Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
temples home

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపాటి ఫణిబాబు

chamatkaram

పండగల సీజన్ వచ్చింది కాబట్టి, దేశంలో ,  ప్రభుత్వ ఉద్యోగస్థులకి బోనస్సులూ, ప్రెవేట్  సంస్థల ఉద్యోగస్థులకి అవేవో ఇంటెన్సివులూ, మిగిలిన వారందరికీ  పండగ మామూళ్ళూ దొరుకుతూంటాయి. ప్రభుత్వ సంస్థలలో పనిచేసేవారికి బోనస్సనది మొదట్లో ఉండేది కాదు. తరవాత్తరవాత మొదలయిందే. దేశంలో చాలా చోట్ల దసరా పండక్కి ముందే బోనస్సులూ, కొన్ని చోట్లలో దీపావళికీ ఇస్తూంటారు… ఏది ఏమైనా, పండగల సీజను వచ్చిందంటే  ఈ బోనస్సులనండి, మామూళ్ళనండి , ఇవిమాత్రం తప్పవు.

ప్రభుత్వరంగ సంస్థలు ఎంత బోనస్సివనీయండి, అందులో పనిచేసే దిగువతరగతి ఉద్యోగులు, అంటే  ఉత్తరాలు బట్వాడాచేసే పోస్ట్ మాన్లూ, టెలిఫోను లో పనిచేసే లైన్మన్లూ , ఓ పుస్తకం తీసికుని , ఓ ఇద్దరు ముగ్గురు కలిసి ప్రతీ ఇంటికీ వెళ్తూంటారు.. సాధారణంగా శలవు పూటో, ఆదివారంనాడో వస్తూంటారు. మనస్థాయిని బట్టీ, వచ్చే ఉత్తరాలనుబట్టీ . పండగ మామూళ్ళు ఇవ్వాల్సిందే. మధ్యలో ఎలెట్రీ వాళ్ళొకళ్ళండోయ్, ఎవరికి పండగ మామూళ్ళివ్వకపోయినా, సంబంధిత సర్వీసులో అంటే టెలిఫోనూ, ఉత్తరాలూ, కరెంటూ = వోటిల్లో కష్టాలు అనుభవించాల్సిందే.. ఇదివరకటిరోజుల్లో అయితే టెలిగ్రాం వాళ్ళొకళ్ళుండేవారు… ఇప్పుడా గొడవ తగ్గింది.

ఇవన్నీ ఒకెత్తైయితే, ఇళ్ళల్లో పనిచేసే పనిమనుషులూ, సొసైటీ వాచ్ మన్లూ, బట్టలిస్త్రీ చేసేవాడూ, పొద్దుటే చెత్త తీసికెళ్ళేవాడూ  VVIP Category  లోకి వస్తారు. ఇంతమంది ఎలాగూ ఉన్నారూ, మనం కూడా ఓ చెయ్యేస్తే ఏమవుతుందీ అనుకుని, పొద్దుటే పాల పాకెట్లు తెచ్చేవాడు కూడా అడుగుతాడు… పనిమనిషికి మిగిలినవారికిచ్చినట్టు ఓ యాభయ్యో, వందో ఇచ్చేస్తే అయ్యే పని కాదు. ఓ నెల జీతం ఉండాల్సిందే.. పైగా పని కుదుర్చుకునేటప్పుడే, ఈ  Terms and conditions   ఫిక్స్ చేసుకుంటారు. ఏదైనా తేడా పాడా వచ్చిందా, మనల్ని వీధిలో పెట్టేస్తారు. ఇంకెవరితోనైనా పరవాలేదు కానీ, ఈ పనిమనుషులతో వేషాలు మాత్రం కుదరదు. ఇదివరకటి రోజుల్లో , ఇంటికి ఒకత్తే పనిమనిషుండేది.. పాపం ఆ మనిషికూడా, దీపావళికి స్వీట్సూ, బాణాసంచా ఇస్తే సంతోషించేది.. ఈరోజుల్లో పనిమనిషి నిర్వచనం కూడా మారిపోయింది.. “ ఒక్కో పనికి ఒక్కో మనిషి “  లోకి మారింది. అంటే, వంటకి ఒకరూ, ఇల్లు తుడవడానికి ఒకరూ, గిన్నెలు తోమడానికి ఒకరూ,  వాషింగ్ మెషీన్లో బట్టకుతికి, ఆరేయడానికొకరూ, ఆ ఎండిన బట్టలు మడతపెట్టడానికొకరూ, బూజులు దులపడానికి ఒకరూ,కిటికీ అద్దాలు తుడవడానికొకరూ, మర్చేపోయాను, బాత్రూంలు కడగడానికి ఒకరండోయ్. ఈరోజుల్లో భార్యాభర్తలిద్దరూ  ఉద్యోగాలు చేస్తూండడంతో, స్వయంగా పాపం ఏ పనీ చేసుకోలేకపోతున్నారు కదా మరీ…   పనిమనుషులందరికీ , ఫాక్టరీల్లోలాగ  యూనియన్లోటీ… ఏదైనా తేడా పాడా వచ్చిందా, ఆ యూనియన్ల వాళ్ళు రంగంలోకి దిగుతారు. పనిమనుషులవలన మనకేమైనా సమస్యలొస్తే మాత్రం ఈ యూనియన్లవాళ్ళు తుపాగ్గుండుక్కూడా కనిపించరు. మనకి మనమే తేల్చుకోవాలి. 

పైగా ఏ సమస్యో వచ్చి పనిమనిషిని ఏ కారణంతోనైనా తీసేస్తే, ఇంకో పనిమనిషి దొరకడంకూడా కష్టం. లేనిపోని యాగీ చేసేసి, ఇంకో పనిమనిషిని మనింటికి రానీయరు. ఇల్లైనా మార్చుకోవాలిగానీ , పనిమనిషిమాత్రం దొరకదు. అద్దె ఇళ్ళవాళ్ళకైతే పరవాలేదుకానీ, స్వంత ఇల్లున్నవాళ్ళ గతేమిటీ?.. చచ్చినట్టుండడమే… పైన చెప్పిన ఎవరికైనా సరే పండగ మామూళ్ళు ఇవ్వలేదా, ఇంక ఆ గృహస్థు పని అయిపోయినట్టే. సొసైటీ వాచ్ మన్ కి ఇవ్వకపోతే, ఎప్పుడైనా కరెంటు పోతే,  లిఫ్టులోవెళ్ళడానికి ఎమెర్జెన్సీ బాటరీ ఛస్తే వేయడు.. “ డిసెలు లేదండీ.. “ అంటాడు. కర్మకాలి ఇంకోరెవరికో వేసినప్పుడు మనం కూడా లిఫ్టులో దూరడమే. లేదా మెట్లెక్కి వెళ్ళడమే. ఏదో మన పని అయిందికదా అని సంతోషిస్తే సరిపోదు.. మనింటికి బయటి వారెవరైనా వస్తే, గేటులోనే చెప్పేస్తాడు.. వాళ్ళింట్లో లేరండీ.. అని. ఆ వాచ్  మన్ అంబులో రకరకాల అస్త్రశస్త్రాలుంటాయి మనల్ని అల్లరి పెట్టడానికి. ఫలితం—పండగ మామూళ్ళివడమే శరణ్యం.

వీళ్ళే కాకుండా ప్రతీరోజూ , చెత్త  సేకరించే కార్పొరేషన్ / మునిసిపాలిటీ వాళ్ళు కూడా మామూళ్ళకోసం వచ్చే అవకాశాలున్నాయి. అంతదాకా ఎందుకూ, ఏ ప్రభుత్వ కార్యాలయానికో వెళ్ళి చూడండి—కాగితం మీద  ఆఫీసరు సంతకమైనా సులభంగా సంపాదించొచ్చు కానీ, ఆ ఆఫీసరు స్టాంప్ వేస్తేనే కానీ, చెల్లుబాటవదు. ఆ రబ్బరు స్టాంపేమో ద్వారందగ్గరుండే జవాను దగ్గర ఉంటుంది. వాడికి చాయ్ డబ్బులిస్తేనే కానీ స్టాంపు పడదాయె. పైగా వీటిని పండగమామూళ్ళనకూడదు. సంవత్సరం పొడుగునా, “ నిత్య కల్యాణం పచ్చతోరణం “ లా  ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి…

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
sarasadarahasam