Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
patience

ఈ సంచికలో >> శీర్షికలు >>

రచనలు చేయటం ఎలా? - టీవీయస్.శాస్త్రి

Tips for writers

రచయిత కాగోరే వారు, రచయితలైన వారు ముఖ్యంగా చేయవలసిన పని - నిరంతరం విద్యార్ధిగా ఉండటం. అంటే ఎక్కువగా మంచి పుస్తకాలు చదవటంతో కాలాన్ని గడపాలి. అసలు రచయితకు కావాల్సిన ముఖ్యలక్షణం - భావుకత. చక్కని భావజాలాన్ని కలిగి ఉండటం. తనకున్న భావాలకు అక్షరరూపాన్ని ఇవ్వటమే రచన అంటే! ప్రతి వారికీ కొన్ని భావాలుంటాయి. కొంతమంది వాటిని ముఖతః వ్యక్తీకరించగలరు, కానీ వాటికి అక్షర రూపాన్ని ఇవ్వలేరు. మరి కొంతమంది చక్కగా రచనలు చేయగలరు, కానీ వక్తగా పెద్దగా రాణించలేరు. మహాకవి శ్రీ శ్రీ చెప్పుకోదగ్గ వక్త కాదు, కానీ మహా రచయిత, కవి. రచయిత అయి, వక్తగా కూడా రాణించిన వారు అనేకమంది ఉన్నారు. రచన, వక్తృత్వం అనేవి రెండు వేర్వేరు అంశాలు. రెండింటిలోనూ రాణించటానికి సాధన అవసరం.

ఏదైనా మంచి రచన చదివిన తరువాత, మనం కూడా అలా వ్రాయగలిగితే బాగుండు అనే అంకురం మొలకెత్తుతుంది, రచయిత కాగోరే వారిలో! ఆ అంకురాన్ని జాగ్రత్తగా పెంచి, పోషించుకొని దానినొక మంచి ఫలవంతమైన వృక్షానిగా మలచుకోవటం మనం చేయవలసిన పని. రచయిత కాగోరే వారు అన్ని రకాల రచనలను చదవాలి, కానీ వాటి ప్రభావంలో మాత్రం పడకూడదు. అంటే మంచి రచయితకు కావలసిన ముఖ్య లక్షణం - ఓపెన్ మైండ్. స్వేచ్ఛాజీవిగా ఉండాలి. భావదాస్యం పనికి రాదు. భావదాస్యాన్ని మించిన దరిద్రం మరొకటిలేదు.

ఉదాహరణకు కేవలం ఆధ్యాత్మికతలోనే తృప్తి ఉందనుకొని, కేవలం అటువంటి రచనలే వ్రాయాలనిపిస్తే మిమ్మల్ని అటువంటి భావజాలం ఉన్న పాఠకులే ఇష్టపడతారు. అలానే, జ్యోతిష్యం వాస్తులాంటివి కూడా. వివిధ అంశాల మీద వ్రాయగలిగితే రచయితగా మీకు విస్తృత పరిధి ఏర్పడుతుంది. అందుకని రచయితగా కాగోరే వారు ఏ ఒక్క భావజాలానికో అంకితం కాకూడదు. కొంతమంది రచయితలు 'నిబద్ధత' పేరు మీద కేవలం ఒక భావజాలానికే అంకితమయి వ్రాస్తుంటారు. విప్లభావాలున్న వరవరరావు, నాస్తిక, మరియు దళితజన సంస్కరణ భావాలున్న కత్తి పద్మారావు లాంటి వారికి కేవలం ఆ వర్గానికి చెందినవారే అభిమానులవుతారు. అలానే వామపక్ష భావాలున్న కొంతమంది కమ్యూనిస్ట్ రచయితలు కేవలం విశాలాంధ్ర, ప్రజాశక్తి లాంటి పత్రికలకే పరిమితమౌతారు. అన్ని వర్గాల సంక్షేమాన్నిదృష్టిలో ఉంచుకొని అన్ని విషయాలను చక్కని అవగాహనతో వ్రాయగలిగే వాడే మంచి రచయిత. అంటే, దేనినీ అంటిపెట్టుకోకుండా, ఓపెన్ మైండ్ తో ఉండటం మంచి రచయితకు కావలసిన ముఖ్యలక్షణం.

కొంతమంది సాంప్రదాయవాదులు గతమంతా మంచి, వర్తమానం అంతా చెడు అనే భావనలతో ఉంటారు. గతం, వర్తమానంలోనూ మంచి చెడులుంటాయి. రెండిటిలోనూ మంచిని గుర్తించాలి. కులాల గురించి ఎక్కువగా మాట్లాడ కూడదు. అసలు మన కులమేమిటో కూడా తెలియ కూడదు. కానీ నా లాంటి వాడి కులం అందరికీ తెలుస్తుంది. పేరులోనే కులం ఉంది కాబట్టి! నేను కలం పేరుతొ రచనలు చేయాలనుకున్నాను. కానీ, ఒక శుభలగ్నం చూసి మా నాన్నగారు నాకు పెట్టిన పేరుతోనే వ్రాయాలనిపించి, ఆ పేరుతోనే వ్రాస్తున్నాను. అలానే, మతం కూడా! కాకపొతే మతానికి కొంత విస్తృత పరిధి ఉంది, ఎందుకంటే ప్రతి మతం కూడా ఆయా మతస్తుల జీవన విధాన్ని సూచిస్తుంది. కావలసినది మతసహనం, మతద్వేషం కాదు. ఎక్కడో టెర్రరిస్టులు బాంబు దాడులు చేసారని, ముస్లిం సోదరులందరినీ టెర్రరిస్టులుగా చూడకూడదు. టెర్రరిస్టులలో ముస్లిములు ఎక్కువ మంది ఉండవచ్చేమో కానీ, ముస్లిములు అందరూ టెర్రరిస్టులు కాదు. ఆ మాటకొస్తే హిందువులలో కూడా ఉగ్రవాదులున్నారు, ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న సంస్థలున్నాయి. భారతదేశం వివిధ కుల, మతాల సమాహారం. ఆ సమాహారంలో ఏ ఒక్క పూస తెగినా, ఆ మాల చిందర వందర అవుతుంది. మన ప్రత్యేకత అయిన 'భిన్నత్వంలో ఏకత్వాన్ని' కోల్పోతాం! కేవలం భిన్నులుగానే మిగిలిపోతాం! సార్వజనీనత, సమకాలీనత, సమైక్యత అనే మంచి లక్షణాలు, ఆశయాలు కలిగి మనం ఉండాలి. ప్రత్యేకించి ఈ లక్షణాలు రచయితలకు చాలా అవసరం. ఎందుకంటే, జాతిని జాగృత పరచేది వారే కాబట్టి!

రచయితకు ఉండవలసిన లక్షణాలను, ఆశయాలను గురించి చెప్పుకున్నాం! ఇక రచనలు చేయటం ఎలా అనే దాన్ని గురించి చెప్పుకుందాం! ముందుగా మీకున్న భావాలను మీ మస్తిష్కంలోగానీ, ఒక కాయితం మీద గానీ నిక్షిప్తం చేసుకోండి. ఉదాహరణకు, ఆవును గురించే ఒక వ్యాసాన్ని వ్రాయాలనుకున్నామనుకోండి! కొంతమంది, ఆవును గోమాతగా భావించి, ఆవు మనకు ఆరాధ్యమైనదనే భావనను కలిగి ఉండవచ్చు, మరి కొందరు ఆవు పాలలో ఉన్న పోషక పదార్ధాలు, గోమూత్రం వలన వ్యాధులు నయమవుతాయనే భావన కలిగి ఉండవచ్చు. ఎవరి భావాల్లో వారు ఆవును గురించి వ్రాయవచ్చు. అయితే, మీరు వ్రాసే వ్యాసం విభిన్నంగా ఉండి, ఇంతకు మునుపు ఎవరూ తెలియచేయని విషయాలుంటే, చదువరులకు మీరు వ్రాసింది చదవాలనిపిస్తుంది. అలా మీరు నిక్షిప్తం చేసుకున్న భావాలను అందంగా ఒక మాలగా చేయటమే రచన అంటే! అంతేనా రచన అంటే, అంతే కాదు! భాషాజ్ఞానాన్ని బాగా అభివృద్ధిచేసుకోవాలి, భాష మీద మంచి పట్టు సాధించాలి. తప్పులు లేకుండా, అక్షర దోషాలు లేకుండా చక్కగా వ్రాయటం నేర్చుకోవాలి. తెలుగు నిఘంటువుని దగ్గర ఉంచుకోవాలి. ఏ పదాన్ని ఎక్కడ వాడితే రచనకు సొగసు చేకూరుతుందో అనేది అభ్యాసం, సాధన వలన సమకూరుతుంది.

