పుట్టపర్తి..బాబా!
నాన్నగారి తరఫు వాళ్లలో సాయిబాబా డెవోటీస్ ఉన్నారు. నా చిన్నప్పుడు నేను అమ్మానాన్నలతో వాళ్లింటికి వెళ్లేవాణ్ని. వాళ్లింటి హాల్లో కూర్చున్న పెద్ద బాబా విగ్రహం ఉండేది. ఎంతో కళగా చూడంగానే అప్రయత్నంగా రెండు చేతులూ కలిసిపోయి నమస్కరించేవి. అక్కడ గురువారం భజనలు చేస్తారట. వాళ్లింటి నుంచి వచ్చేప్పుడు, బాబా ఫోటోలు, విబూది పొట్లాలు తెచ్చుకునేవాళ్లం. స్కూలికి వెళ్లేప్పుడు బాబా ఫోటో జేబులో పెట్టుకునేవాణ్ని. పొద్దుట స్నానం చేయంగానే, రాత్రుళ్లు పడుకునే ముందు విధిగా విబూది ధరించేవాణ్ని. ఫోటో, విబూదీ నాతో ఉంటే బాబా తోడున్నట్టు గొప్ప ఆత్మవిశ్వాసం కలిగేది. ఇఅది చిన్నప్పటి మాట!
పెద్దవుతున్న కొద్దీ ఆయన మీద వినవచ్చే సంగతులు నా మనసును నమ్మకం, అపనమ్మకం ల మధ్య ఊగిసలాడింపజేసేవి (చదువు మూఢ విశ్వాసాలని, నమ్మకాలని దూరంగా ఉంచుతుందని నేను చదివిన కారణం కావచ్చు).
ఇదిలా ఉండగా నేను శంకరమఠ్ ఏరియాలోని శివం దగ్గర్లో ఉన్న ఎన్ సీ సీ లో జాబ్ చేస్తుండేవాణ్ని. ఒకసారి బాబా శివంలో ఉండడానికి వస్తున్నాడని తెలిసింది. అప్పట్లో మేము హెచ్ ఏ ఎల్ కాలనీలో ఉండేవాళ్లం. మా ఆఫీసు తొమ్మిది గంటలకి. హెచ్ ఎ ఎల్ నైట్ షిఫ్ట్ డ్రాపింగ్ బస్ దాదాపు ఆరుగంటలకి బయలుదేరి శివం రూట్ నుంచి వెళుతుంది. అంచేత నేను కాస్త పెందరాళే బయలుదేరి, ఆ బస్సులో వెళితే ఆయణ్ను చూడొచ్చు అనిపించింది.
ఆ బస్ ఎక్కి శివం చేరాను. మైక్ లోంచి ‘ఓం’ అన్న ఛాంటింగ్ మంద్రంగా వినిపిస్తోంది. ఆకాశం ఎందుకో అక్కడక్కడా మబ్బులు పట్టి ఉంది. సూర్యుడు లేతగా కనిపిస్తున్నాడు. అప్పటికే అక్కడ ఆయన దర్శనం చేసుకోవాలని జన సముద్రం ఎదురుచూస్తోంది. నేనూ నుంచున్నాను. మొట్టమొదటి సారిగా ఆయణ్ను చూడబోతున్నాను. ‘బాబా ఎలా ఉంటాడో, ఎప్పుడొస్తాడో’ అన్న ఆత్రుత.
కొద్దిసేపటి తర్వాత కాషాయాంబరధారియైన బాబా చిన్నగా నడుచుకుంటూ బయటకొచ్చాడు. అందరిలో ఏదో తెలియని తన్మయత్వం. బాబా..బాబా అని చిన్నగా అరుస్తున్నారు. సన్నటి వర్షపు జల్లు ప్రారంభమైంది. ఆ చల్లటి వాతావరణంలో, ఆకాశం పైనున్న ఇంద్రధనుసును చూస్తూ, కింద బాబాను దర్శించడం, ఒక అలౌకికానుభవం. అనిర్వచనీయం. జన్మధన్యతనొందిన భావన. ఛాంటింగ్ ఆపొద్దు, కొనసాగించండి అంటూ రెండు చేతులూపుతూ సూచిస్తున్నారు. కొంతమందికి తమ సమస్యలను రాసిన కాగితాలను ఆయనకు అందిస్తున్నారు. మరికొంతమందికి ఆయన విబూది సృష్టించి ఇస్తున్నారు.
ఇది జరిగిన కొంతకాలానికి నా స్నేహితుడు రమేష్, బాబా డెవోటీ బి వి రమణరావు రచించిన ప్రేమబంధం పుస్తకం కానుకగా ఇచ్చాడు. నిజంగా అద్భుతమైన, ప్రతి భక్తుడూ చదివితీరాల్సిన పుస్తకం. ఇప్పటికి ఎన్నిసార్లు చదివానో!
