Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Boneless Fish Curry

ఈ సంచికలో >> శీర్షికలు >>

పుట్టలోని చెదలు - వాసుదేవమూర్తి శ్రీపతి

puttalonichedalu
పద్యం:
తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు
పుట్టనేమి? వాడు గిట్టనేమి?
పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా
విశ్వదాభిరామ వినుర వేమ!
 
   కొన్ని పద్యాలు చదువుతుంటే వేమనకి కూడా బ్రహ్మంగారిలాగా కాలఙ్ఞానం తెలుసేమో అనిపిస్తుంది. పైన రాసిన పద్యం చదివితే ఆయన ఆకాలంలోనే నేడు తల్లిదండ్రులని వృధ్ధాశ్రమాలలో చేర్చే సంతానం గురించి ఆలోచించాడేమో అనిపిస్తుంది. లేదా అప్పుడు కూడా చెదల లాంటి పుత్రులు ఉన్నారా...??!!
 
   ఈ దశాబ్దంలో బాగా ఊపందుకున్న వ్యాపారాలలో వృధ్ధాశ్రమాలు కూడా ఉన్నాయి. పోను పోను బడి, వైద్యశాల, పోలీస్ స్టేషన్, కోర్ట్లలాగానే వృధ్ధాశ్రమాలు కూడా సామాజిక అవసరాలలో భాగమైపోతాయేమోనని భయం వేస్తోంది. కనీ, పెంచీ, పెద్ద చేసిన తల్లిదండ్రులు పిల్లలకి భారమైపోతున్నారు, ఆప్యాయతానురాగాలకి దూరమైపోతున్నారు. తమ జీవిత సర్వస్వాన్నీ పిల్లలకి ధారపోసి, ప్రశాంతంగా గడపాల్సిన వృధ్ధాప్యాన్ని కన్నీళ్ళతో వెళ్ళదీస్తున్నారు. పిల్లలపై పెంచుకున్న ఆశలు, అనురాగం అన్నీ భ్రమలని అర్థం అయ్యి కుమిలిపోతున్నారు. బిడ్డలు కడుపులో పడ్డ దగ్గరనుండి వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడే వరకూ ఏనాడు పిల్లలని భారం అనుకోరు తల్లిదండ్రులు. కానీ పిల్లలు, కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన తమ పెద్దలును ఆశ్రమాల పాలు చేస్తున్నారు.
 
 
   విధి లేక వృధాశ్రమాలలో కాలం వెళ్ళదీస్తున్న ముసలివాళ్ళ దగ్గరికి వెళ్ళి కాస్త ఆప్యాయంగా పలకరించి, నాలుగు ముక్కలు ప్రేమగా మాట్లాడితే చాలు వాళ్ళ గుండెల్లో ఎంత బరువుందో తెలిసిపోతుంది. ఇంకాస్త వినే ఓపికుంటే వాళ్ళ పిల్లల చిన్నప్పటి ముద్దు మాటలనుండి, పెరిగి పెద్దై గుండెల్లో శూలాలతో పొడుస్తున్నట్టు మాట్లాడిన మాటలవరకూ అన్నీ చెపుతారు. అలా చెపుతున్నప్పుడు వాళ్ళ కళ్ళు నిండి వుంటాయి, వాళ్ళ గొంతుల్లో దుఃఖం జీరాడుతూ ఉంటుంది. నిజంగా మనసుంటే మన మనసు కూడా వాళ్ళతో సమానంగా కళ్ళు తడుపుకుంటుంది. ఒక్కొక్కరూ తమ దుఃఖ్ఖాన్నివెళ్ళగ్రక్కినప్పుడు, వాళ్ళ పిల్లలని నిలువునా చీల్చి చంఢాడాలనిపిస్తుంది.
 
