Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
jayajayadevam jokes

ఈ సంచికలో >> శీర్షికలు >>

తమిళనాడు తీర్థయాత్రలు / విహారయాత్రలు - కర్రా నాగలక్ష్మి

11)తిరు వెలుక్కై ——

విష్ణు మూర్తి యిష్ట పూర్వకంగా యిక్కడ కొలువై వున్నాడని అర్దం .‘ వెలు ‘ యిష్టపడి అని , ‘ యిరుక్కై ‘ అంటే వున్నాడు అనిఅర్దం . విష్ణు మూర్తి తనంత తానుగ యిష్టపడి యిక్కడ కొలువై వున్నాడన ఆళ్వారులు స్వామిని కీర్తించేరు . అందుకే యీ స్వామి భక్తుల కోర్కెలు తీరుస్తాడని అంటారు . ఈ స్వామిని ‘ అళగిర సింగార ‘ స్వామి అని కూడా పిలుస్తారు . 

ఈ మందిరం ఎప్పుడు నిర్మించినదీ తెలియకపోయినా 6 నుంచి 9 వ శతాబ్దానికి చెందిన ఆళ్వారుల రచనలలో యీ మందిరం గురించిన వర్ణన వుండడం వల్ల యీ మందిరం , యీ ఒక్క మందిరమనే కాదు యీ దివ్యదేశ మందిరాలు పౌరాణిక కాలానికి చెందినవనే చెప్పుకోవచ్చు . పునః నిర్మాణం గావించిన రాజుల పేర్లు వారు రాయించిన శిలా ఫలకాలపై వుండడం వల్ల అప్పటి నిర్మాణంగాచెప్పబడుతోంది . పల్లవుల కాలం నుంచి చరిత్ర లో వివరాలు వున్నాయి .ఈ మందిరం ద్రవిడ శిల్పకళ నిర్మితం . ప్రతీ కోవెలలో విన్నట్ల పుష్కరిణి , అమ్మవారికి వేరే కోవెల వున్నాయి .  అసురుల నుంచి ఋషులు మునులను రక్షించేందుకు నరసింహవతారంలో స్వామి యిక్కడ కొలువై వున్నాడని అంటారు .

పడమర ముఖంగా వున్న స్వామిని యోగ నరసింహాస్వామి అని కూడా అంటారు . స్థానికంగా రెండు స్థల పురాణాలు వాడుకలో వున్నాయి . మొదటది హిరణ్యకశిపుని ఆగడాలు పెరిగిపోగా అతనిని సంహరించేందుకు నరసింహావతారంలో వచ్చి సంహరించేడు . అదే అవతారంలో కలియుగంలో ప్రజలను కాపాడడానికి యిక్కడ కొలువైవున్నాడు అన్నది .రెండవది , బ్రహ్మ తలపెట్టిన యజ్ఞానికి రక్షకుడిగా వున్న విష్ణుమూర్తి సరస్వతి పంపిన ‘ కాపాలిక ‘ ను సంహరించేందుకు ‘నరహారి ‘ అవతారంలో వచ్చి సంహరించేడని , అదే అవతారంలో భక్తుల కోర్కెలు తీర్చేందుక యిక్కడ కొలువై వున్నాడని అంటారు . మందిరం దీనావస్థలో వుంది . ప్రతీరోజూ 6 నిత్యపూజలు జరుపుతున్నారు . కృష్ణాష్టమి విశేషంగా జరుపుతారు . హిరణ్యకశిపుని సంహరించేందుకు నరసింహావతారంలో వచ్చిన స్వామి తన యిష్టపూర్వకంగా యిక్కడ కొలువై వున్నాడని , వేదాంతదేశిక ‘ విరచిత ‘ కామాశి ‘ అష్టకం లో నరసింహమూర్తి యిక్కడ కొలువైవుండాలని యిష్టపడినట్లుగా వర్ణన వుంది ,ఇక్కడ అమ్మవారు ‘ వేలుక్కైవల్లి ‘ ,  ‘ అమృతవల్లి ‘ అని పిలువ బడుతూ పూజలందుకుంటున్నారు .