నా మిత్రులలో చాలామంది, నేను తెలుగులో వ్రాయాటం మొదలు పెట్టిన తరువాత, వారు కూడా తెలుగులో వ్రాయటానికి ఉత్సాహం చూపించారు. కొంతమంది వ్రాయటం మానేసారు! ఇది స్వాతిశయం కాదు, తెలుగు భాషలో ఉన్న తియ్యదనం అటువంటిది. ముందుగా, పరభాషలోని సంఘటనలను, చిన్నకథలను తెలుగులోకి తర్జుమా చేయండి. పదాల మీద, భాష మీద అలా కొంత వరకు పట్టు సాధించటానికి అవకాశం ఉంది. మనం వ్రాసేది వాడుక భాషలో ఉండాలి. ఇంకా చెప్పాలంటే, పాఠకులతో మనం మాట్లాడుతున్నట్లుగా ఉండాలి! తెలుగు భాష మీద మనకు ప్రేమ ఉండవచ్చు. అంతమాత్రం చేత ఈ దేశ సంస్కృతిలో కలసిపోయిన అన్యదేశీయాలను బహిష్కరించకుండా, యధాతధంగా స్వీకరించి వ్రాయటం ఉత్తమం. ఉదాహరణకు-కాఫీ, ఇంటర్నెట్, ఇ మెయిల్, మొబైల్, ఫోన్, స్టేషన్ ఇలా చాలా పదాలను యధాతధంగా తీసుకోవటం బాగుంటుంది. కొంతమంది, ఇంటర్నెట్ కు బదులు అంతర్జాలమని, ఇ మెయిల్ కు బదులు విద్యుల్లేఖ అని, మొబైల్ కు కరవాణి అని వ్రాస్తున్నారు. కొన్ని ఆంగ్ల పదాలను తెలుగులోకి తర్జుమా చేస్తే, వాటి అర్ధమే మారి ఆ పదాలు అపహాస్యం పాలౌతాయి. Police Dogs అనే పదాన్ని తెలుగులో పత్రికల వారు కూడా ' పోలీసు కుక్కలు' అని వ్రాస్తున్నారు. పోలీసు కుక్కలు అంటే పోలీసులనబడే కుక్కలు అని అర్ధం కూడా వస్తుంది. అలానే Government E. N. T. హాస్పిటల్ కూడా! దాని క్రిందనే తెలుగులో ఇలా వ్రాస్తారు-ప్రభుత్వ, చెవి, ముక్కు, నోటి ఆసుపత్రి అని. ప్రభుత్వం వారికి అవన్నీ ఉన్నాయనే అర్ధం వచ్చి నవ్వుకుంటాను. A. P. S. R. T. C---ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రోడ్ రవాణా సంస్థ అని తెలుగులో వ్రాస్తారు. రోడ్ ను రవాణా చేసే సంస్థ అనే అర్ధం వచ్చి నవ్వుకోవటం మినహా మనమేమీ చేయలేం! అధికార భాషా సంఘం వారు, తెలుగు అకాడమీలు, పత్రికలు, వీటికి చక్కని అనువాద పదాలను సూచించాలి, కాకపోతే ఆ ఆంగ్ల పదాలనే యధాతధంగా వాడాలి.

భాష పట్ల అభిమానం ఉండవచ్చు, అది దురభిమానంగా మారకూడదు. అలా దురభిమానంగా మారిన నాడు మన మాతృభాషే అపహాస్యం పాలౌతుంది. వర్తమానంలో చాలా పదాలు అన్ని భాషలలోను కొత్తగా వస్తుంటాయి. వాటికి నిఘంటువులో అర్ధాలు దొరకవు. నక్సలైట్ అనే పదానికి అర్ధాన్ని ఏ నిఘంటువులో వెతుకుదాం! అన్నిటినీ మించి, అనుకరణలు, అనుసరణలు వద్దు. మీకొక సొంత శైలిని అలవరుచుకోండి! ఇక పైన సూచించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని, మీ కలాలకు నేడే పదును పెట్టండి. చక్కని రచనలు చేసి, మంచి రచయితలుగా పేరు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. చాలా మంది మిత్రులు రచనలు చేయటం ఎలా? అని ప్రశ్నించటం మీదట ఈ వ్యాసాన్ని వ్రాసాను. అట్టివారికి ఈ వ్యాసం కొంతవరకైనా ఉపయోగ పడితే నా ప్రయత్నం ఫలించినట్లే!

మరిన్ని శీర్షికలు
Navvula Jallu by Jayadev Babu