Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
jotishyam small telugu story

ఈ సంచికలో >> శీర్షికలు >>

తస్మాత్ జాగ్రత్త !! - భమిడిపాటి ఫణిబాబు

tasmath jaagratha

చాలామంది మొహమ్మాటాలకి బలైపోతూంటారు. సమయం వచ్చేసరికి "నో" అని చెప్పలేని నిస్సహాయత అనండి, లేదా కొండొకచో "చేతకానితనం" అనండి, ఏదో ఒకటి, ఏది ఏమైతేనేం దాంట్లోంచి బయటపడలేకపోతారు. అలాగని అందరూ అలాగే ఉంటారని కాదు, ఏ కొద్దిశాతమో ఇలాంటి ప్రాణులు ఉంటూంటారు. ఆ మిగిలిన శాతం ఉంటారే వాళ్ళు ఇలాటి "బక్రా" లని exploit చేస్తూంటారు. వీళ్ళు ఓ "ఎర" కోసం వెదుకుతూంటారు. వెదకాలే కానీ, ఈ మొహమ్మాటం పక్షులు అదేమిటో కానీ, వాళ్ళమొహం చూస్తూనే తెలిసిపోతుంది, వీడు ఒక potential target అని! ఆ వేటాడేవాడు ఇతనితో ఆడేసికుంటాడు.

వీళ్ళలో ఇంకో గుణం ఉంటుంది, ఎవరితో పడితే వారితో పరిచయాలు పెంచేసికోడం, సమయం సందర్భం లేకుండా, చెప్పా పెట్టకుండా వాళ్ళింటికి వెళ్ళిపోయి తిష్ఠ వేయడం. ఆ అవతలివాడు ఏదో మొహమ్మాటానికి పరిచయం చేసికున్నాడే కానీ, ఏదో వీధిలో కనిపించినప్పుడు పలకరించొచ్చుకదా అనే కానీ, మరీ మొదటి పరిచయంలోనే ఇలా ఇంటికొచ్చేస్తాడని అనుకోడు. పోనీ అలాగని, "నాకు కొద్దిగా బయటకెళ్ళే పనుందండీ.." అంటాడా, అబ్బే మళ్ళీ మొహమ్మాటం అడ్డొచ్చేస్తుంది. ఈ గృహస్థు గారి భార్యామణి, ఏదో ఈయన బయటకు వెళ్తున్నాడు కదా అని  టిఫినూ, కాఫీ ఇచ్చింది. చూస్తే ఈయనేమో ఎవరితోనో కబుర్లు చెప్తూ, పైగా లోపలకి కూడా తీసికొచ్చాడు. ఎప్పటికి బాగుపడతాడో ఏమో, చెప్పేయొచ్చుగా బయటకి వెళ్తున్నాననీ. నే బతికుండగా మా కాపరం బాగుపడదు అని విసుక్కుంటుంది. ఈ చెప్పినవన్నీ స్వగతాలు, కానీ బయటకుమాత్రం, తడిచేయి కొంగుకు తుడుచుకుంటూ, పమిట సరిచేసికుంటూ, మొహం నిండా నవ్వు పులిమేసికుని, భర్తగారు పరిచయం చేయగా, అది కూడా పూర్తి వివరాలు కూడా కాదు. కారణం ఆయనకీ అన్నీ తెలిసేడిస్తే కదా, ఏదో మామూలు పరిచయం మాత్రమే. ఆ వచ్చినాయనకి తెలుస్తుంది ఫరవాలేదూ వీళ్ళతో ఆడేసికోవచ్చూ అని నిశ్చయించేసికుంటాడు.

ఆకబురూ, ఈకబురూ చెప్తూ, ముందుగా ఇల్లు చూపించడంతో ప్రారంభం అవుతుంది, పాపం ఈమధ్యనే కూడా కట్టించుకున్నడాయె, గృహప్రవేశం చేసిన తరువాత వచ్చిన మొదటి అతిథాయే ఆ వచ్చినాయన, ఆమాత్రం మర్యాదలు చెయ్యొద్దూ అనేసికుని, తన దగ్గర ఉన్న విలువైన పుస్తకాలతో సహా ఈయనకి చూపిస్తాడు. తనకి పుస్తక పఠనంమీద ఎంత ఆసక్తో, ఖరీదెంతైనాసరే, తల తాకట్టుపెట్టైనా సరే ఎలా పుస్తకం సంపాదిస్తాడో వగైరా.. వగైరా. దానికి సాయం, ఆ ఇంటి ఇల్లాలు కూడా, ఈ వచ్చినాయన కబుర్ల బుట్టలో పడిపోతుంది. ఎంతైనా ఈ "వేటగాళ్ళ" మాటల ప్రభావం అలాంటిదీ మరి!

