'బాహుబలి ది కన్‌క్లూజన్' కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. 'ఈగ' సినిమాతో బాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన రాజమౌళి, 'బాహుబలి-1'తో బాలీవుడ్ సినీ పరిశ్రమను కూడా ఆశ్చర్యపరిచాడు. బాలీవుడ్ మేటి చిత్రాలతో 'బాహుబలి-1' పోటీ పడిందనేది వాస్తవం. అందుకే 'బాహుబలి-2' కోసం బాలీవుడ్ ఇప్పుడు ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఆ ఘనత రాజమౌళికే దక్కుతుంది. ఇదిలా ఉంటే, దాదాపుగా చిత్ర నిర్మాణం పూర్తయినట్లుగా తెలియవస్తోంది. అయితే, పోస్ట్ ప్రొడక్షన్ పనులే ఇక్కడ అత్యంత కీలకం. గ్రాఫిక్స్ వర్క్ కోసం రాజమౌళి ఇకపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెడతాడట. తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా 'బాహుబలి ది బిగినింగ్' రికార్డుల మోత మ్రోగించింది. కేవలం టాలీవుడ్‌లోనే కాదు, బాలీవుడ్‌లో కూడా ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. తొలి పార్ట్‌కే అంచనాలను మించి వసూళ్లు అందుకున్న ఈ సినిమా రెండో పార్ట్‌పై మరిన్ని అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను అందుకోవడానికి తగ్గట్లుగా రెండో పార్ట్‌ని తెరకెక్కించడంలో చిత్ర యూనిట్ భారీ ప్రణాళికలే సిద్దం చేసి, అమలు చేస్తోంది. ఎవరి నోట విన్నా బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనేది ప్రశ్న. చిన్న పిల్లాడి దగ్గర నుండి, పండు ముసలి వరకూ ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎదురు చూస్తోందంటే 'బాహుబలి' సినిమాతో రాజమౌళి జనాన్ని ఎంత ప్రభావితం చేశాడో అర్ధం చేసుకోవచ్చు. ఇన్ని భారీ అంచనాల నడుమ రాబోతున్న 'బాహుబలి ది కన్‌క్లూజన్'లో ఏముందో తెలుసుకోవాలంటే మరి కొంత కాలం వెయిట్ చేయక తప్పదు.
|