Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Raja Music Muchchatlu

ఈ సంచికలో >> సినిమా >>

ఆదిత్య హృదయం

Aditya Hrudayam

ముఖ్యమంత్రులతో నేను...

పూరీ జగన్నాథ్ గారి మొదటి చిత్రం 'బద్రి'లో బ్రహ్మానందం గారు మల్లిఖార్జునరావు గారి దగ్గరికొచ్చి నన్ను సి.ఎమ్.రికమెండ్ చేశారని చెప్తే జాబ్ ఇచ్చేస్తారు. చివర్లో సి.ఎమ్. అంటే ముఖ్యమంత్రి కాదు చంద్రమౌళి అనే ఆయన అని తెలిశాక చితక తంతారు. అలా ఈ ఆర్టికల్ చదివాక నలుగురు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు నాకు తెలుసు తప్ప, వాళ్ళు నలుగురికీ నేను గుర్తుండే అవకాశం కూడా లేని పరిచయాలు అని అర్ధమై నన్ను తన్నకండి ప్లీజ్...

నటులు, దర్శకులు, మిత్రులు శ్రీ కాశీ విశ్వనాథ్ గారికి మాటల సందర్భంలో చెబితే నీ ఆర్టికల్ లో ఇది తప్పకుండా రాయి బావుంటుంది అని సలహా ఇచ్చారు... నేను పాటించాను అంతే...

1993 జూన్ 2వ తేదీ ఉదయం 9.30 గంటలకు సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో చందమామ విజయా కంబైన్స్ పతాకంపై యువరత్న బాలకృష్ణ హీరోగా భైరవద్వీపం చిత్రం ప్రారంభోత్సవం జరిగింది. దానికి క్లాప్ కొట్టడానికి ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఒకప్పుడు విజయా ప్రొడక్షన్స్ లో ఆస్థాన హీరోగా మరపురాని సూపర్ హిట్లు అందుకున్న ఎన్.టి.రామారావు గారు వచ్చారు. చిరంజీవి గారు కెమెరా స్విచ్చాన్. రామారావు గారు స్టూడియోలో అడుగుపెట్టిన దగ్గర్నుంచి నేను, ముని అనే ప్రొడక్షన్ బాయ్ ఇద్దరం ఆయన ఎటెల్తే అటు ఫాలో అవుతూ అలా చూస్తూనే ఉన్నాం. ముహూర్తం అయ్యాక సడెన్ గా బాలకృష్ణ గారు నన్ను దగ్గరకి పిలిచి రామారావు గారికి పరిచయం చేశారు. "ఆదిత్య అని ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాడు. అసిస్టెంట్ డైరెక్టర్. ఇదే ఫస్ట్ పిక్చర్" అన్నారు బాలయ్య. దానికి రామారావు గారు "బ్రదర్! మీ గురువుగారు శ్రీనివాసరావు కూడా ఇదే సంస్థలో కె.వి. రెడ్డి గారి 'మాయాబజార్' సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. కె. వి గారు మాకు కూడా గురువు గారే. మీరు వాళ్ళిద్దరి పేర్లూ నిలబెట్టాలి" అన్నారు.

వళ్ళు పులకరించిపోయింది ఆ మాటలకి.

నిజానికి నేను రోజూ పేపర్ చదవటం అలవాటు చేసుకున్నదే రామారావు గారు పార్టీ స్థాపించినప్పట్నుంచి. అప్పటివరకూ సినిమా వార్తలు, సినిమా పుస్తకాలే చదవడం అలవాటు. వారు రాజకీయ ప్రవేశం చేయడంతో సినిమా పేజీ నుంచి మెయిన్ ఫ్రంట్ పేజీలోకి రావడం నేను కూడా అవి ఫాలో అవ్వడం యథాపలంగా జరిగిపోయాయి. అలా మొదలైన అలవాటు ఈవాల్టికీ కంటిన్యూ అయ్యి, ఎడిక్షన్ అయిపొయింది. అందువల్ల కొంత రాజకీయాలని, సమాజాన్ని పరిశీలించే అలవాటు ఏర్పడింది.

