Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
thailand

ఈ సంచికలో >> శీర్షికలు >>

ప్రతాపభావాలు - -ప్రతాప వెంకట సుబ్బారాయుడు

pratapabhavalu

ఏడు కొండలవాడా! వేంకట రమణా!!

మా చిన్నబ్బాయికి పుట్టు వెంట్రుకలు తీయించడానికి తిరుపతి వెళదామనుకున్నాం.

నేను అప్పుడు పనిచేస్తున్న ఆఫీసులో మా ప్రాజెక్ట్ కి అవసరమయ్యే మెటీరియల్స్ సబ్ కాంట్రాక్టర్స్ నుంచి తీసుకోవడం, చెక్ చేసుకోవడం, వాళ్ల బిల్స్ క్లియర్ చేయడం నా చేతుల్లోనే ఉండేది. మా ఆఫీసు సిటీకి 60 కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల వాళ్ల సౌలభ్యం కోసం మా ఇంటిదగ్గరే మెటీరియల్, బిల్ తీసుకునే వాడిని, తర్వాత కంపెనీ నుంచి చెక్స్ తీసుకుని వాళ్లకి అందించేవాడిని. అయితే పనిపరంగా వెండర్స్ కి దగ్గరగా ఉండే నేను, వ్యక్తిగతంగా వాళ్లతో ఎటువంటి రిలేషన్స్ పెట్టుకునే వాడిని కాదు(బయట నుంచి బయటే చెక్స్ ఇవ్వడం, మెటీరియల్ కలెక్ట్ చేసుకోవడం జరిగేది తప్ప ఇంట్లోకి ఆహ్వానించే వాణ్ని కాదు) సంస్థకి తప్పుడు సంకేతాలు వెళతాయని. అందుచేత వెండర్స్ నన్నుగౌరవించేవారు. హద్దుమీరే వారు కాదు.

మా అబ్బాయికి పుట్టువెంట్రుకలు తీయిద్దామని అనుకున్నాం గనక మూడురోజులు సెలవు పెట్టాను. నేను సెలవులో వెళ్లేలోగా, పని పూర్తి చేసిన ఒక వెండర్ బిల్ క్లియర్ చెయ్యాలనుకుని, ఆ వెండర్ ను బిల్స్ తీసుకుని ఇంటి వద్దకు రమ్మన్నాను. "ఏంటి సార్! ఇంత హటాత్తుగా బిల్ సబ్మిట్ చేయమన్నారు" అన్నాడు.

"అవునండీ, నేను లీవ్లో వెళ్లేలోగా మీ బిల్స్ నేను సంతకం చేసి అకౌంట్స్ లో హాండోవర్ చేస్తే, నేను లీవ్ నుంచి వచ్చే సరికి మీ చెక్ సిద్ధంగా ఉంటుంది. అది తెచ్చి మీకివ్వొచ్చు. మా వర్క్ అనుకున్న టైం లో ఇచ్చారు. మీ బిల్స్ కూడా డిలే కాకుండా క్లియర్ అయ్యేలా చూసుకోవాలి కదా!"అన్నాను.

"ఎక్కడికి సార్? తిరుపతా?"అడిగాడు గబుక్కున.

"నాకు చెప్పడం ఇష్టం లేకపోయినా, ముక్తసరిగా ’ఊ’ అన్నాను.

అతను బైక్ మీద వేగంగా వెళ్లిపోయి మళ్ళీ పావు గంటలో వెనక్కి వచ్చి "సార్! మీ ఆఫీసులోనే మరో బ్రాంచ్ లో రామారావు పనిచేస్తాడు కదా, వాళ్ల మామగారు ఎక్స్ ఈ వో, ఆయన చేత ఈ లెటర్ రాయించుకొచ్చాను. తీసుకోండి. ఉపయోగపడుతుంది"అన్నాడు.

చెప్పొద్దూ నాకు చెడ్ద చిరాకు వచ్చింది. "నాకు ఇలాంటివి నచ్చవని మీకు తెలుసుగా?" అన్నాను ముఖం కోపంతో చిట్లించి.

