Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్ర సమీక్ష

goutamiputra shatakarni movie review

 

 

 

 

 

 

 

 

 

 

 

చిత్రం: 'గౌతమీ పుత్ర శాతకర్ణి' 
తారాగణం: నందమూరి బాలకృష్ణ, శ్రియశరన్‌, హేమామాలిని, కబీర్‌ బేడీ, శివరాజ్‌ కుమార్‌ తదితరులు 
నిర్మాణం: ఫస్ట్‌ప్రేమ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ 
నిర్మాత: వై.రాజీవ్‌ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు 
సమర్పణం: బిబో శ్రీనివాస్‌ 
దర్శకత్వం: క్రిష్‌ జాగర్లమూడి 
సంగీతం: చిరంతన్‌ భట్‌ 
సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్‌ 
విడుదల తేదీ: 12 జనవరి 2017 

క్లుప్తంగా చెప్పాలంటే 

రాజ్య విస్తరణ కాంక్షతో చిన్న చిన్నరాజ్యాలపై దండెత్తి, తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటుంటాడు శాతకర్ణి (బాలకృష్ణ). ఆయన భార్య వశిష్టి దేవి (శ్రియ) కూడా, తన భర్త రాజ్య విస్తరణ కాంక్షపై అసహనం వ్యక్తం చేస్తుంటుంది. భార్యని కాదని తాను ఎంచుకున్న దారిలోనే శాతకర్ణి ముందుకు దూసుకుపోతుంటాడు. ఈ క్రమంలో అరివీర భయంకరులైన శతృదేశాల సైన్యాల్ని తన సైన్యంతో తుత్తునియలు చేస్తాడు. ఎంతటి గొప్ప సైన్యం ఉన్న రాజ్యమైనా సరే, శాతకర్ణి ముందు తలొంచాల్సిందే. అయితే ఇదంతా ఓ మహోన్నతమైన ఆశయంతో కూడిన యుద్ధం. ఆ ఆశయానికి కారణం శాతకర్ణి తల్లి గౌతమి బాలాశ్రీ. ఇంతకీ గౌతమి బాలాశ్రీ, శాతకర్ణిలో రాజ్య విస్తరణ కాంక్షను ఎలా రాజేసింది? శాతకర్ణి చేపట్టిన ఆ మహోన్నతమైన ఆశ్యమేంటి? అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే. 

మొత్తంగా చెప్పాలంటే 

గౌతమి పుత్ర శాతకర్ణిగా బాలకృష్ణ రాజసం గురించి ముందు చెప్పుకోవాలి. ఓ చక్రవర్తికి ఉండాల్సిన రాజసాన్ని ప్రదర్శించడంలో బాలయ్యకు సాటి ఇంకెవరూ రారు. ఆ ఆహార్యమే ఈ సినిమాకి అతి పెద్ద హైలైట్‌. మీసం మెలేసినా, తొడకొట్టినా అవన్నీ బాలకృష్ణకే చెల్లాయి. ఎక్కడా ఓవర్‌ ది బోర్డ్‌ వెళ్ళకుండా రాజసం అంటే ఇదీ అనే స్థాయిలో బాలకృష్ణ నటన ఆద్యంతం అలరిస్తుంది. భావోద్వేగాలు పండించాల్సినప్పుడూ, యుద్ధ సన్నివేశాల్లోనూ బాలకృష్ణ అద్భుతహ అనిపించారు. ఇలాంటి సినిమాల్లో సహజంగానే వన్‌ మ్యాన్‌ షో ఉంటుంది. దాన్ని అద్భుతంగా రక్తికట్టించడంలో బాలకృష్ణ తనదైన ముద్ర వేశారు. అభిమానులకు కావాల్సినవేవీ మిస్‌ కాకుండా బాలకృష్ణ తన ఆహార్యంతో సినిమాని ఇంకో హైట్స్‌కి తీసుకెళ్ళారనడం అతిశయోక్తి కాదు. 

హీరోయిన్‌ శ్రియ సహజంగానే అందగత్తె. ఈ సినిమాలో ఇంకా అందంగా కనిపించింది. అందమే కాదు, నటనలోనూ రాణించింది. యుద్ధాల విషయంలో భర్తతో విభేదించడం, తమ బిడ్డల బాగు కోసం తల్లి పడే ఆవేదన ఇవన్నీ ఆమె హావభావాల్లో అద్భుతంగా పండాయి. బాలీవుడ్‌ నటి హేమమాలిని, గౌతమి బాలాశ్రీ పాత్రలో ఒదిగిపోయారనలేంగానీ ఉన్నంతలో ఆమె తన పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నించారు. తెలుగు ఆమెకు రాకపోవడంతో లిప్‌ సింక్‌ కొంచెం ఇబ్బంది పెట్టింది. అయితే ఆమెకు ఉన్న ఫాలోయింగ్‌ కారణంగా ఈ సినిమాకి ఆమె మరో ఎస్సెట్‌ అయ్యారు. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగా చేశారు. 