ఆ ఇల్లాలు తెచ్చిన టిఫినూ, కాఫీ లాగించేసి అసలు విషయంలోకి వస్తాడు. "ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నానండీ, అబ్బ ఇన్నాళ్ళకి నా కల పండింది. అప్పుడెప్పుడో అదేదో పత్రికలో ఈ పుస్తకం మీద రివ్యూలు చదివాను, ఎలాగైనా సరే ఈ పుస్తకం చదవని జీవితంకూడా ఓ జీవితమేనా అనుకుని, ఊళ్ళో ఉన్న అన్ని పుస్తకాల షాపులకీ వెళ్ళి మరీ చూశాను. అయినా మన ఊళ్ళో ఉండే షాపుల గురించే చెప్పాలా, దిక్కుమాలిన పుస్తకాలన్నీ వేల్లాడతీస్తారు కానీ, ఇలాంటి ఆణిముత్యాల గురించి అసలు తెలియనే తెలియదూ, పైగా, ఫలానా పుస్తకం ఉందా అని అడిగితే, ఆ పుస్తకం పేరే వినలేదంటారు. వీళ్ళకేం తెలుస్తండీ, పుస్తకాల విలువా, నేను ప్రొద్దుటే లేచి ఎవరి మొహం చూశానో కానీ, నా అదృష్టంకొద్దీ ఆ పుస్తకం కనిపించింది, అదీ మనింట్లో.." అప్పటికే "మీ ఇంట్లో" నుంచి, "మనింట్లో" లోకి దిగాడు. అదన్నమాట తెలివితేటలంటే.

నిజం చెప్పాలంటే ఈ పెద్దమనిషికి పుస్తకాలమీద అంత పేద్ద ఆసక్తేమీలేదు. ఎక్కడో ఏదో పుస్తకవితరణ సభకి వెళ్ళగా, అక్కడ ఎవరో మాట్టాడుకుంటూండగా విన్నాడు ప్రస్తుతం తను "వల" వేసిన పుస్తకం గురించి! కొంతమందుంటూంటారు ఎక్కడైనా ఏదైనా ఉచితంగా ఇస్తూన్నారంటే తప్పకుండా హాజరవుతూంటారు. మామూలుగా ఇలాటి పుస్తకావిష్కరణ సభలకి మరీ ఎంతమందో కానీ హాజరవరు. అలా హాజరైనవాళ్ళందరికీ కూడా ఉచిత పుస్తక వితరణ చేస్తూంటారు. మళ్ళీ అదో మొహమ్మాటం. కొంతమందైతే ఆ ఉచిత పుస్తకం తీసికోవడం తమ జన్మహక్కనుకుంటూంటారు, ఇవ్వకపోతే దెబ్బలాడైనా తీసికుంటూంటారు. ఆ పుస్తకం content తో ఏమీ సంబంధం ఉండదు, అది ఓ కథ అవొచ్చు, కవిత అవొచ్చు, ఇంకోటేదో కావొచ్చు. ఉచితంగా వస్తోందా లేదా, అదీ విషయం. ఇలా నానావిధాలైన ఆవిష్కరణ సభలకీ వెళ్ళి, ఇంట్లో రెండు ర్యాక్కులు నిండేటన్ని పుస్తకాలు సేకరించిన మహా మనీషి... అదృష్టం బాగోక ఎవరైనా వీళ్ళింటికి వస్తే, ఇవన్నీ ప్రదర్శించొచ్చు. సంఘంలో ఎంత మర్యాద!

