Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

movie review
చిత్రం: అఖిల్‌ 
తారాగణం: అక్కినేని అఖిల్‌, సయేషా సెహగల్‌, రాజేంద్రప్రసాద్‌, మహేష్‌ మంజ్రేకర్‌, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌, సప్తగిరి, జయప్రకాష్‌రెడ్డి తదితరులు 
చాయాగ్రహణం: అమోల్‌ రాథోడ్‌ 
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, తమన్‌, మణిశర్మ (బ్యాక్‌గ్రౌండ్‌) 
దర్శకత్వం: వినాయక్‌ 
బ్యానర్‌: శ్రేష్ట్‌ మూవీస్‌ 
నిర్మాత: నితిన్‌ 
విడుదల తేదీ: 11 నవంబర్‌ 2015 

క్లుప్తంగా చెప్పాలంటే 
పెను విపత్తు నుంచి భూమిని కాపాడే 'జువా'ను ఆఫ్రికాలోని ఓజా అనే తెగకు చెందినవారు సంరక్షిస్తుంటారు. దాన్ని సాధించుకోవడానికి చూస్తారు కొందరు. ఇంకోవైపు స్ట్రీట్‌ ఫైట్స్‌తో, బెట్స్‌తో లైఫ్‌ని జాలీగా ఎంజాయ్‌ చేసే అఖిల్‌ (అఖిల్‌ అక్కినేని) దివ్య (సయేషా)ను ప్రేమిస్తాడు. అప్పటికే దివ్యకు నందకిషోర్‌ (వెన్నెల కిషోర్‌)తో పెళ్ళి అని తెలుసుకుని అఖిల్‌, ఆమెను దక్కించుకోవడానికి ఆ పెళ్ళిని చెడగొడతాడు. దివ్య యూరప్‌కి వెళ్ళిపోతే, ఆమెతోపాటే అఖిల్‌ కూడా యూరప్‌కి వెళతాడు. 'జువా' కోసం వెతుకుతోన్నవారిలో దివ్య తండ్రి (మహేష్‌ మంజ్రేకర్‌) కూడా ఒకరు. జువా సాధించాలన్న దివ్య తండ్రి కుట్రపూరిత ఆలోచన ఫలించిందా? దివ్యతో ప్రేమలో పడేందుకు అఖిల్‌ పడ్డ కష్టమేంటి? అనేవి తెరపై చూడాలి. 

మొత్తంగా చెప్పాలంటే 
తొలి సినిమాతోనే అఖిల్‌ మెప్పించాడు. అక్కినేని ఫ్యామిలీలో అద్భుతమైన డాన్సర్‌ అనిపించుకున్నాడు అఖిల్‌. యాక్షన్‌లో అయితే సూపర్బ్‌ ఎనర్జీ చూపించాడు. యాక్టింగ్‌లోనూ ఓకే. తొలి సినిమా కావడంతో కొన్ని ఇబ్బందులున్నా, కాన్ఫిడెంట్‌గా కెమెరా ముందు కనిపించడంలో సఫలమయ్యాడు అక్కినేని. కామెడీ టైమింగ్‌ రానురాను అలవాటైపోతుంది. రొమాంటిక్‌ లుక్స్‌తో, పవర్‌ఫుల్‌ లుక్స్‌తో అఖిల్‌ చెలరేగిపోయాడు. అక్కినేని ఫ్యామిలీ నుంచి నిఖార్సయిన కమర్షియల్‌ హీరో వచ్చాడనడం అతిశయోక్తి కాదు. 

సయేసా సెహగల్‌ ముంబై అమ్మాయి అయినా, తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులేయించుకుంది. కానీ, ఎక్కువగా నటించే ఛాన్సులు ఆమెకు సినిమాలో దక్కలేదు. ఓవరాల్‌గా బాగా చేసింది. గ్లామర్‌తోనూ ఆకట్టుకుంది. చాలా క్యూట్‌గా ఆడియన్స్‌ మనసుల్ని దోచేస్తుంది. తెలుగు తెరకు ఇంకో అందమైన హీరోయిన్‌ దొరికింది. అందరు హీరోల సరసన సరిజోడీగా కుదిరే టాలెంట్‌ సయేషా సొంతం. బ్రహ్మానందం కామెడీ ఓకే. సప్తగిరి నవ్వించేందుకు ప్రయత్నించాడు. మిగతా పాత్రధారులంత వఆతమ తమ పాత్రల పరిధి మేర ఓకే అనిపిస్తారు. 
కథ కొత్తదేమీ కాదు, పాతదే. 'దేవీపుత్రుడు', 'అంజి' లాంటి సినిమాలెన్నో దాదాపు ఇదే ప్యాట్రన్‌లో వచ్చినవి ఉన్నాయి. కథనం విషయంలో కొత్తదనం చూపించలేకపోయాడు దర్శకుడు. పూర్తిగా కొత్త హీరోని పరిచయం చేయడం కోసం కమర్షియల్‌ యాస్పెక్ట్స్‌పైనే కన్నేయడంతో మిగతా అంశాలపై పట్టు తగ్గింది. మాటలు జస్ట్‌ ఓకే. పాటలు వినడానికీ, తెరపై చూడ్డానికీ బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ మరీ గొప్పగా లేదు. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమా రిచ్‌గా తెరకెక్కిందంటే, నిర్మాణపు విలువలు చాలా బాగున్నట్టే కదా. 

వినాయక్‌ సినిమాల్లో హీరో ఇమేజ్‌ని ఎలివేట్‌ చేసే సన్నివేశాలు చాలా ప్రత్యేకమైనవి. బిల్డప్‌ బాగా ఎక్కువగా ఉంటుంది. ప్రేక్షకులకు సంభ్రమాశ్చర్యాలు కలిగించే అంశాలకు తప్పకుండా చోటు ఉంటుంది. కానీ ఇవన్నీ 'అఖిల్‌'లో మిస్‌ అయ్యాయి. ఫస్టాఫ్‌ సోసోగా సాగిపోతుంది. సెకెండాఫ్‌ కూడా అంతే. ఎక్కడా చెప్పుకోదగ్గ ట్విస్ట్‌లు లేవు. ఆద్యంతం హీరో మీదే ఫోకస్‌ కనిపిస్తుంది. ఆ కోణంలో అఖిల్‌ని బాగా ప్రెజెంట్‌ చేశాడనుకోవాలి. అక్కినేని అభిమానులకైతే సినిమా ఐ ఫీస్ట్‌. డాన్సులు, ఫైట్స్‌తో అలరించాడు అఖిల్‌. ఇది పూర్తిగా అఖిల్‌ సినిమా. అఖిల్‌ తన భుజాలపై మోసిన సినిమా. కాస్త కథా బలం, ట్విస్ట్‌లు, ఎమోషన్స్‌ క్యారీ అయి వుంటే అఖిల్‌కి సెన్సేషనల్‌ ఎంట్రీ లభించి ఉండేది. 

ఒక్క మాటలో చెప్పాలంటే 
అఖిల్‌ అదుర్స్‌ 

అంకెల్లో చెప్పాలంటే: 2.75/5
మరిన్ని సినిమా కబుర్లు
we are the toppers in CG technology