Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly-horoscope-june-8th  to june 14th

ఈ సంచికలో >> శీర్షికలు >>

తమిళనాడు తీర్థయాత్రలు / విహారయాత్రలు - కర్రా నాగలక్ష్మి

tamilnadu

థాయిలాండు విహారయాత్రలు చేసేం కదా , యీ వారం నుంచి మన పొరుగు రాష్ట్ర మైన తమిళనాడు లో వున్న విహార , యాత్రా స్థలాల గురించి చదువుదాం .

తమిళనాడులో అడుగునా గుడి వుంది అని అంటే అతిశయోక్తి కాదు . అన్నీ కూడా శిల్పకళలో ఒకదానితో వొకటి పోటీ పడుతూ వుంటాయి . తమిళనాడులో వున్నన్ని మందిరాలూ చూసేనని చెప్పనుగాని చాలామటికి చూసేనని మాత్రం చెప్పగలను .

ముందుగా తమిళనాడు ముఖ్యపట్టణమైన చెన్నై నగరం గురించి తెలుసుకుందాం .

ఈ నగరం పాతరాతి యుగానికి చెందినట్ల ‘ పల్లవరం దగ్గర దొరికిన ఆధారాలవల్ల తెలుస్తోంది .

కాంచి పురం ముఖ్యపట్టణంగా చేసుకొని పరిపాలన చేసిన   చేర , చోళ , పాండ్య , పల్లవుల పాలనలో చెన్నై నగరం వునికి వుంది .      పదిహేనవ శతాబ్దంలో ముందుగా పోర్చుగీసువారు చెన్నై లో అడుగు పెట్టేరు . సైంట్ థోమస్ తరువాత , సైంట్ థోమస్ క్రీస్తు శకం 56 , 70 సంవత్సరాల మధ్య యిక్కడకువచ్చి ఉపదేశాలు చెప్పినట్లుగా చెప్తారు . సైంట్ థోమస్ మౌంటు యీనాటికీ దర్శనీయ స్థలమే చెన్నైలో .     స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి చెన్నై నగరం నాలుగు అతి యెక్కువ జనాభా గల నగరాలలో ఒకటిగా గుర్తింపబడింది .

ముందుగా చెన్నై గా పిలువబడి ఆంగ్లేయుల కాలం నుంచి మద్రాసుగా పిలువబడి తిరిగి తమిళ వారి చొరవ వల్ల చెన్నైగా మారింది . మొదటినుంచి చెన్నై నగరం విద్య , కళలకు పుట్టిల్లుగా వర్ణింప బడింది . సాంకేతిక , వైద్య  , సంగీత నృత్య విద్యలు యీ నగరం లో వెల్లి విరిసేయనే చెప్పాలి , రాజులు యీ కళలను పోషించడం వలన , తరువాత వచ్చిన పాలకుల శ్రద్ద వల్ల యివాల్టకి కూడా సంగీత నృత్యాలకి చెన్నై పేరు పొందింది .

సముద్రతీరాన వుండడం వల్ల వాతావరణం సమంగా వుంటుంది . చెన్నై నుండి వివిధదేశాలకు ఓడ మార్గం వుండడం వల్ల వాణిజ్యపరంగా కూడా అనాదిగా పేరు పొందింది .

ఇప్పటి పరిస్థితులలో చెన్నైని చూస్తే బహుముఖ ప్రగతి సాధించిన నగరం అని చెప్పక తప్పదు . పాశ్చాత్య పోకడలు , సాంప్రదాయ పోకడలు సరిసమానంగా వున్న నగరం యిదేనేమో  ! .

ఇప్పటి చెన్నై నగరం బహుళ అంతస్థుల భవనాలు , మాల్స్ తో కొత్తగా కనిపిస్తూ మధ్యమధ్యలో ఆంగ్లేయులనాటి భవనాలు కనిపిస్తూగత చరిత్రని కూడాగుర్తుచేస్తూ వుంటుంది .

తెలుగు తమిళ భాషలకు సమాన గౌరవం వుండేది యీ నగరంలోనే . ఇప్పటికీ యీ నగరంలో చాలా మంది తెలుగు మాట్లాడుతారు .      చెన్నైలో వండలూరు జ్యూ , మ్యూజియమ్ , సెయింట్ థామస్ మౌంటు , కపాలేశ్వర మందిరం , అష్టలక్ష్మి మందిరం , పార్థసారధి మందిరం , మెరీనాబీచ్  ,  క్రోకడైల్ పార్కు సిటీ లో వున్నాయి , గోల్డెన్ బీచ్ , మహాబలిపురం నగరానికి కాస్త దూరంగా వున్నాయి .        తమిళనాడులో  అడుగడుగున గుడితో బాటు ఫలహార , భోజన శాలలు కూడా వున్నాయి . చెన్నై లో మీనాక్షిభవన్ , శరవణభవన్లలో ఫలహారాలు , భోజనం చాలా బాగుంటాయి స్వానుభవంతో చెప్తున్నాను .