"ఎందుకైనా మంచిది ఉంచండి సార్"అని నా చేతిలో ఉత్తరం పెట్టి రివ్వున వెళ్లిపోయాడు.

నేను విసుగ్గా మా ఆవిడకిచ్చి "అక్కడెక్కడన్నా పెట్టు" అన్నాను.

అప్పట్లో నేను డిప్లొమా చేశాను. బీ టెక్ చెయ్యడం కోసం, ఎంట్రన్స్ రాయడానికి అప్ప్లై చేశాను. ఆ ఎక్జామ్ ఆదివారం. ఆ రోజు సాయంత్రమే తిరుపతికి ట్రైన్ టిక్కెట్లు తీసుకున్నాను. మా కుటుంబ సభ్యులమందరం హిమాయత్ నగర్ లోని టి టి డి కార్యాలయానికి వెళ్లి బయోమెట్రిక్ లో దర్శనం బుక్ చేసుకున్నాం.

సరిగ్గా తిరుపతికి వెళ్లడానికి నాలుగు రోజులుందనగా మా పెద్దబ్బాయికి జ్వరం వచ్చింది. మా ఆవిడ ఆందోళనగా "తిరుపతి వెళ్లడానికి ఇంక నాల్రోజులే ఉంది. ఎలా?"అంది.

"అంతా ఆయన చూసుకుంటాడు. తగ్గిపోతుంది వర్రీ అవకు"అన్నాను. మనసులో నాకూ వర్రీగానే ఉంది.

ఇక్కడ మా పెద్దబ్బాయి గురించి కాస్త చెప్పాలి. చిన్నప్పట్నుంచి వాడికి అనారోగ్యమే! కాస్త ఎక్కడన్నా నీళ్లు తాగితే మోషన్స్, వామిటింగ్స్ వచ్చేవి. ఒక్కోసారి మందులతో తగ్గేది, లేదంటే అడ్మిటే! అలా ఎన్నిసార్లు జారిగిందో!గతంలో మా ఫ్యామిలీ డాక్టర్- వాడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, కాచి చల్లార్చిన నీళ్లే పట్టాలని, బయటి పదార్థాలు అస్సలు పెట్టకూడదని మాకెన్నో జాగ్రత్తలు చెప్పాడు. అందుచేత వాడి విషయంలో మాకు భయమే!

రోజులు దొర్లిపోతూ, రేపే మా ప్రయాణం అన్న రోజు రాత్రికి తీసుకొచ్చాయి. మా అబ్బాయికి ఫివర్ తగ్గలేదు. డాక్టర్ ఇచ్చిన మందులు ఠంచనుగా వేస్తున్నా కూడా!

ఆ రాత్రి ఎందుకో బయట బోరున వర్షం స్టార్ట్ అయింది.

మా అమ్మ"ఒరే, ఈ పిల్లాడి సంగతి తెలుసుగా, ఫ్యామిలి డాక్టర్ దగ్గరుంటేనే గుండెలు గుబ గుబలాడుతుంటాయి. అలాంటిది అంత దూరం వెళ్లడం నాకెందుకో మనసు ఒప్పుకోవడం లేదు. ప్రయాణం వాయిదా వేసుకోరా" అంది బాధగా.

మా తమ్ముడు కూడా "అవునన్నయ్యా"అన్నాడు డల్ గా.

నా కెందుకో మనసంతా చిరాగ్గా ఉంది. బయట భోరున వర్షం, కరెంట్ లేదు, పైనుంచి వీళ్ల గోల "అది అంత ఈజీ కాదు, ట్రైన్ రిజర్వేషన్ అయిపోయింది. దర్శనానికి టోకెన్ తీసుకున్నాం" ఇప్పుడు ఏం చేయలేం. అంతా ఆయన చూసుకుంటాడు"అన్నాను గట్టిగా.

ఆ రాత్రి మాకెవరికీ నిద్ర పట్టలేదు.

