Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
siirasri question

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఉత్తరాఖండ్ తీర్థయాత్రలు - కర్రా నాగలక్ష్మి

uttarakhand

( కాసర దేవి , గోలు దేవి మందిరం)

ఆల్మోడా జిల్లా ముఖ్యకేంద్రం అవడం వల్ల విద్యాసంస్థలు , ఆర్మీ ఆఫీసులు ,  జిల్లా కార్యాలయాలతో చాలా రద్దీగా వుంటుంది . పెరుగుతున్న జనాభా కి తగ్గట్టు రోడ్లు  విశాలంగా చెయ్యడానికి కొండలలో వీలుపడదు కాబట్టి రింగురోడ్డు నిర్మాణం చేసి వాహనాల రద్దీని నియంత్రించడం సుమారుగా అన్ని హిల్ స్టేషన్ల లో కనిపిస్తుంది . ఇక్కడా అంతే . మొత్తం బజారంతా ముందు రోడ్డుమీదే నిర్మింపబడింది , అక్కడే హోటల్స్ కూడా వున్నాయి . వెనుక వరుసలలో స్థానికుల నివాసాలువున్నాయి ,  అంటే పక్క వీధికి వెళ్లాలంటే మనం కొండ యెక్కాలన్నమాట .

ఊరిలో అమ్మవారి కోవెల , శివకోవెల వున్నాయి , యెక్కువ యిక్కడి ప్రజలు శివభక్తులుగా కనిపించేరు . 

కాసరదేవి మందిరం ----

ఆల్మోడా నుంచి పదికిలోమీటర్లు కారు మీద వెళితే అక్కడ కాసరదేవి మందిరం వుంది . ఈ మందిరం క్రీశ్తుపూర్వం 2 శతాబ్దానికి చెందిన మందిరం . కుమావును పరిపాలించిన ' కతూరియా ' రాజుల కులదేవి కాసరదేవి . ఈ మందిరం పర్వత శిఖరాన వుంటుంది . స్థానికులు కాలినడకను యీమందిరానికి వెళతారు మొత్తం తొమ్మిది కిలోమీటర్ల నడక , వివేకానంద స్వామి యిక్కడ కొన్ని రోజులు ద్యానం చేసుకున్నట్లుగా చెప్తారు . చాలా మంది టిబెట్ కి చెందిన బౌద్దులు యిక్కడ తపస్సుచేసుకున్నట్లు వారి గ్రంథాలలో రాసుకున్నారు . మనఃశాంతికోసం మన దేశానికి వచ్చిన అనేకమంది యురోపియన్లు యీ మందిరంలో ద్యానం చేసుకొని మనశ్శాంతి పొందినట్లు వారి వారి ఆత్మకథలలో రాసుకున్నారు . ఈ మందిరంలో అతీతశక్తులున్నాయని ద్యానం చేసుకున్నవారు అలౌకిక ఆనందాన్ని పొందుతారని యిక్కడివారి నమ్మకం . అందుకే చాలా మంది బాబాలు , సన్యాసులు యీ మందిరంలో సాధనచేసి అనేక శక్తులు పొందినట్లు చెప్తారు .

కొద్దికాలం కిందట నాసావారు అతి శక్తి వంతమైన భూమ్యయస్కాంత నిక్షిప్తాలు మూడింటిని కనుగొన్నారు , ఒకటి యీ మందిర ప్రాంతం లోను , మిగతావి మాచుపీచు ( పెరు) , స్టోన్ హెంజ్ ( ఇంగ్లాండ్ ) లోను వున్నట్లు కనుగొన్నారు . దానిపై పరిశోధనలు చేపట్టేరు . 

భూమ్యయస్కాంత నిక్షిప్తాల వలన యిక్కడ ధ్యానం చేసుకునే వారికి అలౌకిక శక్తులు వశమౌతాయో యేమో . పరిశోధకులు తేల్చాలి .

