Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

గురు చిత్రసమీక్ష

guru movie review

చిత్రం: గురు 
తారాగణం: వెంకటేష్‌, రితికా సింగ్‌, ముంతాజ్‌, నాజర్‌, తనికెళ్ళ భరణి, రఘుబాబు, అనితా చౌదరి తదితరులు 
సంగీతం: సంతోష్‌ నారాయణన్‌ 
సినిమాటోగ్రఫీ: శక్తివేల్‌ 
దర్శకత్వం: సుధ కొంగర 
నిర్మాత: ఎస్‌ శశికాంత్‌ 
నిర్మాణం: వై నాట్‌ స్టూడియోస్‌ 
విడుదల తేదీ: 31 మార్చి 2017

క్లుప్తంగా చెప్పాలంటే

ఆది (వెంకటేష్‌)కి బాక్సింగ్‌ అంటే చాలా ఇష్టం. ఇష్టానికి మించి ప్రాణం అన్న పదం వాడితే మంచిది. కానీ ఆదికి కోపమెక్కువ. ఆ కోపంతోనే, బాక్సింగ్‌ అకాడమీలో రాజకీయాల పట్ల విసుగు చెందుతాడు. కోచ్‌గా కూడా ఆది ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటాడు. విశాఖపట్నంలో అమ్మాయిల బాక్సింగ్‌ కోచ్‌గా అకాడమీ అతన్ని నియమిస్తుంది. అక్కడ అతనికి రాములు (రితికా సింగ్‌) పరిచయమవుతుంది. కూరగాయలు అమ్ముకుంటూ తల్లిదండ్రుల్ని పోషిస్తున్న రాములుకి ఓ అక్క ఉంటుంది. ఆ అక్క లక్స్‌ (ముంతాజ్‌) బాక్సర్‌గా సత్తా చాటితే పోలీస్‌ ఉద్యోగం దొరుకుతుందనే ఆలోచనలో ఉంటుంది. ఇంకో వైపున రాములులో తెగువ నచ్చి, ఆమెను బాక్సర్‌ని చేయాలనుకుంటాడు ఆది. డబ్బు కోసం కోచింగ్‌ తీసుకుంటూ, ఆదిని చులకనగా చూస్తుంటుంది రాములు. రాము మీద కోపంతో మ్యాచ్‌లు కూడా ఓడిపోతుంది. తనకు ఎదురైన ప్రతికూల పరిస్థితుల నుంచి ఆది ఎలా 'గురు'గా తాను అనుకున్నది సాధించాడన్నది తెరపై చూస్తేనే బాగుంటుంది.

మొత్తంగా చెప్పాలంటే

ముందుగా వెంకటేష్‌ బాడీ లాంగ్వేజ్‌ గురించి మాట్లాడుకోవాలి. ఆయన ఫిజిక్‌ గురించి మాట్లాడుకోవాలి. స్టైలిష్‌ లుక్‌ గురించి మాట్లాడుకోవాలి. అన్నీ ప్రత్యేకమైనవే. నటుడిగా వెంకీ గురించి ఇప్పుడు కొత్తగా మాట్లాడేదేముంది? అయినప్పటికీ కూడా 'ఆది' పాత్రలో ఒదిగిపోయాడాయన. గురువు అంటే ఇలాగే ఉండాలన్పించేలా ఆయన తనను తాను మార్చుకున్నారు. సినిమా మొత్తాన్నీ తన భుజాల మీద మోశాడాయన. స్టార్‌డమ్‌ని పక్కన పెట్టి అద్భుతమైన పాత్రలో జీవించేశాడు వెంకీ.

ఈ సినిమాకి ఇంకో హీరో రితికా సింగ్‌. అల్లరి అమ్మాయిగా, కోపంతో ఉండే అమ్మాయిగా, తెగువ చూపించే అమ్మాయిగా అన్ని రకాల షేడ్స్‌లోనూ సత్తా చాటింది. నాజర్‌, భరణి, రఘుబాబు తదితరులు తమ పాత్రల మేర బాగానే చేశారు. మిగతా పాత్రధారులంతా ఓకే అనిపిస్తారు.

హిందీ సినిమా 'సాలా ఖదూస్‌'కి ఇది తెలుగు రీమేక్‌. కథలోనే కొత్తదనం వుంది. కథనం పరంగానూ దర్శకురాలు చాలా జాగ్రత్తలు తీసుకుంది. మాటలు బాగున్నాయి. సంగీతం ఆకట్టుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి ప్లస్‌ పాయింట్‌. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ బాగా వర్క్‌ చేశాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి. ఎడిటింగ్‌ బాగుంది. 
మామూలుగా ఇలాంటి సినిమాలు 'ఆర్ట్‌' మోడ్‌లోకి వెళ్ళిపోతుంటాయి. చాలా స్లోగా సినిమా సాగుతుందనే కల్గిస్తాయి. అయితే 'గురు' దానికి అతీతం. సినిమా చకచకా సాగిపోతుంటుంది. భావోద్వేగాల్ని మనం బాగా ఫీలవుతాం. దర్శకురాలు అలా సినిమాలో ప్రేక్షకుడు లీనమయ్యేలా చేసింది. తెరపై వెంకటేష్‌ కన్పిస్తున్నంతసేపూ, రితికాసింగ్‌ కన్పిస్తున్నంతసేపూ ఆ ఎనర్జీని మనం కూడా ఫీలవుతాం. నటీనటుల నుంచి చక్కటి సహకారం లభిస్తున్నప్పుడు దర్శకత్వం చేసేవారికి అదే పెద్ద ప్లస్‌ పాయింట్‌. ఫస్టాఫ్‌ బాగుంటుంది, సెకెండాఫ్‌ కూడా బాగుంటుందనిపిస్తుంది. ఒరిజినల్‌ చూడనివారికి కొత్త అనుభూతినిస్తుంది. అలాగే ఒరిజినల్‌ చూసినవారికీ వెంకీ అప్పీయరెన్స్‌ మంచి ఫీల్‌ని ఇస్తుంది. ఓవరాల్‌గా ప్రేక్షకుల్ని మెప్పించే సినిమా ఇది.

ఒక్క మాటలో చెప్పాలంటే

డిఫరెంట్‌ గురూ!

అంకెల్లో చెప్పాలంటే: 3.5/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka