నాగులచవితి
మరుగున పడిపోతున్న మన తెలుగు పండగల గురించి ఒకమారు మీ అందరికి గుర్తుచేద్దామని నా ప్రయత్నం . ఏదో ముఖ్యమైన పండగలు తప్ప నోములు వ్రతాలూ మరచిపోయేరనే చెప్పాలి . అలాంటి కొన్ని పండగలు గురించి మీకు పరిచయం చేస్తాను .
మా చిన్నప్పుడు యెన్నో పండగలో , దక్షిణాయనంలో కనీసం నెలకు ఒకటిలేదా రెండు పండగలు తప్పని సరిగా వుండేవి . ఉత్తరాయణంలో ఉగాది తప్ప మరే చెప్పుకోదగ్గ పండగలు లేవు .
పాడ్యమి బలిపాడ్యమి , విదియ ప్రీతి విదియ , తదియ అట్లతదియ , చవితి వినాయక చవితి , చవితి నాగుల చవితి అని మా చిన్నప్పుడు పిల్లలకి నేర్పించేవారు , యెందుకు అంటే మన పండగలు యేయే తిథులలో వస్తాయో వాటికి మన తెలుగు వారి జీవితాలలో వున్న ప్రాముఖ్యత యేమిటో తెలియచెప్పడానికన్నమాట .
అయితే యిప్పుడు పరుగుల జీవితాలలో నిలబడి మన సాంప్రదాయాలను , మనం జరుపుతున్న పండగల , నోముల ప్రాముఖ్యతను గురించి ఆలోచించే తీరుబాటు యెవరికీ వుండటం లేదు అందుకనే పిల్లలకి తెలుగు పండగలగురించి తెలుసుకునే అవకాశం పోయిందనే చెప్పాలి .
సంక్రాంతి , దశర , దీపావళి తప్ప మిగతా పండగలు జరుపుకొనేంత ఉత్సాహంగాని తీరిక గాని యెవరికీ వుండటం లేదు .
విదేశాలలో అయితే యేపండగైనా , యేరోజు వచ్చినా వీకెండుకే పరిమితం అయిపోయేయి . అలాంటి యీ కాలంలో మీకు మన అచ్చతెలుగు పండగ గురించి చెప్తాను . అదే నాగులచవితి గురించి .
మానవాళి సృష్టి జరిగి దేవీదేవతల ఆరాధన గురించి తెలియక పూర్వం ప్రజలు ప్రకృతినే భగవంతునిగా ఆరాధించేవారు , పూజించేవారు . ఇప్పటికీ చాలా జాతులలో అగ్ని , వరుణుడు , వేప మర్రి రావి లాంటి చెట్లను ఆరాధించడం కనిపిస్తుంది , అలాగే జంతువులైన ఆవు సింహం లాంటి జంతువులనూ ఆరాధించడం కనిపిస్తుంది . అలాగే హిందూమతం లో పాములను పూజించడం వేదకాలం నుంచి వస్తోంది . మన పురాణాలలో నాగలోకమనే లోకం భూలోకం పాతాళలోకాలకు మధ్యగా వుండేదని . నాగ ప్రముఖులుగా శేషుడు , వాసుకి అనే నాగులను గురించి చెప్పబడింది .
ఈ ఆధునిక కాలంలో కూడా మనం తెలుగు వారి పేర్లను గమనించినట్లైతే యాభైశాతం మందికి ముందునో వెనుకనో పాముపేరు తగిలించి వుంటుంది . ఇంకా చెప్పుకోవాలంటే కొన్ని కుటుంబాలలో నాగులపేర్లు వంశపారంపర్యంగా వస్తున్న ఆచారం .
ముందుగా మనం యీ నాగులు యెవరో తెలుసుకుందాం , కశ్యప ప్రజాపతికి కద్రువకు పుట్టిన వెయ్యమంది సంతతే నాగులు . వీరిలో తక్షకుడు , వాసుకి , శేషుడు కూడా వున్నారు .
నాగులకు కూడా దేవతలతో సమానమైన శక్తులువున్నాయని హిందువుల నమ్మకం , హిందూపురాణాలలో కూడా పాములకు పెద్ద పీటవేసేరు . విష్ణుమూర్తి పాన్పు పదితలల ఆదిశేషుడని , శివుని ఆభరణాలు నాగులని వాటి ప్రాముఖ్యతను తెలియజేసేరు . అమృత మథనం చేసినప్పుడు వాసికి పాత్ర మనకు తెలిసినదే .
నాగులకి దివ్యశక్తులు వుంటాయని , కొన్ని నాగులు వందేళ్లకు పైబడి జీవిస్తాయని , అలా జీవించిన పాములకు యిష్టానుసారంగా రూపం మార్చుకోగలిగే శక్తి వుంటుందని ఓ నమ్మకం కూడా వుంది . ఇది మూఢనమ్మకమని శాస్త్రజ్ఞలు చెప్తున్నా కూడా మన నరనరాలలోనూ జీర్ణించుపోయి , అలాంటి కథలు , సినిమాలు విశేషప్రజాదరణ పొందడం మనకు తెలిసినదే
కొన్ని వందల సంవత్సరాలుగా నాగులను పూజించడం ఆరాధించటం హైందవులకు అలవాటుగా వస్తోంది .
నవగ్రహాలలో పాము తల తోక భాగాలుగా చెప్పుకొనే రాహుకేతు స్థానాలు గతి తప్పినా జాతకం లో నాగదోషం వుందని , వివాహం లో జాప్యం కలగడం , సంతతి లేకపోవడం జరుగుతుందని అంటారు .
భారతదేశంలోనేకాక పొరుగు రాజ్యాలైన నేపాలు , బంగ్లాదేశ్ , థాయ్లాండ్ , చైనా మొదలయిన దేశాలలో కూడా పాములను దేవతలుగా పూజించడం కనిపిస్తుంది .
ఇంతవరకు నాగులగురించి చెప్పకున్నాం కదా , యిప్పుడు నాగులచవితి గురించి తెలుసుకుందాం , ఆ తరవాత మనదేశంలో వున్న ఓ ప్రసిధ్ద నాగమందిరం గురించి తెలుసుకుందాం .
ఆంధ్రులకు నాగులచవితి ఓ ముఖ్యమైన పండగ , పండగ అనే బదులు నోము అని చెప్పుకుంటే సరిపోతుంది . ఎందుకంటే చాలా యిళ్లల్లో యిది ఆడవాళ్లు మాత్రమే చేస్తారు . ఈ నోము ముఖ్యంగా సంతతి లేని వారు సంతానం కోసం , సంతతి వున్నవారు వారి ఆయుఃరారోగ్యాలకోసం చేస్తూవుంటారు .
కార్తీక శుక్ల చవితిని నాగులచవితిగా మన తెలుగువారు జరుపుకుంటారు . ఈ నోము అన్ని వర్ణాలవారు జరుపుకోడం కనిపిస్తుంది . కొన్ని యిళ్లల్లో అందరూ అంటే ఆడమగ పిల్లలు కూడా పాల్గొంటారు .
ఈ నోము వున్నవారు సూర్యోదయానికి ముందు లేచి అభ్యంగన స్నానంచేసి , యెక్కువగా చన్నీటి స్నానం చేస్తారు . పాము పుట్టదగ్గర శుభ్రపరచి ముగ్గులు వేసి దీపధూపాలు వెలిగించి పూలు అక్షింతలతో పూజ చేసి పుట్టలో పాలు పోస్తారు . చలిమిడి , చిమ్మిలి , అరటిపళ్లు కొబ్బరికాయలు నైవేద్యం చేస్తారు . తర్వాత హారతి యిచ్చి ప్రసాదం అందరూ తీసుకొని , పుట్టమన్ను ప్రసాదంగా యింటికి తీసుకువెళ్లి ఆ మన్ను చెవులకు పెట్టుకుంటారు . అలా చెయ్యడం వల్ల చెవిపోటు , చెవులోంచి చీము కారడం లాంటివి వుండవని నమ్మకం , అలాగే దీర్ఘకాలిక చర్మ రోగాలతో బాధపడేవారు కూడా నాగుల చవితి నాడు నాగవయ్యకి పూజచేసి పుట్టలో పాలు పోస్తే అతితొందరగా తగ్గుతాయని నమ్ముతారు .
కొన్ని బ్రాహ్మణేతర కుటుంబాలలో నాగులచవితికి కోడిగుడ్డుని నైవేద్యంగా సమర్పించి పుట్టలో వెయ్యడం కనిపిస్తూవుంటుంది .
కొన్ని కుటుంబాలలో పుట్టలో పాలు పొయ్యడంతో నోము అయిపోతే కొందరిళ్లల్లో యింటి యిల్లాలు వుపవాసం వుండి సాయంత్రం దీపాలు పెట్టేక చలిమిడి తిని వుపవాసం విడిచి పెట్టడంతో ముగుస్తుంది .
ఈ నాగుల చవితి వెనుకనున్న కధేంటో తెలుసుకుందాం .
బ్రహ్మ మనస్సునుండి ఓ అందమైన కన్య ఉధ్బవిస్తుంది ఆమెకు మానస అనే నామకరణం చేస్తారు , మానస జన్మించినప్పటినుండి ఆధ్యాత్మిక చింతనతో రోజులు గడుపుతూ వుంటుంది . మానస విద్యాభ్యాసం శివుని వద్దసాగుతుంది . అతిచిన్నవయసులోనే మానస కఠోర తపస్సాచరించి విష్ణుమూర్తిని మెప్పించి అతని దర్శన భాగ్యం పొందుతుంది .
మానస జరత్కరుడునే ఋషిని వివాహమాడి ' ఆస్తికుడు ' అనే పుతృనకు జన్మనిస్తుంది .
జనమేజయమహారాజు నిర్వహించిన సర్పయాగంలో యేక , ద్విక , నానా మస్తకులైన పాములు హోమంలో దగ్ధమౌతాయి , కాని జనమేజయుని తండ్రి పరీక్షితు మహారాజు మరణానికి కారకుడైన తక్షకుడు మాత్రం హోమాగ్నికి ఆహుతి కాకపోవడం చూచి జనమేజయుడు దివ్య శక్తితో చూడగా తక్షకుడు యింద్రుని శరణులో యింద్ర సింహాసనాన్ని చుట్టుకొని వుండడం చూచి తక్షకుడు యింద్రసింహాసనంతో కూడా హోమాగ్నికి ఆహుతికావలని మంత్రాలు చదువగా తక్షకుడు యింద్రుని తో సహ హోమాగ్నివైపు వేగంగా ప్రయాణించటం చూసిన దేవతలు కలవర పడి విష్ణుమూర్తిని సర్పయాగాన్ని ఆపుచేయవలసినదిగా ప్రార్ధిస్తారు . విష్ణుమూర్తి యాగాన్ని ఆపే శక్తి తనకు లేదని ఒక్క మానసకు మాత్రమే ఆశక్తి వుందని చెప్పి మానస కొరకై ప్రార్ధిస్తాడు . మానస తన పుతృడైన ఆస్థికుని సర్పయాగం ఆపవలసినదిగా ఆజ్ఞాపిస్తుంది . ఆస్తికుడు సర్పయాగాన్ని నిలిపివేస్తాడు . తక్షకుడు మొదలైన నాగులు హోమాగ్నిలో భస్మం కాకుండా రక్షింపబడతాయి . ప్రాణదాత అయిన మానసకు యీ కథ చెప్పుకొని నాగులచవితినాడు పూజలు యెవరైతే నిర్వహిస్తారో వారు యెప్పుడూ పాము కాటుకు బలికారని , నిర్వంశస్తులు కారని వరం యిచ్చి నాగలోకానికి మరల పోతాయి నాగులు . అప్పటినుండి నాగులచవితి మానవులందరూ జరుపుకుంటున్నారని చెప్తారు . అలాగే ఉత్తర భారతీయులు శ్రావణ శుక్ల పంచమిని నాగపంచమిగా జరుపుకుంటారు . ఆ విషయాలు మనం మరోమారు చెప్పుకుందాం. .
నాగుల చవితి కథ చెప్పకున్నాం కదా యిప్పుడు నాగమందిరం గురించి చెప్పుకుందాం .
ప్రతీ మందిరం లోను మనకి నాగ ప్రతిష్టలు కనబడుతూ వుంటాయిగాని ప్రత్యేకంగా నాగులకి మాత్రమే కోవెలలు వుండడం చాలా అరుదనే చెప్పుకోవాలి , అలాంటి అరుదయిన కోవెల మన దేశంలో కేరళ రాష్ట్రంలో వుంది .
కేరళరాష్ట్రంలోని కొచ్చిన్ కి సుమారు 115 కిలోమీటర్లదూరంలో , బేక్ వాటర్స మీద బోట్ హౌసులకి ప్రసిధ్ద చెందిన అలెప్పీ కి సుమారు 40 కిలో మీటర్ల దూరం లో వున్న ' హరిపాద ' రైల్వే స్టేషనుకి , బస్సాండుకి మూడు కిలో మీటర్ల దూరంలో వుంది యీ నాగరాజ మందిరం , ఈ మందిరం వున్న ప్రాంతాన్ని మన్నారుశాల అంటారు . బేక్ వాటర్స్ మీద బోట్ హౌస్ లో గడపడానికి వెళ్లిన మేము స్థానికులని చూడదగ్గ ప్రదేశాల గురించి వాకబు చేస్తే యీ మందిరం గురించి చెప్పేరు .
మరునాడు ప్రొద్దున్నే టాక్సీ తీసుకొని బయలు దేరేం . నాగరాజ మందిరం వున్న ప్రాంతాన్ని ' మన్నారు శాల ' అని ' అప్పోప్పన్ కావు ' అని అంటారు .
కొబ్బరి తోటల మధ్యనుంచి 40 కిలోమీటర్లు ప్రయాణించేక మన్నారుశాల చేరేం . కేరళ స్టైల్ లో కట్టబడ్డ పురాతనమైన మందిరం . చాలా భాగం చెక్కతో నిర్మింప బడింది . మందిర ప్రాంగణం లో ముప్పై వేలకు పైబడి నాగప్రతిష్టలు వున్నాయి . చిన్న పిల్లలను చక్కగా అలంకరించి తీసుకు వచ్చేరు . లోపల అయిదు తలల నాగేంద్రుడు పూజలందుకుంటున్నాడు . పెద్ద వసరా నిండుగా భక్తులు సమర్పించిన అరటిగెలల , కొబ్బరికాయలు , బెల్లం , వుప్పు , మిరియాలు గుట్టలుగా పోసి వున్నాయి , మరో పక్క తులాభారం వుంది ఇందులో పిల్లలను తూచి పసుపు వగైరాలతో నాగేంద్రుని కి మొక్కులు తీరుస్తున్నారు . ప్రసాదంగా పసుపు యిస్తున్నారు .
ఇక్కడ పిల్లలు లేని వారు వచ్చి మొక్కుకొని వెళ్లి సంతతి కలుగగానే వచ్చి మొక్కులు తీర్చుకుంటారని తెలిసింది . అక్కడకి వచ్చిన చాలా మంది భక్తులందరూ చంకలో పిల్లతోనో , కవలపిల్లలని తీసుకొనో రావడం చూస్తే నాగరాజు మందిరం యీ చుట్టుపక్కల యెంత పేరు పొందిందో అర్దమౌతుంది .
ఈ కోవెలలో నిజం పాములు కూడా తిరుగుతూ వుంటాయట , కాని యెవరికీ హాని చెయ్యవట .
ఈ మందిరం గురించిన స్థలపురాణం చెప్తాను వినండి .
ఇక్కడ స్థలపురాణం పరశురాముడితో ముడిపడి వుంది . పరశురాముడు చేసిన క్షత్రియసంహారం వల్ల అంటిన పాపం , అతనికి మాత్రమే సొంతమైన భూమిని బ్రాహ్మణులకు దానమిస్తే పరిహారమౌతుందని తెలుసుకొని తన ఆయుధమైన పరశు ని సముద్రం లోకి విసిరి వేయగా సముద్రం వెనుకకు నెట్టబడి బయటపడిన నేలను బ్రాహ్మణులకు దానమిస్తాడు . సముద్రం నుంచి బయటపడ్డ నేల కావడం వల్ల ఆ భూమి పంటలకు యోగ్యం కాకపోవడం , ఆ ప్రాంతం లో వున్న విషనాగుల భయం వల్ల బ్రాహ్మణులు వలసపోతూ వుండగా చింతాక్రాంతుడైన పరశురాముడు శివుని కొరకై తపస్సు చేసి అతనిని ప్రశన్నుని చేసికొని అతని సలహాప్రకారం నాగరాజుకొరకై తపస్సు చేసి నాగరాజును ప్రత్యక్షం చేసుకుంటాడు . వెయ్యి తలలతో , యవ్వనకాంతులీనుతున్న శరీరంతో , పద్మాలను పాదాలుగాకలిగియున్న నాగరాజు ప్రత్యక్షమై పరశురాముని కోరిక మేరకు అన్ని విషసర్పాలను పిలచి వారి విషంతోఆనేలను ప్రక్షాళన చేసి నేలను సశ్యశ్యామలంగా మారుస్తాడు .
పరశురాముడు బ్రహ్మ స్వరూపమైన నాగారాజుని , విష్ణుస్వరూపమైన అనంతుని , శివ రూపమైన వాసుకిని , సర్పయక్షి , నాగయక్షి , నాగఛాముండిలను యివే కాక అనేక నాగ దేవతలను వారివారి స్థానాలలో ప్రతిష్టించి సామవేద గానంతో నిత్యం అభిషేకం , అలంకారం , నైవేద్య సమర్పణం , నీరాజనం , సర్పబలి మొదలయిన అనేక ఉపచారాలతో పూజలు నిర్వహించి , దుర్గ మొదలయిన విగ్రహాలను ప్రతిష్టించి పూజకొరకై బ్రాహ్మణులను నియమించి పూజా విధులనాలను వారికి తెలియజేసి మహేంద్రగిరికి అవతారం చాలించడానికి వెళ్లిపోతాడు పరశురాముడు .
భూమి సస్యశ్యామలంగా మారిన తరువాత యీ ప్రాంతమంతా మందార చెట్లతో నిండిపోగా అందరూ యీ ప్రాంతాన్ని మందారశాల అనిపిలువ సాగేరు .
కాలగర్భంలో కొన్ని వేలసంవత్సరాలు కలిసిపోయి , కలియుగ ప్రవేశం జరిగిన తరువాత యీ మందిరంలో వాసుదేవ , శ్రీదేవి అనే పుణ్యదంపతులు పిల్లలు లేక యీమందిరంలో నాగరాజును సేవించుకుంటూ వుండగా ఒకనాడు అగ్ని రాజుకొని యీ ప్రాంతాన్ని దహించవేయసాగింది . ఆ అగ్ని ప్రభావాన యెన్నో పాములు కాలిపోతూ వుంటే వాసుదేవ దంపతులు అగ్నిని చల్లార్చి , సగం కాలిన పాములకు యెన్నో వుపచారాలుచేసి వాటిని బ్రతికించి , మరణించిన నాగులకు దహనసంస్కారాలు చేస్తారు . వారి సేవలకు సంతోషించిన నాగరాజు వారి కడుపున పుడతానని వరమిస్తాడు .కొంతకాలానికి నెలతప్పిన శ్రీదేవి , ఒక మగపిల్లవానికి , ఓ అయిదు తలల సర్పానికి జన్మనిస్తుంది . అయిదు తలల సర్పం తాను ఆ మందిరంలో సమాధిపొంది ఆచంద్రార్కం ప్రజలను కాపాడతానని మాటయిచ్చి గర్భ గుడిలో నుంచి పాతాళానికి వెళుతూ మాయమైపోతుంది . ఇప్పటికీ గర్భగుడిలో కిందన నాగరాజు తపస్సు చేసుకుంటూవున్నాడనే నమ్ముతారు భక్తులు , అతని తపస్సుకు భంగం కలగకుండా చాలా నిశ్శబ్దంగాదర్శనం చేసుకోమని చెప్తారు
వాసుదేవవంశస్థులు యీ మందిరాన్ని అప్పొప్పన్ కావు అంటే ముత్తాతగారి తోట అనే యిప్పటికీ పిలుస్తారు .
అయితే యిక్కడ మొక్కులుకూడా చాలా వింతగా అనిపించేయి , సంతతి కావాలనుకొనే వారు వెండితో గాని యిత్తడితో గాని చేసిన గోకర్ణం కానుకగా సమర్పిస్తారు , విష కీటకాల నుండి రక్షణగా పసుపును , అన్ని కోరికలు నెరవేరేందుకు కదళీ ఫలాలలను , రుగ్మతలనుండి రక్షణకు ఉప్పు మిరియాలు కానుకగా యిస్తారు .
అలాగే నాగరాజుకి పంచామృత అభిషేకం చేయించుకుంటే సర్వాపదలూ తొలగి సర్వసంపత్తులూ కలుగుతాయట .
యీ మందిరానికి దర్శనానికి వచ్చిన వారు నాగరాజుకు పూజచేసిన పసుపు ప్రసాదంగా యిళ్లకు తీసుకు వెళతారు , యీ ప్రసాదం యింట్లో వుంటే యింట్లోవారు యెటువంటి విష ప్రభావానికి లోను కారని స్థానికుల నమ్మకం . యిదండీ నాగుల చవితి గురించి , నాగరాజమందిరం గురించి వివరాలు .
మరోమారు యిలాంటి మనం మరచిపోతున్న మరో పండగ గురించిన వివరాలతో మీ ముందుంటానని మనవి చేస్తూ శలవు తీసుకుంటున్నాను .
|