ఒకానొకప్పుడు చీకట్లో వెళ్ళేటప్పుడు, దారి కనిపించాలంటే, ఏ కాగడాయో చేతిలో పట్టుకునేవారు, ఇప్పటికీ చూస్తూంటాము, ఏ దేవుడి ఊరేగింపో జరుగుతున్నప్పుడు, పల్లకి తోపాటు, కాగడాలు కూడా తీసికెళ్ళడం ఓ సాంప్రదాయంగా ఉంటోంది… దేశానికి స్వతంత్రం వచ్చిన కొన్నిసంవత్సరాలదాకా, అన్నిచోట్లా విద్యుఛ్ఛక్తి ఉండేది కాదు., ఏదో ప్రధాన నగరాల్లో మాత్రమే ఉండేది… అలాగని అసలు వెలుగే లేదనికాదు.. అవేవో హరికేన్ ల్యాంపులూ, కోడుగుడ్డు ల్యాంపులూ అని ఇళ్ళల్లో వాడకంలో ఉండేవి… వాటికి కింద ఓ గ్లాసుదో, సీనారేకుదో ఓ బుడ్డి ఉండేది, దాంట్లో కిరసినాయిల్ పోసుకుని, దానిపైన వత్తి తగిలించేవారు.. ఆ వత్తి చివరిభాగం, కింద బుడ్డిలో ఉన్న కిరసనాయిల్ లోనూ, ఉంచేవారు. ఆ మంట ఆరిపోకుండా, దాని చుట్టూ ఓ గ్లాసు చిమ్నీ ఉండేది…
రోజూ, మసిబారిన ఆ చిమ్నీని ఏ ముగ్గో పోసి శుభ్రపరిచేవారు.. ఇవి కాకుండా, రోడ్లమీద వెళ్ళేవారిక్కూడా దారి కనిపించాలిగా, దానికోసం రోడ్డు పక్కన, కొంతంతదూరంలో స్థంభాలు పాతి, దానిమీద ఓ కిరసనాయిలు దీపం, దానిచుట్టూ ఓ చిమ్నీ ఉండేవి. ప్రతీరోజూ, ఆ పంచాయితీ బోర్డువారి మనిషోడు, నిచ్చినేసుకుని వచ్చి, ఆ దీపాలు వెలిగించడం ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది… ఇళ్ళల్లో ఆరోజుల్లో చదువులుకూడా, దీపాలచుట్టూనే జరిగేవి. దీపం ఎదురుగా కూర్చుని , పుస్తకం చదువుకోవడం, మధ్యమధ్యలో జోగుతూండడం మర్చిపోగలమా? ఇవి కాకుండా, పెళ్ళిళ్ళల్లో ఊరేగింపులకి , Petromax Lights అని ఉండేవి.. దానికి వెలుగురావడానికి సిల్క్ తో తయారుచేసిన mantle అని ఉండేది… కాలక్రమేణా దేశమంతా నగరాలతోపాటు, , మిగిలిన ప్రదేశాల్లో కూడా విద్యుఛ్ఛక్తి అందుబాటులోకి వచ్చేసింది… దీన్ని తయారుచేయడానికి కూడా కొత్తకొత్తపధ్ధతులు—బొగ్గు ఉపయోగించీ ( Coal Based ) , నీటి ద్వారా ( Hydal ), చివరకి అణుశక్తి ( Nuclear Power ) ద్వారానూ – వచ్చేసాయి…
చూసేఉంటారు—ఎక్కడ చూసినా రోడ్డుపక్కన పొడుగాటి స్థంభాలూ, , వాటికి ఎలెక్ట్రిక్ తీగెలూ బిగింపబడి కనిపించేవి. కానీ క్రమక్రమంగా, ఏ తుఫాను లాటివి వచ్చినప్పుడు, ఈదురుగాలులవలన, ఆ తీగలు తెగి జనాలకి షాక్కు తగలడం వలన, అయితేనేమి, ఎత్తుగా ఉండే వాహనాలకి అడ్డురాకుండా ఉండడానికైతేనేమి, ఈరోజుల్లో ఎలెక్ట్రిక్ తీగెలు భూమిలోపలనుండి లాగుతున్నారు. దీనివలన ప్రమాదాలూ తగ్గాయి, ఆ రాగితీగల మన్నికా బాగుపడింది… చిన్న చిన్న ఊళ్ళల్లో చూస్తూంటాం, రోడ్డు పక్కన ఒక స్థంభం, దాన్నుంచే, లెక్కలేనన్ని , అధికార, అనధికార కనెక్షన్లూనూ.. ఎప్పుడు ఏమౌతుందో తెలియదు.. అంతా గందరగోళం.. Load ఎక్కువయి, అప్పుడప్పుడు ప్రమాదాలు కూడా జరుగుతూంటాయి.. అలాగని విద్యుఛ్ఛక్తి లేకుండా ఈరోజుల్లో ఏదైనా జరుగుతుందా అంటే, అదీ లేదాయె… ప్రమాదాల దారి ప్రమాదాలదే… life goes on..
