Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఉత్తరాఖండ్ ( తీర్థయాత్రలు ) - కర్రా నాగలక్ష్మి

uttarakhand

ఆల్మోడా

నైనితాల్ లో బోరుకొట్టి నైని సరస్సు ఒడ్డున కూర్చొని ఆలోచిస్తూ వుంటే నైనితాల్ పేకేజ్ టూర్లో వెళ్లొచ్చిన ఓ తెలిసిన వాళ్లు నైనితాల్ దగ్గర ఓ జ్యోతిర్లింగ వుందని వారు చూసొచ్చేమని చెప్పడం గుర్తొచ్చి దాని గురించి వాకబు చెయ్యసాగేం , అప్పుడు ఓ ముస్లిం టూరు ఆపరేటరు మాకు ఆ వివరాలన్నీ యిచ్చి , జ్యోతిర్లింగం గురించి శంకరాచార్యుల గురించి మాకు తెలియని యెన్నో విశేషాలు తెలియజేసి తప్పకుండా వెళ్లమని కూడా చెప్పేరు . నిజంగా యెంత గొప్ప విషయమో కదా ? చాలా మంది హిందువులకు తెలియని ఆ మందిర విషయాలు ఓ ముస్లిం నోట వింటూ వుంటే చాలా ఆనందం అనిపించింది .

అతని సలహా ప్రకారం పొద్దున ఆరింటికల్లా ఆల్మోడా వైపు బయలు దేరేం .

ఢిల్లీ నుంచి సుమారు 370 కిలోమీటర్లు కాఠ్ గోదాం నుంచి సుమారు 110 కిలోమీటర్లు . కాఠ్గోదాం నుంచి అంతా ఘాట్ రోడ్డు కావడంతో ప్రయాణ వేగం బాగా తగ్గిపోతుంది . నైనితాల్ వరకు వుండే రద్దీ యీ పర్వతాలలో కనిపించదు , తరచూ కురిసే వర్షాలవలనో లేక పాలకుల నిర్లక్యమో కాని యిక్కడి రోడ్లు చాలా దయనీయ స్థితిలో వుంటాయి . కారు ప్రయాణం పడవ ప్రయాణాన్ని తలపిస్తూ వుంటుంది . ప్రకృతి రమణీయత ప్రయాణ కష్టాన్ని మరపిస్తూ వుంటుంది అనటంలో అతిశయోక్తి లేదు . ఓ పక్క గలగల ప్రవహిస్తున్న కోసి నది , మరో పక్క యెత్తైన వృక్షాలతో కూడుకొని వున్న పర్వతాలు  , అక్కడక్కడ విసిరేసినట్లుగా ఓ నాలుగయిదు యిళ్లు , కొండలపైనుంచి రోడ్డు మీదకి జారుతున్న వేడినీటి ప్రవాహాలు ఆశ్చర్యాన్ని కలుగ జేస్తాయి . భీమతాల్ నుంచి సుమారు 11 కిలోమీటర్లు ప్రయాణించేక చిన్న నగరం పేరు ' భవోలి ' రోడ్డుకి రెండువైపులా యిళ్లు దుకాణాలు వున్నాయి , చలి బాగా వుంది , దట్టమైన అడవి కావడంతో రోజూ వాన కురుస్తూ వుంటుంది అనడానికి ఆనవాలుగా యిళ్లపైనుంచి నీరు కారుతూ వుంటుంది . ఇక్కడ కాస్త టీ తాగి తిరిగి ప్రయాణం సాగించేం .

మరో 8 కిలో మీటర్ల ప్రయాణానంతరం ' ఘోడా ఖల్ ' అనే కూడలి చేరేం . ఈ గ్రామం రాణి ఖేత్ వైపు కి వెళ్లడానికి దారి మళ్లుతుంది . ఈ ప్రాంతం చాలా రద్దీ గా వుంటుంది . 1902 లో నిర్మించిన టిబి శానిటోరియమం వుండటం వల్ల చాలా రద్దీగా , వసతి సౌకర్యాలతో వుంటుంది . కుమావు ప్రాంతాన్ని రక్షించే అమ్మవారు ' గోలు దేవత ' కోవెల యీ పట్టణానికి దగ్గర వున్న కొండపైన వుంది . చాలా చిన్న మందిరం . శానిటోరియం కి వచ్చేవారి వల్ల యీ మందిరం యెప్పడూ రద్దీగానే వుంటుంది. ' ఘోడాఖల్ ' అక్కడ వున్న సైనిక్  స్కూలు వల్ల కూడా పేరుపొందింది .

