పురాణాల్లో చదువుకున్నాము – ఒకానొకప్పుడు ఉత్తములనీ, రాక్షస ప్రవృత్తి కలవారినీ గుర్తుపట్టెవారుట… అంతదాకా ఎందుకూ, మన సినిమాలనే చూడండి—అందులో హీరోనీ, విలన్ నీ గుర్తుపట్టేయొచ్చు.. వారి వేషధారణ అనండి , హావభావాలనండి.. అంతా ప్రత్యేకంగా ఉంటాయి.. ఓ Unique Identity అనుకోండి… కాలక్రమేణా ఈ కలియుగంలో గుర్తుపట్టడం చాలా కష్టమవుతోంది. మొహం చూసి వీడు మంచివాడా, చెడ్డవాడా అని ఛస్తే గుర్తుపట్టలేము… అమాయకంగా కనిపించేవాడు, ఎంతో డేంజర్ మనిషవొచ్చు, అలా కాకుండా పైకి కరుగ్గా కనిపించేవాడు, పాపం మంచివాడే కావొచ్చు.
గుర్తుందా… ఇదివరకటి రోజుల్లో సినిమాల్లో, పసిపిల్లల్ని నిద్రబుచ్చడానికో, లేక చంకనేసుకుని తిండి తినిపించడానికో, అమ్మలు .. “ బూచాడొచ్చాడమ్మా.. బూచాడొచ్చాడమ్మా .. “ అంటూ పాటలు పాడేవారు. పాపం ఆ పిల్లలుకూడా భయపడి నోరుమూసుక్కూర్చునేవారు… చెప్పొచ్చేదేమిటంటే పిల్లలకి కొంత జ్ఞానం వచ్చేవరకూ, భయపెట్టి లొంగతీసుకోవడం చాలా సులభం గా ఉండేది…
పురాణాల్లో ఋషులూ, మునులూ ఎలా ఉండేవారో మనకి తెలియదు.. కానీ కాలక్రమేణా చిత్రకారులు ఊహించి , వేసిన బొమ్మలద్వారా ఒహో మునులూ, ఋషులూ ఇలాగుండేవారన్నమాట అని తెలిసింది.. ఓ పంచ, చేతిలో ఓ కమండలం, గెడ్డాలూ మీసాలూ వగైరా… ఇంక సినిమాల్లో కూడా, ఏ ఆస్థాన పురోహితుడినో చూపించాలంటే, ఈ విధంగా వేషధారణ ఉండేది. ఈరోజుల్లో అలాటి సినిమాలే రావడంలేదనుకోండి, అది వేరే విషయం. ఆ పాత్రలలో నటించే వారికి వయసునిబట్టి, పాత్రను బట్టీ ఈ గెడ్డాలూ మీసాల లా ఉండే “ విగ్గు “ లు తగిలించేస్తే పనైపోయేది.. వాళ్ళ సంభాషణలు కూడా లక్షణంగానే ఉండేవి… ఈ విగ్గులు వాడకం ఆరోజుల్లో భేతాళ మంత్రగాళ్ళకి కూడా పెట్టేవారండోయ్.. “ పాతాళభైరవి “ సినిమాలోలాగ.