మరుసటిరోజు ఎంట్రన్స్ టెస్ట్ కి బయల్దేరబోతూ మా ఆవిణ్ని పిలిచి " నా టెస్ట్ మధ్యాహ్నం 12 గంటలకు అయిపోతుంది. ఈ లోపల వీడిని మన డాక్టర్ కి చూపించి, మనం వెళ్లొచ్చో, లేదో కనుక్కో. నేను ఎగ్జామ్ హాల్లో నుంచి బయటకు రాగానే నీకు ఫోన్ చేస్తాను (అప్పట్లో సెల్ ఫోన్లు లేవు. టెలిఫోన్ బూత్ లోంచి లాండ్ లైన్లో మా ఇంటి పక్కనున్న షాపుకు చేస్తే, వాళ్లు మా ఆవిణ్ని పిలిచి ఇస్తారు). నువ్వు డాక్టర్ ఏం చెప్పాడో చెప్పు. ఒకవేళ ఆయన వద్దంటే వస్తూ, వస్తూ సికింద్రాబాదు స్టేషనుకు వెళ్లి టికెట్ క్యాన్సిల్ చేసుకుని వస్తాను"అన్నాను. తను ‘సరె’ అంది.

అనుకున్న ప్రకారం ఎగ్జామ్ హాల్లో నుంచి బయటకు రాగానే దగ్గర్లో ఉన్న షాపుకు పరిగెత్తుకెళ్లి మా ఆవిడకి ఫోన్ చేశాను.

తను లైన్లో కొచ్చి "డాక్టర్ ప్రయాణం చెయ్యొచ్చు, ఏం ఫర్వాలేదన్నాడండీ. ట్రావెలింగ్ లో వేయడానికి మందులు ఇచ్చాడు" అంది అంతలో మా అబ్బాయి వాళ్ల మమ్మీ చేతిలోంచి ఫోనందుకుని "డాడీ, అయామ్ అబ్ సొల్యూట్లీ ఓ కే" అన్నాడు నవ్వుతూ. నా మనసు కుదుట పడింది.

ఇంటికొచ్చి వాడి ఒళ్లు చూశాను. వేడిగానే ఉంది.

సాయంత్రం ఆటోలో సికింద్రాబాదు రైల్వే స్టేషన్ కు వెళ్లాం. దారి పొడుగుతా వాడు కబుర్లు చెబుతూనే ఉన్నాడు.

ట్రైన్ ఎక్కాం.

మా ఎదురుగా నేపాలీ దంపతులున్నారు. వాళ్లకు ఆరేడేళ్లున్న ఇద్దరు ఆడపిల్లలున్నారు. అతను టీ షర్ట్ లో, మెడలో రకరకాల రంగురాళ్ల దండతో చాలా గమ్మత్తుగా ఉన్నాడు. నాకు ఎందుకో అతని మీద మంచి అభిప్రాయం కలగలేదు. వాళ్లావిడ మాత్రం పంజాబీ డ్రస్సులో సాదా సీదాగా ఉంది.

ఇద్దరూ మమ్మల్ని పలకరించారు. నేను పొడి పొడిగా మాట్లాడాను. మా పెద్దాడు పడుకుంటానని మిడిల్ బెర్త్ ఎక్కి పడుకున్నాడు.

సరిగ్గా రాత్రి ఎనిమిదిన్నర. కిటికీలోంచి బయటకు చూస్తే బొగ్గుపొడి పోసినట్టు చీకటిగా ఉంది. సరిగ్గా అప్పుడు మావాడు మోషన్ కు వెళ్లాడు. వామిటింగ్ కూడా చేసుకున్నాట్ట. మా ఇద్దరికీ గుండెజారిపోయింది. అలా రెండూ కల్సి వస్తే పరిస్థితి ఎక్కడిదాకా వెళ్తుందో తెలుసు మాకు.

మా ఎదురుగా ఉన్నవాళ్లు మా ఆందోళన గమనించినట్టున్నారు. "ఏవైంది? బాబుకు ఒంట్లో బాగాలేదా? జ్వరమా" అడిగాడు.

"ఆఁ" ముక్తసరిగా అన్నాను.