     ఈసడించుకునే కోడళ్ళు, చిరాకుపడే కొడుకులు, అన్నం పెట్టకుండా అమ్మా నాన్నని మాడ్చేవాళ్ళు, అన్నం తింటున్నంతసేపు ఎత్తిపొడుపు మాటలతో సాధించేవాళ్ళు, కొట్టి రోడ్లపైకి ఈడ్చి చిత్రహింసలు పెట్టేవాళ్ళు................... ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి మనుషులున్న సమాజంలో బ్రతుకుతున్నందుకు మనమీద మనకు అసహ్యం వేస్తుంది. అసలు ఆ తల్లిదండ్రులు ఏం పాపం చేశారు? అనే ప్రశ్నకి, పిల్లలని కన్నారు అనే సమాధానం దొరుకుతుంది. 
 
   ఒకప్పుడు మనుషులు గుంపులు, గుంపులుగా కలిసి జీవించేవారు. ఆతరువాత ఉమ్మడి కుటుంబాలు, ఆతరువాత ఎవరి కుటుంబాలు వాళ్ళవి, అయితే విడిపోయి బ్రతికే ఈ కుటుంబాలలో తాతా, నాయినమ్మ, అమ్మా నాన్నా, పిల్లలు ఇలా మూడు తరాలు ఉండేవి. ఇప్పుడు పై మూడు తరాలలో ఒక తరం వృధ్ధాశ్రమంలో ఉంటున్నారు. మిగిలింది రెండు తరాలు!!! మరి ముందు కాలాల పరిస్థితి ఏమిటి?
 
   పెద్దలు పిల్లలని హాస్టళ్ళలో పెంచిన కారణంగానే, పెరిగి పెద్దైనాక ఆపిల్లలు పెద్దలని వృధ్ధాశ్రమాలలో చేరుస్తున్నారు అని ఒక వాదన వుంది. కానీ, ఆ వాదనతో నేను ఏకోభవించలేను. ఎందుకంటే పూర్వం పెద్దలు పిల్లలని చదువుకోసం గురుకులాలకి పంపి వాళ్ళ విద్యాభ్యాసం పూర్తయిన తరువాత ఇంటికి తీసుకువచ్చేవారు. మరి ఆ కాలంలో అసలు వృధ్ధాశ్రమాలు లేవే!! మరి ఈ వాదన ఎంతవరకు సమంజసం. ఒక్కొక్కసారి సమస్య చదువులలోనే ఉందనిపిస్తోంది. సైన్స్, సోషలు, లెక్కలు, భాషలు, కంప్యూటర్లు, ఐఐటీలు..... వగైరా, వగైరా... వీటిలో ఆప్యాయతలూ, అనురాగాలూ, అనుబంధాలు, మానవ సంబంధాలు, విలువలు, సంస్కారం ఇలాంటివి కొరవడుతున్నాయి. ఈ మధ్య ఒక వాట్సప్ సందేశంలో ఒక పెద్దాయన ఉపన్యాసం విన్నాను. అందులో ఆయన ఒక మాట అన్నారు. పిల్లలకి వాళ్ళమ్మ బాక్స్ లో తినుబండారాలు పెడుతూ "నువ్వే తినాలి! ఎవరికీ పెట్టద్దు." అని చెపుతుందట! అది నిజమే అలా నేర్చుకున్న పిల్లలు చివరికి పెద్దలకి కూడా పెట్టడానికి ఇష్టపడరు. సమస్య చదువులతో పాటు పెంపకాలలో కూడా ఉంటోంది. మనం మన తల్లిదండ్రులకి ఏ విలువ ఇస్తామో, రేప్పొద్దున్న మన పిల్లలు మనకి అదే విలువ ఇస్తారన్న విషయం మాత్రం మర్చిపోకండి. మననుండే వాళ్ళు నేర్చుకుంటారు. అది మంచైనా, చెడైనా! కాబట్టి మీ తల్లుదండ్రులని అనాధలని చెయ్యకండి, భవిష్యత్తులో మీరు అనాధలు కాకండి.
 
 
మరిన్ని శీర్షికలు
anukokunda short flim review