కాలక్రమేణా, ఈ పురాణాల సినిమాలు తగ్గి, సోషల్ సినిమాలు మొదలయ్యాయి.. ప్రతీ సినిమాలోనూ ఓ హీరో, విలనూ ఉంటేనే కానీ కథ ముందుకునడవదాయే.. పాపం ఎక్కడో తప్పించి, ఈ విలన్లు కూడా పైకి అమాయకంగానే కనిపిస్తారు… కానీ వాడి అనునాయుల్ని గుర్తుపట్టడమెలా? ఇదిగో ఇక్కడే, అలాటి ప్రమధ గణాలకి, ఓ గుబురు గెడ్డం తగిలించేయడం… అంటే ఇక్కడ గెడ్డం ఉన్నవాడిని చూస్తే తెలిసిపోతుందన్నమాట—వీడు ఏదో దరిద్రప్పని చేసేవాడూ అని… అందుకే సినిమాల్లో, ఓ గెడ్డం తగిలిస్తే గొడవుండేదికాదు చాలా కాలం వరకూ…
సినిమాలకే కాకుండా, నిజజీవితాల్లో కూడా ఈ గెడ్డాలకి ప్రముఖ పాత్ర ఉండేది—పెళ్ళాం పురిటికెళ్ళినప్పుడో, లేదా ఏ దేవుడి మొక్కో ఉన్నప్పుడో చాలామంది గెడ్డాలు పెంచుకునేవారు.. వాళ్ళని చూడగానే.. “ ఎమోయ్ ఏదైనా మొక్కా..” అనో “ ఏమిటీ మీఆవిడ నీళ్ళోసుకుందేమిటీ.. “ అనో పలకరించేవారు…
అలాటిది ఎప్పుడొచ్చిందో ఏమో కానీ, ఈరోజుల్లో ఎవడిని చూసినా గెడ్డాలే.. మూతిమీద మీసం రావడమేమిటి, ఆ మీసం మాటెలా ఉన్నా, గెడ్డాలు – పైగా వాటికీ ఓ స్టైలూ.. మొదట్లో అదేదో పిల్లిగెడ్డంతో మొదలెట్టి ఇప్పుడు నానారకాల భంగిమల్లోనూ వచ్చేస్తున్నాయి. చిన్నప్పుడు మాగజీన్ల కవర్ పేజీల మీద కనిపించిన ఏ ఫొటో ఆడైనా, మగైనా సరే, ఓ పెన్నుతో మీసాలూ, గెడ్డాలూ పెట్టడం ఓ సరదాగా ఉండేది గుర్తుందా… అలాగే ఏదైనా ఘోర హత్యో, దోపిడీయో చేసినవాడు గుర్తుపట్టకుండా ఉండడానికి మీసాలూ గెడ్డాలూ పెంచి , పోలీసులనుండి తప్పించుకోవడం ఈరోజుల్లోనూ చూస్తున్నాము… ప్రతీరోజూ పేపర్లలోనూ, టీవీ చానెళ్ళలోనూ , ఏ ఉగ్రవాదినో పట్టుకున్నప్పుడు, వాడు గెడ్డాలతోనే కనిపిస్తాడు.. చెప్పొచ్చేదేమిటంటే ఈ గెడ్డానికి అంత కధుందన్నమాట.. ఓ Unique Identity లాటిది, మన Adhaar Card లాటిదన్నమాట.
దో ఆంఖే బారా హాథ్ అని శాంతారాం గారు నిర్మించిన ఓ సినిమా వచ్చింది ఆరోజుల్లో… అందులో దొంగలందరికీ గెడ్డాలే.. ఇప్పుడు మన National Cricket Team చూడండి—ఒకానొకప్పుడు ఫొటో చూసినప్పుడో, టీవీ ల్లో ప్రత్యక్షప్రసారాలు చూసినప్పుడో, ఆటగాడెవడో ఇట్టే గుర్తుపట్టేసేవాళ్ళం… ఓ తెల్ల పాంటూ, తెల్ల చొక్కా మాత్రమే ధరించేవారు.. అలాటిది ఈరోజుల్లో ఆడే పదకొండుమందికీ గెడ్డాలే.. ఎవడినీ గుర్తుపట్టలేము. బహుశా అందుకేనేమో వీళ్ళ వేషధారణ కూడా మారిపోయింది, ఈరొజుల్లో వాళ్ళు వేసుకునే షర్టుల వెనక్కాల పేరు రాస్తేనే కానీ తెలియడం లేదు…
“ వసుధైక కుటుంబం “ కి అర్ధం ఇప్పుడు తెలుస్తోంది…
సర్వేజనా సుఖినోభవంతూ….
|