ఉత్తరాఖండ్ ప్రజలలో మరో అలవాటు గమనించేను , వారు స్నానాలకు ప్రవాహముల నీటినే వుపయోగిస్తారు . అంటే రోజూ కొండలోయలలోకి దిగి వాగులలో స్నానాలు చేసి వస్తున్నారు . ప్రతీ సంవత్సరం '  భగవత్ కథ ' పఠనం చేస్తారు ఆ రోజులలో కఠిన నియమాలు పాఠిస్తారు . వేడినీటి స్నానం చంటిపిల్లలు వృధ్దులకు మాత్రమే , మిగతావారు చన్నీటి స్నానమే చేస్తారు .

ఆల్మోడా లో ఓ రోజు గడిపి అక్కడి అమ్మవారి కోవెల , శివ కోవెల , కాసర దేవి మందిరాలు చూసుకొని  'జాగేశ్వర్ ' బయలుదేరేం .

' జాగేశ్వర్ ' లో పన్నెండు జ్యోతిర్లింగాలలో వొకటైన ' నాగేశం ' మందిరం వుంది . అదేంటీ మేం మహారాష్ట్ర లో ' ఔంఢ్ ' లో చూసేం , కాదు కాదు మేం గుజరాత్ లో ద్వారక దగ్గర చూసేం అని అనుకుంటున్నారా ? , మేం ఆరెండూ చూసేం , ఇది మూడవది , యెదినిజందో యెదికాదో చెప్పడానికి ఆది శంకరాచార్యులే దిగిరావాలి . అందుకని మేం మూడూచూసేసేం . అలాగే వైధ్యనాధ్ గురించి కూడా యిలాగే మీమాంస  , పర్లి లో వున్న ' వైద్యనాధం ' , బిహారు లోని ' వైధ్యనాధ్ ధామ్ ' యేది అసలయినది అని . మేం మధ్యస్థంగా రెండూ చూసేసేం 

హలద్వాని నుంచి అల్మోడా వరకు వున్న అడవులు వేరు , ఆల్మోడా నుంచి జాగేశ్వర్ వరకు వున్న అడవులు యింకా దట్టంగా , సూర్యకిరణాలు చొరబడలేనంత దట్టంగా వున్నాయి . సన్నని రోడ్లు రెండిళ్లు వుంటే వూరే , అలా ఓ పదికిలోమీటర్లు ప్రయాణించేక  వరుస గా ఓ పదిపదిహేను దుకాణాలు అదీ రకరకాల సైజులలో గంటలు ( మందిరాలలో వుండేవి ) అమ్ముతున్నారు . విషయం బోధపడేలోపున గుట్టమీద చిన్న మందిరం కనిపించింది .

రోడ్డు పక్కన కారు ఆపుకొని మందిరం వైపు నడిచేం . మందిరం వరకు గంటలు అమ్మే దుకాణాలు తప్ప యింకేవీ లేవు . పెద్ద ఆర్చి లోపల మెట్లు , మెట్లకి రెండువైపులా గంటల హారాలు వ్రేలాడ కట్టి వున్నాయి . లోపల చిన్న కోవెల , చిన్న విగ్రహం , చుట్టూరా పలకలు పరచిన మంటపం మంటపం నిండా వేలకొద్దీ గంటలు , యెక్కడ చూసినా గంటలే . దేవుడి దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేస్తూ వుంటే చుట్టూరా గంటలే కాకుండా కాయితాల దండలు యెక్కడపడితే అక్కడ కాయితాలు వ్రేలాడకట్టి వున్నాయి . నలుగురయిదుగురు స్థానికులు దేవుడికి పూజలు చేసుకొని వెళ్లే వరకు వుండి అక్కడి పూజారిని స్థలపురాణం అడిగేం . 