పెద్దపెద్ద అలలు తీరాన్ని చేరుతూ వుండడం చూడాలంటే మెరీన బీచ్ కి వెళ్లవలసిందే . వారాంతపు శలవులలోనే కాకుండా పనిరోజులలోకూడా చాలా సందడిగా వుండే బీచ్ యిది . పిల్లాపెద్దలతో రోజంతా కళకళలాడుతూవుంటుంది , ప్రొద్దుట , సాయంత్రం నడిచే వారితో చాలా సందడిగా వుంటుంది . రాజకీయనాయకుల సమాధులు , వాటిని దాటేక చేపలు పట్టేవారి యిలాకా మొదలవుతుంది . ఏ తెల్లవారో చేపలవేటకి బయలుదేరి వెళ్లినవాళ్లు మద్యాహ్నం తిరిగి వస్తారు . అదో ప్రపంచం , యిసుకలో నేలమీద , వరుసగా తాళ్లకు కట్టి యెండపెట్టే యెండుచేపలు ముక్కులని బద్దలుకొడుతూ వుంటాయి. అది వారి జీవనోపాధి .

పేరిస్ కార్నర్ లో వుండే పూల మార్కెట్లలో అన్నిరకాలపూలు చూడొచ్చు అలాగే పళ్ల మార్కెట్ కూడా . 1990 ల వరకు యీ ప్రాంతం విదేశీ వస్తువుల అమ్మక ప్రాంతంగా కూడా వుండేది .

నగరం మధ్యలో పెద్ద వుద్యానవనం అందులో చక్కని రధం చూపరులను ఆకట్టుకుంటూ వుంటాయి . దానిని వళ్లువారు కొట్టం అని అంటారు . సుమారు 2000 సంవత్సరాలకి పూర్వం కవి , ముని అయిన తిరువళ్లువారు జ్ఞాపకార్థం 1976 లో నిర్మించిన కట్టడం . 30 మీటర్ల యెత్తున్న రధంపై నిలువెత్తు విగ్రహం గణపతి స్థపతి గారిచే మలచబడింది . పక్కగా వున్న ఆడిటోరియం సుమారు 4000 మంది కూర్చొనేంత విశాలంగా వుంటుంది . చెన్నై లో యిదొక ముఖ్యమైన పిక్నిక స్పాట్ . వుద్యానవనంలా వుండడం వల్ల చెన్నై వేడి వాతావరణం నుంచి తప్పించుకోవచ్చు .

ఇక మైలా పూర్ లో వున్న ‘ కపాలేశ్వర ‘ మందిరం . ఇప్పుడు వున్న గోపురం 7 వ శతాబ్దం లో నిర్మించబడింది , కాని యీ మందిరం వునికి అంతకు ముందునుంచే వున్నట్లు పరమశివభక్తులు కవులు అయిన అప్పార్ , సుందరార్ వారి రచనలలో యీ మందిరం యొక్క విశిష్టతను వర్ణించేరు .

ద్రవిడ శిల్పకళతో నిర్మితమైన మందిరం , రెండు యెత్తైన గోపురాలు , తూర్పున వున్న గోపురం 40 మీటర్ల యెత్తు , పశ్చిమాన వున్న గోపురం కాస్త తక్కువ యెత్తులో వుంటుంది యెదురుగా పుష్కరిణి ( తెప్పాకుళం ) , యిక్కడ చెప్పవలసిన ముఖ్య విషయం యేమిటంటే యిందులో నీరు యెప్పుడూ పరిశుభ్రంగా వుంటాయి .

గర్భగుడిలో కపాలేశ్వరుడు లింగాకారంలో పూజలందుకుంటూ వుంటాడు , పక్కనున్న మందిరం లో పార్వతి ‘ కర్పకంబాళ్ ‘ పేరుమీద పూజలందుకుంటూ వుంటుంది . కర్పకం అంటే కల్పవృక్షం , కల్పవృక్షం లా కోరిన కోర్కెలు తీర్చే తల్లి అని అర్దం . అమ్మవారి కాళ్లదగ్గర నెమలి బొమ్మకి కూడా అమ్మవారికి చేసినట్టుగానే అన్ని  పూజలు అందుకుంటూ వుంటుంది .

నెమలిని చూడగానే మనం షణ్ముఖుడు అనే అనుకుంటాం కాని యిక్కడ పార్వతీ దేవినే నెమలి అవతారంగా పూజిస్తారు . ఆ కధేమిటో తరువాత తెలుసుకుందాం .

మందిర ప్రాంగణం లో వినాయకుడు , కుమారస్వామి , దుర్గాదేవి , దక్షిణామూర్తి , సంధికేశ్వరుడు మొదలయిన ఉప మందిరాలు వున్నాయి . 

          ఊరేగింపులలో వుపయోగించేందుకు రథం , నంది , యేనుగు , నెమలి , యెలుక , చిలుక , మేక మొదలయిన వాహనాలు వున్నాయి , ఆడ , మగ నెమళ్ల  పంజరాలు వున్నాయి . మందిరం యెప్పుడూ భక్తులతో రద్దీగా వుంటుంది . రోజూ విధివిధానాలతో ఆరు పూజలు నిర్వహిస్తారు యిక్కడి పూజారులు . ఏడాదికి నాలుగు వుత్సవాలు కూడా నిర్వహిస్తారు . ఎప్పుడూ యీ మందిర పరిసరాలలో పండగ వాతావరణం నెలకొని వుంటుంది .