"గాబరా పడకండి, ఏం కాదు. నా దగ్గర పేరాసెట్మాల్ ఉంది. మోషన్ తగ్గడానికి కూడా ట్యాబ్ లెట్ ఉంది ఇవ్వనా?"

"అవసరం లేదు. వాడు ఆల్రెడీ మెడికేషన్లో ఉన్నాడు. మా డాక్టర్ ఇచ్చాడు"అన్నాడు. మా వాడు పడుకున్నాడు. వాళ్లావిడకి ఏదో చెప్పాడు. ఆవిడ రెండు ప్లేట్లలో రెండు పూరీల చొప్పున, కూరతో వేసి అతనికి పట్టుకొచ్చిచ్చింది. అవి మా ముందు పెట్టి "ఇదిగో తినండి"అన్నాడు.

నా మనసులో రకరకాల ఆలోచనలు. వాళ్లు అపరిచితులు. అసలే మనసంతా చికాగ్గా ఉంది. ఇప్పుడు వాళ్లిచ్చింది తిన్నాక ఏవన్నా సమస్య వస్తే? "ప్లీజ్, వద్దు"గట్టిగానే తిరస్కరించాను.

వాళ్లావిడ వంక తిరిగి అవి లోపల పెట్టేయమన్నాడు. మేము తినక పోతే వాళ్లూ తినరట. నాకు కోపం, విసుగూ కలగా పులగంగా వచ్చాయి. వాళ్ల పిల్లల్ని చూస్తే జాలేసింది. "సరే, ఇవ్వండి"అన్నాను ఏం చెయ్యాలో తెలీక. వాళ్లిద్దరి ముఖాలూ పూర్ణచంద్రాలయ్యాయి.

మాకు పెట్టి వాళ్లూ తిన్నారు. మా అబ్బాయి మోషన్స్ కు, వామిటింగ్స్ కు వెళుతూనే ఉన్నాడు. మా అబ్బాయితో నేనెళితే అతను, మా ఆవిడ వెళితే వాళ్లావిడ తోడూ వస్తూనే ఉన్నారు. రాత్రంతా మాతో పాటూ మేల్కొని మాకు ధైర్యం చెబుతూనే ఉన్నారు.

వాళ్లకి రేణిగుంటలో షాప్ ఉందట. మాటల సందర్బంలో చెప్పాడు.

రేణిగుంటలో రైలు ఆగినప్పుడు తమతో పాటు దిగిపోయి, తమ ఇంట్లో ఉండి, ఫ్యామిలీ డాక్టరుకు చూపించుకుని తిరపతి వెళ్లమని వాళ్లిద్దరూ ఎంతో బతిమాలారు. మొదట్లో వాళ్లను తప్పుగా అర్థం చేసుకున్నందుకు మనసులో సిగ్గుపడుతూ వాళ్ల చేతులు పట్టుకుని వాళ్లు మాకిచ్చిన ధైర్యానికి కృతజ్ఞతలు చెప్పి అక్కడ దిగలేమని సున్నితంగా తిరస్కరించాను.

అతని ఆహార్యం చూసి అతన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. నా చదువంతా ఏమై పోయిందో?

తిరుపతిలో దిగాక మా బాబుని ఎత్తుకున్నాను. వాడు తల నా భుజం మీద పెట్టి పడుకున్నాడు. అక్కడ డాక్టర్ కి చూపించి తిరుమల వెళదాం అనుకుని అదే మా ఆవిడతో అన్నాను. తను సమాధానం చెప్పేలోగా మావాడు కొండపైకి వెళ్లాక అన్నాడు. రెండు మూడు సార్లు అలాగే అన్నాడు ఎందుకో. నాకూ ఎందుకో అదే సరైనదనిపించింది.

బస్ లో కొండపైకి వెళ్లాం. వెళుతున్నంత సేపూ, మళ్లీ మోషన్ కాని వామిటింగ్ కాని వస్తుందేమో, నీరసంతో పడిపోతాడేమో అని మనసులో ఆందోళనగానే ఉంది.

