Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

రామ్‌ తో ఇంటర్వ్యూ

interview with ram
హైప‌ర్ అనే టైటిల్ రామ్‌కి త‌ప్ప మ‌రో హీరోకి సూట్ అవ్వ‌దేమో?
న‌ట‌న‌లో, డాన్స్‌లో, యాటిట్యూడ్‌లో అన్నిటా హైప‌రే. 
రామ్‌ని చూస్తే హుషారుని పొట్లాంగా క‌ట్టిన‌ట్టు, దూకుడ్ని డోర్ డెలివ‌రీ చేసిన‌ట్టు, చురుకుద‌నానికి చిరునామా అన్న‌ట్టు క‌నిపిస్తుంటాడు.
ఈత‌రం కుర్రాళ్లు ఎలా ఉండాల‌నుకొంటారో, ఎలా ఉంటున్నారో.. అలానే ఉంటాయి రామ్ పాత్ర‌లు. అందుకే యూత్ రామ్‌కి త్వ‌ర‌గా క‌నెక్ట్ అయిపోతుంటారు. నేను శైల‌జ‌తో ఓ హిట్టు కొట్టి ఫామ్ లోకి వ‌చ్చిన రామ్‌.. ఇప్పుడు హైప‌ర్ అంటూ క‌మ‌ర్షియ‌ల్ క‌థ చెప్ప‌బోతున్నాడు. ఈ సంద‌ర్భంగా రామ్‌తో చేసిన చిట్ చాట్ ఇది.

* నేను శైల‌జ‌తో క్లాస్ లుక్‌లోకి వెళ్లారు.. వెంట‌నే మ‌ళ్లీ బాస్ బాట ప‌ట్టేశారు?
- ఓకే ర‌క‌మైన పాత్ర‌లు ఎప్పుడూ చేయ‌కూడ‌ద‌న్న ఆలోచ‌న‌తోనే. నేను శైల‌జ త‌ర‌వాత మ‌ళ్లీ ల‌వ్ స్టోరీనే చేశాన‌నుకోండ‌.. రామ్ సినిమాలేంటి?  ఎప్పుడూ ఒకేలా ఉంటాయ్ అని మీరే అంటారు. అందుకే ఇలా జోన‌ర్ మార్చా.

* హిట్ ఫార్ములా వ‌ద‌ల‌డం ఎవ్వ‌రికీ ఇష్టం ఉండ‌దు క‌దా?
- అవును. కాక‌పోతే.. నేను శైల‌జ చూసిన వాళ్లంతా 'సినిమా చాలా బాగుంది.. మీరు కొత్త‌గా క‌నిపించారు' అని కాంప్లిమెంట్లు ఇచ్చారు. కొంత‌మంది మాత్రం 'నీదైన స్టైల్‌.. నీదైన హుషారు లేదు' అని మొహంమీదే చెప్పేశారు. అంద‌రినీ సంతృప్తి ప‌రిచే సినిమా చేయాల‌న్న ఉద్దేశంతోనే 'హైప‌ర్‌' ప‌ట్టాలెక్కించాం.

* హైప‌ర్‌లో మీకు కొత్త‌గా క‌నిపించిన పాయింట్ ఏంటి?
- తండ్రీ కొడుకుల అనుబంధం నేప‌థ్యంలో చాలా సినిమాలొచ్చాయి. అయితే తండ్రిపై ఉన్న ప్రేమ‌ని పీక్స్‌లో చూపించే కొడుకు క‌థ‌. ఆ పాయింట్ చెప్ప‌గానే భ‌లే ఉందే అనిపించింది. ఈ సినిమాలో కావ‌ల్సినంత ఫ‌న్ పుట్టించ‌డానికి ఆ లైన్ బాగా దోహ‌దం చేసింది. సాధార‌ణంగా ప్ర‌తీ సినిమాలోనూ హీరో త‌ల్లి కోస‌మో, ఫ్రెండ్ కోస‌మో, ల‌వ‌ర్ కోస‌మో పోరాడుతుంటాడు. నేనూ ఆ త‌ర‌హా సినిమాలు చేశా. కానీ ఈసినిమాలో తండ్రి కోసం పోరాటం సాగిస్తాడు. ఆ పాయింట్ బాగా న‌చ్చింది.

* ఈ సినిమాలో సందేశం కూడా ఉంది అంటున్నారు.. మీరూ సందేశాల బాట ప‌ట్టారా?
- సినిమా ద్వారా ఏదో ఓ మంచి మాట చెప్ప‌డం మంచిదే క‌దా?  ఇది వ‌ర‌కూ ఈ త‌ర‌హా సినిమాలు చేసే వ‌య‌సు, అనుభ‌వం నాకు లేదేమో అనిపించేది. ఇప్పుడు కాస్త మెచ్యూరిటీ వ‌చ్చింద‌నే అనుకొంటున్నా. పైగా సందేశం అంటే... క్లాస్ పీకిన‌ట్టు ఉండ‌దు. క‌థ‌లో భాగంగా వ‌స్తుంది. సినిమా అంతా ఎంట‌ర్‌టైన్‌మెంట్ నేప‌థ్యంలో సాగుతుంద‌ని ట్రైల‌ర్లు చూస్తే అర్థం అవుతోంది. కానీ.. ఇందులో మెసేజ్ ఉంద‌న్న విష‌యం మేం చెప్ప‌డం లేదు. మీరు చూసి తెలుసుకోవాల్సిందే.

