‌దా. మంచి క‌థ‌లు ఎంచుకోవ‌డం మిన‌హా మ‌రో మార్గం లేదు. క‌థ‌ల‌తో మెస్మ‌రైజ్ చేయ‌గ‌లిగితే.. ఈ స‌మ‌స్య నుంచి దాటుకెళ్లొచ్చు.

* ఎనిమిది కీల‌కమైన పాత్ర‌ల చుట్టూ జ‌రిగే క‌థ ఇదంటున్నారు. మ‌రి మీకు బాగా న‌చ్చిన పాత్ర ఏది?
- శివ‌గామి పాత్ర‌. అందులో ర‌మ్య‌కృష్ణ‌గారు అద్భుతంగా న‌టించారు. చిన్న‌ప్ప‌టి నుంచీ ఆమెను చూస్తున్నాం. ఆ ఫైర్ మాత్రం త‌గ్గ‌లేదు. మా టీమ్ అంద‌రికీ ఆ పాత్రే ఫుల్ ఎన‌ర్జీ ఇచ్చింది. 


* ఇంత పెద్ద సినిమాలో...  మీ పెద‌నాన్న కృష్ణంరాజుగారు కూడా ఉంటే బాగుణ్ణు అనిపించిందా?
- అనిపిస్తుంది. కానీ అది నా చేతుల్లో లేదు క‌దా. అయినా ఏ పాత్ర‌కు ఎవ‌రు కావాలో, ఎవ‌ర్ని తీసుకొంటే బాగుంటుందో రాజ‌మౌళి గారికి బాగా తెలుసు. ఏదో ఇరికించాల‌ని పెద‌నాన్న‌గారికి పాత్ర ఇచ్చేయ‌కూడ‌దు. క‌థ డిమాండ్ చేయాలి.

* మీ కెరీర్‌లో అత్యంత భారీ చిత్రం రిలీజ్ అవుతోంది. ఈ స‌మ‌యంలో మీ నాన్న‌గార్నీ మీరు మిస్ అవుతున్నారా?
- చాలా. క‌నీసం ఆయ‌న సెట్‌కి వ‌చ్చి బాహుబ‌లి గెట‌ప్‌లో న‌న్ను ఒక్క‌సారి చూసుకొన్నా బాగుండేది అనిపించింది. 

* మూడేళ్ల ఈ క‌ష్టాన్ని గిఫ్ట్ ప్యాక్‌లా మ‌ల‌చి... ఎవ‌రికైనా కానుక‌గా ఇవ్వాలంటే.
- ఖ‌చ్చితంగా మా మ‌ద‌ర్‌కీ, సిస్ట‌ర్‌కీ ఇస్తా. ఎందుకంటే నేను హిట్ కొడితే అంద‌రికంటే ఎక్కువ‌గా ఆనందించేది, నా సినిమా ఫ్లాప్ అయితే బాధ‌ప‌దేది వాళ్లే.


* బాహుబ‌లి 1 అయ్యింది... నెక్ట్స్ ఏంటి?  పెళ్లేనా?
- ఇంకా దాని గురించి ఆలోచించ‌లేదు. ప్ర‌మోష‌న్లు పూర్త‌యితే.. కొన్ని రోజులు రెస్ట్ తీసుకొందామ‌నుకొంటున్నా..

* ఆ త‌ర‌వాత‌..?
- బాహుబ‌లి 2. మ‌ధ్య‌లో గ్యాప్ దొరికితే.. సుజిత్ సినిమా ఉంటుంది.

* ఓకే ఆల్ ది బెస్ట్‌

- ధ్యాంక్యూ

 

- కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka