Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

movie review

చిత్రం: బాహుబలి
తారాగణం: ప్రభాస్‌, రాణా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌, నాజర్‌, ప్రభాకర్‌, అడవి శేష్‌, సుదీప్‌, రోహిణి తదితరులు.
చాయాగ్రహణం: సెంథిల్‌కుమార్‌
సంగీతం: ఎంఎం కీరవాణి
నిర్మాణం: ఆర్కా మీడియా వర్క్స్‌
దర్శకత్వం: ఎస్‌ ఎస్‌ రాజమౌళి
నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని
సమర్పణ: కె రాఘవేంద్రరావు
విడుదల తేదీ: 10 జులై 2015

క్లుప్తంగా చెప్పాలంటే
శివగామి (రమ్యకృష్ణ) ఓ బిడ్డను శతృవుల నుంచి తప్పిస్తుంది. ఆ బిడ్డ వరద ప్రవాహంలో కొట్టుకుంటూ పోయి ఓ గ్రామం చేరుకుంటాడు. ఆటవిక తెగకు చెందిన ఓ మహిళ (రోహిని) ఆ బిడ్డను పెంచుతుంది, శివుడుగా ఆ బిడ్డకు నామకరణం చేస్తుంది. చిన్నప్పటినుంచీ శివుడు తన గ్రామానికి ఆనుకుని ఉన్న కొండలపై ఏముందో తెలుసుకోవాలనే తపనతో ఉంటాడు. ఓ రోజు ఎలాగైతేనేం కొండపైకి చేరుకుంటాడు. ఈ క్రమంలో అతనికి అవంతిక (తమన్నా) పరిచయమవుతుంది. ఆమె ప్రేమలో పడ్డ శివుడు, ప్రేమికురాలి కోరిక తీర్చడానికి అతి క్రూరుడైన భళ్ళాలదేవ పరిపాలిస్తున్న మాహిష్మతి రాజ్యంలో ఖైదు అనుభవిస్తున్న దేవసేన)ను విడిపించేందుకు వెళతాడు. అక్కడే శివుడు తానెవరన్నదీ తెలుసుకుంటాడు. శివుడు ఎవరు? మాహిష్మతి రాజ్యంతో అతనికేం సంబంధం అనేవి తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే
సినిమా టైటిల్‌కి తగ్గ పాత్ర కోసం కండలు పెంచిన శరీరంతో ప్రభాస్‌ అభిమానులకు కను విందు చేస్తాడు. కండలతోనే కాదు, నటనతోనూ ప్రభాస్‌ ఆకట్టుకుంటాడు. ఈ పాత్రకు ప్రభాస్‌ తప్ప ఇంకొకర్ని ఊహించుకోలేం. అతి క్రూరుడిగా రాణా ఆహార్యం అద్భుతం. బళ్లాలదేవ పాత్రలోనూ రాణా తప్పితే ఇంకొకర్ని ఊహించుకోవడం అన్న ఆలోచే రాదు. తమన్నా అవంతిక పాత్రలో ఒదిగిపోయింది. మిల్కీ బ్యూటీ తమన్నా అందం ఈ సినిమాకి అదనపు ఆకర్షణ.

మొదటి నుంచీ రాజమౌళి శివగామి పాత్ర పోషించిన రమ్యకృష్ణ నటన గురించి చాలా చాలా గొప్పగా చెబుతున్నాడు. ఆ గొప్పలో నిజాయితీ ఉంది. రమ్యకృష్ణ పాత్ర ఈ సినిమాకి ప్రాణం పోసింది అనడం సబబు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ రమ్యకృష్ణ నటనా ప్రతిభ గురించే చర్చించుకునేంతలా ఆమె పాత్ర తీర్చిదిద్దబడితే, ఆమె అందుకు తగ్గ ఆహార్యంతో ఆకట్టుకోవడం ఇంకా గొప్ప విషయం.

కాలకేయ పాత్రలో ప్రభాకర్‌ ఒళ్ళు గగుర్పొడిచేలా కనిపించాడు. నాజర్‌ తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు. తెరపై కనిపించే ప్రతి పాత్రా ఆకట్టుకుంటుంది. ఆయా పాత్రల్లో కనిపించిన నటీనటులు, తమ పాత్ర పరిధి మేర నటించి మెప్పించారు.

కథని రెండు భాగాలుగా చేసి, తొలి పార్ట్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన రాజమౌళి, తొలి భాగంలో టెక్నికల్‌ ఎక్స్‌లెన్సీపైనే దృష్టిపెట్టాడు. సెకెండాఫ్‌లో తన ట్రేడ్‌ మార్క్‌ ఎమోషనల్‌ సీన్స్‌, పవర్‌ఫుల్‌ సన్నివేశాలు వుండాలనుకున్నాడో ఏమో, ఆ స్థాయికి తగ్గ సన్నివేశాల్ని చాలా తక్కువగానే ఫస్టాఫ్‌లో ఉపయోగించుకున్నాడు. 'శివుడు'గా ప్రభాస్‌ని మరీ అంత పవర్‌ఫుల్‌గా చూపలేకపోయాడు. అలాగే రాణా చేసినంతవరకూ సూపర్బ్‌గానే ఉన్నా, ఇంకా చాలానే ఉందన్న సంకేతాలు ప్రేక్షకులకు ఇచ్చేలా అతని పాత్రనీ రాజమౌళి చూపించాడు. సంగీతం బాగుంది. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా బాగుంది. అయితే రాజమౌళి సినిమాల్లో కీలక భూమిక పోషించే కీరవాణి సంగీతం, ఈ సినిమా ఇంకా బావుండాల్సిందనిపిస్తుంది. ఎడిటింగ్‌ ఓకే. సినిమాటోగ్రఫీ అద్భుతం. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ మహాద్భుతం. గ్రాఫిక్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. కాస్ట్యూమ్స్‌ విషయంలోనూ ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. సినిమా ఒక్కోసారి నెమ్మదిగా సాగుతుందనిపిస్తుందంటే అది స్క్రీన్‌ప్లే లోపమే.

ఇది రాజమౌళి సినిమా అనగానే అందులో ఎమోషనల్‌ సీన్స్‌ కోసం సగటు ప్రేక్షకుడు ఎదురు చూస్తాడు. విలనిజం ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటుంది రాజమౌళి సినిమాల్లో. హీరో, విలన్‌ సమానంగా పోటీ పడుతోంటే ప్రేక్షకులు ఉత్కంఠగా సినిమాలో లీనమైపోతారు. ఆ లీనమైపోవడం కన్నా, కళ్ళు పెద్దవి చేసుకుని విజువల్‌ వండర్స్‌ని ఆస్వాదించడానికే పరిమితమవుతారు ప్రేక్షకులు. అంటే ఇందులో విజువల్‌ ఎఫెక్ట్స్‌, గ్రాఫిక్స్‌ మిగతా ఎమోషన్స్‌ని డామినేట్‌ చేశాయని అర్థం. కథ, కథనాలు కూడా కాస్త డోస్‌ తగ్గినట్లున్నాయనిపిస్తుంది. రెండు భాగాలుగా సినిమా తీస్తున్నప్పుడు ఈ సమస్య తప్పదేమో. ఫస్టాఫ్‌ కలర్‌ఫుల్‌గా సాగిపోతుంది, సెకెండాఫ్‌లో పవర్‌ఫుల్‌ సీన్స్‌ వస్తాయి. కానీ అక్కడక్కడా సినిమా నెమ్మదిస్తుంది ఓవరాల్‌గా సినిమా చూశాక చాలా బాగుంది అనే ఫీలింగ్‌ అయితే కలుగుతుంది. పవర్‌ కోరుకునేవారికి పూర్తిగా సంతృప్తి కలగదు. విజువల్‌ గ్రాండ్‌ కోసం వచ్చినవారిని నిరాశపరచదు.

ఒక్క మాటలో చెప్పాలంటే
బాహుబలి టెక్నికల్‌ ఎక్సలెన్సీ

అంకెల్లో చెప్పాలంటే: 3.75/5

మరిన్ని సినిమా కబుర్లు
interview