మరో పది కిలోమీటర్ల  ప్రయాణం తరువాత లోయలో కోసినది ఒడ్డున వున్న ఆశ్రమం మమ్మల్ని ఆకట్టుకొంది . ఓ మారు ఆశ్రమం చూసి ప్రకృతిని కెమేరాలో బంధించ వచ్చనే ఆశతో ఆశ్రమం దగ్గర ఆగేం  . ఆల్మోడా రోడ్డుపైనే కారు ఆపుకొని లోయలోకి నడిచి వెళ్లాలి , ఓ. అరకిలోమీటరు దూరం నడిచి అక్కడకి చేరుకున్నాం . అక్కడ ఆంజనేయుడు , దుర్గ , శివుడు , వినాయకుడు మొదలయిన విగ్రహాలతో పాటు ఓ బాబాగారి విగ్రహం కూడా వున్నాయి . ఆశ్రమంలో నివాసానికి గాను గదుల నిర్మాణం జరుగుతోంది . అక్కడకి వాతావరణం చాలా ప్రశాంతంగావుంది . ఈ ప్రాంతాన్ని ' కైంచీ ధామ్ ' అంటారు .

ఈ ప్రాంతంలో పర్వతాలపై నిర్మించిన రోడ్డు కత్తెర ఆకారంలో వుండటం వల్ల యీ ప్రాంతాన్ని ' కైంచి ' అని వ్యవహరించేవారు , యిక్కడ నిర్మింపబడ్డ ఆశ్రమాన్ని  ' కైంచీ ధామ్ ' గా పిలువసాగేరు .

కైంచీ ధామ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం . 1962 ప్రాంతాలలో శ్రీ పూర్ణానంద మహరాజ్  రోడ్డు పక్కన వున్న రాతి మీద సేదతీరి స్థానికులకు కనిపించేరట , ' సంబోరి బాబా ' , ప్రేమిబాబా లు యజ్ఞం నిర్వహించిన ప్రదేశం గురించి వాకబు చేసి ఆ ప్రాంతాన్ని గుర్తించి చిన్న మంటపం కట్టి అక్కడ అతను కూడా యజ్ఞాలు నిర్వహించ సాగేరు . ఆంజనేయ ఉపాసకులైన బాబా తరువాత అరణ్య సంరక్షాధికారి వద్ద నుంచి యీ ప్రాంతాన్ని గుత్తకు తీసుకొని 1964 లో జూన్ 15 వ తేదీని యజ్ఞ మంటపాన్ని ఆంజనేయస్వామి మందిరంగా మార్చారు . అక్కడ ప్రతిష్టించిన వేరు వేరు విగ్రహాలు వేరువేరు సంవత్సరాలలో ప్రతిష్టంచినా తారీఖు మాత్రం జూన్ 15 కావడంతో బాబాగారి భక్తులు 1973 సెప్టెంబరు 10 న మరణించిన శ్రీ పూర్ణానంద మహరాజ్ గారి విగ్రహాన్ని సమాధిమందిరంలో  జూన్ 15 నే ప్రతిష్టించేరు .