పైన చెప్పినదంతా మన "వేటగాడి" ఘనత ! ప్రస్తుతానికి వస్తే, తన దృష్టి పడ్డ పుస్తకం కూడా తన collection లోకి చేరాలి! ఆ కబురూ ఈకబురూ చెప్పి చివరకి తేలుస్తాడు, మళ్ళీ ఆ ఇంటి ఇల్లాలు ఏమైనా అభ్యంతరం చెప్తుందేమో అనుకుని, అటువైపునుండి నరుక్కొస్తాడు. "చెల్లెమ్మా, ఏదో మాట్టాడుతున్నానే కానీ, ఆ పుస్తకం చదవకుండా ఉండలేనమ్మా, అలాగని మరీ మీఇంట్లోనే కూర్చుని చదువుకోమని మాత్రం అనకమ్మోయ్.. మీకు ఎన్నెన్నో పనులుంటాయి, నా అడ్డం ఎందుకూ, ఒక్కసారి ఇలా తీసికెళ్ళి అలా తెచ్చి పువ్వుల్లోపెట్టి ఇచ్చేసే పూచీ నాదీ.. నాకు తెలుసు ఆ పుస్తకమంటే మీకున్న బంధం. మరీ అభ్యంతరం ఏదైనా ఉంటే మాత్రం చెప్పమ్మా, పుస్తకానికేమిటీ, ఈ భూప్రపంచంలో ఎక్కడో అక్కడ వెదుకుతాను. ఈ ఇచ్చిపుచ్చుకోవడాల్లో మన స్నేహానికేమీ అడ్డురాకూడదమ్మోయ్.." అంటూ ఇమోషనల్ అత్యాచార్ లోకి దిగిపోతాడు.  చెప్పానుగా ఆ వెర్రి ఇల్లాలు పడిపోతుంది ఈయనగారి మాటల్లో. "అదేమిటండీ మీరేమైనా మణులడిగారా, మాణిక్యాలడిగారా ఒఠ్ఠి పుస్తకమే కదా, ఆమాత్రం దానికి అంతలా అడగాలా ఏమిటీ, నేనూ, మావారూ ఎప్పుడో చదివేశాం, తీసికెళ్ళండి అన్నయ్యగారూ.." అని పెర్మిషనిచ్చేస్తుంది. పైగా ఆ పుస్తకం పెట్టుకోడానికి ఓ గుడ్డసంచీయో ఇంకోటో కూడా ఉచితం.

ఇంక తలుచుకున్న కార్యంలో సఫలీకృతుడై, బయటకి వెళ్ళీవెళ్ళడంతో, ఆ సంచీ కాస్తా తన జేబులో దోపెసికుని, ఆ పుస్తకం మాత్రం అందరికీ కనిపించేటట్టుగా పట్టుకోవడం! ఇలాటి పుస్తకం తన చేతిలో ఉందంటే సమాజంలో తనకి ఎంత పేరూ ప్రతిష్ఠా! తన "ఉచిత పుస్తక కిరీటం" లో మరో కల్కి తురాయి! తనేమైనా చదివేడా పెట్టేడా, ఊరికే వస్తున్నాయికదా అని పోగేయడం. పాపం ఎవరింటినుండి తెచ్చుకున్నాడో వాళ్ళు మాత్రం, ఈయన పుస్తకం ఎప్పుడు తిరిగిస్తాడా అనుకుంటూ ప్రతీ రోజూ ఎదురు చూడడం. ఖర్మకాలి ఎప్పుడో ఏ బజారులోనో కనిపిస్తాడు. "పుస్తకం చదివేశారా" అని అడగడం తరవాయి, "మొన్న మా ఊరునుండి మా బంధువొకడొచ్చాడండీ, నేను అప్పుడే మీకు తిరిగి ఇచ్చేద్దామని చెప్పుల్లో కాళ్ళెట్టుకుని బయలుదేరానా, సరీగ్గా అప్పుడే ఆయనా దిగబడ్డాడు. చేతిలో పుస్తకం చూసి, "ఒక్కసారి ఇవ్వరా అబ్బాయీ, చదివి పంపేస్తాను" అన్నాడండీ, ఏం చేస్తాం పెద్దమనిషాయె, పైగా మా ఇంటావిడకి చుట్టంకూడానూ, జాగ్రత్తగా పంపడం మర్చిపోకూ" అనేసి, ఆయనకిచ్చేశానని చెప్తాడు. పైగా "మీరే మీ ఖంగారు పడకండే, మీసొమ్ము నా సొమ్ము కాదుటండీ.."  అనేసి ఊరుకోబెడతాడు...

పుస్తకం తిరిగిరావడం విషయం మర్చిపోవచ్చు.. గోడకి రాసిన సున్నంలాగానే ఈ "వేటగాళ్ళకి" సమర్పించుకున్న పుస్తకాలూనూ.. తస్మాత్ జాగ్రత్త...
భమిడిపాటి ఫణిబాబు

మరిన్ని శీర్షికలు
railway track