Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
annamayya pada seva

ఈ సంచికలో >> శీర్షికలు >>

శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు - టీవీయస్.శాస్త్రి

kandukuri veereshalingam panthulu

శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఒక గొప్ప సాహితీ వేత్త, సంస్కర్త. వితంతు వివాహాలు నిర్వహించిన మహనీయుడు. అలాగే, బాల్య వివాహాలను కూడా అడ్డుకున్నారు. శ్రీ వీరేశలింగం పంతులు గారు 16-04-1848 వ తేదీన శ్రీ సుబ్బారాయుడు, పూర్ణమ్మ దంపతులకు రాజమహేంద్రవరంలో జన్మించారు.

వీరిది ఒక సనాతన, సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. వీరేశలింగం గారికి మూడేండ్ల ప్రాయంలో ఆ రోజుల్లో ప్రాణాంతక వ్యాధి అయిన మశూచి వ్యాధి సోకింది. భగవదనుగ్రహం వల్ల దేశ ప్రజల అదృష్టం వల్ల వారు ఆ వ్యాధి నుండి బ్రతికి బయట పడ్డారు. కానీ, వారికి నాలుగు సంవత్సరాల వయసులోనే పితృ వియోగం కలిగింది. ఆ తరువాత వారి తండ్రి గారి సోదరుడైన శ్రీ వెంకట రత్నం గారు వీరిని దత్తు తీసుకొని సొంత బిడ్డ లాగా పెంచారు. ప్రాధమిక విద్య అంతా రాజమహేంద్రవరంలోనే సాగింది.

అటుపైన ఆంగ్ల విద్యను అభ్యసించటానికి వీరిని ఒక మిషనరీ స్కూల్ లో చేర్పించారు. వీరిలోని చురుకుదనం, మేధస్సు , వివిధ రంగాల పట్ల వీరికున్న మక్కువ మొదలైనవి అప్పుడే బయటపడ్డాయి. స్వభావ రీత్యా అత్యంత విశిష్టమైన వ్యక్తి కావటం చేత తన వ్యక్తిత్వానికి మరిన్ని మెరుగులు దిద్దుకున్నారు. స్కూల్ మొత్తం మీద ఉత్తమ విద్యార్ధిగా గుర్తించపడ్డారు.

1869 వ సంవత్సరంలో మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులై, కోరంగి అనే గ్రామంలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. అక్కడ రెండు, మూడు సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా, ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేసిన పిమ్మట ధవళేశ్వరంకు మకాం మార్చారు. అక్కడ ఒక ఆంగ్ల మాధ్యమ విద్యాలయంలో ఉపాధ్యాయుడిగా చేరారు. ఆ రోజుల్లో సమాజంలో ఉన్న మూఢ ఆచారాలు వీరిని కలచివేసాయి. ముఖ్యంగా స్త్రీల సమస్యలు వీరిని ప్రభావితం చేసాయి. సంఘ సంస్కరణకు నడుం బిగించారు. వితంతు వివాహాలు నిర్వహించటం, బాల్య వివాహాలు నిరోధించటం వీరి సంస్కరణలోని ముఖ్యాంశాలు. స్త్రీలకు విద్య నేర్పించక పోవటమే ఈ దురాచారాలకు కారణమని భావించి ధవళేశ్వరంలో 1874 బాలికల కోసం ప్రత్యేకంగా ఒక విద్యాలయాన్ని ప్రారంభించారు.

1876లో ఒక తెలుగు పత్రికను ప్రారంభించి, ఆ పత్రికలో స్త్రీల సమస్యలను గురించి అనేక వ్యాసాలు వ్రాసారు. ఆ తరువాత వీరు 'వివేక వర్ధిని' అనే పత్రికను స్థాపించి తన ఉద్యమానికి ఊతగా ఆ పత్రికను నడిపారు. సంస్కరణకు సంబధించిన వ్యాసాలతో పాటు, సమాజంలోని దురాచారాలను, అవినీతి, కల్మషాన్ని తన రచనా వ్యాసంగంతో కడిగివేసారు. ఆ రోజుల్లో ఆ పత్రిక మద్రాసు నుండి ముద్రించబడేది. ఆ పత్రికకు అనతికాలంలోనే విశేష స్పందన వచ్చింది. ఆ పరిస్థితుల దృష్ట్యా పంతులు గారు రాజమహేంద్రవరంలోనే తన సొంత ముద్రణాలయాన్ని ప్రారంభించారు. ఆ రోజుల్లోనే వీరు స్త్రీలను చైతన్య పరచటానికీ మరియూ వారికున్న హక్కులు తెలియచేసి వారిని జాగృత పరచటానికి 'సతిహితబోధిని' అనే మరో పత్రికను కూడా ప్రారంభించినారు. 1878లో దేవదాసీ, భోగం మేళం లాంటి దురాచారాలను ఎండగడుతూ(anti-nautch movement ) తీవ్రమైన ఉద్యమాలు చేసారు. వితంతు వివాహాలు వీరి ఆధ్వర్యంలో విరివిగా జరగటం మొదలయ్యాయి. 11-12-1881 న వారు గోగులపర్తి శ్రీ రాములు, గౌరమ్మ అనే వారికి చేసిన మొదటి వితంతు వివాహం.