పోయిన సంవత్సరం అనంతపురంలో జరిగిన కవి సమ్మేళనానికి నేను మా ఆవిడ హాజరయ్యాము. ఆ రోజు రాత్రి పదిగంటలకు ట్రైనుకు రిజర్వేషన్ అయిపోయింది. మా కవితా పఠనం పదకొండు గంటలకు పూర్తయ్యింది. అక్కడికి కదిరి నరసింహస్వామి ఆలయం దగ్గరని తెలియడంతో వెంటనే బయలుదేరి వెళ్లాం. ఆలయం మూసేస్తుంటే వెళ్లి దూరం నుంచి వచ్చామని చెప్పి అభ్యర్థించి స్వామి దర్శనం చేసుకుని, భోజనాలయం మూసేసినా అక్కడి సెక్యూరిటీ పర్సన్ దయవల్ల లోపలికెళ్లి భోజన ప్రసాదం తిని, అక్కడి నుంచి పుట్టపర్తి దగ్గరే అని తెలియడంతో ప్రశాంత నిలయం చూడాలని బయల్దేరాం. ఎంత సేపు నుంచున్నా అక్కడి నుంచి పుట్టపర్తికి వెళ్లే బస్ దొరకలేదు. నిజానికి పావుగంటకో బస్ ఉంటుందట స్థానికులు చెప్పారు. కొంతసేపటికి బస్ వచ్చింది. ఎక్కి పుట్టపర్తిలో దిగేసరికి అయిదున్నరయింది. అక్కడి నుంచి అనంతపురానికి మూడు గంటలట. గబ గబ ప్రశాంతనిలయాన్ని చూసి బయల్దేరాలన్న ఆత్రుత! సరే లోపలికెళ్లాం. స్వామి సమాధి మందిరానికి వెళ్లాలంటే ఆడవాళ్లు, మగవాళ్లు విడి, విడిగా నుంచుని వెళ్లాలట. మా ఆవిణ్ని లేడీస్ వైపు వెళ్లమని నేను లోపలికెళ్లి చూడగా జంట్స్ వి ఐదారు లైన్లున్నాయి. అలాగే కొంత దూరంలో చాలా లైన్లు లేడీస్ వి కనిపించాయి. అప్పుడు మొదలైంది నాకు భయం. తను ఎక్కడికెళ్లి, ఏ లైనులో నుంచుందో. అసలే టైము తక్కువుంది. స్వామి దర్శనం చేసుకోడానికి నాకెంత టైం పడుతుందో’ అనుకుంటుండగా నా లైన్ కదిలి పది నిముషాల్లో దర్శనం పూర్తయింది. సమాధిని దర్శించుకున్న నా చేతిలో గులాబీ రేకలు ఉంచారు అక్కడి వాలంటీర్లు. హడావుడిగా బయటకొచ్చిన నేను లేడీస్ ఎంట్రెన్స్ వైపెళ్లి, లోపలికెళ్లి తనను వెదకుదామంటే అక్కడి సెక్యూరిటీ లేడీస్ నన్ను పంపడం లేదు. ‘మేము రాత్రి ట్రైనుకు వెళ్లాలని తనను ట్రేస్ చేయడం చాలా ముఖ్యమనీ’ చెప్పాను. అయినా ‘ససెమిరా’ అన్నారు. పైగా కొద్దిగా దూరంగా నుంచోమని, లేకుంటే సీ సీ టీవీలో నన్ను చూసి వాళ్ల ఆఫీసర్లు వాళ్లని మందలిస్తారని అన్నారు. చేసేదేం లేక ఓ రెండు నిముషాలు నుంచున్నాను. ఉండబట్టలేక మళ్లీ వెళ్లి రిక్వెస్ట్ చేశాను. ఊహూ..ఫలితం లేకపోయింది.
అప్పుడొచ్చింది ఒకావిడ అచ్చం లక్ష్మీ దేవిలా ఉంది. ’ఏంటండీ’ అంది. నాకు ప్రాణం లేచొచ్చి, విషయం చెప్పాను.
ఆవిడ నవ్వుతూ చూసి ’ఇక్కడన్నీ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. అంతా సవ్యంగా జరుగుతుంది. మీరేం దిగులుపడొద్దు. వెళ్లి అక్కడ నుంచోండి. ఆవిడే వస్తుంది"అని వెళ్లిపోయింది. నేను ఓ ఐదు నిముషాలు నుంచున్నాను. కాని మనసూరుకోదుగా, ‘ ఆవిడకేం చెప్పి వెళ్లిపోయింది. చెప్పడం ఎన్నైనా చెబుతారు. జరగకపోతే..’మళ్లీ మనసు కుదురు కోల్పోవడంతో వెళ్లి సెక్యూరిటీ లేడీస్ దగ్గరకు వెళ్లాను.
మళ్లీ ఆవిడే నా దగ్గరకు వచ్చి’ నేను ఇక్కడి సెక్యూరిటీ లో సేవ చేస్తాను. మా ఆయనా మరోచోట సేవ చేస్తారు. నా డ్యూటీ టైం అయిపోవడంతో రూం కి బయల్దేరాను. ఇంతలో మిమ్మల్ని చూశాను. సరె.. నేను లోపలికి వెళ్లి మీ ఆవిణ్ని కలిసి మిమ్మల్ని కలవడానికి ఇక్కడికి రమ్మని చెబుతాను’ అని మా ఆవిడ వేసుకున్న దుస్తులు, రూపురేఖలు తెలుసుకుని ’మీరు అక్కడ నుంచోండి’ అని లోపలికె వెళ్ళొచ్చి, "మీ ఆవిడతో మాట్లాడాను, తనొచ్చేస్తుంది’ అంది.
‘అసలు ఈవిడ మా ఆవిణ్ని కలిసిందో లేదో, తనని గుర్తుపట్టగలిగిందో లేదో, అవే పోలికలతో ఉన్న మరొకావిడతో, తన భర్త ఎదురుచూస్తున్నాడని చెప్పిందేమో, ఆవిడ భర్తా ఎదురుచూస్తూంటాడు కాబట్టి, తను ‘సరె’ అనుంటుంది’ ఇలాంటి ఆలోచనలతో మెదడు వేడేక్కిపోతోంది. ఇలా ఆలోచిస్తున్నంతలో మా ఆవిడ వచ్చేసింది. మనసుకు గొప్ప రిలీఫ్. ఆవిడకి కృతజ్ఞతలు చెప్పుకున్నాం. ఆవిడ ‘సరె, నేను రూం కి వెళ్లి మా ఆయనకు చపాతీలు చేసుకోవాలి’ అని ’ మీరు మీరనుకున్న టైం లో బయల్దేరాలంటే లోపల లక్ష్మీదేవీ, గాయత్రీమాత గుళ్లుంటాయి, వెళ్లి దర్శించుకోండి. అవి మూసే టైమయిపోతోంది. లేదా క్యాంటీన్లో భోజనం చేయండి. అదీ మూసేస్తారు. కాబట్టి దైవదర్శనమా, ఆహారమా ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసుకోండి’ అని నవ్వుతూ వెళ్లిపోయింది.
మా ఆవిడ ’ దేవతల దర్శనమే చేసుకుందామండి. భోజనం బయట హోటల్లో చేయోచ్చు‘ అంది. నాకూ అదే సబబనిపించింది.
లోపల రోడ్ల మీద ఒక్క మట్టి రేణువు కనిపించలేదు. ఎక్కడ చూసినా పచ్చని చెట్లు. సర్వత్రా టెన్షన్లు లేని ముఖాలు. సేవా దృక్పథాలు. సంతృప్తిగా ఆలయాల్లో దేవతల దర్శనం చేసుకున్నాం. చీకటి పడింది. బయటకొచ్చి ఆటోలో బస్టాండుకొచ్చి అనంతపురానికి బయల్దేరుతున్న బస్సును ఆఖరు క్షణంలో ఎక్కాం. బస్సు అలా వెళుతూనే ఉంది. బస్సూ, సమయమూ సమాంతరంగా పరిగెడుతున్నాయి. నాకేమో రైల్వే స్టేషన్ కి సమయానికి చేరుకోగలమా లేదా అన్న బెంగ క్షణ క్షణానికి పెరిగిపోతోంది. మా ఎదురుగా కూర్చున్న ఒక కుర్రాడికి మా ట్రైన్ విషయం చెప్పి ’బాబూ ఈ బస్సు సమయానికి చేరుకుంటుందంటావా?"అన్నాను. ‘చేరుతుంది సార్. ఒకవేళ ఒక్క పదినిముషాల ముందు చేరినా ఒక స్టాప్ ముందు దిగిపోయి, మిమ్మల్ని షార్ట్ కట్ లో స్టేషన్ లోకి తీసుకుపోతా’ అని చెప్పాడు. మా మాటల మధ్యలో తెలిసిన విచిత్రమైన విషయం ఏంటంటే అదే చివరి బస్సుట. అది దాటితే, ధర్మవరానికి వచ్చి ఇంకో బస్ ఎక్కాలట. ఇంకేవన్నా ఉందా? అన్నమాట ప్రకారం దేవుడు పంపిన దూతలా మమ్మల్ని సరైన టైం కి అడ్డదారిలో స్టేషన్ కు చేర్చాడు. మేము ట్రైనెక్కి సికింద్రాబాదు చేరాం.
మనిషిలో భగవంతుణ్ని చూసే సంస్కృతి మనది. ప్రేమను విశ్వవ్యాప్తం చేసి, ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమందిని భక్తుల్ని చేసుకుని, విరాళాలు సేకరించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. అనంతపురం దాహార్తిని తీర్చారు. పెద్ద హాస్పిటల్ నిర్మింపజేసి ఎందరికో పునర్జీవితం ప్రసాదించిన మహా మనీషి. ఆయన భక్తులు వాలంటీర్లుగా మారి, అన్ని వైపులా విస్తరించి నిస్వార్థంగా అనేక సేవాకార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ తమ జీవితాలని ధన్యం చేసుకుంటున్నారు. అదృష్టవశాత్తు మనకి భూమ్మీద దర్శనం ఇచ్చిన భగవంతుడు. చంద్రుని చల్లదనం అనుభూతిస్తూ మచ్చను విమర్శించే నైజం ఉన్న మనుషులను ఆయన క్షమించుగాక! మన పాపం శమించు గాక!!
ఓం సాయిరాం
|