2002 వ సంవత్సరంలో నా రెండో సినిమా శ్రీరామ్ షూటింగ్ పూర్తయి, రిలీజ్ కు ముందు నేను, మా కెమెరామెన్ శివ (ఇప్పుడు శంఖం, శౌర్యం, దరువు చిత్రాల దర్శకుడు) కలిసి హైదరాబాద్ నుంచి బెంగుళూరు నుంచి మంగుళూరు రెండు ఫ్లైట్ లు మారి వెళ్ళాం. మంగుళూరు నుంచి కొల్లూరు వెళ్లి మూకాంబిక అమ్మవారి దర్శనం చేసుకుని, మర్నాడు ఉదయం మంగుళూరు నుంచి బెంగుళూరు వచ్చి, ఎయిర్ పోర్ట్ లో హైదరాబాద్ విమానం కోసం వెయిట్ చేస్తున్నాం. అప్పుడు చాలా సింపుల్ గా వైట్ అండ్ వైట్ లో లాల్చీ, గోచి పంచెకట్టుతో, చేతిలో చిన్న లెదర్ బ్రీఫ్ కేస్ తో ఒక పెద్దాయన వచ్చి ఒక కార్నర్ లో కామ్ గా కూర్చుని వున్నారు. చుట్టూ ఎవరూ లేరు. కూడా ఎవరూ లేరు. ఆయన డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి గారని గుర్తుపట్టాను నేను. శివకి ఆయన గురించి చెప్పాను నేను. అక్కడితో ఆగలేదు. ఆయన గురించి నేనేం అనుకుంటున్నానో ఆయనకే చెప్తాను అని వారి దగ్గరికెళ్ళాను. నమస్కారం సార్! అన్నాను. చిరునవ్వుతో విష్ చేశారు.

అప్పటికి ఆయన ప్రతిపక్ష నేత. నేను 'మనసంతా నువ్వే' చిత్ర దర్శకున్నని పరిచయం చేసుకుని, "పేపర్ లో మీ ఉపన్యాసాలన్నీ చదువుతాను సార్. సాధారణంగా ఏ అప్పోజిషన్ పార్టీ లీడర్ అయినా ప్రభుత్వాన్ని, సి.ఎం. ని తిట్టడంతోనే సరిపోతుంది. కానీ మీరు మాత్రం వాళ్ళతో పాటు మీ పార్టీ విధానాలని, నచ్చని వ్యక్తులని విమర్శించే సాహసం చేస్తారు. సొంతపార్టీలోనే రెబెల్ అనిపించుకున్నారు మీరు. అదే మీలో నాకు బాగా నచ్చే విషయం. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా మీరే ముఖ్యమంత్రి. మీలాంటి డైనమిక్ లీడర్ ఆ పార్టీలో ఇప్పుడు లేరు" అన్నాను. ఆయన నా రెండు బుగ్గలు చెరో చేత్తో గట్టిగా లాగి, "బాల వాక్కు, బ్రహ్మ వాక్కు" అన్నారు. నేనొక పావుగంటసేపు ఆయనతో సినిమాల గురించి, రాజకీయం గురించి సీమలో ఫ్యాక్షన్ గురించి మాట్లాడి, కృతజ్ఞతలు చెప్పి వచ్చేశాను. ఆయన నిరాడంబరత నాకు బాగా నచ్చింది. అనుకోకుండా ఆ తర్వాతే ఆయన పాదయాత్ర చేయడం, ముఖ్యమంత్రి అవ్వడం వెంట వెంటనే జరిగిపోయాయి. నాలాంటి ఎన్నో కోట్ల మంది విషెస్ ఆయనకు అనుకూలంగా పనిచేసుంటాయేమో అనుకున్నాను. విచిత్రమేమంటే, రెండోసారి ఎన్నికలప్పుడు (2009లో) గాంధీభవన్ నుంచి అప్పటి పార్టీ కార్యదర్శి అంబటి రాంబాబు గారు నా సెల్ కి ఫోన్ చేసి "రాజశేఖర్ రెడ్డి గారు మిమ్మల్ని పార్టీలో చేరమన్నారండి" అని అన్నారు. "నేను అభిమానించే వ్యక్తులు తలో పార్టీలోనూ వున్నారండి. నేను ప్రత్యేకించి ఒక్కపార్టీ జెండా పట్టుకోవడం నాకిష్టం లేదు. అయినా నా కెరీర్ లో నేను సాధించాల్సింది చాలా ఉంది. ఈలోపు ఇలా డీవియేట్ అవ్వడం నాకిష్టం లేదు. దయచేసి ఏమీ అనుకోవద్దు" అని స్పష్టంగా చెప్పేశాను. ఎన్నికలయ్యాక రాజశేఖరరెడ్డి గారిని కలిసి పార్టీలో చేరనందుకు క్షమించమని అడుగుదాం అనుకున్నాను. వారికి బెంగుళూరు ఎయిర్ పోర్ట్ సంఘటన గుర్తుండి ఫోన్ చేయించారా, లేదా ఎన్నికల ముందు జనరల్ గా సినిమా వాళ్లకి ఫోన్ చేసినట్టు చేశారా అన్నది నాకు తెలీలేదు. అది తెలుసుకోవడానికైనా కలవాలి అనుకున్నాను. దురదృష్టవశాత్తు దివంగతులైనారు.