తిరుమల చేరుకోగానే శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలని తెలిసింది. ఇసక వేస్తే రాలనంత మంది జనం. నా మెదడు మొద్దుబారిపోయింది. బాబును మా ఆవిడకిచ్చి వాళ్లిద్దరినీ నీడలో కూచోబెట్టి, గదుల కోసం వెళ్లాను. ఎక్కడా గదులు దొరకలేదు. ఏం చేయాలో తోచలేదు. టాప్ లెవెల్ లో రికమెండేషన్లు తెచ్చిన వాళ్లను కూడా పట్టించుకోవడం లేదు.

మనసంతా పిచ్చులూ, వెర్రులుగా ఉంది.

అంతలో తెల్ల బట్టల్లో ఉన్న ఒకాయన బయట కొచ్చాడు.

నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. వెంటనే మా ఆవిణ్ని "మన ఊళ్లో వెండర్ ఇచ్చిన కాగితం ఏం చేశావు? అడిగాను ఆత్రుతగా" పెట్టెలో పెట్టానంది.

"త్వరగా తీయ్"అన్నాను. తను తీసిచ్చింది.

తనకు ఆ ఉత్తరం ఇచ్చి, బాబును నేను చూస్తాను, ఆ తెల్ల బట్టలేసుకున్న వ్యక్తి దగ్గరకు వెళ్లి, ఆయనకు బాబును చూపించి, పరిస్థితి వివరించి, ఉత్తరం ఇవ్వమన్నాను.

తను అలాగే చేసింది. ఆయన బాబు వంక చూశాడు. నా ఒళ్లో నీరసంగా పడుకుని ఉన్న వాడిని చూసి ఏవనుకున్నాడో, ఆ ఉత్తరం లోపలికి తీసుకెళ్లి, రూమ్ ఇచ్చినట్టుగా రిసీట్ పట్టుకొచ్చి ఇచ్చాడు. ఆయనకు, మా వెండర్ కు మనసులో ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నానో తెలీదు.

రూమ్లో సామాను పడేసి, బండీలో కాఫీ తయారు చేస్తున్న వ్యక్తి దగ్గరకు వెళ్లి"బాబూ ఇక్కడ ఉన్న మంచి ప్రైవేట్ హాస్పిటల్ చెప్పు, బాబుని చూపించాలి"అన్నాను ఆత్రుతగా.

"ఎందుకు సార్, గవర్నమెంట్ హాస్పిటల్ కొద్ది దూరంలో ఉంది. " అని ఎలా వెళ్లాలో గుర్తులు చెప్పి "వెళ్లి చూపించండి"అన్నాడు తల తిప్పకుండానే.

గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద ఉన్న ’గొప్ప అభిప్రాయంతో’ "మంచి ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడుందో చెప్పుబాబూ నీకు పుణ్యముంటుంది"అన్నాను.

"సార్ నేను చెబుతున్నా కదా, ఇక్కడ బాగా చూస్తారు. వెళ్లండి"అన్నాడు నవ్వుతూ.

చేసేదేం లేక వేగంగా అక్కడికి వెళ్లాం. బ్రహ్మోత్సవాలనో ఏంటో చక్కగా, నీట్ గా ఉంది.

నేను బాబు నెత్తుకుని డాక్టర్ గారున్న గది తలుపు దగ్గర నుంచున్నాను. నాతో పాటు నలుగురైదుగురున్నారు. లోపల ఎర్రగా కమలాపండులా ఉన్న డాక్టరు గారు తన ఎదురుగా ఉన్న పేషేంటును చూస్తూ కనిపిస్తున్నాడు. ఆ పేషెంటును చూడడం పూర్తవగానే ఏమనుకున్నాడో నన్ను లోపలికి రమ్మన్నాడు. నేను వెళ్లి ఆయనముందు కూచుని జరిగింది చెప్పాను.

ఆయన బాబును పరీక్షించి "వైరల్ ఫివర్ అనుకుంటా, రేపు మీరు ఇక్కడే బ్లడ్ టెస్ట్ చేయించండి, ఇదిగో ఈ ఇంజక్షన్ చేయించండి, రూమ్ కి వెళ్లాక ఏదన్నా లైట్ గా తినిపించి ట్యాబ్లెట్లు వేయండి"అన్నాడు.