12)తిరు థంక —- 

ఈ మందిరం అష్టభుజ మందిరానికి సుమారు అర కిలోమీటరు దూరంలో వుంది . దీనిని ‘ తూపుల్ ‘ , దీప ప్రకాశన పెరుమాళ్కోవెలగా కూడా స్థానికులు ఉదహరిస్తూ వుంటారు .        బ్రహ్మ దేవుడు చేస్తున్న అశ్వమేధ యాగానికి భంగం కలిగిస్తున్న సరస్వతికి ఆమె పంపుతున్న అసురులను విష్ణ మూర్తి చెండాడంచూసిన బ్రహ్మ చీకటిని చీల్చే దీపకాంతితో పోలుస్తూ విష్ణు మూర్తిని కీర్తించేడు . అందుకు యీ కోవెలలో స్వామిని దీపప్రకాశన పెరుమాళ్అని పిలుస్తారు .ఈ మందిరంకూడా ద్రవిడ శిల్పకళతో నియమించిన కట్టడం . మూడంతస్థల రాజగోపురం తో వున్న చిన్న మందిరం .మూలవిరాట్టు పడమర ముఖంగా అభయముద్రలో నిల్చున వుంటుంది . చరిత్ర ప్రకారం ఈ కోవెల 12 వ శతాబ్దంలో రాజరాజచోళుడు -3కట్టించినట్లుగా లిఖించబడింది . లోపల లక్ష్మీ దేవికి , గరుడునికి , హయగ్రీవునికి , ఆండాళ్లుకు , ఆళ్వారులకు వేరువేరు మందిరాలుకట్టబడ్డాయి . ‘ ఆళ్వారు వేదాంతదేశిక ‘ కి వేరుగా మందిరం కనిపిస్తుంది . వేదాంతదేశిక జన్మించిన ప్రదేశమిదే . అందుకేఅతనిపుతృడు నాయనార్ వరదాచారి యీ మందిరాన్ని తండ్రి జ్ఞాపకార్ధం నిర్మించినట్లు చెప్తారు . ఇక్కడ అమ్మవారు ‘ మరకత వల్లి ‘ గా పూజలందుకుంటోంది . పుష్కరిణిని ‘  సరస్వతీ తీర్ధమని ‘ అంటారు .

13)తిరుకల్వనూర్—

ఈ దివ్యదేశం కామాక్షి మందిరంలో  వుంటుంది . కామాక్షి మందిరంలో పుష్కరిణికి పక్కగా వుంటుందీ మందిరం . చిన్న కోవెల .కామాక్షి అమ్మవారికి కుడిపక్కన  కుడివైపున వుంటుందీ మందిరం . దీనిని ‘ ఆదివరాహ ‘ మందిరమని అంటారు .

స్థలపురాణ

పార్వతీదేవి శాపవిముక్తురాలై పరమశివునికొరకు వేచియున్నప్పుడు లక్ష్మీ దేవి పార్వతీదేవిని అలంకరించేందుకురాగా యిద్దరూముచ్చటలాడుతూ పుష్కరిణి ప్రాంతంలో విహరిస్తూ వుండగా విష్ణుమూర్తి పొదల చాటున నక్కి వారి మాటలు వినడానిక ప్రయత్నిస్తాడు .దొంగలా పొదలమాటున దాగిన విష్ణమూర్తిని కనిపెట్టిన పార్వతి అతనిని ‘ దొంగ ‘ అని పిలుస్తుంది . అందుకే యిక్కడ స్వామిని కల్వన్ (దొంగ ) పెరుమాళ్ అని అంటారు . ఇక్కడ విష్ణమూర్తికి అమ్మవారి పూజారులే దీపధూప నైవేద్యాలు సమర్పిస్తూ వుంటారు .ఈ మందిరానికి యెదురుగా వున్న పుష్కరిణిని ‘ కామ కొష్టం ‘ అని అంటారు .

14)తిరుపుత్కుళి శ్రీ విజయరాఘవ పెరుమాళ్ ——-

ఈ ప్రదేశం కాంచీపురానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో వుంది . చెన్నై నెల్లూరు హై వే మీద వున్న ‘ బాలుచెట్టి ఛత్రం ‘ అనేవూరికి సుమారు అర కిలోమీటరు దూరంలో వుంది .         ఇక్కడ స్వామి వారిని శ్రీ విజయరాఘవ పెరుమాళ్ అని అంటారు . ఈ మందిరాన్ని 6 వ శతాబ్దం నుంచి 9 వ శతాబ్దం వరకు గలఆళ్వారులు దివ్యదేశం గా గుర్తించేరు .ఈ మందిర నిర్మాణం లో పల్లవులు , చోళులు , విజయనగరరాజులే కాక తంజావూరును పరిపాలించిన నాయకరాజులుకూడా ముఖ్యభూమికను పోషించేరు .అయిదంతస్థుల రాజగోపురం , చుట్టూర రాతి ప్రహారిగోడ లోపల మందిరం మందిరానికి యెడమవైపున పుష్కరిణి , అమ్మవారికివేరేకోవెల వున్నాయి .

స్థలపురాణం తెలుసుకుందాం .