*  సినిమా చూస్తున్న‌ప్పుడు మీ నాన్న‌గారు గుర్తొచ్చారా?
- బాగా. అయితే నాన్న‌పై నాకున్న ప్రేమ‌ని హైప‌ర్ సిన‌మాలోలా ఎప్పుడూ బ‌య‌ట‌పెట్ట‌లేదు. ప్ర‌తీ కొడుకికీ తండ్రంటే ప్రేమ ఉంటుంది. దాన్ని బ‌య‌ట‌పెట్టే సంద‌ర్భాలు చాలా అరుదుగా వ‌స్తుంటాయ‌ని నా న‌మ్మ‌కం.

* మీ సినిమాలు చూసి ఏమంటుంటారు?
- ఆయ‌న‌కు నా ఫ్లాప్ సినిమా కూడా న‌చ్చుతుంది.. కొడుకుని క‌దా..? (న‌వ్వుతూ)

* ర‌భ‌స ఫ్లాప్ అయ్యింది, అయినా సంతోష్ శ్రీ‌నివాస్‌తో మ‌ళ్లీ సినిమా చేయ‌డం రిస్క్ అనుకోలేదా, అదీ.. నేను శైల‌జ త‌ర‌వాత‌...?
-  ఏ ద‌ర్శ‌కుడినైనా, ఏ న‌టుడినైనా వాళ్ల‌లో ఉన్న ప్ర‌తిభ‌ను హిట్స్‌, ఫ్లాప్స్‌తో లెక్క పెట్ట‌కూడ‌దు. సంతోష్ శ్రీ‌నివాస్ లోని టాలెంట్ నాకు కందిరీగ స‌మ‌యంలోనే తెలుసు. క‌చ్చితంగా పెద్ద ద‌ర్శ‌కుడు అవుతాడ‌ని అప్పుడే అనిపించింది. ర‌భ‌స విష‌యానికొస్తే క‌థ విష‌యంలో త‌ప్పు చేశాడేమో గానీ, టేకింగ్‌ప‌రంగా బాగానే ఉంటుంది. మంచి క‌థ ఇస్తే... త‌ప్ప‌కుండా మంచి సినిమా తీసిపెట్ట‌గ‌ల‌డు. అలాంటి శ్రీ‌నివాస్ మంచి క‌థ‌తో వ‌చ్చాడు. నో చెప్ప‌డానికి నా ద‌గ్గ‌ర కార‌ణం లేకుండా పోయింది.

*  మీతోనూ హిట్స్‌, ఫ్లాప్స్ బాగా దోబూచులాడుకొన్నాయి క‌దా?
- అదీ ఒకందుకు మంచిదే. వ‌రుస‌గా హిట్స్‌వ‌స్తే నా త‌ప్పులు తెలిసేవి కాదు. ఫ్లాపులొస్తే.. ఏం చేయాలో అర్థ‌మ‌య్యేది కాదు. జ‌యాప‌జ‌యాల‌కు ఎలా స్పందించాలో ఈ నా ప్ర‌యాణ‌మే నేర్పింది. అది నాలో మాన‌సిక స్థిర‌త్వాన్ని తీసుకొచ్చింది.

* మీ సినిమా విడుద‌ల అవుతోందంటే.. ఆ రోజు ఎలా ఉంటుంది?
- ప‌రీక్ష‌లు రాసి రిజ‌ల్ట్ కోసం ఎదురుచూసే పిల్లాడినే అనుకోండి..  (న‌వ్వుతూ) ఫ‌స్ట్ షో ప‌డి టాక్ వ‌చ్చేంత వ‌ర‌కూ ఆ టెన్ష‌న్ ఉంటుంది.

* క‌మ‌ర్షియ‌ల్ బాట‌లోనే న‌డుస్తారా, ప్ర‌యోగాలు చేసే ఉద్దేశం ఉందా?
- జ‌గ‌డం, ఎందుకంటే ప్రేమంట సినిమాలు నా దృష్టిలో ప్ర‌యోగాలే. ప్ర‌యోగం చేసిన‌ప్పుడ‌ల్లా ఫ్లాప్స్ వ‌చ్చాయి. అవి నిజంగానే మంచి క‌థ‌లు. ఎందుకంటే జ‌నానికి రీచ్ కాలేదు. నేను చేసిన ప్ర‌తీ సినిమా ప్రేమించే చేశా. జ‌గ‌డం ఫ్లాప్ అవుతుంద‌ని ముందే తెలిసినా ఆ క‌థ‌ని వదిలేవాడ్ని కాదు. అంత బాగా న‌చ్చిన కాన్సెప్ట్ అది. ఎందుకంటే ప్రేమంట సినిమాకి టీవీలో రేటింగులు ఇప్ప‌టికీ బాగుంటాయి. ఆ సినిమా బాగా ఆడితే.. ఇంకా చేసేవాడ్నేమో?

* వ‌రుస సినిమాల‌తో బిజీ అవుతున్నారు.. మ‌రి పెళ్లి క‌బురు ఎప్పుడు వినిపిస్తారు?
- పెళ్లి గురించి ఇంకా ఆలోచించ‌డం లేదు. నా వ‌య‌సు ప్రేమ‌క‌థ‌లు చేసే ద‌గ్గ‌రే ఆగిపోయింది. అలాగ‌ని ప్రేమ‌లోనూ ప‌డ‌లేదు.

* అనిల్ రావిపూడి సినిమా ఎప్పుడు?
- అదింకా చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉంది.

-కాత్యాయని
మరిన్ని సినిమా కబుర్లు
cine churaka