Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
uttarakhand

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

చిన్నప్పుడు బలవంతంగా నేర్చుకున్న లెక్కల సబ్జెక్ట్ లో విన్నట్టు గుర్తు. లెక్కలన్నా , కుక్కలన్నా నాకు చచ్చే భయం. అలాగని మిగిలినవాటిలో ధైర్యవంతుడుననీ కాదు. కొంతకాలం వరకూ, వయసుతోపాటు నా భయమూ పెరిగేది. దాన్ని అదేదో  Directly proportional  అంటారుట, గూగులమ్మని అడిగితే తెలిసింది. కానీ  రిటైరయిపోయినప్పటినుండీ  అదికాస్తా reverse  అయింది, కారణం దేనికీ లెక్కలు కట్టాల్సిన అవసరమే లేకపోవడం. ఇంక కుక్కల భయమంటారా, అంతగా చీకటి పడ్డాక బయటకే వెళ్ళడం మానేస్తే సరి. ఇదివరకటిరోజుల్లో షిఫ్ట్ టైమింగుల ప్రకారం డ్యూటికి వెళ్ళాల్సిరావడంతో వీధిన పడేవాడిని.ఆ గొడవే వదిలింది. అర్ధమయిందా ఇప్పుడు ఈ నిష్పత్తుల గోలేమిటో? సాధారణంగా ప్రభుత్వం వారు, ఏదైనా లెక్కలు చెప్పాల్సినప్పుడు, ఇదిగో ఇలాటి నిష్పత్తుల్లో చెప్తూంటారు. ఎవడికీ అర్ధం అవవు. వాళ్ళ ముఖ్యోద్దేశంకూడా అదేకదా. మరీ అర్ధం అయితే, ప్రభుత్వాలుచేసే నిర్వాకాలు అందరికీ అర్ధం అయిపోవూ ?మళ్ళీ అదో గొడవా.

తెలుగులో ఓ సామెత వినే ఉంటారు-- " చదవేస్తే ఉన్న మతి పోయిందిట ". అలాగ చదువెక్కువవుతున్నకొద్దీ , తెలుగు మాట దేవుడెరుగు, సందుసందుకీ ఉన్న  Spoken English, Written English  సంస్థల్లో చేరి, అలనాడెప్పుడో లార్డ్ మెకాలేగారు ప్రోత్సహించిన ఇంగ్లీషు భాషనికూడా   భ్రష్టు పట్టించేస్తున్నారు , ఈ ప్రచార సాధనాలు మొబైళ్ళూ అవీ వచ్చిన తరువాత ! ఒక్క ముక్క అర్ధం అవదు. ప్రతీ పదాన్నీ " బోనసాయించేశారు". చిన్నప్పుడు జేవీరమణయ్య గారి గ్రామరు లో చదువుకున్నవన్నీ మర్చిపోయేలా చేస్తున్నారు. "  d "   అంటే  " the "  అనుకోవాలిట. మేము నేర్చుకున్నది ,  a, an the  అనేవి అవేవో  articles  అంటారనీ, వాటిని ఎలా పడితే అలా వాడకూడదనీ, నేర్చుకున్నాము. ఆరోజుల్లో టెలిగ్రాములు పంపేటప్పుడు, పదానికి ఓ రేటుండడం చేత ఎడ్రెస్ దగ్గరనుండి ప్రతీదానినీ  కురచ చేసేవారు.   మహా అయితే గ్రీటింగ్స్ కి నెంబర్లుండేవి. కానీ ఈరోజుల్లో  ప్రతీదానికీ  ఓ షార్టు కట్టు.అదేమిటో అర్ధం అయిచావదు. ఓ పదం పూర్తిగా రాస్తే వాళ్ళ సొమ్మేం పోయిందిట? ఏమిటో అంతా గందరగోళం. పదాలకి షార్టు కట్లు.  పైగా అలా రాయడం వలన , ఆ రాసేవాడికేమైనా కలిసొచ్చిందా అంటే అదీ లేదూ. పూర్తి పదం స్పెల్లింగు తెలియకపోయినా పరవాలేదు.. ఓ రెండు మూడు పొడక్షరాలు రాస్తే గొడవొదిలిపోతుంది.

ఇదివరకటి రోజుల్లో ఇంటికి ఉత్తరం రాయాలంటే  నాన్నగారికి  ( డబ్బులవసరమైనప్పుడు మాత్రమే ) ఏదో  " మహారాజశ్రీ తో  మొదలెట్టి, క్షేమసమాచారాలు విచారించి, ఏ మధ్యలోనో డబ్బుల సంగతి రాసేవారు. అమ్మకైతే " మహాలక్ష్మీసమానురాలైన " అని లక్షణంగా రాసేవారు. ఈరోజుల్లో ఆ ఉత్తరాలే లేవనుకోండి, అంతా అంతర్జాలమే పోనీ అదైనా సరీగ్గా ఉంటుందా అంటే అదీ లేదూ "  Hi pop "  పాప్ ఏమిటీ కూరల్లో పెట్టే పోపులాగ? అమ్మ ఎప్పుడో హాయ్ మాం అయిపోయింది..

ఇంక వేషధారణంటారా, ఎంత కురచగా వేస్తే అంత మంచిదీ. ఇదివరకటిరోజుల్లో, కురచ లాగులు ఏ పోలీసాడో, రెవెన్యూ ఇనస్పెక్టరో, శాఖలకి వెళ్ళే ఏ ఆర్.ఎస్. ఎస్. వాళ్ళో వేసికునేవారు. ఇప్పుడు ఎక్కడచూసినా  హాఫ్ చెడ్డీలే. అప్పటిదాకా పంచా లాల్చీ వేసికున్నవారు కూడా నిక్కర్లలోకి దిగిపోయారు.వయసుతో నిమిత్తం లేకుండా ఓ పువ్వులచొక్కా ఓటీ.ఇంట్లో ఉండే వయసుమళ్ళిన తల్లితండ్రుల్ని సరీగ్గా చూస్తారో లేదో తెలియదుకానీ, ఈ కుక్కల అవసరాలు మాత్రం తప్పకుండా చూస్తారు. తెల్లారేసరికి ఓ కుక్కని పట్టుకుని బయలుదేరడం.  Ofcourse  ఎవరి సరదా వారిదనుకోండి. కొంతమందైతే జంటగా వెళ్తూంటారు. ఇంకో చిత్రం ఏమిటంటే, ఆ బహిర్భూమికి తీసికెళ్ళబడిన ఆ కుక్క గారికి, ఏ ఫ్రెండో ( అంటే ఆడకుక్కో, మొగకుక్కో ) కనిపించేసరికి, ఆ రెండూ భొయ్యిమని పలకరించుకోవడం. ఈలోపులో ఆ కుక్కగారికి తీసికెళ్ళబడిన పని గుర్తుకొస్తుంది, ఏ పార్క్ చేయబడిన కారుకో, కాలెత్తి తనపని చేస్తుంది. ఒక్కోప్పుడు రోడ్డుమీదే కానిచ్చేస్తుంది. అదే మనుషులు అలా చేస్తే, “ స్వఛ్ఛ భారత్ “ చట్టం కింద జుర్మానా వేస్తారుట.మానవ జన్మెత్తినందుకు  శిక్షన్నమాట.

చెప్పొచ్చేదేమిటంటే, జనాభా పెరిగేకొద్దీ వస్తూన్న పరిణామాలా ఇవి?  మేమేమైనా చదువుకున్నామా  పెట్టామా?
సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
weekly horoscope october 13th to october 19th