ఈ ఆశ్రమనిర్మాణం గురించి యిక్కడ ప్రచారంలో వున్న కధ యేమిటంటే కొందురు భక్తులు శ్రమదానంతో ఆశ్రమనిర్మాణం చేపట్టి ' జై శ్రీరామ్ ' అని  ' జై కైంచీ బాబీకి జై ' , ' నీమ్ కరోలీ బాబా కీ జై ' అనే నినాదాలతో పని మొదలు పెట్టారట , వారివద్ద ధనం గాని ఆశ్రమ నిర్మాణానికి కావలసిన నమూనా గాని యేవీ లేవట . భక్తుల నినాదాలు కొండలలో మారు మ్రోగుతూ వుంటే చుట్టుపక్కల పల్లెలలోని శ్రామికులు వారివారి పనులను పక్కన పెట్టి వచ్చి వీరికి సహాయపడసాగేరట . భోజనం దగ్గర నుంచి నిర్మాణానికి కావలసిన సామగ్రి యేదోవిధంగా వారికి చేరేదట . అలా వారు 1974 లో సమాధి మందిరం నిర్మించేరు . ఇప్పటికీ యేదో ఒక నిర్మాణం జరుగుతూనే వుంది . ఈ ఆశ్రమంలో బస చెయ్యదలచుకున్నవారు ముందుగా ఆశ్రమం దగ్గరనుంచి అనుమతి పొందవలసి వుంటుంది . వారి  నిబంధనలకు కట్టుబడి ఆశ్రమ పద్దతులను పాఠించాలి .

శ్రీ పూర్ణానంద మహరాజ్    గారికి ఉత్తర ప్రదేశ్ లో చాలా చోట్ల ఆశ్రమాలు వున్నాయి . ఇతనిని యెక్కువగా ' నీమ్ కరొలి బాబా ' అనే పిలుస్తారు .

శ్రీ పూర్ణానంద మహరాజ్ కుమావు ప్రాంతానికి రాకముందు ఫరుక్కాబాద్ లో వుండేవారు , ఒకనాడు ట్రైనులో టికెట్టులేకుండా ప్రయాణిస్తున్న పూర్ణానంద్ బాబాని టికెట్ కలెక్టర్ పట్టుకొని చిన్నవూరిలో బలవంతంగా దింపెస్తాడు . బాబా దిగిపోయిన తరువాత బండి అక్కడనుంచి కదలలేదు . యే విధమైన యంత్ర లోపం లేకుండా నిలిచి పోయిన బండి యెన్నో విధాలుగా ప్రయత్నించినా కదలలేదు . అప్పుడు మిగతా ప్రయాణీకుల సలహా మేరకు పట్టాలు వెంటబడి నడుస్తూ పోతున్న బాబాని క్షపార్పణ అడిగి బండి యెక్కవలసినదిగా టికెట్ కలెక్టరు అడుగుతాడు . ' సరే నాలో బండిని నడిపేంత శక్తి వుందని నీకనిపిస్తే  యెక్కుతాను గాని యీ ప్రాంతంలో ఓ స్టేషను నిర్మాణం చేస్తానని మటివ్వాలి ' అని బాబాగారు అన్నారట . బాబాగారు బండి యెక్కగానే బండి కదిలిందట , బాబాకి యిచ్చిన మాట ప్రకారం అక్కడ స్టేషను నిర్మాణం చేసేరు . అక్కడ వున్న నీమ్ కరొలి  గ్రామం పేరుమీద ఆ రైల్వేస్టేషను పేరు ' నీమ్ కరొలి ' అని పెట్టేరు . అప్పటినుంచి పరిపూర్ణానంద మహరాజ్ ను ' నీమ్ కరొలి బాబా ' అని పిలువసాగేరు .

ఈ ఆశ్రమం లో నిత్య పూజలతో పాటు భజనలు సత్సంగ్ లు నిర్వహిస్తూ వుంటారు . ప్రతీ సంవత్సరం జూన్ 15 వ తేదీన ' ప్రతిష్టా దివస్ ' బాబాగారి భక్తులు జరుపుతుంటే వుంటారు .

ఓ అరగంట ఆశ్రమం లో గడిపి ఆల్మోడా  బయలుదేరేం .