ఒకానొకప్పుడు ఎలెక్ట్రిసిటీ లేనిరోజుల్లో కూడా, మనుషులు జీవించారు.. కానీ ఈరోజుల్లోనో, మనం దీనికి ఎంత అలవాటు పడిపోయామో మాటల్లో చెప్పడం కష్టం… విద్యుచ్చక్తి లేకుండా ఉపయోగపడే వస్తువులు బహుతక్కువ… ఏ వస్తువైనా మన చేతికొచ్చేసరికి విద్యుఛ్ఛక్తి అవసరం ఉండకపోవచ్చునేమో కానీ, దాన్ని ఉపయోగించగలిగే పరికరంగా తయారుచేయడానికి మాత్రం అవసరమే…
మనం ఈ విద్యుఛ్ఛక్తికి పూర్తిగా బానిసలమైపోయామనడంలో ఆశ్చర్యంలేదు.. ఏ కారణంచేతైనా విద్యుఛ్ఛక్తి ఆగిపోయిందా, పూర్తి జనజీవనం అస్థవ్యస్థమైపోతుంది.. మొత్తం అన్ని కార్యక్రమాలు స్థంభించిపోతాయి.—కారణం—మన అస్థిత్వానికి కారణభూతులైన ప్రతీదీ దీనితో జోడించబడ్డదే… ఇళ్ళల్లో వెలుగు, గాలికోసం పంకాలు, ఈరోజుల్లో ఏసీలు, అంతదాకాఎందుకూ, బహుళాంతస్థుల భవనాల్లో పనిచేసే లిఫ్టులు, తిరగడానికి అంతంతెత్తు ఎపార్టుమెంట్లలోకి వచ్చే నీళ్ళు ( మరి Pumps పనిచేయొద్దూ )—రోడ్లమీద ఉండే Traffic Signals… ఇలా చెప్పుకుంటూ పోతే, ఎన్నో ఎన్నెన్నో ఈ విద్యుఛ్ఛక్తిమీదే పనిచేస్తాయి. .. మరి దానికే అంతరాయం కలిగితే, మనం అసలు బతక్కలమా?
దీనికి alternate గా ఈమధ్యన Solar Energy కి కూడా importance ఇస్తున్నారు. ఈరొజుల్లో, పెద్దపెద్ద సొసైటీల్లో పైన ఈ Solar Panels కనిపిస్తూంటాయి.. ఈ ఎలెక్ట్రిసిటీ ఆగిపోయినప్పుడు, పెద్దపెద్దకర్మాగారాల్లోనూ, హాస్పిటల్స్ లోనూ, Back up Generators ( బ్యాటరీ తో పనిచేసేవి) ఉంటాయనుకోండి… అలాగే ఇళ్ళల్లో కూడా, invertor లు వచ్చేసాయి… వీటన్నిటికీ ముఖ్యకారణం—ఈ ఎలెక్ట్రిసిటీ ఆగిపోతే మనిషికి మనుగడే లేదు…
సర్వేజనా సుఖినోభవంతూ…
|