పూజారి చెప్పిన ప్రకారం 16 వ శతాబ్దం లో యీ ప్రాంతాన్ని పరిపాలించిన ' బాజా బహదూర్ ' గారు యీప్రాంతానికి వేటకై రాగా యీ గుట్టపైన ఒక అందమైన యువతి ధ్యానం చేసుకుంటూ కనిపించిందట . రాజుగారి విశ్రాంతికి ఆ ప్రదేశాన్ని తయారు చెయ్యాలని ఆమెని ఆ ప్రదేశం వదలి పోవలసినదిగా రాజుగారి సైనికులు అడుగుతారు , దానికి ఆమె రాజుగారు తనకన్నా బలవంతుడని నిరూపించుకుంటే ఆ ప్రదేశాన్ని వదిలి పోతానని చెప్తుంది . రాజు ఆమె షరతుకి వొప్పుకుంటాడు . అప్పుడు యెదురుగా పోరాడుతున్న రెండు ఆంబోతులను విడదీయమని చెప్తుంది , రాజు వాటిని విడదీయలేకపోతాడు , ఆమె అవలీలగా వాటిని విడదీస్తుంది . ఆమె సౌందర్యానికి , పరాక్రమానికి ముగ్ధుడయిన రాజు ఆమెను వివాహమాడి పట్టపురాణిగా చేసుకుంటాడు . కొంతకాలానికి ఆమె నెలతప్పి నవమాసాలానంతరం  చక్కని పుతృనికి జన్మనిస్తుంది . రాజుగారు ఆమెను పట్టపురాణిగా చెయ్యడం నచ్చని మిగతా రాణులు ఆమె పొత్తిళ్లలో రాయనివుంచి ' కొండల దగ్గర వుండే రాణికి రాళ్లే పుడతాయని ' అందరిని నమ్మించి పసిబాలుని పంజరం లో పెట్టి అడవిలో విడచిపెడతారు . కోయలచేత రక్షింపబడిన ఆ బాలుడు ఇరవై సంవత్సరాలనంతరం రాజుగారి దగ్గరకు వచ్చి తన వద్ద  వున్న మంత్ర విద్యలతో  కర్రగుర్రం చేత సెలయేటి నీరు తాగిస్తానని చెప్పి ప్రజలను , రాజపరివారాన్ని సెలయేటి దగ్గర సమావేశ పరచి కర్రగుర్రముచేత నీరు త్రాగించే ప్రయత్నము చేస్తాడు , యెంతసేపటికి గుర్రము నీరు త్రాగకపోవటం చూసిన రాణులు యితనెవడో మోసగాడని , రాజును ప్రజలను వంచించడానికి వచ్చేడని అతనిని శిక్షింపవలసినదిగా రాజుని కోరుతారు , దానికా యువకుడు ఆడది రాయకు జన్మనిచ్చిన దేశంలో కర్రగుర్రం చేత నీళ్లు తాగించడం వో వింతా ? అని అంటాడు . అతని మాటలు విన్న రాజు రాణులను దండించగా వారు చేసిన మోసం వప్పుకుంటారు . ఆ యువకుడే తన పుతృడని  గ్రహించిన రాజు అతనికి పట్టాభిషేకం చేసి రాజ్యభారాన్ని వప్పగిస్తాడు . 

 ప్రజలనికన్నబిడ్డలకన్నా యెక్కువగా చూసుకుని , రాజ్యంలో యెవరికీ అన్యాయం జరగకుండా చూసుకునేవాడట , అతనిని ప్రజలు సాక్షాత్తు శివుని రూపంగా చెప్పుకునేవారు . అతని మరణానంతరం అతని సంతతివారు అతనికి మందిరం నిర్మించేరు . ఎదురుగా వున్న చిన్న మందిరంలో అతని సహచరుని విగ్రహం వుంది . 

కుమావు రాజుల కులదేవతగా కూడా చెప్తారు . ' గోలు' దేవత మందిరం అని స్థానికులు పిలుస్తారు . స్థానిక భాష లో ' గోలు దేవత ' అంటే న్యాయ దేవత అని అర్దం . 

ఇక యిక్కడ వున్న గంటల గురించి , యిక్కడ గోలు దేవత కి మన కోరికలు విన్నవించుకొని అవి తీరిన వెంటనే తిరిగి దర్శనానికి వచ్చి గంట కడతారట , అంటే కోరికలు తీరిన వారు యిక్కడ గంట కట్టడం ఆచారం . అక్కడ వున్న వేల సంఖ్యలో గంటలను చూస్తే ఆ కోవెలకున్న ప్రాముఖ్యత తెలుస్తుంది . 

అలాగే కోర్టులలో వున్న కేసులు , యెన్నాళ్లగానో తీర్పుకు నోచుకోని కేసులు , కోర్టుల వరకు వెళ్లని తగవులు యిక్కడ కాయితాలమీద రాసి కడతారు , అవి న్యాయం వున్న వైపుగా తీర్పులు రావడం జరుగుతూ వుంటుందట . 

చాలామంది చెప్పిన మరో విషయం సుమారు 15 , 20 సంవత్సరాల కిందట ఓ జడ్జిగారు దాయాదులకేసులో సాక్షాధారల ప్రకారం తీర్పుయిచ్చేరట , కాని జడ్జిలకు లాయర్లకు కూడా ఆ తీర్పు తప్పని కూడా తెలుసట , తీర్పు యిచ్చిన కొన్నాళ్లకు జడ్జీగారు జాగేశ్వర్ మందిరానికి వెళుతూ యిక్కడ ' గోలుదేవతని దర్శించుకున్నప్పుడు అతనికి గతంలో యిచ్చిన తీర్పు గుర్తొచ్చి , నేను న్యాయం చెయ్యలేకపోయేను , నువ్వే న్యాయం చెయ్యాలని దండం పెట్టుకొని తన వూరికి వెళ్లిపోయేడట , కొద్దిరోజులకు గెలిచిన దాయాది తిరిగి జడ్జి గారి వద్దకు వచ్చి తప్పయిందని వొప్పుకొని ఆస్తి మొత్తాన్ని జడ్జీగారి సమక్షంలో సొంతదారునికి వొప్పజెప్పేడట . తిరిగి ఆ జడ్జీగారు కోవెలకు వచ్చి పూజారికి ఆ విషయం చెప్పి ' గోలుదేవత ' లో సత్యం వుందని చెప్పేరట , మేం యీ విషయం విన్నప్పుడు అప్పట్లో ఆ జడ్జి ఢిల్లీ హై కోర్టు జడ్జిగా వుండేవారు , పేరు మరచిపోయేను . 

తర్వాత మేం చాలా సార్లు ఆ కోవెలకు వెళ్లడం జరిగింది .  ' గంటలు ' వేల లోంచి లక్షలలో మారేయి , కోవెల కి పాలరాయి మెట్లు , పాలరాయి మంటపం , కోవెలను ఆనుకొని చక్కని పూలతోట వచ్చేయి . రోజురోజుకి కోవెలకు భక్తులరద్దీ యెక్కువవుతోంది . ప్రస్తుతం గంటలు అమ్మే దుకాణాలు పదులలో వెలిసాయి .

ఆ మందిరాన్ని దర్శించుకొని జాగేశ్వర్ కి ప్రయాణమయేం . అదే రోడ్డుమీద మరో 20 కిలోమీటర్లు ప్రయాణించేక నిర్మానుష్య ప్రదేశంలో రాతి మందిరాల సముదాయం కనిపించింది . చాలా పురాతనమైనవి . ఇది ఆర్కియాలజీ సర్వే వారిచే సంరక్షింప బడుతున్నాయి . . ఈ మందిర సముదాయం ' జటాగంగ ' వొడ్డున వున్నాయి . ఇందులో శివకోవెలతో పాటు ' లక్ష్మీ నారాయణ , కుబేర , సూర్యనారాయణ మందిరాలు వున్నాయి . నిత్యపూజలు జరుగుతున్నట్లున్నాయి , కాని మనుష్యులు మాత్రం కనిపించలేదు . మూసివున్న తలుపులు తీసుకొని లోపలకి వెళ్లి మందిరం చూసుకొని తిరిగి తలుపులు మూసి వచ్చేం . ఆ మందిరాలు 9 నుంచి 11 వశతాబ్దం మధ్య నిర్మించి వుంటారని ఆర్కియాలజీ వారి అంచనా .

స్థానికుల ప్రకారం యీ మందిరాన్ని బాల జాగేశ్వర్ అని అంటారు , ముందు యీ మందిరాన్ని చూసుకొని తరువాత జాగేశ్వర్ లో నాగనాధ్ ని దర్శించుకోవాలి . జాగేశ్వర్ తరువాత 2 కిలోమీటర్ల దూరంలో వున్న వృద్ధ జాగేశ్వర్ ని దర్శించుకోవాలి .

జాగేశ్వర మందిర వివరాలు వచ్చే సంచికలో చదువుదాం అంతవరకు శలవు . 

మరిన్ని శీర్షికలు
weekly horoscope october 20th to october 26th