ఆల్మోడా నగరం ( ఆంగ్లం లో ఆల్మోరా అని రాస్తారు , కాని స్థానికులు ఉత్తర భారతీయులు దీనిని ఆల్మోడా అనే వ్యవహరిస్తారు ) ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన జిల్లా ముఖ్యపట్టణం కూడా . ఈ పట్టణం కొండశిఖరాన నిర్మింపబడింది . ఈ నగరం మహాభారత కాలానికి ముందు కొండరాజుల పరిపాలనలో  వుండి తరువాత హస్తినాపుర రాజ్యంలో కలిసి పాండవుల పరిపాలనలో వుండేది తరువాత చంద్రవంశపురాజుల పరిపాలనలో వుండి , తరువాత నేపాలు రాజుల చేతులలో కి మారింది  , 18 వ శతాబ్దం లో ఆంగ్లేయుల పరిపాలనలోకి వచ్చింది . గుర్రపుజీను ఆకారంలో వుండే కొండమీద నిర్మింపబడిన నగరం . వేసవిలో కూడా చాలా చల్లగా వుండడంతో ఆంగ్లేయులు యీ ప్రాంతాన్ని వేసవి విడిదిగా వుపయోగించేవారు . స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నేపాలు బోర్డరు ఆపక్కనే  చైనా బోర్డరు వుండడం తో భారత ఆర్మీ స్థావరాలు నిర్మింప వలస వచ్చింది . దాంతో అల్మోడా నగరం పక్కనున్న కొండలమీదికి కూడా విస్తరించింది .

ఆల్మోడా చాలా మంచి వేసవి విడిది అని చెప్పాలి , సుమారు 1645 మీటర్ల యెత్తున వున్న పట్టణం . కాని యీ ప్రాంతం మైదానాలకు చాలా దూరంగా వుండడం తో సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో చాలా మటుకు మరుగున వుండిపోయింది . ఇప్పుడిప్పుడే రోడ్లు బాగుపడడంతో రవాణా సౌకర్యాలు పెరిగి యాత్రీకులను ఆకట్టుకుంటోంది .

టిబెట్టు చైనా వారి ఆధీనమయున తరువాత కైలాస్ మానససరోవర యాత్ర తిరిగి ప్రారంభమైన తరువాత ఆల్మోడా కి యాత్రీకుల తాకిడి కాస్త యెక్కువయిందనే చెప్పాలి . భారత ప్రభుత్వం ద్వారా నడుపబడే కైలాస మానససరోవర యాత్ర ఆల్మోడా మీదుగా సాగుతుంది . అడపాదడపా యాత్రీకుల రాక వల్ల భోజనాలయాలు , వసతులు నిర్మింపబడ్డాయి . చుట్టుపక్కల వున్న పర్యాటక ప్రదేశాలు జనులకు పరిచయం చెయ్యబడ్డాయి .

ఆల్మోడా కూడా భాగేశ్వర్ , జాగేశ్వర మందిరాలకు వెళ్లే కూడలని చెప్పొచ్చు . బస చెయ్యదలచు కుంటే నగరంలోకి ప్రవేశించవచ్చు . ఢిల్లీ లో పొద్దున బయలుదేరితే రామనగరు రుద్రాపూర్ , పంత్ నగర్ ,  హలద్వాని ల దగ్గర వుండే రోడ్డు రద్దీలను దాటుకొని ఆల్మోడా చేరేసరికి చీకటి పడడం తో ఆ రోజు అక్కడే బస చేసేం . చలి బాగా కుదపుతోంది , నీళ్లు కూడా వేడిగా తప్పతాగలేని పరిస్థితి , రాత్రి యేదో వేడిగా తిని విశ్రమించేం . ప్రొద్దుట టీ పడందే లేవలేని పరిస్థితి , యెనిమిది లోపున చాయ్ దొరకలేదు , ఓ మారు గంటి సుజలక్క బావగార్లతో వచ్చినప్పుడు అక్క రూములోనే టీ యేర్పాట్లు చెయ్యడంతో మళ్లీ సారి యాత్రలకు చిన్న వాటర్ హీటరు ( చూపుడు వేలంతది ) మా ప్రయాణ వంటింట్లో చోటు సంపాదించింది .

మళ్లావారం జాగేశ్వర మహదేవ్ మందిరం గురించి వివరాలు తెలుసుకుందాం అంతవరకు శలవు .

మరిన్ని శీర్షికలు
chamatkaaram