స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత గాధ ఆధారంగా ఇప్పటికే రెండు బయోపిక్స్ సెట్స్ మీదికెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. సంచలన డైరెక్టర్ వర్మ దర్శకత్వంలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అంటూ బయోపిక్ ఒకటి కాగా, తేజ డైరెక్షన్‌లో బాలయ్య హీరోగా తెరకెక్కుతోన్న మరోటి. ఈ సినిమాకి 'ఎన్టీఆర్' అనే టైటిల్‌ని రిజిస్టర్ చేయించారు బాలయ్య అండ్ టీమ్. కాగా ఇప్పుడు ముచ్చటగా మూడో బయోపిక్ తెరపైకి వచ్చింది. అదే 'లక్ష్మీస్ వీరగ్రంధం'. కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. కాగా లక్ష్మీ పార్వతి యాంగిల్ నుండి ఎన్టీఆర్ ఏంటి? అనే కోణంలో ఈ సినిమా ఉండొచ్చుననే వార్తలు వినిపిస్తున్నాయి. అప్పట్లో ఎన్టీఆర్‌పై ఓ పుస్తకం రాస్తానంటూ ఆయనకు పరిచయం అయ్యారు లక్ష్మీ పార్వతి. సో ఆ యాంగిల్‌లో ఈ సినిమా స్టోరీ ఉండనుందని భావిస్తున్నారు.
మరో పక్క తేజ డైరెక్షన్‌లో తెరెకెక్కనున్న సినిమాలో ఎన్టీఆర్ జీవిత చరిత్రలోని పలు ముఖ్యమైన ఘట్టాల్ని ప్రస్థావించనున్నారు. అంటే ఆయన సినీ, నట ప్రస్థానంలోని పలు ముఖ్య అంశాలు అన్న మాట. ఇక వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కే బయోపిక్, ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంటర్ అయిన తర్వాత నుండి ఆయన జీవితంలోనూ, రాజకీయంగానూ చోటు చేసుకున్న పరిణామాలను మాత్రమే తెరపై చూపించనున్నారు. ఇదిలా ఉండగా, తాజాగా అనౌన్స్ అయిన 'లక్ష్మీస్ వీరగ్రంధం' చిత్రంపై లక్ష్మీ పార్వతి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నా అనుమతి లేకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తే ఒప్పుకోననీ ఆమె అంటున్నారు. మొత్తానికి టాలీవుడ్‌లో ఎన్టీఆర్ బయోపిక్ ఓ సెన్సేషన్ అయ్యింది. బాలయ్య హీరోగా తెరకెక్కే 'ఎన్టీఆర్' చిత్రం జనవరిలో సెట్స్ మీదికెళ్లనుండగా, వర్మ - 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఫిబ్రవరిలో పట్టాలెక్కనుంది.
|