2006వ సంవత్సరంలో ఎమ్మెస్ రాజుగారు నిర్మాతగా... సిద్ధార్థ, ఇలియానా హీరో, హీరోయిన్లుగా నా దర్శకత్వంలో 'ఆట' సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆ షూటింగ్ నిమిత్తం వైజాగ్ వెళ్తున్నాం. నేను, డా.ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు. ఆయన ప్రముఖ నటుడు, కాంగ్రెస్ నాయకుడు. మా కుటుంబానికి చాలా ఆత్మీయులు. నేను 'మావయ్యగారూ అని, ఆయన 'అల్లుడూ అని సంబోధించుకునే చనువు మా ఇద్దరి మధ్యా. ఇద్దరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్దాం అనుకుని ఫ్లైట్ వద్దని చెప్పి షూటింగ్ ముందురోజు సాయంత్రం ట్రైన్ లో ఫస్ట్ ఏ.సి. బుక్ చేయించుకున్నాం. ఆయనతో ఉన్నతసేపు టైం తెలీదు. మేం ట్రైన్ ఎక్కిన పది నిముషాల తర్వాత గబగబా అరడజను మంది బ్లాక్ క్యాట్ కమెండోస్ గన్స్ తోటి, పోలీసులొక స్క్వాడ్, సఫారి వేసుకున్న గన్ మెన్లు అటుఇటు తిరిగేస్తున్నారు. ఆ హడావుడి చూసి ముందు కొద్దిగా కంగారు పుట్టింది. ఏదైనా బాంబు ఉందని ఫోన్ వచ్చుంటుందా మావయ్యగారూ.. అనడిగాను. మన పక్కనున్నది బాంబు కాదల్లుడూ బాబు... చంద్రబాబు.. ఈ పక్క కూపేలోనే రాజమండ్రి వెళ్తున్నారు. అన్నారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు. జడ్ ప్లస్ క్యాటగిరీ సెక్యురిటీలో ఉన్న ముఖ్యనేతలు ఇలా సామాన్య జనంలో ఎందుకు తిరగడం? అందులోనూ అలిపిరి ఘటన తర్వాత ఆయన ఏ హెలీకాప్టర్ లోనో, చార్టర్డ్ ఫ్లైట్ లోనో తిరగాలి తప్ప పబ్లిగ్గా తిరగ్గూడదు. పైగా ఇప్పుడు రాత్రంతా నాకు నిద్ర పట్టదు. ఆయనకేం అవుతుందోనని.. ఈ టెన్షన్ నాకవసరమా.. అన్నాను.

కాసేపటి తర్వాత మర్యాద పూర్వకంగా ధర్మవరపు గారు వెళ్ళి చంద్రబాబు గారిని కలిసి, మాటల్లో నా టెన్షన్ గురించి ప్రస్తావించారు. వెంటనే చంద్రబాబు గారు నన్ను పిలిపించారు. పదినిముషాలు మాతో సరదాగా అవీఇవీ మాట్లాడుతూనే మాటల్లో నాడౌట్లన్నీ తీర్చేశారాయన తెలివిగా. నాకు టెన్షన్ లేకుండా చేశారు. ఆయనపై నాకొక సదభిప్రాయం ఉంది. మంచి మాటకారి కాకపోవచ్చు, గ్లామర్ ఉన్న లీడర్ కాకపోవచ్చు. కానీ విజన్ ఉన్న మంచి గొప్ప అడ్మినిస్ట్రేటర్. ఆయనకి ఏ విషయమైనా నేర్చుకునే కుతూహలం ఉంది. చెబితే వినే ఓపికుంది. మారుతున్న ప్రపంచంతోపాటు మనమూ మారాలన్న దృక్పథం ఉంది. ఆంధ్రప్రదేశ్ ని, ప్రజలందరినీ(మూడుప్రాంతాలనీ)కలిపి ఒక రాష్ట్రంగా కాకుండా పెద్ద కంపెనీలా భావిస్తే ఆ కంపెనీకి సి.ఇ.ఓ. గా ఉండడానికి అర్హుడన వ్యక్తి శ్రీ చంద్రబాబేనని నా అభిప్రాయం.

2011లో మూవీ మొఘల్ డా. డి. రామానాయుడు గారు నిర్మాతగా నేను దర్శకత్వం వహించిన "ముగ్గురు" చిత్రం షూటింగ్ వైజాగ్ షెడ్యూల్ పూర్తయ్యాక నేను, మా పెదనాన్న గారింట్లో ఒక రోజు ఉండిపోయి తర్వాత రోజు సాయంత్రం ఫ్లైట్ ఎక్కాను. నా మిత్రుడు, ట్రావెల్ ఏజెంట్ శ్రీనివాస్ నన్ను కూర్చోబెట్టి గబగబా బోర్డింగ్ పాస్ తనే తీసుకుని, లగేజ్ తనే చెకిన్ చేసి వెళ్ళేప్పుడు నాతో చెప్పాడు.. మీకు కంఫర్టబుల్ గా ఉంటుందని ఫ్రంట్లో ఫస్ట్ సీట్ ఇప్పించానండీ అని. ఫ్లైట్ పదినిమిషాలు టేకాఫ్ కాకుండా డిలే అయింది. ఈలోగా ఫ్లైట్ వరకు నేరుగా మూడు కార్ల కాన్వాయ్. చూస్తే మన ప్రస్తుత ముఖ్యమంత్రి డా. కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయన ప్రధాన భద్రతాధికారి, పి.సి.సి. చీఫ్ బొత్స సత్యనారాయణ గారు, ఆర్థికమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఇంకొక మంత్రి గారు (పేరు గుర్తు లేదు) కలిసి ఫ్లైట్ ఎక్కి నా పక్క సీట్లలో వరుసగా కూర్చున్నారు. సి. ఎమ్. గారి ప్రధాన భద్రతాధిగారి పోలీస్ డిపార్ట్ మెంట్  కాబట్టి డ్యూటీ లో భాగంగా నా వివరాలు అడిగారు. చెప్పాను. కిరణ్ గారు విని నాతో మాటలు కలిపారు. విచిత్రంగా ఈ టూర్ లో వచ్చేటప్పుడు ఫ్లైట్ లో మీ ప్రొడ్యూసర్ రామానాయుడు గారితో వచ్చాను. వెళ్ళేప్పుడు ఆయన డైరెక్టర్ తో వెళ్తున్నాను అన్నారాయన

కెనడాలో ఉన్న మా చెల్లెలు కనకదుర్గ, మా బావగారు ప్రసాద్ గారు మీకు బాగా పరిచయం సార్ అన్నాన్నేను. ఆయన సి.ఎమ్. కాక ముందు వాళ్ళతో బాగా పరిచయం వున్నా సంగతి ఆయన సి. ఎమ్. అయ్యాక చెప్పింది. ఆయన చాలా బాగా రెస్పాండ్ అయి మాట్లాడారు. "జవహర్ లాల్  నెహ్రు పి.ఎమ్. అయిన కొత్తలో ఆయన కుమార్తె ఇందిరాగాంధికి రాసిన లెటర్ ఆయన ఆత్మకథలో చదివాను సార్. 1947 తరువాత భారతదేశంలో ఎన్ని సమస్యలు ఉత్పన్నం అయ్యాయో, అవుతున్నాయో విపులంగా రాసి, ఇన్ని సమస్యల మధ్య ప్రధానమంత్రి పదవి ఏ మాత్రం పూలపాన్పు కాదు... అనుక్షణం బాధ్యతలని ముల్లులా గుచ్చే ముళ్ళ సింహాసనం అని రాశారు. మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత అంత సింపతీ  మీ మీద వచ్చిందండీ. మీరు ముఖ్యమంత్రి అయిన సందర్భం, రాష్ట్ర పరిస్థితులు చూస్తే ఈ ఛెయిర్ని   మీరు ప్రివిలేజ్ గా ఎంజాయ్ చేయలేరు కదా అని బాధగా ఉంటుంది అప్పుడప్పుడు" అన్నాన్నేను. ఆయన చాలా ఆనందపడి, కరక్టే సిటిజన్ లా  అర్థం చేసుకున్నారండీ అన్నారు.

ఏ ముఖ్యమంత్రినీ పరిచయం అయ్యాక ఈ రోజు వరకూ మళ్ళీ కలవాలనో, ఆ పరిచయం పెంచుకోవాలనో ప్రయత్నం చేయలేదు. ఈరోజు దాకా సచివాలయం ఎలా ఉంటుందో చూడలేదు. ఏ పార్టీ ఆఫీసులకీ వెళ్ళలేదు. ఏ లైసెన్సులూ, కాంట్రాక్టులూ, టెండర్లూ కావాలనుకోలేదు. ఈ జ్ఞాపకాలు మాత్రం సరదాగా మనసులో దాచుకోవాలనుకున్నాను అంతే...

కొంతమంది వీడు బాగు పడడు అనుకుంటారు. ఇంకొంతమంది వీడు మనశ్శాంతిగా ఉన్నాడు అనుకుంటారు.

ఆ రెండో కొంతమందే నా హృదయాన్ని అర్థం చేసుకున్నారని తృప్తిపడతాను.

వచ్చేవారం "సినిమాల్లోకి కొత్తగా రావాలనుకునేవాళ్లకి ప్రత్యేకం" 





మీ
వి.ఎన్.ఆదిత్య

మరిన్ని సినిమా కబుర్లు
Indraganti Music Magic