నేను మా రెండోవాడి పుట్టువెంట్రుకలు తీయించడానికి వచ్చిన విషయం చెప్పి, నేనూ మా పెద్దబ్బాయికూడా జుట్టిద్దామనుకున్నామని చెప్పాను.

ఆయన నా వంక సూటిగా చూసి "ఈ బాబుది వద్దులేండి" అన్నాడు.

నేను బయటకొచ్చి మా ఆవిడతో ‘తిరుమల వచ్చి డాక్టర్ కు చూపించుకోవడమేంటో, బ్లడ్ టెస్టులు చేయించుకోవడమేంటో, వీడు జుట్టు ఇవ్వలేకపోవడమేంటో’ అన్నాను బాధగా, నిరాశగా.

పాపం.. అసలే ఓపిక లేని వాడికి ఇంజక్షన్ చేయించాలంటే నాకు చాలా బాధ కలిగింది.

ఆ పక్కనే ఉన్న రూం లో ఇంజక్షన్ చేస్తున్నారు. మా వాడిని లేపి ఇంజక్షన్ ఇవ్వబోతున్న విషయం చెప్పాను. వాడు ’ఊ’ అన్నాడు ఏడుపు గొంతుతో. వాడు నా భుజం మీద పడుకుని ఉండగానే పిర్ర మీద ఇంజక్షన్ చేసింది నర్స్. ఎలా అంటే నొప్పికి ఏడుస్తాడనుకున్న మా వాడు, ’ఇంజక్షన్ చేయమను డాడీ"అనేంత సున్నితంగా. ఆవిడకి థాంక్స్ చెప్పి రూం కు బయల్దేరాం.

రూం కు వస్తుంటే మధ్యదారిలో కల్యాణ కట్ట ఉంది. అక్కడికి రాగానే మా పెద్దాడు"డాడీ నేను జుట్టిస్తా"అన్నాడు. నాకు ఒళ్లు జలదరించింది. వాడి ఒళ్లు అప్పటికీ వేడిగా ఉంది.

మా ఆవిడ "డాక్టర్ వద్దన్నారు కదండీ"అంది ఆందోళనగా.

"ఆ వేంకటేశ్వరుడే అనిపించాడేమో, అలాగే జుట్టిప్పిద్దాం" అన్నాను.

"జుట్టిచ్చాక స్నానం చెయ్యాలిగా, ఇలా ఒళ్లు పెనంలా కాలిపోతూంటే ఎలాగండి"అంది దాదాపు ఏడుపు గొంతుతో. ’చెప్పాను కదా ఆయనే చూసుకుంటాడని’ అన్నాను మొండి ధైర్యంతో. వాడిని అక్కడ క్షురకుడి ముందు కూచోబెట్టి, వాడి చేత స్వామికి దణ్నం పెట్టించి, జుత్తు ఇప్పించాను. మేమూ జుట్టు ఇచ్చేశాం.

అప్పుడు రూ.5 కు బకెట్ వేడినీళ్లు ఇచ్చేవాళ్లు. అవి తెప్పించి వాడికి స్నానం చేయించాం.

అది పూర్తయ్యాక, అంతకు ముందు దాకా నా భుజం మీద పడుకునే ఉండేవాడు, నడవడం మొదలెట్టాడు. హోటల్లో ఇడ్లీలు తిని అందరం స్వామి దర్శనానికి వెళ్లాం. మేమందరం కళ్లారా ఆ మంగళ స్వరూపాన్ని చూశాం.

అది మొదలు మాతో పాటూ కొత్త ఉత్సాహంతో, సంతోషంగా తిరుమల అంతా తిరిగాడు. ఆ శీనివాసుడి లీలకి అందరం ఆశ్చర్యచకితులమయ్యాం.