          ఈ మందిరం మైలా పూర్ లో వుందని చెప్పాను కదా ? అసలు దీనిని మొయిలా పురం అని వ్యవహరించేవారు , కాలక్రమేణా యిది మైలాపూర్ గా మారింది తమిళంలో మొయిల్ అంటే నెమలి , ఓ సారి పార్వతీ దేవి శాపవశాన భూలోకంలో జన్మించవలసి వస్తుంది , అప్పుడు అమ్మవారు ఆడనెమలి ఆకారంలో యీ ప్రాంతాలలో సంచరిస్తూ వుండగా అమ్మవారికి స్వయంభువుగా వున్న శివలింగం కనిపిస్తుంది . శాప విమోచనకై అమ్మవారు శివలింగానికి పూజలు చేస్తూ వుంటుంది . అమ్మవారి పూజలకు సంతుష్టుడైన శివుడు నెమలి రూపంలో వచ్చి అమ్మవారితో క్రీడిస్తాడు . శివుడు పార్వతి క్రీడించిన ప్రాంతమే ‘ మొయిలా పురం ‘ గా పిలువబడసాగింది . 

           తను రాకమునుపే అక్కడ శివలింగం వుండడానికి గల కారణ మడుగుగా శివుడు ఆ శివలింగాన్ని ‘ కపాలేశ్వరుడు ‘ అని అంటారని చెప్పాడు . కపాలేశ్వరుడు అనే పేరెందుకు వచ్చిందని అడుగగా బ్రహ్మ గర్వమదాన శివుని ధిక్కరించగా , బ్రహ్మ గర్వభంగము కలిగించాలనే తలంపుతో శివుడు బ్రహ్మ శిరస్సును వ్రేలిగోటితో ఖండించగా బ్రహ్మ తన పదవిని పోగొట్టుకొంటాడు . శివుణ్ణి ప్రసన్నుని  చేసుకొనేందుకు బ్రహ్మ ఆ ప్రదేశంలో శివుణ్ణి ఆవాహన చెయ్యగా శివుడు స్వయంభూ గా అవతరిస్తాడు . ఆ లింగానికి బ్రహ్మ అభిషేకాదులు నిర్వహిస్తూ తపస్సు చేసుకొని శివుని కృపను పొంది తిరిగి బ్రహ్మ లోకము చేరుకుంటాడు . అందుకే కపాలేశ్వరుడు అనే నామధేయం వచ్చిందని తెలియజేస్తాడు .

          ఆడ నెమలి అవతారంలో అమ్మవారు తిరుగాడిన ప్రదేశం అమ్మవారిక యెంతో ప్రీతికరమైనది కాబట్టి అమ్మవారు యిక్కడ యెంతో ప్రసన్నం గా వుండి భక్తుల కోరికలను తీరుస్తూ వుంటుంది అందుకే యిక్కడ అమ్మవారు ‘ కర్పకంబాళ్ ‘ గా పిలువబడుతోంది . 

            ‘ కర్పకంబాళ్ ని ఆరాధించి షణ్ముఖుడు అనేక శక్తులను పొంది రాక్షస సంహారం కావించాడు .

        అలాగే యీ వూరిని శుక్రపురి , వేదపురి , మొయిలాయె కయిలై అనికూడా పిలిచేవారు .

      వామనావతారంలో విష్ణుమూర్తితో కన్ను పోగొట్టుకున్న శుక్రుడు కపాలేశ్వరుని సేవించి పోగొట్టుకున్న కన్ను తిరిగి పొందుతాడు . మొయిలాయె కయిలై అంటే నిజంగా కైలాశమే అని అర్దం . కపాలేశ్వరుని దర్శించుకుంటే కైలాశాన్ని దర్శించుకున్నంత ఫలం దొరకుతుంది అని యిక్కడివారి నమ్మకం .

        రాముడు రావణుడితో యుధ్దానికి బయలుదేరేముందు కపాలేశ్వరుని సేవించుకొని లంకలో రావణుని ఓడించి సీతతో తిరిగి వచ్చినట్లు చెప్తారు .

        శివనేశ చెట్టియార్ కుమార్తె ‘ అంగం పూంపవై ‘ పాముకాటుతో మరణించగా కవి ఋషి అయిన ‘ తిరుజ్ఞాన సంబందార్ ‘ కపాలేశ్వరుని సన్నిధిలో ఆమె శరీరాన్ని వుంచి శివుని ప్రార్ధించగా ఆమె లేచి కూర్చుందిట .

          వయలార నయనర్ సమాధిపొందిన ప్రదేశం కూడా యిదే .

        తరువళ్లువార్ జన్మస్థలం కూడా యిదే .

      పైవారం మరికొన్ని చెన్నైవివరాలతో మీ ముందుంటాను . అంతవరకు శలవు .

మరిన్ని శీర్షికలు
*her.  short flim