సమాజం నుంచి ఎన్నో అడ్డంకులు, విమర్శలు వచ్చినప్పటికీ వాటినన్నిటినీ ఓర్పుగా, ధైర్యంగా ఎదుర్కోవటమే కాకుండా, తన రచనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా ప్రజలను ఒప్పించి మెప్పించగలిగారు. వారి సంస్కరణాభిలాషకు విదేశీయులనుండి కూడా ప్రశంసలు లభించాయి. శ్రీ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ గారు వీరికి సమకాలికులు మరియూ వారి భావాలు కూడా పంతులుగారి భావాలే! అలా శ్రీ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ గారు వీరిని మరింత ప్రోత్సహించారు. తరువాతి కాలంలో వీరు ఒక వితంతు శరణాలయం ప్రారంభించారు. బాల్య వివాహాలను నిరోదించటం పై దృష్టి సారించి దాని కోసం ఒక చట్టం కూడా రావటానికి కృషి చేసారు. 'కన్యాశుల్కం' లాంటి దురాచారాలను ఎండగట్టారు. తరువాత బాలికలకు విద్యకోసం మరొక విద్యాలయాన్ని స్థాపించారు. 'రావు బహదూర్' అనే బిరుదు పొందారు. తరువాత బ్రహ్మసమాజం వైపు ఆకర్షితులై దాని వ్యాప్తికోసం విశేష కృషి చేసారు. బ్రహ్మసమాజం యొక్క ఉద్దేశ్యాలను దృష్టిలో ఉంచుకొని 'హిత కారిణి' అనే మరొక విద్యాలయాన్ని కూడా ప్రారంభించారు.

తెలుగు, ఆంగ్ల, సంస్కృత భాషలో విశేష పాండిత్యం ఉండటం వల్ల వీరు పెక్కు గ్రంధాలను రచించారు. వ్యాసాలు, జీవిత చరిత్రలు, ఆత్మకథలు, నవలలు లాంటి పెక్కు ప్రక్రియలను తెలుగు భాషలో ప్రవేశపెట్టారు. తెలుగులో మొట్ట మొదటి నవలైన 'రాజశేఖర చరిత్ర' వీరు వ్రాసినదే! Oliver Goldsmith వ్రాసిన "The Vicar of Wakefield", కు ఇది స్వేచ్చానువాదం. వ్యావహారిక భాషా ఉద్యమానికి వీరు చేసిన కృషి మరువరానిది. సమాజంలోని దురాచారాలాను ఖండిచటం కోసం చాలా వ్యంగ్య నాటకాలు కూడా వ్రాసారు.

శ్రీ వీరేశలింగం గారికి వారి పదమూడవ సంవత్సరంలో బాపమ్మ గారితో వివాహం అయింది. అప్పుడు బాపమ్మ గారి వయసు ఎనిమిది సంవత్సరాలే! భర్త సంస్కరణలను, ఉద్యమాలను,భావాలను అర్ధం చేసుకొని వారి వెనుక నిలబడి ప్రోత్సహించిన మహిళా శిరోమణి బాపమ్మ గారు. శ్రీ గురజాడ వారి రచనలకు వీరి జీవితమే ప్రేరణ! గురజాడవారి 'కన్యాశుల్కం' నాటకం లోని సౌజన్యా రావు పంతులు గారి పాత్ర వీరేశలింగం గారిని దృష్టిలో ఉంచుకొని సృష్టించినదే! 1885లో మొదటి భారత జాతీయ congress సమావేశాలలో పాల్గొన్నారు. గోదావరీ తీరాన కోటిలింగాలు ఉన్నాయి. ఎన్నోలింగాలు నదీ ఉధృతికి కొట్టుకొని పోయాయి. ఒక్క గొప్ప లింగం మిగిలింది,అదే వీరేశ'లింగం'! తెలుగువారిని చైతన్యవంతులుగా చేసిన ఈ మహనీయుడు 27-05-1919 న తమ 71 వ సంవత్సరముల వయసులో, తుది శ్వాస విడిచారు.

ఆ మహనీయునికి నా స్మృత్యంజలి....

మరిన్ని శీర్షికలు
Paryatakam - Hampi