Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

ఉన్నది ఒకటే జిందగీ చిత్ర సమీక్ష

unnadi okate jindagi movie review

చిత్రం: ఉన్నది ఒకటే జిందగీ 
తారాగణం: రామ్‌, అనుపమ పరమేశ్వరన్‌, లావణ్య త్రిపాఠి, శ్రీవిష్ణు, కిరీటి, ప్రియదర్శి, అనీషా ఆంబ్రోస్‌, కౌశిక్‌ తదితరులు. 
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్‌ 
సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి 
దర్శకత్వం: కిషోర్‌ తిరుమల 
నిర్మాత: కృష్ణ చైతన్య 
నిర్మాణం: పీఆర్‌ సినిమాస్‌, స్రవంతి సినిమాటిక్స్‌ 
విడుదల తేదీ: 27 అక్టోబర్‌ 2017 

క్లుప్తంగా చెప్పాలంటే 
అభిరామ్‌ (రామ్‌), వాసు (శ్రీవిష్ణు), సతీష్‌ (ప్రియదర్శి), సాయి (కిరీటి) చిన్నప్పటినుంచీ ప్రాణ స్నేహితులు. స్నేహితులతో కలిసి ఉండడం కోసం మంచి స్కూల్‌లో చదివే అవకాశమొస్తే వదులుకుంటాడు. ఎవరికి నచ్చినట్టు వారు నడచుకోవాలనే మనస్తత్వం అభిరామ్‌ది. సంగీతాన్ని చాలా ఇష్టపడతాడు. ఆ ఇష్టంతోనే రాక్‌ బ్యాండ్‌ గ్రూప్‌ని నిర్వహిస్తుంటాడు. ఓ అనూహ్య ఘటన తర్వాత మహా (అనుపమ పరమేశ్వరన్‌) అభిరామ్‌ జీవితంలోకి వస్తుంది. ఆ ఇద్దరి పరిచయం, ఆ తర్వాత ప్రేమగా మారుతుంది. కానీ మహాకి వాసుతో పెళ్ళి నిశ్చయమవుతుంది. మహా కూడా, వాసుని పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడుతుంది. మరి, ఆ పెళ్ళి జరుగుతుందా? అభి - మహాల మధ్య ప్రేమ సంగతేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెరపైనే చూడాలి. 

మొత్తంగా చెప్పాలంటే 
రామ్‌ అనగానే ఎనర్జీకి కేరాఫ్‌ అడ్రస్‌ అనిపించే మంచి జోరున్న కుర్రాడు గుర్తుకొస్తాడు. అయితే వీలు చిక్కినప్పుడల్లా తనలోని నటనను బయటకు తీసేందుకోసం వెరైటీ సినిమాల్ని ఎంచుకుంటుంటాడు రామ్‌. 'నేను శైలజ' సినిమా అలాంటిదే. ఆ సినిమా దర్శకుడితోనే, ఇంకోసారి తనలోని నటుడ్ని మరోమారు కొత్తగా ప్రెజెంట్‌ చేసుకునే ఛాన్స్‌ తీసుకున్నాడు. రామ్‌ని ఇందులో చాలా చాలా కొత్తగా చూస్తాం. ప్రేమికుడిగా, స్నేహితుడిగా రామ్‌లోని భిన్న కోణాలు కనిపిస్తాయి ఇందులో. అభి పాత్రలో రామ్‌ నటించడం కాదు, జీవించేశాడు. ఈ సినిమాకి ఉన్న హైలైట్స్‌లో రామ్‌ నటనకే ఫస్ట్‌ ప్లేస్‌ దక్కుతుంది. 

హీరోయిన్లలో అనుపమ, లావణ్య త్రిపాఠి నటనలో పోటీ పడ్డారు. క్యూట్‌నెస్‌లో లావణ్యతో పోల్చితే అనుపమకి కొన్ని మార్కులు ఎక్కువే పడ్తాయి. ఫస్టాఫ్‌లో అనుపమ, సెకెండాఫ్‌లో లావణ్య తమ ప్రత్యేకతను చాటుకున్నారు. హీరో ఫ్రెండ్‌ క్యారెక్టర్‌ చేసిన శ్రీవిష్ణు కూడా చాలా బాగా చేశాడు. ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌లో ప్రియదర్శి, కిరీటి బాగానే సందడి చేశారు. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగా చేశారు. 
ప్రేమ - స్నేహం కాన్సెప్ట్‌తో చాలా సినిమాలొచ్చాయి. అయితే కాస్తంత కొత్తదనం చూపితే, ఎంటర్‌టైన్‌మెంట్‌నీ ఎమోషన్స్‌నీ మిక్స్‌ చేస్తే అన్నిసార్లూ ఆ కాన్సెప్ట్‌కి మంచి విజయాలే దక్కుతుంటాయి. దర్శకుడు కథనం విషయంలో కొత్తగా ఆలోచించాడు. పాత్రల స్వభావం విషయంలోనూ వెరైటీ కనిపిస్తుంది. పాత్రల్ని సహజంగా తీర్చిదిద్దాడు దర్శకుడు. మాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ సినిమాకి మెయిన్‌ ఎస్సెట్‌. మ్యూజిక్‌ కూడా అంతే. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంటుంది. పాటలు వినడానికీ, తెరపై చూడ్డానికీ బాగున్నాయి. నిర్మాణపు విలవల పరంగా ఎక్కడా రాజీ పడలేదు. ఎడిటింగ్‌ మాత్రం అక్కడక్కడా అవసరం అనిపిస్తుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్స్‌ సినిమాకి హెల్ప్‌ అయ్యాయి. 

ఫస్టాఫ్‌ స్లోగా స్టార్ట్‌ అయినట్లనిపిస్తుంది. ఆ తర్వాత వేగం పుంజుకుంటుంది. సరదా సరదా సన్నివేశాలతోపాటు, కాస్తంత రొమాంటిక్‌ ఫీల్‌, ఇంకాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉన్నాయి. సెకెండాఫ్‌కొచ్చేసరికి సినిమాలో వేగం పెరిగింది. దాంతోపాటే ఎమోషనల్‌ కంటెంట్‌ కూడా కట్టిపడేస్తుంది. ప్రేమ - స్నేహం కాన్సెప్ట్‌లో ఇదొక కొత్త కోణం అనిపిస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇంకాస్త జొప్పిస్తే బాగుండేదిగానీ, బలవంతంగా మిక్స్‌ చేస్తే సమస్యలొస్తాయనుకున్నాడేమో దర్శకుడు కొంతమేరకే ఎంటర్‌టైన్‌మెంట్‌ని పరిమితం చేశాడు. ఓవరాల్‌గా నటీనటుల నటనా ప్రతిభ సినిమాలో ప్రేక్షకుడు లీనమయ్యేలా చేసింది. ఎంటర్‌టైన్‌మెంట్‌ కొంచెం తగ్గడం, కొన్ని సన్నివేశాలు సాగతీత అనే భావన కలగడం మైనస్‌ పాయింట్స్‌. స్నేహం - ప్రేమకు సంబంధించి టార్గెట్‌ ఆడియన్స్‌ ఈ సినిమాతో బాగా కనెక్ట్‌ అవడం ప్లస్‌ పాయింట్‌. 

ఒక్క మాటలో చెప్పాలంటే 
ఉన్నది ఒకటే జిందగీ.. ప్రేమ, స్నేహం, కొంచెం కొత్తదనం! 

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka