Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
indhanam cartoons

ఈ సంచికలో >> శీర్షికలు >>

నైల్ నదికి మానవాళి నివాళి - సి.హెచ్. పద్మావతి

ఎప్పుడెప్పుడు ఈజిప్టు వెళ్దామాని ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్స్తున్నమమ్మల్ని, మా కలల్ని మోసుకుంటూ ముంబై నుంచి కైరో కి విమానం గాల్లోకి ఎగిరింది. దాదాపు ఏడు గంటలు ప్రయాణించి , తెలతెలవారుతుండగా ఈజిప్టు గడ్డ మీద కాలు మోపాము.

ముందే మా పర్యాటక సంస్థ ద్వారా  అన్ని ఏర్పాట్లు చేసుకుని , ఇంగ్లీష్ వచ్చిన గైడ్ కావాలని అడగడం వల్ల ఎలాటి ఇబ్బందులు లేకుండా, బయట పడ్డాము. సామాను తీసుకొని టాక్సీ దగ్గరికి వస్తుంటే అక్కడున్న సిబ్బంది, టాక్సీ డ్రైవర్లు 'నమస్తే ఇండియా', వెల్కమ్ అమితాబ్ బచ్చన్, హలో షారుక్ ఖాన్,హలో కరీనా కపూర్ ' అని పలకరించారు . ఆ తరువాత ఈజిప్టు లో ఎక్కడికి వెళ్లినా ఇలాంటి పలకరింపులే . దాని బట్టి మన హిందీ సినిమాలు, యాక్టర్లు ఇక్కడ ఎంత పాపులరో అర్థం అయింది. హిందీ సినిమాలు ‘అరబిక్ సబ్ టైటిల్స్’ తో ఇక్కడ రిలీజ్ అవుతాయని మా గైడ్ చెప్పాడు.

దాదాపు గంట సేపు  ప్రయాణించి, 'గిజా గవెర్నెస్ 'లో మాకు కేటాయించిన హోటల్ చేరుకున్నాము.

గబగబా ఫ్రెష్ అయి,హోటల్ ద్వారం దగ్గరకు వచ్చాము. దూరంగా ,  ప్రపంచ ప్రఖ్యాత  'గిజా పిరమిడ్స్ ' పిలుస్తున్నట్లుగా కనిపించాయి.. నా ఒళ్ళు గగుర్పొడిచింది వాటిని చూడగానే .

సజీవ మానవ నిర్మిత  'గ్రేట్ పిరమిడ్':  అన్నిటి కన్నా పెద్దదైన 'గ్రేట్ పిరమిడ్' చూడడానికి సుమారు రెండు గంటలపైనే పడుతుందని మా గైడ్ చెప్పడం వల్ల , దాని కంటే చిన్నదైన ‘ఖఫరే (khafre ) పిరమిడ్ చూద్దామని టిక్కెట్లు తీసుకున్నాము. 

ఏదైనా కొత్త ప్రదేశం చూడాలనుకొన్నప్పుడు , ఆ ప్రదేశం చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు గురించి  తెలుసుకొని వెళితే, గైడ్ చెప్పే విషయాలు  మనం బాగా అర్ధం చేసుకొని, ఆనందించగలుగుతాము.. పిరమిడ్ కాంప్లెక్స్ లోకి అడుగు పెడుతూనే ఎదురుగా కనిపించింది  'అతి పెద్ద భారీ పిరమిడ్’

..ఇదే... ప్రపంచపు అతి పురాతన, అత్యద్భుత  సజీవ మానవ నిర్మిత  'గ్రేట్ పిరమిడ్' ….. నాకు మాటలలో చెప్పలేని అనుభూతి కలిగింది. కాలం చక్రం అటు పోట్లని తట్టుకొని, తమాయించుకొని, ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉంది.

ఈ గిజా పీఠభూమి కైరో నగర శివార్లలో నైల్ నదికి పడమర గా ఉంది. ఇక్కడ మూడు ప్రఖ్యాత పిరమిడులు,చక్రవర్తి కాఫు(Khafu ) ,వారి కుమారుడు ఖఫరే(Khafre ), మనవడు మెంకురే (Menkaure) సమాధులపై కట్టిన పిరమిడులు,  భారీ శిల్పాకృతి 'స్పీన్స్(sphinx ), రాణి గారి సమాధులు, కార్మికుల గ్రామం, కర్మాగారం మొదలైనవి కలిసి 'పిరమిడ్ కాంప్లెక్స్ గా పిలవబడుతోంది.

'గ్రేట్ పిరమిడ్' ఆఫ్ గిజా - దీనిని నిర్మించిన రాజు కాఫు (khafu ).ఈ పిరమిడ్ ఎత్తు దాదాపు  481.4 అడుగులు . ఈ గిజా పిరమిడ్ నిర్మాణానికి దాదాపు ఇరవై ఏళ్ళు పట్టిందిట.చక్రవర్తి కాఫు వజిర్(మంత్రి) హెమోన్ (Hemon ) లేక హేమియును (Hemiunu ) ఈ నిర్మాణానికి వాస్తు శిల్పి.

పారో కఫరె పిరమిడ్ లోపలి వెళ్ళుతున్నామంటే ఎదో తెలియని భావోద్రేకం కలిగింది. క్రీస్తు పూర్వం నిర్మించిన రాతి కట్టడంలోని రహస్యాలని తెలుసుకోబోతున్నాని ఉత్సాహం ..ఆత్రుత… మా గైడ్ పిరమిడ్ ప్రవేశ ద్వారం వరకు వచ్చాడు. గైడ్స్ కి లోపల రావడానికి అనుమతి లేదుట. మేమే వెళ్ళాము. దాదాపు 150 మెట్లు కిందకు దిగి వెళ్ళాము.పెద్ద గది. ఖాళీగా ఉంది .  ఎదురుగ మరో కటకటాల గది. ఎత్తైన దిమ్మ కనిపించింది.  దాని మీద పారో కఫరె మమ్మీ ఉండేదిట.

అప్పుడు రాజులని 'పారో'(pharao )లని పిలిచేవారట. ప్రజలు వారి రాజులని 'దేవదూతలు'గా అంటే  దేముడికి, ప్రజలకి మధ్యవర్తులుగా భావించేవారు. మన లాగే వీరు పునర్జన్మ ఉంటుందని నమ్మేవారు. కొత్త జీవితానికి  నాంది మరణం అని,శరీరం ఉంటేనే ఆత్మ తిరిగి శరీరం లో ప్రవేశిస్తుందని శవాన్ని చాల శ్రద్ధగా భద్రపరిచే వారు.తిరిగి జీవించినపుడు కొత్త జీవితానికి కావలసిన వస్తువులని, ధనాన్ని, సేవకులని ఆ సమాధిలో ఉంచేవారు.సాధారణంగా ధనవంతులే  తమ శరీరాల్ని 'మమ్మీలు' గా మార్చుకొనేవారు ఈ శవపేటికలు వివిధ  రకాలుగా చేసేవారు.వాటికి అందమైన అలంకరణలు జోడించేవారు.  వీటన్నిటిని మేము కైరో ఈజిప్షియన్ మ్యూజియంలో చూసాము.

కార్మికుల గ్రామం, కర్మాగారం   అవీ ఇప్పుడు లేవు కానీ కొద్దీ దూరం నుండి రాణి గారి, వారి పిల్లల సమాధులని  చూడవచ్చు. గిజా పిరమిడ్ నుండి ఈ సమాధులని చూడడానికి మేము గుర్రపు బండి లో వెళ్ళాము. .గుర్రాల మీద వెళ్ళచ్చు.  దూరం నుంచి ఈ సమాధులన్ని ఒక గీతలా  కనిపిస్తాయి. అన్నీ  గిజా పిరమిడ్ కంటే బాగా చిన్నవే.

అక్కడ నుండి కొంచెం దూరంలో ఉన్న గ్రేట్ స్పిన్స్ (Sphinx ) చూడడానికి వెళ్ళాము. మనిషి తలా, సింహం శరీరం ఉన్న సున్నపు రాతి శిల్పం . కాళ్ళు జాపుకుని సేద తీరుతున్న భంగిమ లో ఉన్న పౌరాణిక జీవి .  సరిగ్గా మన నరసింహ అవతారానికి వ్యతిరేకం. ప్రపంచంలో ఉన్న అతి పురాతనమైన స్మారక శిల్పం గా పిలువబడుతోంది. Sphinx  తల అప్పటి రాజు 'పారో కఫరె' శిరస్సు లా ఉంటుందని అంటారు. మనిషి తల తెలివికి , సింహం శరీరం బలానికి సంకేతం. పారో కఫరె అతి బలవంతుడు, తెలివైన వాడు అని మిగిలిన ప్రపంచానికి తెలిపేందుకే ఈ శిల్పాన్ని చెక్కించాడు అంటారు.

ఈ శిల్పానికి ఉన్న ముక్కు, కళ్ళు బాగా శిధిలం అయిపోయాయి. నెపోలియన్ సైనికులు ఈ శిల్పం ముక్కుని తమ లక్ష్యం గా చేసికొని, తుపాకీ పేల్చడం లో శిక్షణ తీసుకున్నారు. అందుకే బాగా పాడై పోయిందని అంటారు. దగ్గరగా వెళ్లనివ్వరు. శిల్పానికి మరమ్మతులు అవుతున్నాయి.

మాకు మర్చిపోలేని మరో అనుభూతి ఈ పిరమిడ్స్ ని రాత్రి ‘సౌండ్ అండ్ లైట్ షో’ లో చూడడము. అద్భుతం ..అమోఘం... మరెన్నో విషయాలు తెలుసుకున్నాము.  ఇప్పుడు మనం వైద్య,  వైజ్ఞానిక శాస్త్రంలో సాధించాము అనుకున్న అనేక విజయాలను వారు అప్పుడే సాధించారు.

పిరమిడ్స్ లోపల చాల శుభ్రంగా ఉంది గాని, రోడ్డు మీదకి రాగానే మన ఇండియా గుర్తుకు వచ్చింది. ఎక్కడ బడితే అక్కడే పారేసిన చెత్త, ఎగురుతున్న కాగితాలు, దుమ్ము, ..ఈ గిజా వీధుల్లో పరిగెడుతున్న గుర్రాలని చూసాము. ఇక్కడ శాఖాహారం దొరకడం కష్టమే. ఇండియన్ హోటళ్లు ఉన్నాయి గాని చాల ఖరీదు. లోకల్ గా దొరికే ఆహారం ప్రయత్నిద్దామని  మా గైడ్ ని అడిగాము. ఫలాఫల్ దొరుకుతుంది అన్నాడు. దాని మధ్యలో కాబూలీ చానా తో చేసిన వడ -  మాకు ముంబై లో దొరికే 'వడా -పావ్ ' గుర్తుకు వచ్చింది.

అతి పెద్ద వస్తు సంగ్రహశాల:

మరునాడు ఈజిప్ట్ మ్యూజియం, దీనినే కైరో మ్యూజియం అని కూడా అంటారు,  చూడడానికి వెళ్ళాము.  పురాతన ఈజిప్ట్ సంస్కృతిని భద్రపరచిన అతి పెద్ద వస్తు సంగ్రహశాల.  మొదటి అంతస్తులో ప్రాచీన ఈజిప్ట్ పారోల సమాధుల నుండి సేకరించిన అనేక వస్తువులు, 'వేలీ ఆఫ్ కింగ్స్ ' నుండి  ఆఖరి రాజు 'తూతనఖమున్'(Tutankhamun ) సమాధి లో దొరికిన అనేకళాఖండాలు, అతని బంగారపు తొడుగుని చూసాము. ఈజిప్ట్ లో అనేక ప్రదేశాల నుండి తీసుకొచ్చిన 'మమ్మీ' లకోసం. ప్రత్యేకమైన విభాగం పైనే ఉంది.  వివరంగా చూడాలంటే ఒక రోజు కంటే ఎక్కువే పడుతుంది. మేము మ్యూజియం అంతా తిరుగుతూ చూస్తూ చాల మంది విద్యార్థులని చూసాము. వారు ప్రాచీన ఈజిప్ట్ నాగరికత మీద అధ్యయనం చేస్తున్న వారు. చదువు పూర్తి అయిన తరువాత గైడ్స్ లా పని చెయ్యచ్చుట. మహిళా గైడ్స్ ఎక్కువే ఇక్కడ.

ఖాన్ ఎల్ ఖాలీలీ బజార్ (Khan EL Khalili Bazar );

కైరో కి వచ్చిన ప్రతి టూరిస్ట్ తప్పకుండ వెళ్ళే బజార్ , అచ్చం మా ముంబై లోని క్రాఫోర్డ్ మార్కెట్ లా ఉంది.రక రకాల బొమ్మలు, సావనీర్లు , బట్టలు అమ్మే  వీధి దుకాణాలు , కస్టమర్లని రమ్మని పిలిచే దుకాణదారులు, రకరకాల తినుబండారాలు అమ్మే హోటళ్లు, కాఫీ హౌసులు .. పాత పాత భవనాలు... జనాలు, వాహనాలతో రద్దీగా   ఉన్నవీధులు  ..ఇలా ఎనెన్నో  .. నాకైతే ఒక క్షణం,  నేను ముంబైలో ఉన్న ఫీలింగ్ కలిగింది.. అక్కడ పాపులర్ అయిన  'పుదీనా చాయ్' తాగి, , మా హోటల్ దారి పట్టాము.

మర్నాడు పొద్దున్నే, మూడు గంటలకే కైరో నుండి, ఈజిప్ట్ కి దక్షిణ భాగంలో ఉన్న ఆస్వాన్ (Aswan )వెళ్ళే విమానం ఎక్కాము.

ఆస్వాన్ లో దిగడం ఏమిటి, అక్కడ మరో గైడ్ వచ్చి రిసీవ్ చేసుకొన్నాడు. క్రూయిజ్ కి వెళ్ళే ముందు,  దారిలో ఉన్న ఆస్వాన్ డామ్ దగ్గర ఆగాము. నైలు నది వరదలని నియంత్రించడానికి, తద్వారా వ్యవసాయానికి కావలసిన నీటిని నిలువ చేయడానికి, , జల విద్యుత్ ని ఉత్పత్తి చేయడం కోసం ఈజిప్ట్ ప్రభుత్వం ఈ 'హై డామ్' ని నిర్మించింది.

ఈ హై డాం రిజర్వాయర్ కి అప్పటి నాయకుడైన 'నాజర్' పేరు పెట్టారు. అందుకే 'నాజర్ సరస్సు' అని ప్రాచుర్యం వచ్చింది. ఈ హై డాం కట్టడానికి ఈజిప్ట్ కి  సోవియట్ యూనియన్ అందించిన సహాయానికి గుర్తు గా  అక్కడకి కొద్ది దూరంలోనే  'అరబ్ -సోవియట్ 'స్నేహ సంస్మరణార్ధం నిర్మించిన 'లోటస్ పువ్వు' ఆకారం లో ఉన్న కట్టడం ఉంది. దానిలో ఈ రెండు దేశాల చిహ్నాలని చూడవచ్చు.

ఫిలే దేవాలయం : అక్కడనుండి నాజర్ సరస్సులో ఉన్న 'అగ్లీక ద్వీపం' లో ఉన్న 'ఫిలే దేవాలయం ' చూడడానికి వెళ్ళాము.. ఈ గుడికి అధిదేవత  'వుసిరిస్' భార్య, 'హోరుస్'కి తల్లి అయిన 'ఐసిస్'. 'దేవతలకి తల్లి' గా ప్రసిద్ధి చెందింది.

దీనికి పడవలో వెళ్ళాలి.  పడవ దిగి, చిన్న కొండ పైకి మెట్లు ఎక్కి వెళ్ళాము.  నాజిర్ సరస్సు కట్టేటప్పుడు ఈ గుడి మునిగిపోకుండా యునెస్కో వారి సహాయంతో ఈ స్మారకాన్ని అతి జాగ్రత్తగా ముక్కలు ముక్కలు చేసి, సురక్షితమైన ఈ ద్వీపంలో ఒరిజినల్ టెంపుల్ గా సమీకరించారుట.ఇలా యునెస్కో వారి సహాయంతో తిరిగి నిర్మించిన స్మారక  కట్టడాలు ఎన్నో ఉన్నాయి ఈజిప్టులో.

మొదటి ద్వారం , దీన్నే 'ఫస్ట్ పైలాన్' అంటే 'ప్రధాన ద్వారం' అన్నమాట. అటు ఇటు గోడల మీద ఉన్న ఐసిస్ , హోరుస్, మొదలైన వారి చిత్రాలు చూసుకొంటూ , లోపలికి వెళ్ళాము. నాలుగు వైపులా '(లోటస్ పువ్వు) కలువ పువ్వు ' ఆకారం లో ఉన్న స్తంభాలతో ఉన్న విశాలమైన ప్రాంగణం కనిపిస్తుంది. ఆ స్తంభాలపైన చెక్కిన రక రకాల శాసనాలను, చిత్రాలను చూసాము. రెండవ పైలాన్ గుండా గర్భ గుడిలోకి వెళ్ళాము. లోపల మళ్ళీ పెద్ద పెద్ద స్తంభాలు. కాలక్రమంలో క్రైస్తవుల ప్రార్ధనా స్థలంగా ఎలా రూపాంతరం చెందిందో తెలిపే శాసనాలు గ్రీకు భాషలో ఉన్నాయిట. ఈ ప్రదేశంలో వెలుతురు తక్కువగా ఉండడం వల్ల, టార్చ్ లైట్ వెలుగులో చూడగలిగాము.

ఈ 'ఐసిస్ దేవత' ని 'ఆరోగ్య దేవతగా 'పూజించే వారట.అందుకే గ్రీకు, రోమనుల కాలంలో యాత్రికులు ఎక్కువగా వస్తుండేవారట. దీనికి దగ్గరగా ఉన్న మరో అసంపూర్ణ కట్టడాన్ని చూసాము. రోమన్ చక్రవర్తి ట్రాజన్ నిర్మించిన ఈ కియోస్క్ అఫ్ ట్రాజన్, (Kiosk of Trajan ). ఈ కట్టడం నిర్మాణ ప్రత్యేకత కలప, రాతిని ఉపయోగించడం.

అసంపూర్ణ స్తంభం (Unfinished  Obelisk ): ఈజిప్ట్ లో  కట్టిన అనేక కట్టడాలకు ఆస్వాన్ నుండే గ్రానైట్ రాయి సరఫరా అవుతుండేది. ఈ స్తంభాన్ని కర్నాక్ ఆలయ నిర్మాణం లో ఉపయోగిద్దామని ,  క్వారీ లో చెక్కడం మొదలు పెట్టారుట.గాని, గ్రానైట్ రాయి లో పగుళ్ల  వల్ల, దీనిని అసంపూర్తిగా వదిలేసారు. గిజా పిరమిడ్ నిర్మాణం లో వాడిన గ్రానెట్ అంతా ఆస్వాన్ నుంచే వచ్చిందంటారు

ఇది చూసుకొని మా క్రూయిజ్ 'గ్రాండ్ ప్రిన్సెస్' చేరుకున్నాము. మూడు రోజులు నైల్ నదిలో ఉత్తర దిక్కుగా  ప్రయాణము చేస్తూ, నదికి  దగ్గరగా ఉండే ప్రదేశాలు చూస్తాము. నైల్ నది ప్రయాణం మరో అద్భుతమైన అనుభవం. క్రూయిజ్ సిబ్బంది చాల ఫ్రెండ్లీ గా ఉన్నారు. శాఖాహారులమని ముందే తెలియజేయడం వల్ల, మా కోసం ప్రత్యేకంగా వంటకాలు చేసారు..

నూబియన్ విలేజ్':

ఆ సాయంత్రం చిన్న మోటార్ పడవలో ‘నూబియన్ విలేజ్' చూడడానికి వెళ్ళాము. ఆస్వాన్ హై డాం కట్టేటప్పుడు , ఈ నుబియాన్స్ కి 'Elephantian island ' మీద పునరావాసం కలిపించారు. ఈ నుబియాన్స్ ఈజిప్ట్ లో ఒక జాతి. నల్లగా, పొడుగ్గా ఉంటారు. ఇప్పటికి వారు వారి పురాతన జీవన పద్ధతులనే పాటిస్తున్నారు. ఎండ వేడికి తట్టుకునేలా తమ ఇళ్ళని నీలి రంగుతో పెయింట్ జేసుకొంటారు. మన దేశంలో జోధ్ పూర్ లో కూడా ఇళ్లన్నీ నీలి రంగులో ఉండడం గమనించాను. నీలి రంగు వల్ల ఇంటి లోపల చల్లగా ఉంటుందిట. నుబియన్లు స్నేహశీలురు. ఆతిధ్యానికి పెట్టింది పేరు. వచ్చిన టూరిస్ట్స్ అందరికి వేడి వేడి టీ, మందార పూలతో చేసిన 'కర్కడే(karkade ) పానీయాన్ని ఇస్తారు. దాదాపు అందరి ఇళ్లలోనూ పెంపుడు జంతువు గా మొసళ్ళని పెంచుతారు.  నైల్ మొసళ్ళని ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. మా అమ్మాయి చిన్న మొసలి పిల్లని ధైర్యంగా ఎత్తుకుంది. వారు తయారు చేసిన చేతి వస్తువులని చూపిస్తారు. నచ్చితే కొనుక్కోవచ్చు. ఇక్కడికి వచ్చిన టూరిస్టులు సాధారణం గా నుబియాన్ పిల్లల కోసం చిన్న చిన్న బహుమతులు, మిఠాయిలు తీసుకొస్తుంస్తుంటారుట. మమ్మలిని మన బిందీలు ఇమ్మని అక్కడ ఆడవారు బాగా వెంట పడ్డారు. నా దగ్గర ఉన్న రెండు బిందీ పాకెట్స్ ఇచ్చాను. మా ఫ్రెండ్స్ మమ్మలిని ముందే హెచ్చరించారు. పెద్ద బొట్టు పెట్టుకోవద్దు అని. అందుకే చిన్న బొట్టుతో  మా ట్రిప్ అంతా గడిపాను.

 క్రూయిజ్ మీద మాలాంటి టూరిస్ట్స్ కోసం ఈజిప్షియన్ డాన్సర్స్ వచ్చి 'బెల్లి ' డాన్స్ చేసారు. మరికొంత మంది కళాకారులు ‘ఈజిప్షియన్ జానపద సంగీతం’ వినిపించారు . భాష అర్ధం కాకపోయినా , శృతి లయని, ఎంజాయ్ చేసాము .

అబూసింబల్  : ఉదయం నాలుగున్నర - ఐదు మధ్యలో మా వాహనాలు ఒక దాని వెనుక మరొకటి బయలు దేరాయి. దాదాపు మూడు గంటలు ఎడారి లో ప్రయాణం. అటు ఇటు ఇసుక.. మనిషి జాడ లేదు. రివ్వు రివ్వుమని దూసుకు పోతున్న వాహనాలు తప్ప. ఎడారిలో సూర్యోదయం...అరుణోదయం.. మాటలలో వర్ణించలేను..ఇసుకలో రక రకాల రంగులని చూసాము.

అబూ సింబల్ లో ఉన్నవి రెండు భారీ ఇసుక రాతి ఆలయాలు. సుడాన్ సరిహద్దులకు దగ్గరగా ఉంది ఈ ప్రదేశం. ఈ ఆలయ సముదాయాన్ని యునెస్కో ,ఈజిప్షియన్ ప్రభుత్వం కలిసి, కృత్రిమం గా తయారు చేసిన కొండ మీద ఒరిజినల్ గా ఉండేటట్లుగా పునర్నిర్మాణం కావించారు. లేకపోతే, ఆస్వాన్ హై డాం కట్టేటప్పుడు ఈ ఆలయం నీట మునిగి ఉండేది. అబూ సింబల్ పునర్ నిర్మాణం 'ఇంజినీర్లు చేసిన అద్భుతం’  అనచ్చు. క్రీస్తు పూర్వం పదమూడో శతాబ్దంలో , 'పారో రాంసేస్ (Ramessess II ),కాదేశ్ యుద్ధంలో గెలిచినప్పుడు , తన విజయానికి గుర్తుగా ,తన రాణి Nefartari తో కలిసి ఈ ఇసుక రాతి ఆలయాలని కట్టించాడని అంటారు. దాదాపు ఇరవై సంవత్సరాలు పట్టిందిట ఈ ఆలయ సముదాయాన్ని కట్టడానికి.

ఇందులో రెండు ఆలయాలు ఉన్నాయి. ఒకటి గ్రేట్ టెంపుల్. రెండోది చిన్న గుడి. ఈ పెద్ద గుడి' లో రా-Harakhty, హతోర్ లాంటి దేవతతోపాటు, దేవుడిలా ఉన్న Ramesses II , రాణి నేఫర్తరి Nefartari ని చూడవచ్చు.  ప్రవేశ ద్వారం వద్ద  Ramesses II ,  Nefartari ల భారీ విగ్రహాలని చెక్కారు. వీరి కంటే చిన్నగా, Ramesses II ఓడించిన రాజుల విగ్రహాలు  ఉన్నాయి.  కాల గమనం లో ఈ విగ్రహాలు పాడైనా ,  వారి చరిత్రని, రాచ ఠీవి నిఊహించవచ్చు. ఆలయం లోపల చెక్కిన చిత్రాలన్నిటి లోను రాజు, రాణి గార్లు తమ దేవతలకి అర్పించిన కానుకలని చిత్రాల రూపం లో చూడచ్చు.

సంవత్సరం లో రెండు రోజులు - అక్టోబర్ 22  - ఫిబ్రవరి 22 నాడు మొట్టమొదటి సూర్య కిరణాలు ఆలయం లోకి ప్రవేశించి అక్కడ ఉన్న దేవతలు 'Ra -Harakhty , Ramesses -II , అమున్ విగ్రహాలని ప్రకాశింపచేస్తాయిట .  ఈ రెండు రోజులు Ramesses -II పుట్టినరోజు, పట్టాభిషేకం జరిగిన రోజులని చెబుతారు. ఈ వింతని చూడడానికి ఒక రోజు ముందు నుండే యాత్రికులు వేచి చూస్తుంటారుట.

 ఆ రాత్రి మా క్రూయిజ్ నైల్ నది మీద లక్సర్ వైపు ప్రయాణం మొదలు పెట్టింది. చాల మెల్లగా తెలిసాయి నీటి కుదుపులు. ఈ నైల్ నది ఈజిప్ట్ కి దేవుడిచ్చిన అతి విలువైన బహుమతి అంటారు. నైల్ నది జీవనది. ఈ నది చెప్పే కథలెన్నో ..కరిగిపోయిన గతానికి, కదులుతున్న కాలానికి ప్రత్యక్ష సాక్షి.

తరువాతి మజిలీ ; కోమ్ ఒంబో KOM  Ombo :  మా  క్రూయిజ్ నుంచి అయిదు నిముషాల్లోనే  నైల్ నది ఒడ్డునే ఉంది ఈ దేవాలయము. నిజానికిది ఒకేలా ఉండే రెండు దేవాలయాలు. ఒకటి ఉత్తరం వైపు ఉంటె మరొకటి దక్షిణం వైపు ప్రవేశ ద్వారాలు ఉంటాయి. ఉత్తర గుడి 'హోరుస్(గద్ద తల )"దేవుడికి , దక్షిణం గుడి sobek  (మొసలి తల)కోసం ప్రత్యకంగా, నిర్మించిన భిన్న దేవాలయాలు. గ్రీక్ - రోమన్ శైలిలో ఉన్న ఈ దేవాలయాలు ఆనాడు వైద్య పరంగా ఎంతో అభివృద్ధి చెందిందని అక్కడ చెక్కిన చిత్రాలు బట్టి తెలుసు కోవచ్చు. అనేక రకాల శస్త్ర -వైద్య పరికరాలు ప్రస్తుత ఆధునిక పరికరాలను పోలి ఉండడం గమనించచ్చు.  క్రీస్తు పూర్వం ప్రాచీన ఈజిప్షియన్స్ ఈనాటి ఆధునిక పద్దతిలో వైద్యం చేసేవారంటే ఆశ్చర్య పోక తప్పదు. అక్కడ ఉన్న చిన్న చిన్న గదులలో ప్రజలు వచ్చి, వైద్యులను కలిసే వారని భావించవచ్చు. రోమన్ కాలంలో బాగా అభివృద్ధి చెందిందీ ప్రాంతం.స్థానిక భాష లో 'కోమ్ ఓంబో' అంటే 'బంగారు కొండ' అనే అర్థంట.

దీనికి అతి దగ్గరగా ఉన్న 'మొసళ్ల మ్యూజియం 'లో 'మమ్మీ'లుగా మార్చిన మొసళ్ళని చూడచ్చు. స్టఫ్ చేసిన మొసళ్ళు ఉన్నాయి. మొసళ్ళకి సంబంధించిన అనేక విషయాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.

Edfu .

మరి కొంత దూరం ప్రయాణం చేసిన తరువాత ,నైల్ నది ఒడ్డున ఆగింది మా క్రూయిజ్. అక్కడ నుండి గుర్రం బండి మీద ప్రయాణం చేయడం మరో వింత అనుభవం. మరో ప్రఖ్యాత పురాతన దేవాలయం Edfu. అప్పటి రాజు 'హోరుస్ ' చేతిలో ఓడిన శత్రువులందరు మొసళ్ల రూపంలో వచ్చి దాడి చేస్తే, హోరుస్ గద్ద రూపం లో వచ్చి తన రెక్కలతో వారందరిని ఈజిప్ట్ పొలిమేరల వరకు తరిమి కొట్టాడట.  ఈ గుడి ప్రవేశ ద్వారం దగ్గర రెండు పక్కలా ఉన్న ఈ గద్ద విగ్రహాలని చూడవచ్చు. ఇక్కడ కూడా భారీగా ఉన్న పైలాన్ ప్రధాన ఆకర్షణ. ఇక్కడ ఉన్న పెద్ద పైలాన్ ఈజిప్ట్ లో ప్రస్తుతం ఉన్న అన్ని పైలాన్ ల కంటే అతి పెద్దది. లోపలి వెళితే అతి విశాలమైన ప్రాంగణము కనిపిస్తుంది.మూడు వైపులా కలువ పువ్వుల డిజైన్ తో అలంకరింప బడ్డ పొడుగాటి స్తంభాలను చూస్తాము. ఈ ప్రాంగణం లోనే ప్రజలందరూ వచ్చి తమ కానుకలను దేవతలకు సమర్పించేవారట. ఇక్కడి గోడల మీద చెక్కిన చిత్రాల బట్టి, ప్రాచీన గ్రీక్-రోమన్ కాలం నాటి భాషల్ని, నమ్మకాలని, మతాచారాలని తెలుసుకోవచ్చు. రోమన్ల కాలం లో క్రైస్తవ  మతం వ్యాప్తి కోసం ఈ దేవాలయం లో పూజలని నిరోధించారుట.  అప్పటి మతానికి సంభందించిన చిత్రాలని నాశనం చేసారని, ఇప్పుడూ నల్లగా కనిపించే ఈ దేవాలయ సీలింగ్స్ వల్ల మనకి తెలుస్తుంది. ఈ దేవాలయం హతుర్, హోరుస్ ల కోసం ప్రతేకంగా నిర్మించబడింది.ఇక్కడ బాగా ప్రాచుర్యంలో ఉన్న పండుగ, హతుర్ దేవత ప్రతి సంవత్సరం ‘దండేరా’ లో ఉన్న తన గుడి నుండి edfu లో ఉన్న హోరుస్ ని కలిసినప్పుడు జరిగే వారి వివాహం . సంవత్సరంలో రెండు సార్లు వీరి వివాహము జరుపుతారుట . ఒకసారి ‘దండేరా’ లోను , మరొకసారి Edfu లోనూ జరిపే  వివాహ వేడుక అత్యంత ప్రజాదరణ పొందిన పండుగ.

 Luxor  లో మరొక అద్భుతమైన అనుభవం 'హాట్ ఎయిర్ బెలూన్' లో మేము నైల్ నది దాటి అవతల ఒడ్డుకు వెళ్ళడము. తెల్లవారి నాలుగు గంటలకే మేము ' మా గ్రాండ్ ప్రిన్సెస్' కి వీడ్కోలు పలికి, మరొక చిన్న బోట్ ఎక్కి , ఈ ' హాట్ ఎయిర్ బెలూన్ 'స్థలానికి చేరుకున్నాము. బెలూన్ నుంచి కిందకి చూస్తుంటే, ఎక్కువగా అరటి చెట్లు కనిపించాయి. ప్రకృతి తీరు చాల విచిత్రం.  ఎడారికి సరిహద్దులా  నైల్ నది రెండు పక్కలా , ఒడ్డునానుకొని పచ్చటి చెట్లు...పైనుంచి 'వాలీ అఫ్ కింగ్స్' ఈజిప్ట్ లో అత్యంత సమర్ధురాలైన 'పారో Hatshepsut ' ఆలయాన్ని చూసాము.. ఈజిప్ట్ అందాలన్నిటిని పైనుంచి చూసిన  అనుభవం మర్చిపోలేనిది.

'వాలీ ఆఫ్ కింగ్స్':

అక్కడ నుండి 'వాలీ ఆఫ్ కింగ్స్' చూడడానికి వెళ్ళాము. 'లక్సర్' నగరానికి దగ్గరగా, 'తేబాన్ కొండల' మధ్య వుంది ఈ   లోయ. లోపలికి  వాహనాలు అనుమతించరు. ఒక పెద్ద హాల్లో ఈ  'వాలీ ఆఫ్ కింగ్స్ ' కి సంబంధించిన సమాచారం, ఫోటోలు ఉన్నాయి. ముందు వాటిని చూసి, చదివితే, మనకి ఈ లోయ గురించి కొంత అవగాహన వస్తుంది. దాదాపు అయిదు వందల సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 16 శతాబ్దం నుండి పదకొండవ శతాబ్దం వరకు,  ప్రాచీన ఈజిప్ట్ పారోలని, రాజవంశీకులని ఇక్కడే సమాధి చేసే వారట. 1979 లో 'పారో తుతంఖమెన్' సమాధి ని కనుక్కోవడంతో,   ఈ ప్రదేశానికి 'ప్రపంచపు వారసత్వ స్థలం'గా గుర్తింపు వచ్చింది. ఇక్కడ నుంచి తీసుకొచ్చిన 'పారో తుతంఖమెన్' మమ్మినే మేము కైరో మ్యూజియం లో చూసాము. ఇక్కడ అన్ని సమాధులలోకి టూరిస్ట్స్ ని అనుమతించరు. ఈ సమాధుల ప్రవేశ ద్వారం వద్ద  KV 1 , KV 2 అనే నెంబర్లని చూసాము. KV  అంటే ‘కింగ్స్ వాలీ’  అని పాలనా సౌలభ్యం కోసం ఆలా నంబరింగ్ చేశారట. మేము KV 6 , పారో రాంసేస్ IX సమాధి లోకి వెళ్ళాము. లోపలి వెళుతుంటే, చుట్టూ ఉన్న గోడల మీద చిత్రించిన రంగురంగుల చిత్రాలు చూసాము. ఈ సమాధుల్లోకి మన గైడ్స్ కి అనుమతి లేదు. అలాగే ఫోటోగ్రఫీ కూడా అనుమతించరు, దాదాపు అన్ని సమాధులని కొల్లగొట్టి , విలువైన వస్తువులన్నీ దోచేసారుట. దొరికిన అవశేషాలను కైరో మ్యూజియం లో భద్ర పరిచారుట. మేము తుతంఖమెన్ సమాధి లోకి వెళ్ళాము. అక్కడ వస్స్తువులన్ని కైరో మ్యూజియం లోకి తరలించారు. దీనికి వేరే ప్రవేశ రుసుము చెల్లించాలి.

వాలీ ఆఫ్ కింగ్స్ కి దగ్గరగా ఉన్న' మార్చురీ టెంపుల్ ఆఫ్ Hatshepsut ' వెళ్లాము.  ప్రాచీన ఈజిప్ట్ కాలానికి చెందిన ఈ అద్భుత కట్టడం  అప్పటి అందమైన కట్టడాలలో ముఖ్యమైనది గా పేరు పొందింది.. అర్ధ వృత్తాకారం గా కొండల మధ్య నిర్మించబడింది. Djeser  Djeseru (holy of holiest) అని ప్రధాన భవనానికి పేరు. రాణి Hatshepsut , వారసుడిగా నిర్ణయించిన Thutmose III చిన్నవాడవడం వల్ల, తాను రాణిగా రాచరిక వ్యవహారాలన్నీ చక్కదిద్డదేది. అప్పటి రాచరిక పురుషాధిక్య వ్యవస్థకి  వ్యతిరేకంగా తనని 'ఈజిప్ట్ పారో గా ' ప్రకటించుకొని , రాజ్యం చేసింది. ఆమె సారధ్యంలో ఈజిప్ట్ ఆర్ధికం గా, వాణిజ్య పరంగా  ఎంతో అభివృద్ధి చెందింది.  ఆమె సాధించిన విజయాలకు గుర్తుగా, మరణానంతర ఆలయంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. గాని, ఆమె మరణం రహస్యం గా ఉండిపోయింది. ఆమె వారసుడిగా రాజ్యం చేసిన థుతిమోసె III (Thutmose III ), ఆమె మీద ద్వేషంతో అన్ని నిర్మాణాలని నాశనం చేసాడు. మూడు అంతస్తులుగా ఉన్న  ఈ కట్టడంలో మనం నేరుగా , రాంప్ ద్వారా  రెండవ అంతస్తు, మూడవ అంతస్తుకి చేరవచ్చు. కింది, పైన ఉన్న అంతస్తులు  విశాలమైన , వరుసలలో ఉన్న పెద్ద పెద్ద స్తంభాలతోను, చిత్రాలతోను  అలంకరింప బడ్డాయి. అప్పటి కాలంలో కింద భాగంలో పచ్చటి చెట్లతో ఉండేదని అక్కడ ఉన్నగుంతలను చూపిస్తూ  అంటారు. ప్రస్తుతం పచ్చదనం అనేదే లేదు. ఆమె చేసిన వ్యాపార కార్యకలాపాలు ,వాటి కోసం ఆమె చేసిన ప్రయాణాల చిత్రాలు ఉన్నాయి.

రెండవ అంతస్తు లో Hatshepsut  పుట్టిన స్థలాన్ని, హతుర్ దేవతని  చూడవచ్చు. మూడవ అంతస్తులో హోరుస్ విగ్రహాలున్నాయి . సెనేముట్, Hatshepsut  సలహాదారు ,ఈ  భవన నిర్మాణానికి రూపకర్త అంటారు.

కర్నాక్ ఆలయం:  ఈజిప్టులో మరొక ప్రముఖ దేవాలయ సముదాయం. దీనికి ప్రవేశ రుసుము కట్టి , లోపలి వెళ్ళాము. ప్రధాన ద్వారానికి రెండు పక్కలా రామ్ తలలతో sphinxes వరుసగా కూర్చుని టూరిస్ట్స్ కి స్వాగతం పలుకుతాయి. వాటి పంజాల మధ్య రాంసేస్ II చిన్న దిష్టి బొమ్మ ఉంటుంది.  లోపలి వెళుతూనే మనోహరమైన స్మారక ద్వారాలు, ఎత్తైన స్తంభాలు, భారీ రాంసేస్ II విగ్రహం, రాణి Hatshepsut స్థాపించిన అతి పెద్ద స్తంభము, దాని మీద ఆమె సాధించిన విజయాలు,  ప్రముఖ హైపోస్టయిల్ హాలు , మనల్ని ఆశ్చర్య చకితుల్ని చేస్తాయి. ఎన్నో వేల సంవత్సరాల కిందటి నిర్మాణాల నమూనాలని, వారి నైపుణ్యాలని ప్రశంసింపకుండా ఉండలేము.

కర్నాక్ దేవాలయ సముదాయంలో అనేక చిన్న చిన్న ఆలయాలు, ఒక పవిత్ర సరస్సు,  ఆ సరస్సు చుట్టూ పూజారుల కోసం చిన్న గదులు ఉండేవి. ఈ దేవాలయం ప్రత్యేకంగా అమున్, ముత్, ఖొన్సు దేవతల కోసం దాదాపు ముప్ఫయి మంది పారోలు నిర్మించారు.  ఈ సరస్సుకెదురుగా గ్రానెట్ రాతి తో చెక్కిన ఒక పెద్ద 'పేడ పురుగు ' ఉంది.  దాన్ని ‘స్కేరబ్ అఫ్ అమెంహోటెప్ III’ అని, దాని చుట్టూ ప్రదక్షణము చేసి, ఏదైనా కోరుకుంటే అవి తీరుతాయని ఇప్పటికి నమ్ముతారు.

ప్రాచీన ఈజిప్షియన్లకి కర్నాక్ ప్రధాన ఆరాధనా స్థలంగా ఉండేది. ప్రతి ఏడూ వ్యవసాయ పనులు పూర్తి అయిన తరువాత భూమి, పైనున్న దేవతలు అలసిపోతారని, వారికి తిరిగి శక్తి రావాలని 'ఓపేట్ పండుగ'ని ఇక్కడ ఇరవై ఏడు రోజుల పాటు జరిపేవారట. ఈ పండుగ ద్వారా తమ పారో లకు , అమున్ దేవతకు మధ్య మంచి సంభందాలు ఏర్పడతాయని భావించేవారుట.  చివరి  రోజున పెద్ద ఊరేగింపు కర్నాక్ లో మొదలై, లక్సర్ లో ముగిసేది.

లక్సర్ దేవాలయం:

మా ఈజిప్ట్ యాత్రలో ఆఖరిది , మరో ప్రముఖ పురాతన దేవాలయం  లక్సర్.  ఇది అప్పుడు పాలించే రాజుల క్షేమం కోసం, వారి శక్తి కోసం నిర్మించారని అంటారు. ప్రవేశ ద్వారం రెండు పక్కల ఉన్న భారీ రాంసేస్ II విగ్రహాలు మనకి ఈ లక్సర్ చరిత్ర చెపుతామంటాయి. మొదట ఈ ఆలయాన్ని అమెంహోటెప్ III ,తరువాత తుతంఖమెన్, రాంసేస్ II , ప్రముఖ గ్రీకు వీరుడు అలెగ్జాండర్ కూడా ఈ ఆలయ సముదాయ నిర్మాణం లో భాగస్వాములని అంటారు. ఈ లక్సర్ ఆలయానికి ప్రాచీన ఈజిప్ట్ చరిత్రలోఅటు రాజకీయం గాను, ఇటు మత పరం గాను  ఒక విశిష్ట స్థానం ఉంది. ఇక్కడ జరిగే అనేక పండుగల్లో 'ఓపేట్ పండుగ' అతి ముఖ్యమైనది. కర్నాక్ నుండి ఊరేగింపుగా బయలు దేరిన అమున్ దేవత, తన శక్తిని ఇక్కడ ఉన్న పారో లకి ఇస్తాడని, అందువల్ల, ఆ  రాజు అత్యంత బలవంతునిగా,దైవాంశసంభూతునిగా మారతాడని ఆనాటి ప్రజల నమ్మకం.

ఇక్కడ ఉన్న హైపోస్టయిల్ హాలు అద్భుతం ..వరుసలలో ఉన్న కలువ పువ్వు స్తంభాలు ఆకాశాన్ని తాకుతున్నాయనిపిస్తుంది. మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయం ఉత్తరం నుండి దక్షిణం వైపుకి, కర్నాక్ కి ఎదురుగా ఉంటుంది. ఈ ఆలయం ఆనాటి నుండి ఈనాటి వరకు పూజా స్థలంగానే ఉంది. క్రిస్టియన్స్ కాలంలో హైపోస్టయిల్ హాలు చర్చిగా మార్చి, ప్రార్ధనలు చేసేవారు. .ఇక్కడ జరిగిన తవ్వకాల్లో ఎన్నో అందమైన కళాఖండాలు బయట పడ్డాయి. ఇవన్నీ రోమన్ల కాలంలో వారు భూమిలో పాతిపెట్టారని అంటారు.

మర్నాడు లక్సర్ నుండి కైరో, కైరో నుండి ముంబై ప్రయాణమయ్యాము.  ఎన్నో వేల సంవత్సరాల కిందటి చరిత్రని  ఫోటోల రూపంలో  మాతో బాటు తీసుకొచ్చాము..ఈజిప్ట్ పిరమిడ్స్ ని చూడాలని, తాకాలని ఉన్న కోరిక తీరినందుకు చాల తృప్తిగా ఉంది.

మరిన్ని శీర్షికలు