చిత్రం: రాజా ది గ్రేట్
తారాగణం: రవితేజ, మెహరీన్, వివన్ భటీనా, రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, సంపత్ రాజ్, రాధిక, శ్రీనివాసరెడ్డి తదితరులు.
సంగీతం: సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ: మోహన్‌కృష్ణ
దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల తేదీ: 18 అక్టోబర్ 2017
క్లుప్తంగా చెప్పాలంటే
రాజా (రవితేజ) పుట్టుకతో అంధుడు. అంధుడే అయినా ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. రాజాని అతని తల్లి (రాధిక) పోలీస్‌ని చేయాలనుకుంటుంది. ఇదిలా ఉండగా పోలీస్ అధికారి (ప్రకాష్‌రాజ్) కుమార్తె లక్కీ (మెహరీన్). లక్కీ తండ్రి, దేవా (వివన్ భటేనా) తమ్ముడ్ని ఎన్‌కౌంటర్‌లో చంపేస్తాడు. ఆ కోపంతో లక్కీ చూస్తుండగా, ఆమె తండ్రిని దేవా చంపేస్తాడు. దేవా నుంచి తప్పించుకు తిరుగుతుంది లక్కీ. లక్కీని కాపాడేందుకు పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రయత్నిస్తుంటుంది. ఆమెను రక్షించేందుకు రాజా రంగంలోకి దిగాడు. అంధుడైన రాజా భయంకరమైన ఓ క్రిమినల్ గ్యాంగ్‌తో ఎలా తలపడ్డాడు? లక్కీని ఎలా రక్షించాడు? అన్నది తెరపై చూడాల్సిందే.
మొత్తంగా చెప్పాలంటే
రవితేజ అంటే ఎనర్జీకి మారుపేరు. అంధుడిగా తెరపై కనిపించాల్సి రావడంతో ఎనర్జీ తగ్గుతుందేమోనని అంతా అనుకోవడం సహజం. అంధుడి పాత్రపై ప్రేక్షకుల్లో ఉన్న నమ్మకాలు అలాంటివి. అయితే రవితేజ డబుల్ ఎనర్జీతో అంధుడి పాత్రలో ఒదిగిపోయాడు. తొలిసారిగా ఈ తరహా పాత్ర చేసిన రవితేజ, ఆ పాత్రలో మెప్పించాడు. ముందుగా ఇలాంటి పాత్రలు చేయడానికి ముందుకొచ్చినందుకు రవితేజని అభినందించి తీరాలి. మాస్ మహరాజ్ నుంచి ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాల్నీ మిస్ అవలేదు. కామెడీ చేశాడు, యాక్షన్‌లో సత్తా చాటాడు. ఒకటేమిటి ఏమేం చేయాలో అన్నీ చేసేశాడు.
మెహరీన్ అందంగా కనిపించింది. కొంచెం బొద్దుగా తయారైంది. కాస్త నాజూగ్గా తయారైతే మంచిది. నటనకు ప్రాధాన్యం ఉన్నప్పటికీ అలా అలా నెట్టుకొచ్చేసిందంతే. నటనలో ఆమె ఇంకా సత్తా చాటాల్సి ఉంది.
విలన్ పాత్రలో వివాన్ ఆకట్టుకుంటాడు. రాజేంద్రప్రసాద్, సంపత్ రాజ్, పోసాని తదితరులు సినిమాకి హెల్పయ్యారు. రవితేజతో శ్రీనివాసరెడ్డి కామెడీ టైమింగ్ బాగుంది. రాధిక పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమె బాగా చేసింది. మిగతా పాత్రధారులంతా తమ తమ పాత్ర పరిధి మేర బాగా చేశారు.
కథ కొత్తదేమీ కాదు. కొత్తదనం ఏమన్నా ఉందంటే అది హీరో అంధుడు కావడమే. కథనం తొలి సగంలో వేగంగా సాగినా, రెండో సగంలో నెమ్మదించింది. మాటలు బాగున్నాయి. పాటలు ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణపు విలువల పరంగా అస్సలేమాత్రం రాజీ పడలేదు. ఎడిటింగ్ సెకెండాఫ్‌లో అవసరం అనిపిస్తుంది.
దర్శకుడు మాస్ మహరాజ్‌తో రిస్క్ చేయలేదు. హీరో అంధుడనే కొత్త కాన్సెప్ట్ తప్ప కథ, కథనాల్లో ఎక్కడా కమర్షియల్ జోనర్‌ని వదల్లేదు. ఫస్టాఫ్ సరదాగా సాగిపోతుంది. సెకెండాఫ్‌కి వచ్చేసరికి కథలో వేగం తగ్గుతుంది. కథనం నెమ్మదిస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌కి కొదవ లేకపోయినప్పటికీ అక్కడక్కడా ఫోర్స్‌డ్‌గా అనిపిస్తాయి. హీరో హీరోయిన్ల మధ్య తగినంత కెమిస్ట్రీ లేకపోవడం, పాటల ప్లేస్‌మెంట్ కోసం లీడ్ సీన్స్ కన్విన్సింగ్‌గా లేకపోవడం మైనస్ పాయింట్‌గా చెప్పుకోవాలి. ఓవరాల్‌గా చెప్పాలంటే ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఏమాత్రం ఢోకా లేని సినిమా.
ఒక్క మాటలో చెప్పాలంటే
రాజా జస్ట్ ఎంటర్‌టైనర్!
అంకెల్లో చెప్పాలంటే: 3/5
|