చిత్రం: ఖైదీ నెంబర్ 150
తారాగణం: చిరంజీవి (ద్విపాత్రాభినయం), కాజల్ అగర్వాల్, తరుణ్ అరోరా, రాయ్ లక్ష్మి, బ్రహ్మానందం, అలీ, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి తదితరులు.
నిర్మాణం: కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ
నిర్మాత: రామ్‌చరణ్
సమర్పణ: కొణిదెల సురేఖ
దర్శకత్వం: వి.వి. వినాయక్
సంగీతం: దేవిశ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ: రత్నవేలు
విడుదల తేదీ: 11 జనవరి 2017
క్లుప్తంగా చెప్పాలంటే
కోల్‌కతా సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న కత్తి శీను (చిరంజీవి), హైదరాబాద్‌కి వస్తాడు. బ్యాంకాక్ వెళ్ళిపోదామనుకున్న సమయంలో కత్తి శీను, లక్ష్మి (కాజల్ అగర్వాల్)ని చూసి ప్రేమలో పడతాడు. ఇంకో వైపున ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరుగుతుంది. ఆ సమయంలో రక్తమోడుతున్న ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతాడు కత్తి శీను. కారణం ఆ వ్యక్తి అచ్చం తనలానే ఉంటాడు. ఆ వ్యక్తి పేరు శంకర్. అతని గురించి తెలుసుకుని, అతని స్థానంలోకి వెళ్ళి డబ్బు సంపాదించి, బ్యాంకాక్‌కి చెక్కెయాలనుకున్న కత్తి శీను ఆలోచనలు, అనూహ్య పరిస్థితుల నడుమ మారిపోతాయి. అవేంటి? ఇంతకీ శంకర్ ఎవరు? కత్తి శీను, శంకర్ పాత్రలోకి వెళ్ళి ఏం చేస్తాడు? అన్నవి తెరపై చూస్తూనే బాగుంటుంది.
మొత్తంగా చెప్పాలంటే
మెగాస్టార్ చిరంజీవి. తెలుగు సినీ ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరిది. సుమారు 9 ఏళ్ళ తర్వాత తెరపై హీరోగా చిరంజీవి రీ-ఎంట్రీ ఇస్తున్నారనగానే, అతన్నుంచి అభిమానులు చాలా చాలా ఆశిస్తారు. మెగాస్టార్ అంటే డాన్సులు, మెగాస్టార్ అంటే కామెడీ. అవన్నీ మళ్ళీ చిరంజీవిలో అలాగే ఉన్నాయా? అన్న అనుమానాలకు చిరంజీవి సరైన సమాధానమే ఇచ్చారు. ఎక్కడా అభిమానుల్ని ఆయన డిజప్పాయింట్ చెయ్యలేదు. నటన గురించి కొత్తగా చెప్పేదేముంది? హీ ఈజ్ మెగాస్టార్. డాన్సులు అదరగొట్టేశారు, ఫైట్స్ దుమ్ము రేపేశారు, కామెడీతో కితకితలు పెట్టేశారు. ఓవరాల్‌గా ఇది వన్ మ్యాన్ షో. అదీ మెగాస్టార్ షో.
హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కి నటించడానికి చాలా తక్కువ ఛాన్స్ దొరికింది. గ్లామర్ షో పరంగా తాను చెయ్యాల్సిందంతా చేసింది. మెగాస్టార్ పక్కన డాన్సుల్లో హుషారుగా కనిపించింది.
విలన్ పాత్రలో తరుణ్ అరోరా కొత్తగా అనిపించాడు. అయితే విలన్ పాత్రని మరీ అంత పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దలేకపోయారు. బ్రహ్మానందం, అలీ తదితరుల కామెడీ ఓకే. చిరంజీవి డామినేట్ చేసేస్తోంటే మిగతా పాత్రలన్నీ తేలిపోవడం సహజమే కదా. తెరపై మిగతా నటీనటులంతా తమ పాత్ర పరిధి మేర బాగా చేశారు.
తమిళ సినిమా 'కత్తి'కి ఇది తెలుగు రీమేక్. మురుగదాస్ కథల్లో ఓ బర్నింగ్ ఇష్యూ ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో రైతు సమస్యల మీద మురుగదాస్ 'కత్తి' పదును చూపించాడు. వ్యవస్థని జాగృతం చేసేందుకు ప్రయత్నించాడు. దానికి కమర్షియల్ టచ్ ఇవ్వడంలో మురుగదాస్ కొంతవరకు సఫలమైతే, తెలుగు వెర్షన్‌కి వచ్చేసరికి ఇంకాస్త ఎక్కువే కమర్షియల్ అంశాల్ని అద్దాడు దర్శకుడు వినాయక్. స్క్రీన్‌ప్లే బాగుంది. అక్కడక్కడా కొంచెం అవసరమనిపిస్తుంది. డైలాగ్స్ బాగున్నాయి. రైతులకు సంబంధించిన సీన్స్‌లో డైలాగ్స్ ఇంకా బాగున్నాయి. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ చాలా బాగుంది. తెరపై పాటలు ఇంకా అందంగా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి అదనపు బలాన్నిచ్చింది. కాస్ట్యూమ్స్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ బాగా హెల్పయ్యాయి సినిమాకి. ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా కన్పించిందంటే, దానికి కారణం ఏమాత్రం రాజీ పడని నిర్మాణపు విలువలే. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీని. రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధాన ఆకర్షణ.
మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని వినాయక్.
గతంలో 'ఠాగూర్' సినిమా తీశాడు. అది అవినీతి మీద తీసిన సినిమా. ఇది రైతుల సమస్యల మీద తీసిన సినిమా. అదీ, ఇదీ రెండూ రీమేక్‌లే. చిరంజీవి అభిమానులకు ఏం కావాలో వినాయక్‌కి బాగా తెలుసు. రీమేక్‌ని సానబట్టడంలో తనదైన ముద్ర వేయగలిగాడు ఇంకోసారి వినాయక్. చిరంజీవిని అందంగా ప్రెజెంట్ చేయడం దగ్గర్నుంచి ప్రతి విషయంలోనూ వినాయక్ మార్క్ కన్పిస్తుంది. ముఖ్యంగా హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్‌లో వినాయక్ తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడు. అయితే రైతుల సమస్యల్ని ఇంకాస్త గట్టిగా చెప్పడం, సమస్యలకు సరైన పరిష్కారం చూపడం ఇలాంటి విషయాల్లో ఇంకాస్త బెటర్‌మెంట్ చేసి ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఓవరాల్‌గా చిరంజీవి అభిమానుల్ని వినాయక్ మెప్పించాడు. చిరంజీవి అయితే తన అభిమానుల్ని అలరించడానికి తగిన సినిమానే ఎంచుకున్నారనిపిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే పైసా వసూల్ అని చెప్పక తప్పదు. మెగాస్టార్ ఈజ్ బ్యాక్ అంతే.
ఒక్క మాటలో చెప్పాలంటే
అభిమానులకి మెగా ట్రీట్ - బాస్ ఈజ్ బ్యాక్
అంకెల్లో చెప్పాలంటే: 3.25/5
|