త్రేతాయుగంలో రాముడు వనవాసం చేస్తూ దండకారణ్యంలో వుండగా రావణుడు సీతమ్మను అపహరించి లంకకు తీసుకుపోతూవుండగా జటాయువు సీతమ్మను రావణాసురుని చెరనుండి విముక్తను చెయ్యడానికి శాయశక్తులా పోరాడుతుంది . పక్షులకు శక్తి వాటిరెక్కలలో వుంటుందన్న సత్యాన్ని యెరిగిన రావణాసురుడు జటాయువు రెక్కలను నరికెస్తాడు . సీతమ్మ జాడ రామునికి యెరుకపరచాలనే నిశ్చయంతో జటాయువు రాముని కొరకు ప్రాణాలను నిలుపుకొని , రాముడు సీతమ్మను వెతుకుతూ రాగా సీతమ్మ జాడ తెలిపిజటాయువు రామున చేతిలో ప్రాణాలు విడుస్తుంది . రాముడు పక్షిని తండ్రిగా భావించుకొని ఉత్తరక్రియలు నిర్వహిస్తాడు .దశరధమహారాజుకు చెయ్యలేక పోయిన ఉత్తరక్రియలను పక్షికి చేస్తూ తండ్రిన తలచుకున్నాడట , అలా ఒకపక్షకి తండ్రి స్థానాన్నియివ్వడం , హనుమంతుడు , విభీషణుడు ,జాంబవంతులకు సహోదర స్థానం యివ్వడం వలన రామావతారములో విష్ణుమూర్తిప్రాణులమధ్య బేధాలులేవని తెలియజేసేడని ఆళ్వారుల వర్ణించేరు . ఈ మందిరంలో స్వామినాలుగు భుజాలతో పక్షిని చేతపట్టుకొని నేలపై కూర్చొని వుంటుంది . శ్రీదేవి స్వామికి కుడివైపున కాకుండాయెడమవైపున వుంటుంది . స్వామి మోములో దుఃఖం , అలాగే యెదురెదురుగా వున్న  శ్రీదేవి భూదేవి విగ్రహాలు స్వామి వైపు విచారంగాచూస్తున్నట్లుగా వుంటాయి . 

పుల్ అంటే  గ్రద్ద అని కుళి అంటే గుంట( గొయ్యి) అని అర్దం . జటాయువుకు ఉత్తర క్రియలు జరిగిన ప్రదేశం .

ఇక్కడ గరుడునికి , అమ్మవారికి వేరే మందిరాలు వున్నాయి . అమ్మవారిన ‘ మరకతవల్లి ‘ అనిఅంటారు . రామానుచార్యుల గురువైన ‘ యాదవప్రకాశ ‘ యొక్క జన్మస్థలం యిది . రామానుజాచార్యులు విద్యనుపొందిన ప్రదేశం . ‘ యాదవ ప్రకాశ ‘ విగ్రహాన్ని ప్రతిష్టించిన మందిరం కూడా యిక్కడ చూడొచ్చు .ఈ మందిరంలో ‘ పంచారక్త ఆగమ ‘ విధానంలో నిత్యపూజాదులు నిర్వహిస్తున్నారు . ఈ మందిరంలో అమావాస్య పూజలు చాలా ఘనంగా నిర్వహిస్తూ వుంటారు .

ఈ మందిరంలో మరో విశేషం యేమిటంటే సంతానం లేని వారు పెసలు తెచ్చి పూజారులకు యిస్తారు . పూజారులు ఆ పెసలనునానపెట్టి తడిబట్టలో కట్టి సంతానం లేని స్త్రీ నడుముకు కడతారు . ఆ దంపతులు ఆరాత్రి మందిరంలో నిద్రచెయ్యాలి . ప్రొద్దుట ఆపెసలు మొలకవేస్తే ఆ స్త్రీ కి సంతానం కలుగుతుందని మొలకలు రాకపోతే సంతానం కలగదని అంటారు . చాలా మంది దంపతులుయిక్కడకు రావడం చూసేం . పెళ్లి కానివారు యిక్కడ అమావాస్య పూజ చేయించుకుంటే దోషాలు తొలగి వెంటనే పెళ్లిళ్లు అవుతాయనినమ్మకం . ఆ నమ్మకం తో చాలా మంది యిక్కడకు రావడం కనిపిస్తుంది . ఇవి కాంచీపురంలోని దివ్యదేశాలు , వచ్చేవారం నుంచి కాంచీపురంలోని మరికొన్ని ముఖ్య మందిరాలను గురించి తెలుసుకుందాం .అంతవరకు శలవు              .  

మరిన్ని శీర్షికలు
weekly-horoscope august 10th to august 16th