దర్శకుడు ఈ సినిమా కోసం ఎంచుకున్న కథ అత్యంత క్లిష్టతరమైనది. ఎందుకంటే ఇది చారిత్రక గాధ. తాను ఊహించింది తీసెయ్యాలనుకుంటే  కుదరదు. పైగా చరిత్ర ఏంటో ఎవరికీ తెలియదు. ఉన్న సమాచారానికి తోడు ఇంకొంత సమాచారాన్ని సేకరించి, ఎక్కడా వివాదాస్పదం కాకుండా ఇంకొకరు వేలెత్తి చూపకుండా 'శాతకర్ణి' జీవిత చరిత్రను ఆవిష్కరించే ప్రయత్నం చేసిన క్రిష్‌ని అభినందించి తీరాలి. సినిమా చకచకా నడిచిపోతుందంటే అది క్రిష్‌ స్క్రీన్‌ప్లే మహత్యంగా చెప్పక తప్పదు. మాటలు చాలా బాగున్నాయి. బాలకృష్ణ అభిమానుల్ని అలరించేలా ఉండటంతోపాటు, చారిత్రక గాధని, అలాగే అందులోని కంటెంట్‌ని ఎలివేట్‌ చేసేలా డైలాగుల్ని రాశారు. ఈ తరహా సినిమాలకు సంగీతమే ప్రాణం. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఆ విషయంలో మెచ్చుకోదగ్గ రీతిలో ఔట్‌పుట్‌ ఇచ్చాడు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా బాగుంది. పాటలు తెరకెక్కిన విధానం ఆకట్టుకుంటుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ తరహా సినిమాలకు చాలా కీలకం. ఈ విభాగాల పని తీరు అభినందనీయం. నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడలేదు. ఉన్న బడ్జెట్‌లో అత్యద్భుతంగా సినిమా తెరకెక్కించడం గొప్ప విశేషం.

చారిత్రక గాధల్ని తెరకెక్కించే క్రమంలో రీసెర్చ్‌ చాలా ముఖ్యం. వివరాలు ఏవీ అందుబాటులో లేకపోయినా ఉన్న సమాచారాన్ని విశ్లేషించి, ఇంకా సరికొంత సమాచారాన్ని ఎలాగోలా సేకరించి ఓ రకంగా రీసెర్చ్‌ చేసి ఈ సినిమా తెరకెక్కించినందుకు దర్శకుడు క్రిష్‌ని అభినందించకుండా ఉండలేం. వంద కోట్ల పైన బడ్జెట్‌ అయ్యే సినిమాని, ఏళ్ళ తరబడి తీయాల్సిన సినిమాని కేవలం 79 రోజుల్లో, అనుకున్న బడ్జెట్‌లో తీసి, అనుకున్న తేదీకి సినిమాని విడుదల చేయడం ఆషామాషీ విషయం కాదు. ఇక్కడే సినిమాకి నూటికి నూరు మార్కులూ ఇచ్చేయాలి. దానికి తోడుగా సినిమాలో నటీనటుల పెర్ఫామెన్స్‌ సినిమాకి జీవం పోసింది. బాలకృష్ణ స్టార్‌డమ్‌ ఇలాంటి సినిమాలకు అదనపు బోనస్‌. ఆద్యంతం సినిమాని గ్రిప్పింగ్‌గా తెరకెక్కించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. 'బాహుబలి' స్థాయి గ్రాఫిక్స్‌ ఆశించడం ఈ తరహా ప్రయోగానికి సబబు కాదు. ఉన్నంతలో మంచి ఔట్‌ పుట్‌ ఇచ్చారు. సినిమాపై క్రియేట్‌ అయిన హైప్‌, దానికి తోడుగా దర్శకుడి దర్శకత్వ ప్రతిభ, బాలకృష్ణ ఇమేజ్‌ ఇవన్నీ ఈ సినిమాకి అద్భుతంగా కలిసొచ్చాయి. ప్రతి తెలుగువాడూ ఖచ్చితంగా తన చరిత్ర గురించి తెలుసుకోవాలి, శాతకర్ణి చూడాలి. అంతటి గొప్ప చారిత్రక చిత్రమిది. 

ఒక్క మాటలో చెప్పాలంటే 

గౌతమి పుత్ర శాతకర్ణి - తెలుగు జాతి ఆత్మగౌరవం 

అంకెల్లో చెప్పాలంటే: 3.5/5

మరిన్ని సినిమా కబుర్లు
kaidi no.150  movie review