నా ప్లానేంటంటే ట్రైనులో విజయవాడ వెళ్లి మా కజిన్ ఇంట్లో నేను పడిన టెన్షనంతా పోయేలా రిలాక్స్ అయ్యి, ఒకరోజు రెస్ట్ తీసుకుని సికింద్రాబాదు వెళదామని,

స్టేషన్లో మా ఆవిడ "ఏవండీ, ఇక్కడ నుంచి అన్నవరం వెళదామండి. నేనలా అనుకున్నాను" అంది.

"అదేంటి, వీడు ఎంత వీకయ్యాడో తెలుసు కదా, అలా ఎలా అనుకున్నావు? స్టేషన్లో చూడు ఎంతమంది జనం ఉన్నారో, నువ్వెక్కడి కంటే అక్కడికి వెళ్లిపోగలమనుకుంటున్నావా"అన్నాను చిరగ్గా.

అలా ఆందోళనగా, విసుగ్గా, చిరాగ్గా ఉన్న తరుణంలో ఒక కూలీ- పచ్చని పసిమి రంగులో, పొట్టిగా ఉన్నాడు. మా దగ్గరకు వచ్చి "అన్నవరం కు టిక్కెట్లు కావాలా, సీటుకు యాభై రూపాయలు ఎక్కువియ్యండి"అన్నాడు.

నేను మోసపోతానేమో అన్న భయంతో "వద్దులే" అన్నాను.

"టికెట్లు ఇచ్చింతర్వాతే డబ్బివ్వండి"అన్నాడు.

"టిక్కెట్లు ఇచ్చాక కాదు, మమ్మల్ని ట్రైన్లో, మా సీట్లలో మమ్మల్ని కూర్చోబెట్టాక, మొత్తం మీద ఇంకో యాభై ఎక్కువిస్తాను. కానీ సీట్లలో కూర్చోబెట్టాకే"అన్నాను.

అతను వెళ్లి అర గంటైనా రాలేదు. ఇహ రాడు అనుకున్న సమయంలో వచ్చి టిక్కెట్లు మా చేతిలో పెట్టి సామాను తీసుకుని ముందు నడుస్తూ, మమ్మల్ని ట్రైన్ ఎక్కించి, సీట్లలో కూర్చోబెట్టాడు. నేను డబ్బు అతని చేతిలో పెట్టాను. అతను క్షణంలో అంతర్ధానం అయ్యాడు. మనసులో అతనికి ఎందుకో దణ్నం పెట్టుకోవాలనిపించి పెట్టుకున్నాను.

అన్నవరం లో వ్రతం, స్వామి దర్శనం శీఘ్రంగా జరిగిపోయాయి. అక్కడి నుంచి విజయవాడలో ఉన్న మా కజిన్ ఇంటికెళ్లి, అమ్మవారి దర్శనం కోసం గుడికెళ్లాం. తామర తంపరగా జనం. కొండపైకి ఎక్కాక అక్కడే ఉన్న ఒక కానిస్టేబుల్ ను దర్శనానికి టికెట్ల దర్శనం ఎక్కడ? అని అడిగాను. అతను తన వెనకాల ఉన్న ధర్మ దర్శనం దారి చూపించి -‘వెళ్లండి’ అన్నాడు. దర్శనం ఎలా అయిందంటే అరగంటలో. విజయవాడలో ఉన్నవాళ్లు సైతం నమ్మలేదు.

ఆందోళనతో మొదలైన ట్రిప్. ఆకస్మికంగా రూట్లు మార్చుకుంటూ దేవుళ్లందరినీ దర్శింపజేసింది.

అప్పటి పరిస్థితులు ఇప్పుడు తల్చుకున్నా ఒళ్లు గగుర్పొడుస్తుంది.

ఏది ఏవైనా ఆ వేంకటేశ్వరుని లీలలు అలౌకికం, అద్భుతం. తనువూ, మనసును తన్మయత్వానికి లోనయ్యేలా చేస్తాయి. ఈ జన్మలో నాకూ ఆ అనుభూతి దక్కినందుకు స్వామివారికి మనఃపూర్వక నమస్సులు.

గోవిందా..గోవిందా!

మరిన్ని శీర్షికలు
vaaram varaam vari vari varaphalalu